অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రైతు నేస్తాలు - సాగుకు ఆలంబనలు

రైతు నేస్తాలు - సాగుకు ఆలంబనలు

ఈ అత్యాధునిక యుగంలో సమాచారం అతివేగంగా ప్రవహిస్తోంది. అలాగే పరిణామాల్ని ఊహించనంతటి స్థాయిలో పరావర్తనం చెందిస్తోంది. మనిషి చుటూ ఉన్న, వ్యవస్తలు, రంగాలు - మొత్తంగా ఈ పరిణామాన్ని మోసుకుంటూ పరిభ్రమిస్తున్నాయి. ఆలోచనలో నడవడికలో, ఆహారంలో, జీవనశైలిలో అన్నిటిలోనూ ఈ పరిభ్రమణం ద్యోతకమవుతూనే ఉంది.

అన్ని రంగాలలో శోధన, సమాచార వ్యాప్తితో వస్తున్న మార్పులు మానవుడి మనుగడకు కీలకమైన వ్యవసాయ రంగంలోనూ దర్శనమిస్తున్నాయి. అయితే ఇతర రంగాలంత వేగంగా ఈ రంగంలో పరిణామక్రమం లేదు. మరీ ముఖ్యంగా సంప్రదాయక విధానాలకు అమిత ప్రాధాన్యం ఇచ్చే ఆసియా దేశాలలో ఈ మార్పు ఉండాల్సినంత వేగంగా లేదు. విచిత్రమేమిటంటే ఈ రంగంలో మార్పుల క్రమం కొన్ని సానుకూల ఫలితాలకు, మరికొన్ని అనూహ్యమైన విపరిణామాలకు దారితీస్తోంది. ఆహార, ఉపాధి, ఆరోగ్య రంగాలు, ఆర్థికరంగం - ఆసియా దేవాలలో మరీ ముఖ్యంగా భారత్ లో వ్యవసాయంతో అనుసంధానమైనందున ఈ రంగంలోని మార్పుల మీద చర్చ ఎక్కువగానే జరుగుతోంది. అకడమిక్, పరిశోధనా వ్యవస్థలకే ఈ చర్చ పరిమితమయ్యింది. వ్యవసాయంతో ముడిపడని ప్రజానీకానికి దీనిపట్ల సహజంగానే ఆసక్తి ఉండదు. కనుక వారిదాకా ఇది విస్తరించలేదు. గ్రామీణ రైతులకు ఈ చర్చ ఉపయుక్తమే అయినా వారి దాకా కూడా సవ్యంగా చేరడంలేదు. వారికి అవసరమైన సమాచారం, పరిజ్ఞానం అనేక రకాల కారణాలవల్ల అందాల్సినంతగా కూడా అందడం లేదు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో వస్తున్న మార్పులపై అనుకూల వ్యతిరేక ధోరణులు బలంగానే వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా ఆర్థిక ప్రయోజనాలపై దృష్టి ఉన్నవారిలో మార్పుల పట్ల అనుకూల ధృక్పథమే ఎక్కువగా ఉంది. ఆర్థికంతోపాటు ఆరోగ్యం గురించి కూడా పట్టింపు ఉన్నవారికి మార్పులపై పూర్తి వ్యతిరేకత ఉండడం లేదు కానీ కొన్ని అభ్యంతరాలుంటున్నాయి. ఉత్పాదకతను పెంచడంతోపాటు భూసారాన్ని పరిరక్షించుకోవడం, రసాయన రహిత లేదా స్వల్ప స్థాయిలో రసాయనాల వినియోగానికే పరిమితం కావడంపై వీరిలో పట్టుదల వ్యక్తమవుతోంది. మన దేశానికి ఇదే అనుసరణీయ విధానమని వారి వాదన.

ఎలాంటి ఆలోచననైనా, పరిశోధనైనా, ఫలితాలనైనా ప్రజానీకంలోకి త్వరితంగా తీసుకువెళ్లాలంటే సమాచారాన్ని ఎక్కువగా వ్యాప్తి చేయడమొక్కటేగా మార్గం. దానికి సమాచార ప్రచురణ, పంపిణీయే ప్రధానం. మన దేశంలో సాహిత్య ఆధ్యాత్మిక రచనల ప్రచురణలకున్నంత ప్రాచుర్యం ఇతర రంగాల రచనల ప్రచురణకు ఇంకా లభించకపోవడం లోటుగానే ఉంది. ఆ లోటును భర్తీ చేయడం కోసం, రైతుకు ఏది మంచో ఏది చెడో చర్చించడం కోసం, విశ్వవిద్యాలయాల పరిశోధనలు, వాటి ద్వారా సాధించదగిన ఫలితాల గురించి తెలియచేయడం కోసం ఆధునిక సాగు విధానాలు, ఆర్థికంగా లాభదాయకమైన, కాలానుగుణమైన పంటలు, తోటలు - ఒకటేమిటి, ఆ రంగానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని తెలుగు రైతులకు అందించే ప్రచురణలు ఎక్కువగా వెలువడాల్సిన అవసరం ఉంటోంది.

గతంలో కంటే మిన్నగా విద్యాధికులు, యువత వృత్తి. ప్రవృత్తిగా సంప్రదాయ ఆధునిక, అత్యాధునిక పద్ధతుల్లో పలు రకాల పంటలు, పండ్ల తోటలు, పూలు, కూరగాయల సాగు చేస్తున్నారు. మరోవైపు గొర్రెలు, మేకల పెంపకం, పాడి పశువుల పోషణ, కోళ్ళు, చేపలు, రొయ్యల పెంపకం వాణిజ్య సరళిలో సాగుతోంది. దీనికి తోడు ఇటీవల కాలంలో సహజ, సేంద్రియ, సుస్థిర, ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తూ పర్యావరణహిత సేద్యం వైపు మొగ్గ చూపుతున్నారు. వీటిలో ఏ విధానాన్ని ప్రోత్సహించేవారు ఆ విధానాన్ని తమ తమ స్థాయిల్లో రైతులను చైతన్య పరుస్తూ, తమ ఆచరణ పద్ధతులను పంట పొలాలకు చేరవేసే పనుల్లో ఉంటున్నారు. స్వచ్ఛంద సేవాసంస్థలు సైతం ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఎవరు ఏ స్థాయిలో పనిచేస్తున్నా సాగుచేసే రైతన్నకు కావాల్సిన నిర్ణష్ట సమాచారం, పరిజ్ఞానం అందుబాటులో లేక, అవసరానికి దొరకక సతమతమవుతున్నాడు.

ఇటీవలి వరకు వ్యవసాయ సమాచారం లోలోపించిన విశ్వసనీయత, సమగ్రత, శాస్త్రీయత, అస్పష్టతలను అధిగమించి ఆయా వ్యవసాయ విధానాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని సమగ్రంగా, స్పష్టమైన అవగాహనతో అందుబాటులోకి తెస్తున్న వాటిలో చెప్పుకోదగ్గ సంస్థ రైతునేస్తం పబ్లికేషన్స్, వ్యవసాయానికి వెన్నుదన్నుగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో యడ్లపాటి వెంకటేశ్వరరావు నేతృత్వంలో వస్తున్న ఈ ప్రచురణ సంస్థ - ఏ విషయంలో రైతులకు ఎవరు అవసరమైన సమాచారాన్ని అందించగలరో, ఎవరికి క్షేత్రస్థాయిలో అనుభవం ఉందో వారిచేతనే రాయించి పుస్తకాలు వెలువరిస్తోంది. ఆయా రకాల పద్ధతుల్లో ప్రాథమిక అంశాలను స్పష్టంగా తెలియచేసే విషయాలతో పుస్తకాలు తీసుకురావడంతో పాటు డివిడీలను రూపొందించి ఆధునిక సమాచారాన్ని దాన్ని ఆచరిస్తున్నరైతుల అనుభవాలను దృష్య రూపంలో రైతులకు అందుబాటులోకి తెచ్చింది. యూట్యూబ్ వేదికగా కూడా ఎప్పటికప్పుడు అభ్యుదయ రైతులు ఆచరిస్తున్న వ్యవసాయ పద్ధతులను ప్రోటి రైతులకు రైతునేస్తం పబ్లికేషన్స్ అందుబాటులో ఉంచుతోంది.

అత్యాధునిక వ్యవసాయంగా రెండు రాష్ట్రాల్లో ఊపందుకున్న గ్రీన్ హౌస్లలో పూలు, కూరగాయల సాగు గురించి ఈ సంస్థ వెలువరించిన 'పూదోట' అందరికీ కరదీపికైంది. ఈ పుస్తక రచయిత డాక్టర్ రావి చంద్రశేఖర్ తెలుగు రాష్ట్రాలలో వాణిజ్య సరళిలో పూల సాగుకు ఆధ్యుడు. 'పూదోట' ఆధారంగానే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ హౌస్లలో పూలు, కూరగాయల సాగు ప్రణాళిక రూపొందించుకొని సాగుతుండటం విశేషం. ఈ సంస్థ ప్రచురించిన 'వివిధ పంటలలో కలుపు యాజమాన్యం', 'చేపలు - ఉపాధి పుస్తకాలు ఆయా అంశాలకు సంబంధించిన గైడ్ లాగ  ఉపయోగపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయంలో సాగుతున్న యాభై మంది రైతుల సాగు అనభవాలు ప్రకృతి నేస్తాలు'గా ప్రచురించింది. పట్టణ వ్యవసాయం, మన ఇల్లు- మన పంట - మన ఆరోగ్యం, చిరుధాన్యాలతో యాభై వంటకాలు వంటి 75కు పైగా ప్రచురణలను వెలువరించింది రైతునేస్తం పబ్లికేషన్స్ త్వరలో ప్రతి పంటలో అన్ని వ్యవసాయ పద్దతులతో సాగు వివరాలను సమగ్రంగా సంబంధిత నిపుణుల వివరణలతో తీసుకురావడంతో సహా వచ్చే మార్చి నాటికి మరో 70 పుస్తకాలు ప్రచురించే ప్రయత్నంలో ఉంది. పుస్తక ప్రచురణలతో పరిమితం కాకుండా గుంటూరు సమీపంలోని కొర్నెపాడు గ్రామంలో ప్రతి ఆదివారం ఆసక్తి కలిగిన రైతులకు రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇస్తూ ఉచితంగా సమాచార కిట్లు కూడా అందిస్తోంది.

రైతునేస్తం పబ్లికేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వసనీయతను సాధించి ఎక్కుడ రైతు సమావేవాలు, దినోత్సవాలు జరిగినా అక్కడ దర్శనమిస్తోంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ మొదలుకొని హైటెక్స్లో జరిగే రైతు ప్రదర్శన వరకు ఆ సంస్థ పబ్లికేషన్స్ స్టాల్ ఉండటం ఆనవాయితీగా మారింది. ఇటువంటి వ్యవసాయ సంబంధిత ప్రచురణ సంస్థలు మరిన్ని రాగలిగితే రైతులకు సమాచారం, పరిజ్ఞానం పూర్తి స్థాయిలో లభించడంతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలతో అధిక దిగుబడికి ఆలంబనగా నిలుసాయి.

ఆధారం : పాడిపంటలు మాస పత్రిక

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate