অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సూక్ష్మ నీటి పారుదల పద్దతులు – నీరు, ఎరువుల యాజమాన్యం

సూక్ష్మ నీటి పారుదల పద్దతులు – నీరు, ఎరువుల యాజమాన్యం

  1. సాంప్రదాయ సాగునీటి పారుదల పద్దతులు
  2. మడుల పద్దతి
  3. చాళ్ళ పద్దతి
  4. పొడవైన మళ్ళ పద్దతి
  5. పాదుల పద్దతి
  6. పండ్ల మొక్కలకు కుండల పద్దతి
  7. సాగునీటి వృధాని అరికట్టడం
  8. బిందు సేద్యము
  9. డ్రిప్ పద్దతిలో అమర్చే పరికరాలను మూడు భాగాలుగా విభజించవచ్చు
  10. డ్రిప్ పద్దతి వల్ల కలిగే లాభాలు
  11. డ్రిప్ నీటి పారుదల పద్దతికి అనుకూలమైన పంటల వివరాలు
  12. డ్రిప్ పద్దితికయ్యే ఖర్చు
  13. మొక్కకు కావలసిన నీటి పరిమాణం
  14. పంపు రోజుకి నడపాల్సిన కాలము
  15. నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులను అనుసరించి బిందు సేద్యం ద్వారా నీరు అందించే వ్యవధి:
  16. డ్రిప్ నీటి పారుదల యాజమాన్యం
  17. ఎరువుల యాజమాన్యం (ఫర్టిగేషన్)
  18. ఎరువులను బిందు సేద్య వ్యవస్థ ద్వారా కలిపే పరికరాలు
  19. సూక్ష్మపోషకాలు
  20. ఫర్టిగేషన్ పద్దతి యాజమాన్యంలో కీలకమైన అంశాలు
  21. ఫర్టిగేషన్ ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు
  22. మొక్కజొన్న పంటకు బిందు సేద్య పద్దతిలో నీటి ద్వారా ఎరువులను అందించే ప్రణాళిక
  23. జొన్న పంటకు బిందు సేద్య పద్దతిలో నీటి ద్వారా ఎరువులను అందించే ప్రణాళిక
  24. సజ్జ పంటకు బిందు సేద్య పద్దతిలో నీటి ద్వారా ఎరువులను అందించే ప్రణాళిక
  25. చెఱకు పంటకు బిందు సేద్య పద్దతిలో నీటి ద్వారా ఎరువులను అందించే ప్రణాళిక
  26. గమనిక
  27. పట్టిక
  28. బిందు సేద్య పద్దతి సంరక్షణ
  29. బిందు సేద్య పద్దతిలో ముఖ్య భాగాలను ఈ క్రింది విధంగా సంరక్షించుకోవచ్చు
    1. 1. శాండ్ /గ్రావెల్ /ఇసుక ఫిల్టరును శుభ్రపరచడం
    2. 2. జల్లెడ ఫిల్టర్ ను శుభ్రపరచడం
    3. 3. వివిధ భాగాలు గల పి.వి.సి. పైపును శుభ్రపరచడము
    4. 4. లేటరల్స్ శుభ్రపరుచుట
    5. 5. డ్రిప్పర్లు - శుభ్రత
    6. ఇతర జాగ్రత్తలు
    7. డ్రిప్పరు నీటి విడుదల సామర్థ్యాన్ని పరిశీలించడం
  30. తుంపర/ జల్లు (స్ప్రింక్లర్) సేద్యం
    1. స్ప్రింక్లర్ పద్దతిలోని ముఖ్యభాగాలు
    2. స్ప్రింక్లర్ పద్దతిని మూడు విధాలుగా అమర్చుకోవచ్చు
  31. స్ప్రింక్లర్ రకాలు
  32. స్ప్రింక్లర్ పద్దతి వలన లాభాలు
  33. స్ప్రింక్లర్ వ్యవస్థ ఖర్చు వివరాలు
    1. నిర్వాహణ
  34. జల్లెడ ఫిల్టర్ ను శుభ్రపరుచుట
  35. పైపులు మరియు అమరికలు (ఫిట్టింగ్సు)
  36. స్ప్రింక్లర్ హెడ్

సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల, నీరు అవసరానికి మించి వాడినందువల్ల, నీరు అవసరానికి మించి వాడినందువల్ల లాభమేమి లేకపోగా, అత్యంత విలువైన నీటిని మరియు పోషకాలను వృధాచేయడమేకాక మంచి భూములు క్రమంగా చైడు భూములుగా మారుతాయి. ఏ పైరు నుండి అయినా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే, ఆ పంట ఏ దశలోను నీటి ఎద్దడికి గురికారాదు. ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు కట్టాలి. ముఖ్యంగా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. ఏ పైరుకు ఎన్ని తడులు ఇవ్వాలి, తడులు మధ్య ఎంత కాల వ్యవధి ఉండాలి. అనేది ముఖ్యంగా నేల స్వభావం, పైరు గుణగణాలు మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి వుంటుంది. సాధారణంగా నేలలో పంట వేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50 శాతం కంటే తగ్గిపోక ముందే పైరుకు నీరు పెట్టాలి. నేలలో పైరుకు లభంచే తేమ 75 శాతం వరకు తగ్గినప్పుడు, మొక్కలకు కావలిసినంత నీరు లభ్యంకాక వరపు (నీటి ఎద్దడి) కలుగుతుంది. దీని వలన పంట దిగుబడి తగ్గుతుంది. మరీ తొందరగా నీరు పెట్టినా పంటకు ప్రాణ వాయువు దొరకక నష్టం కలుగుతుంది.

సాధారణంగానే పైపొరలలో 15-20 సెం.మీ. లోతు వరకు మట్టిని పరిశీలించి, నీరు పెట్టవలసిన సమయాన్ని నిర్ణయించాలి. ఇందుకు గాను మట్టిని చేతితో పట్టుకొని చూసి దానిలోని తేమ యొక్క హెచ్చు తగ్గులను కనుగొనవచ్చు.

ఏఏ నేలల్లో ఎప్పుడు నీరు పెట్టాలని తెలుసుకోవడానికి ఇసుక గుంత పద్ధతిని, ఇసుక నేలలను మరియు వరి పైరుకు తప్ప, ఇతర అన్ని రకాల నేలలకు మరియు పైరులకు అన్ని దశల్లో నీరు పెట్టడానికి ఉపయోగపడవచ్చును. ఈ పద్ధతిలో పంటను సులువుగా తనిఖీ చేయటానికి వీలయ్యే చోట్ల మూడడుగుల వెడల్పు, మూడడుగుల పొడవు, మూజజుగుల లోతు గల గుంతను తీయాలి. గుంట నుండి తీయగా వచ్చిన మట్టిలో (పరిమాణాన్ని బట్టి) ఇసుక బాగా కలిపి, కలియబెట్టాలి. ఈ విధంగా కలిసిన ఇసుక, మట్టితో గుంటను ఆరు అంగుళాల మేరకు నింపాలి. ప్రతి 6 అంగుళాల మట్టి వేసిన పిమ్మట మట్టిని బాగా దిమ్మెన చేస్తూ గుంటను నింపాలి. మామూలుగా పొలంలో ఓ పైరును పెట్టవలెనో ఆ పైరునే పెట్టాలి. ఇసుక కలిపిన గుంటలలో మట్టి నీటిని ఇమడ్చుకునే శక్తి తక్కువగా ఉండటం వలన, నీరు తక్కువైనప్పుడు గుంట ఉన్న చోట మొక్కలు వాడిపోయే లక్షణాలను, తక్కిన పోలంలోని మొక్కలు ముందుగానే సూచించడం వలన పైరుకు ఎప్పుడెప్పుడు నీరు కావలసినది తెలుసుకొని నీరు కట్టవచ్చు. ఇసుక ఎంత కలపాలన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక నేలను బట్టి ఇసుక పరిమాణం 5 శాతం నుండి కొంచెం అటో ఇటో మార్చుకోవాలి.

సాంప్రదాయ సాగునీటి పారుదల పద్దతులు

సాగునీరు పొదుపుగా వాడుకోవాలంటే పోలం చదునుగా వుండాలి. పొలాన్ని చిన్న మడులుగా విభజించి ఆ మడుల్లో నేలను బాగా చదునుగా చేసుకోవాలి.

మడుల పద్దతి

పోలాన్ని చిన్నచిన్న గట్లతో చతురస్రాకారపు మడులుగా విభజించాలి. మడులు 18 x 15 మీటర్ల నుండి 6 x 6 మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. గట్ల ఎత్తు నీటిని ఎంతవరకు నిలపాలో దానిని బట్టి వుంటుంది. మడుల్లో వుండే నేల బాగా చదునగా గాని లేక ఒక వైపుకు కొంచెం వాలుగా వుండేటట్లు గాని తయారు చేయాలి. పొలానికి ఎత్తు వైపు నుండి కొంచెం పెద్ద కాలువలు ఏర్పాటు చేయాలి. ఈ కాలువల నుండి చిన్న చిన్న కాలువల ద్వారా కయ్యలకు కావలసినంత నీరు పెట్టాలి. కయ్యలలో పెట్టిన నీరు బయటికి పోకుండా అందులోనే ఇంకుపోయేలా చూడాలి. వరిపైరుకు చాలా పెద్ద మడులు చేస్తారు. వేరుశనగ, రాగి, కూరగాయలు, పశుగ్రాసాలు మొదలైన పైర్లకు చిన్న చిన్న మడులు చేస్తారు. గట్లు తెగిపోకుండా బాగా వేయాలి. ఎక్కువ వాలుగా ఉండే పొలాలకు ఈ పద్దతి పనికి రాదు.

చాళ్ళ పద్దతి

దీనినే “బోదెలు కాలువల పద్దతి” అంటారు. ఈ పద్దతిలో రెండు వరుసల మధ్య సన్నని కాలువలు చేసి ఈ కాలువల గుండా నీరు పెట్టాలి. ఈ చిన్న కాలువల గుండా నీరు పారేటప్పుడు నీరు నేలలోకి ప్రక్కలకు యింకి వేళ్ళ దగ్గర నేలను తడుపుతుంది. వరుసల్లో వేసే పంటలకు అంటే చెఱకు, ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొగాకు మొదలైనవి ఉపయోగపడుటుంది. ఇసుక నేలలు, విస్తారంగా పగుళ్ళు పారు నేలలకు తప్ప మిగితా అన్ని నేలలకు సరిపోతుంది. ఈ పద్దతి వలన పొలంలోని నేలనంతా తడపవలసిన పనిలేదు. నీరు ఎక్కువగా వృధా కాదు. నీటిని నిదానంగా పీల్చుకునే నేలలో కాలువలు వెడల్పుగా ఉండి లోతు తక్కువగా వుంటే బాగుంటుంది. నీటిని త్వరగా పీల్చుకునే తేలిక భూముల్లో కాలువల వెడల్పు కంటే లోతు తక్కువగా ఉంటే బాగుంటుంది. నీటిని త్వరగా పీల్చుకునే తేలిక భూముల్లో కాలువల వెడల్పు తక్కువగా వున్నా పరవాలేదు. కాలువలు నిండే దశను బట్టి నిర్ణయించుకోవాలి. ఈ చిన్న కాలువలను నాగళ్ళతోగాని, బోదెగుంటకతో గాని సులభంగా వేయవచ్చు.

సాగు నీరు తక్కువగా ఉన్నప్పుడు, ఒక సాలు తప్పించి ఒక సాలుకు నీరందించాలి. తదుపరి నీరు పెట్టేటప్పుడు మొదటిసారి తప్పించిన సాలుకు నీరు పెట్టి, ఇంతకు ముందు నీళ్ళు పెట్టిన పాలును తప్పించాలి. అదేవిధంగా పంటను జంట సాళ్ళ పద్దతిలో విత్తుకొని, రెండు జంటసాళ్ళ మధ్య కాలువ ద్వారా నీరందించాలి. రెండు జంట సాళ్ళ మధ్య దూరం ఎక్కువగా ఉంచి, సాళ్ళ మద్య దూరం తక్కువగా ఉంచి కావలసిన మొక్కల సాంద్రతను సాధించవచ్చును.

పొడవైన మళ్ళ పద్దతి

పొలాన్ని సమానమైన పొడవైన కయ్యలుగా 15 సెం.మీ. గట్లతో విభజించాలి. ఈ మళ్ళ వెడల్పు 6 నుండి 30 మీటర్ల వరకు వుంటుంది. మళ్ళ పోడవు 60 నుండి 300 మీటర్ల వరకు నేలను బట్టి, నీటి ప్రవాహ పరిమాణాన్ని బట్టి వుంటుంది. గట్ల మధ్య నేలను ఎత్తు పల్లాలు లేకుండా చదును చేయాలి. ఒక వైపు నుండి మరో వైపు 0.05 నుండి 0.5 శాతం వాలు కలిగించాలి. పొలం పైభాగాన పెద్ద కాలువ చేసి, ఈ కాలువల నుండి మడుల లేనికి పొడవాటి గొట్టాల ద్వారా నీరు వదలాలి. నీరు పొడవాటి మడిలో ఎత్తు నుండి పల్లానికి ప్రవహించి నేలను బాగా తడుపుతుంది. ఈ పద్దతిలో నీరు కొంత ఎక్కువగా పడుతుంది. పర్షపు నీరు పోవడానికి అంత అవకాశం వుండదు. దగ్గరగా విత్తే పైర్లు అనగా కొర్ర, గోధుమ, బార్లీ, పశుగ్రాసం మొదలైన వాటికి ఈ పద్దతి బాగా అనుకూలిస్తుంది. మడులు వేయడానికి చాలా తక్కువ ఖర్చవుతుంది. ఎక్కువ పరిమాణం గల నీటి ప్రవాహాన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు.

పాదుల పద్దతి

సాధారణంగా పండ్లకోతకు నీరు పెట్టేటప్పుడు ఈ పద్దతి అవలంభిస్తారు. చెట్టు చుట్టూ పాదులను గుండ్రంగా గాని లేక చదరంగా గాని తయారుచేసి ఆ కాలువల ద్వారా పాదులకు నీరు పెట్టాలి. మొక్కలు దూరంగా ఉంటే రెండు మూడు మొక్కలకొక పాదుచొప్పున తయారు చేయాలి. పాదుల నిండా నీరు పెట్టి ఆ నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు అట్లే ఉంచాలి. చెట్లు పెరిగే కొలది పాదులను పెద్దవిగా చేయాలి. ఈ పాదులను మిట్ట మధ్యాహ్నం, చెట్టు నీడ ఎంత ఉంటుందో అంత వెడల్పు చేయాలి.

పండ్ల మొక్కలకు కుండల పద్దతి

నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో మామిడి, నారింజ మొదలైన పండ్ల మొక్కలను పెంచడానికి ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది. ఇరుపది లీటర్లు పట్టే కుండలను తీసుకొని వాటికి అడుగున కొంచెం ప్రక్కగా పెన్సిలు పట్టేటంతటి రంధ్రం చేయాలి. ఈ కుండలను మొక్కకు రెండు వైపుల చెట్టు మొదలుకు కొంచె దూరంగా మెడ వరకు నేలలోనికి పాతాలి. కుండలు పాతేటప్పుడు వాటి రంధ్రం మొక్క వేర్ల వైపు పుండేటట్లు చూడాలి. ఈ కుండల నిండా నీరు పోసి పైన మూతలు పెట్టాలి. కుండలలో నీరు కన్నం గుండా చిన్నగా నేలలోకి పోతుంది. అప్పుడు వేర్ల దగ్గర తడిచి మొక్క వేర్లు సులభంగా నీటిని పీల్చుకుంటాయి. అవసరమైనప్పుడల్లా అనగా వారానికొకసారి కుండలను నింపుతూ వుండాలి. అందువలన కొంచె నీటితోనే మొక్కలను ఎండాకాలంలో బ్రతికించవచ్చు. ఆవిరిరూపంగా నీరు వృధా పోదు. పాదుల్లో కలుపు మొక్కలు కూడా ఎక్కువ వుండదు. నీటిలో కరిగే ఎరువులను కూడా పరిమితంగా కుండల్లో వేయవచ్చు. సాధారణంగా మొక్కకు పాదులలో పోసే నీటిలో 1/3 భాగం ఈ పద్దతిలో సరిపోతుంది.

వేసిన పంటను మరియు నీటి లభ్యతను అనుసరించి నీటి పారుదల పద్దతిని నిర్ణయించుకోవాలి.

సాగునీటి వృధాని అరికట్టడం

నీటి వనరుల నుండి కాలువల ద్వారా పొలానికి తీసుకొని పోయేటప్పుడు దాదాపు 20 శాతం నీరు నేలలో ఇంకిపోవడం మూలంగాను, ఆవిరి అవడం ద్వారాను వృధా అవుతుంది. అంతేకాకుండా కాలువలు తెగిపోవడం, కలుపు మొక్కలు పెరిగి నీటి ప్రవాహాన్ని అడ్డుకొనటం, ఇవన్నీ జరుగుతూ వుంటాయి. ఇసుక నేలలో నీరు ఇంకా ఎక్కువగా ఇంకిపోతుంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి క్రింద తెలిపిన మార్గాలు ఆచరించాలి.

  • అర్థ చంద్రాకారంలో చేసిన సిమెంటు పెంకులుగానీ, మట్టి పెంకులు గానీ కాలువ పొడువునా పరచవచ్చు.
  • కాలువలు లేకుండా నీటిని నేరుగా పొలంలోనికి సిమెంటు లేదా ప్లాస్టిక్ గొట్టాల ద్వారా తీసుకొని పోవచ్చు. బావి దగ్గర నుండి చాలా దూరంగా వుండే పొలాలకు కూడా కాలువలు లేకుండా నేల లోపల వేయబడిన పైపుల ద్వారా నీరు తీసుకువెళ్తారు. ఈ పైపులను భూమిలో దాదాపు 3 అడుగుల లోపల పరుస్తారు. నీరు ఆవిరి రూపంలో గాని, ఇంకిపోవడం వలన గానీ వృధాగాపోదు. కాలువలు అవసరం లేదు కాబట్టి సేద్యపు భూమి నష్టం అవదు. వీటిని గ్రామంలోని రైతులే ఇతరుల పాంకేతిక సహాయం లేకుండా వేసుకోవచ్చు.

పైన తెలియజేసిన ప్రాచీన సాంప్రదాయ పద్దతులతో నీటిపారుదల చేయడం వలన సాధారణంగా మొక్కలకు కాకుండా భూమికి నీరు ఇవ్వడం జరుగుతుంది. మొక్కలకు కావలసిన దాన్ని కన్నా అధిక మోతాదులో నీరివ్వడము వలన మొక్కల వేరు వ్యవస్థ దగ్గరలో ఉన్న గాలి రంధ్రాలన్ని నీటితో నిండి పోవడం వలన మొక్కల వేర్లు సరిగా గాలి ప్రసరణ జరగదు. అంతేకాకుండా మొక్కల వేర్ల దగ్గర ప్రాణవాయువు (ఆక్సీజన్) లేని పరిస్ధితులలో మొక్కల ఎదుగుదల సరిగా ఉండదు. అంతేకాకుండా చెడు చేసే సూక్ష్మక్రిములు, బాక్చీరియా వృద్ధి చెంది కొన్ని హానికర రసాయనాలు విడుదల చేయడం వలన మొక్కల పెరుగుదల దెబ్బతింటుంది. అధిక మొత్తంలో అందజేసిన నీరు ఆవిరి రూపంలోను, అధిక ఉపరితల ప్రవాహ రూపంలోనే కాకుండా నేలలో వేర్లకు అందకుండా భూగర్భములోకి చేరి, నీటిలోని కరిగే పోషకాలు నీటితో పాటు వృధా అవుతాయి. అందువలన ఈ పద్దతులలో మొత్తం పంటకు అందించిన నీటిలో 35-40 శాతము నీటిని మాత్రమే పంట ఉపయోగించుకుంటుంది.

నీటిని పొదుపు చేసి, ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదల కొరకు భూమికి కాకుండా మొక్కలకు నీరు అందించాలి.

అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మొతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు అధిక దిగుబడిని పొందవచ్చు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ ఆశించిన స్థాయిలో ఉత్పత్తిని మరియు ఉత్పాదకతలను సాధించటమే కాకుండా ఉత్పాదకత వ్యయాన్ని తగ్గించి సుస్థిరమైన అభివృధిని సాధించడం ముఖ్యము. ఇది సూక్ష్, నీటి పారుదల పద్దతి ద్వారా వీలుకలుగుతుంది. ఈ పద్దతి పెండు రకాలు. అవి బిందు (డ్రిప్) మరియు తుంపర ( స్ప్రింక్లర్) సేద్య పద్దతులు. ఈ పద్దతులలో నీటి వినియోగ సామర్థ్యము సాంప్రదాయ పద్దతుల (55 – 70%) కంటే ఎక్కువగా అనగా 55 - 70% తుంపర పద్దతిలో మరియు 90 – 90% వరకు బిందు సేద్య పద్దతిలో ఉంటుంది.

బిందు సేద్యము

ప్రతి రోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలములో అతిస్వల్ప పరిమాణంలో (గంటకు 1 నుండి 12 లీటర్ల వరకు) అందించే విధానాన్ని “బిందు సేద్యం” లేదా “డ్రిప్ పద్దతి” అంటారు. ఈ పద్దతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనం ( ప్రెషర్)తో పైపులైన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. బిందు (డ్రిప్) సేద్య పద్దితిలో వేసే పంటను బట్టి ఐదు పద్దతులున్నాయి.

  • ఆన్లైన్ డ్రిప్ పద్దతి: ఈ పద్దతిలో నీరు బొట్టు రూపంలో మొక్క వేర్లకు చెరుతుంది. ఈ పద్దతిని ఎక్కువగా మొక్క వేర్లకు చెరుతుంది. ఈ పద్దతిని ఎక్కువగా మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలైనటువంటి మామిడి, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి మరియు అరటి తోటలకు వినియోగించడం జరుగుతుంది.
  • ఇన్లైన్ డ్రిప్ పద్దతి: ఈ పద్దతిలో డ్రిప్పర్లు లేదా ఎమిటర్లు లేటరల్ లైను లోపల యంత్రము మీదనే నిర్ణీత దూరంలో అమర్చుతారు. మొక్కల మధ్య దూరంను బట్టి ఎమిటన్లు అమర్చిన లేటరల్ లైనును ఎన్నిక చేసుకోవాలి. ఎమిటర్ల మధ్య దూరంను 30 సెం.మీ. 40 సెం.మీ., 50 సెం.మీ., 60 సెం.మీ., 75 సెం.మీ., 100 సెం.మీ. మరియు 120 సెం.మీ. గా అమర్చిన లేటరల్ లైనులు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ పద్దతి ముఖ్యంగా చెఱకు, ప్రత్తి, కూరగాయలు మరియు పూల తోటలకు ఉపయోగించడం జరుగుతుంది.
  • మెక్రో జెట్ పద్దతి: ఈ పద్దతిలో నీటిని జల్లు రూపంలో భూమి నుండి 50 సెం.మీ. ఎత్తు మించకుండా వృత్తాకారంగా లేటరల్ లైను పైన అమర్చిన జెట్స్ ద్వారా మొక్కకు అందించడం జరుగుతుంది. ఈ పద్దతిని ఎక్కువగా ఇసుక నేలల్లో మరియు ఎక్కువ నీరు ఇంకిపోయే భూములలో ఎత్తు పంటలైనటువంటి మామిడి, కొబ్బరి, నిమ్మ, పామాయిల్ తోటలకు, గ్రీన్ హాన్ మరియు షెడ్నెట్ వేసే సర్సరీలకు, పూల మొక్కలకు ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • మిని మైక్రో జల్లు పద్దతి: ఈ పద్దతి కూడా మైక్రోజెల్ ఇరిగేషన్ మాదిరిదే. కాని ఈ పద్దతిలో లేటరల్స్ పైన అమర్చిన మైక్రో స్ప్రింక్లర్స్ కు అటు ఇటు తిరిగే పరికరము అమర్చబడి ఉంటుంది.
  • పొగ మంచు (మిస్ట్) ఇరిగేషన్ పద్దతి: ఈ పద్దతిలో లేటరల్ పైన మిస్ట్ (ప్రొగ మంచు రూపంలో వెదజల్లే) పరికరాన్ని అమర్చుతారు. ఈ పద్దతిలో నీరు పొగ రూపంలో వెదజల్లబడుతుంది. ఈ పద్దతిని ఎక్కువగా హరిత గృహాల (గ్రీన్ హౌస్) లోపల ఎల్లప్పుడు తేమ ఉండటానికి వాడుతారు. ఈ బిందు సేద్య పద్దతిలో నీటిని మొక్క వేరు వరకు చేరవేయడానికి ఈ క్రింది పరికరాలు తప్పకుండా ఉండాలి.

డ్రిప్ పద్దతిలో అమర్చే పరికరాలను మూడు భాగాలుగా విభజించవచ్చు

  • నీటిని మరియు ఎరువును అదుపు చేసే విభాగం (హెచ్ కంట్రోల్ యూనిట్) అందులోని భాగాలు: నాన్ రిటర్న్ వాల్స్, వ్యాక్యూమ్ గేజ్, ఫిల్టర్ యూనిట్, ఫర్టిలైజర్ ట్యాంక్, గన్మెటల్ వాల్స్, ప్రెషర్ గేజ్, ఇతర ఫిట్టింగులు.
  • నీటిని విస్తరింప చేసే విభాగం (వాటర్ కన్వేయన్స్ సిస్టమ్) అందులోని భాగాలు: పి.వి.సి. ప్రధాన మరియు ఉపప్రధాన పైప్ లైన్లు, కంట్రోల్ వాల్స్, ఫ్లష్ వాల్స్, ఇతర ఫిట్టింగులు.
  • నీటని విస్తరింప చేసే విభాగం సరఫరా చేయు విభాగం (వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) అందులోని భాగాలు: అ) ఆన్లైన్ డ్రిప్ పద్దతి: గ్రోమెట్, స్టార్ కనెక్టర్, నిప్పల్, లేటరల్ పైపు, ఆన్లైన్ డ్రిప్పర్లు, ఎండ్ క్యాప్. ఆ) ఇన్లైన్ డ్రిప్ పద్దతి: గ్రోమెట్, స్టార్ కనెక్టర్, నిప్పల్, డ్రిప్పర్ లైన్, ఎండ్ క్యాప్. ఇ) మైక్రో స్ప్రిక్లర్ పద్దతి: గ్రోమెట్, స్టార్ కనెక్టర్, నిప్పల్, మైక్రోస్ప్రింక్లర్, ఫీడర్ ట్యూబు, బార్బడ్ కనెక్టర్, ఎండ్ క్యాప్.

డ్రిప్ పద్దతి వల్ల కలిగే లాభాలు

  • వివిధ పంటలలో 21 నుండి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది.
  • మొక్కల వేర్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చు తగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయటం వలన మొక్కలు ఏవుగా పెరిగి, త్వరితంగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను (15 నుండి 150%) మరియు నాణ్యమైన పంటను పొందవచ్చు.
  • అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ మరియు ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది. నేలను చదును చేయటం, గట్లు కట్టడం, కాలువలు తవ్వడం, బోదెలు చేయ్యటం, నీటిని పారగట్టడం, ఎరువులు వేయడం మొదలైన పనులు ఉండవు కావున వీటికయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ పద్దతిలో పంట వరుసల మధ్యలో లేమ ఉండదు. కావున కలుపు సమస్య తగ్గుతుంది.
  • ప్రతీ చెట్టుకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందడేయడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటరు నడపబడి కరెంటు వినియోగంలో దాదాపు 30 - 45% ఆదా అవుతుంది.
  • పోషక పదార్ధాలు నీటితో కరిగించి (ఫర్టిగేషన్ ద్వారా) నేరుగా మొక్కల వేర్లకు దగ్గరగా అందించడం వలన ఎరువల వినియోగ సామర్థ్యం పెరిగి (80 – 90%) దాదాపు 20 - 43% ఎరువులు వేరుగా మొక్కకు అందుతాయి.
  • ఉప్పు నీటితో (8 డెసీసైమన్స్/మీటరు వరకు) కూడా పంటలు పండించవచ్చు.
  • మొక్కల మొదళ్ళ వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వలన పురుగు మందుల పిచికారి, మొక్కల కత్తిరింపులు (ప్రూనింగ్), పంటకోత మొదలగునవి సులభతరమవుతాయి.
  • నీరు నేరుగా మొక్కలకు అందించడం వలన చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది.
  • భూమి కోతకు గురికాదు. ఎరువులు భూమి లేపలి పాదుల్లోకి చొచ్చుకొనిపోయి వృధా కావు. మురుగు నీటి సమస్య తగ్గుతుంది. వాతావరణ సమతుల్యతకు ఎటువంటి హీని కలుగదు.

డ్రిప్ నీటి పారుదల పద్దతికి అనుకూలమైన పంటల వివరాలు

డ్రిప్ పద్దతిని వివిధ వాణిజ్య పంటలు, కూరగాయల పంటలు, దుంప పంటలు, గడ్డ పంటలు, ఆకు కూరలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు, కలప పంటలు, ఔషధ పంటలు, పూల పంటలు మొదలగు పంటలతో అమర్చుకోవచ్చు.

డ్రిప్ పద్దతి అమర్చుకోవటం పంట రకం మరియు మొక్కల సాంద్రత (స్పేసింగ్), మొక్కకు రోజువారి కావలసిన అత్యధిక నీటిపరిమాణం, పంటకాలం, నేల తీరు మరియు స్వభావం, ఏటవాలు (టోపోగ్రఫీ), పొలం విస్తీర్ణం, నీటి వసతి (బావి, కాలువ, చెరువు), లభ్యమయ్యే నీటి పరిమాణం (నీటి ఎద్దడి ఉన్నప్పుడు లభించే నీటి పరిమాణం), భూమి నుంచి నీటిలోతు (సక్షన్ లిఫ్ట్), నీటి నాణ్యత, పంపు సెట్ రకం (సెట్రీఫ్యూగల్, టర్బైన్, సబ్ మెర్సిబుల్), పంపుసెట్ సమకూర్చే నీటి పీడనం (ప్రెషర్ హెడ్), రోజుకు విద్యూత్ సరఫరా కాలం (గంటలలో), పంటల మార్పిడి విధానం, భూమి నిలువ ఉంచుకునే నీటి సామర్థ్యం, వాతావరణ పరిస్థితి మరియు రైతు ఆర్ధిక పరిస్థితి మొదలగు అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

డ్రిప్ పద్దితికయ్యే ఖర్చు

డ్రిప్ పద్దితికయ్యే ఖర్చు ముఖ్యంగా పంటలో వరుసల మధ్య, వరుసల్లో మొక్కల మధ్య దూరం, పొలానికి నీటివసతికి మధ్య గల దూరం మరియు నీటి నాణ్యత, పంట అవసరాలకు సరిపడే డ్రిప్ పరికరాల మీద ఆధారపడి ఉంటుంది.

మొక్కకు కావలసిన నీటి పరిమాణం

బిందు సేద్యం రూపకల్పన చేస్తున్నప్పుడు పంటకు ఎంత నీరు అవసరము మరియు ఎంత నీరు బిందు పద్దతి ద్వారా పంపిస్తున్నామో తప్పకుండా తెలుసుకోవాలి.

భాష్పోత్సేకము మరియు నీరు ఆవిరిగా మారడం ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. అందువలన బిందు పద్దతిని ఎండాకాలంలో పంటకు అత్యధిక విధంగా రూపొదించాలి. డ్రిప్ పద్దతిలో ఒక్కో మొక్కకు లేదా పొలానికి ప్రతి రోజు పెట్టే నీటి పరిమాణం, ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, గాలి వేగం, గాలిలో తేమ, చెట్ల మధ్య దూరం, పొలం విస్తీర్ణం , పంట రకం, పంట స్వభావం, పంట పెరుగుదల దశ మొక్కల భాష్పోత్సేకము, నీరు కట్టే ఋతువు మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. నీటి ఆవిరి (Pan Evaporometer) ద్వారా ఆవిరి అయ్యే నీటి పరిమాణాన్ని మరియు మొక్క స్వభావం, పెరుగుదల దశలను పరిగణించి మొక్క యొక్క నీటి ఆవస్యకతను అంచనా వేసుకున్న తర్వాత డ్రిప్ వ్యవస్థను ఎంత సేపు నడిపించాలన్నది డ్రిప్పర్ల సంఖ్య మరియు గంటకు డ్రిప్పర్లు అందించే నీటి పరిమాణంపై ఆధారపడి వుంటుంది.

ఉదా: పంట – చెఱకు : నీటి పారుదల పద్దతి – బిందు సేద్యం

నాటిన తేది – ఫిబ్రవరి : సాళ్ళమధ్య దూరం – 5 అడుగులు : గరిష్ఠ నీటి ఆవిరి – 8.5 మి.మీ

వాతావరణ నీటి ఆవిరి = గరిష్ఠ నీటి ఆవిరి x పాన్ ఫాక్టర్ (0.7) = 5.95 మి.మీ./రోజుకు

పంట నీటి అవసరం (మొక్క భాష్పోత్సేకం) : వాతావరణ నీటి ఆవిరి x పంట ఫ్యాక్టర్ = 5.95 x 1.1 (పంట బాగా ఎదిగిన దశ) = 6.54 మి.మీ./రోజుకు

పంట గరిష్ఠ నీటి అవసరం = పంట భాష్పోత్సేకం/నీటి పారుదల పద్దతి సామర్థ్యం (డ్రిప్ – 90%) x 100 = 6.54/90 x 100 = 7.26 మి.మీ./రోజుకు

పంపు రోజుకి నడపాల్సిన కాలము

పంటను నీటి అవసరాన్ని బట్టి డ్రిప్ సిస్టమ్ (పంపు) ఎంతసేపు అనేది ఆధారపడి ఉంటుంది.

ఉదా 1: సాళ్ళలో వేసే పంటకు కావాల్సిన నీటి అవసరము: 7.3 మి.మీ./రోజుకు, నీటి పైపుల మధ్య దూరం : 1.2 మి., డ్రిప్పర్ మధ్యన దూరం: 0.5 మీ.

డ్రిప్పర్ విడుదల సామర్థ్యము : ఒక గంటకు 4 లీటర్లు, ఒక గంటకు నీటి లభ్యత = డ్రిప్పరు నీటి విడుదల / నీటి పైపుల దూరం x డ్రిప్పర్ మధ్య దూరం= 4/(1.2 x0.5) = 4/0.6=6.67 లీ. / చ.మీ.

డ్రిప్ సిస్టమ్ నడపాల్సిన సమయం (నిమిషాలు):=7.3/6.67 x 60=65.67=66 నిమిషాలు.

ఉదా 2 :

మామిడికి రోజుకు నీటి అవసరం 80 లీటర్ల ఒక మొక్కకున్న డ్రిప్పర్లు: 4

డ్రిప్పర్ల నీటి పారుదల సామర్థ్యం : 4 లీ/గం.

మొక్కకు విడుదలయ్యే నీరు: 4 X 4 = 16 లీ/గం.

డ్రిప్ పద్దతి (పంపు) నడపాల్సిన సమయం= నీటి అవసరం/ నీటివిడుదల = 80/16 = 5 గంటలు.

నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులను అనుసరించి బిందు సేద్యం ద్వారా నీరు అందించే వ్యవధి:

వాతావరణ పరిస్థితినేల స్వభావం
ఇసుక నేలలు తేలికపాటి ఇసుక నేలలు ఒండ్రు మట్టి నేలలు
ఎక్కువ వేడి మరియు పొడిగా ఉండే వాతావరణం (వేసవి కాలం) రోజుకు మూడు సార్లు 1 లేదా 2 రోజులకొకసారి 2 - 3 రోజులకొకసారి
మధ్యస్థ రక వాతావరణం (వర్షాకాలం) లేక వారానికి రెండు సార్లు రోజుకు ఒకసారి 2 - 3 రోజులకొకసారి 3 రోజులకొకసారి
తక్కువ ఉష్ణం/ శీతల వాతావరణం (శీతాకాలం) రోజుకు ఒకసారి వారానికి రెండు సార్లు 4 రోజులకొకసారి

డ్రిప్ నీటి పారుదల యాజమాన్యం

  • డ్రిప్ నీటి పారుదల పరికరాలన్ని బి.ఐ.ఎస్. లేదా ఐ.ఎస్.ఒ. నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • డ్రిప్ పెట్టుకొవాలంటే ముందు మొత్తం నేల విస్తీర్ణం, నేల స్వభావం మరియు ఏటవాలు, నీటి వసతి మరియు నీటి నాణ్యత పరీక్ష ఫలితాలు వివరాలు, మట్టి పరీక్ష ఫలితాలు, పండించదలచిన పంటలు మరియు ఆ ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులు తెలుసుకొని ప్రణాళిక తయారు చేసుకోవాలి.
  • ఏదైనా పంటలకు డ్రిప్ పెట్టుకోవాలంటే ఆ పంట యొక్క కీలక దశలో అత్యధిక నీటి అవసరాలు తెలుసుకోవాలి.
  • డ్రిప్ వ్యవస్థ యొక్క పరిమాణం పొలంలో అన్ని పంటలకు, అన్ని నేలల కీలక దశలలో నీరు సరఫరా చేయగలిగేదిగా ఉండాలి.
  • నేలలు, వాతావరణం, పంటలు మరియు అవసరాన్ని బట్టి డ్రిప్ పరికరాలను ఎంచుకోవాలి.
  • డ్రిప్పర్ రంధ్రాల ద్వారా విడుదల అయ్యే నీరు భూమి మీద ప్రవహించే విధంగా ఉండకూడదు.
  • డ్రిప్ పైపుల్లో తగినంత పీడనం ఉండే విధంగా డ్రిప్ పైపులను అమర్చాలి. నీరు ప్రవహించేటప్పుడు డ్రిప్ పరికరాల వల్ల కోల్పోయిన పీడనం తీసివేసిన తరువాత కూడా వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు అవసరమయ్యే పీడనం పైపుల్లో ఉండే విధంగా పంప్ ను అమర్చుకోవాలి.
  • డ్రిప్ కంపెనీ యొక్క అధీకృత ఇంజనీరింగ్ నిపుణుల ప్ర్యవేక్షణలో క్రమబద్దంగా డ్రిప్ పారుదల వ్యవస్థను అమర్చుకోవాలి.
  • డ్రిప్ పారుదల వ్యవస్థలోని హెడ్ కంట్రోలు, ఫిల్టర్ యూనిట్ వద్ద కాంక్రీటుతో కూడినటువంటి సిమెంటు ప్లాట్ఫారంను అమర్చుకోవాలి. దీని వలన హెడ్ కంట్రోలుకు ధృఢత్వం కలుగటయే కాక వ్యవస్థ యొక్క నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది.
  • డ్రిప్ వ్యవస్థ యొక్క ప్రధాన పైపులైను, ఉప ప్రధాన పి.వి.సి. పైపులైన్ల కొరకు భూమిలో గాడులు తీయవలసి ఉంటుంది. ఆ గాడిలోతు విధిగా ప్రధాన పైపుకయితే 0.75 నుండి 0.9 మీటర్ల లోతు మరియు 0.3 మీటర్ల వెడల్పు, ఉప ప్రధాన పైపులకు 0.6 మీటర్ల లోతు మరియు 0.25 మీటర్ల పెడల్పు ఉండాలి.
  • పి.వి.సి ప్రధాన మరియు ఉపప్రధాన పైపులు బాటకు ప్రక్కగా వచ్చే విధంగా అమర్చుకోవాలి. ప్రధాన పైపులను గాడిలోనే ఉంచి అతికించాలి. ఉపప్రధాన పైపులు భూమిపైన అతికించి తరువాత గాడిలోనికి దింపి మట్టి కప్పాలి.
  • గాడిలో పి.వి.సి పైపు వేసిన తరువాత పైపులకు అమర్చిన “ఎల్” బెండు, టీ, రెడ్యూసర్ల వద్ద ధృడత్వం కొరకు ప్రక్కలకు సిమెంటు కాంక్రీటు బ్లాకులు అమర్చుకోవాలి.
  • మొత్తం డ్రిప్ వ్యవస్థ అమర్చిన తరువాత పైపుల్లో నీరు వదలి వ్యవస్థ యొక్క పనితనం పరీక్షించాలి.
  • డ్రిప్ వ్యవస్థ నిర్వాహణ విధానం, అందులోని భాగాలయిన ఫిల్టర్లను, ఉపప్రధాన పైపులను, లాటరల్స్, డ్రిప్ లైన్లను శుభ్రపరచడం, ఆమ్ల చికిత్స మరియు క్లోరిన్ చికిత్స విధానం, కంట్రోలు వాల్వులు తెరిచే ప్రక్రియ, ఎరువుల ట్యాంక్ ఉపయోగించే విధానం తెలుసుకోవాలి.
  • ఎరువులను ఫర్టిలైజర్ ట్యాంక్ ద్వారా నీటిలో కరిగించి డ్రిప్ ద్వారా నేరుగా మొక్కలకు ఇవ్వాలి.
  • నీటివసతిని బట్టి (నాణ్యతను), ఫిల్టర్ను నిర్ణయించుకోవాలి. నీటివసతిగా బోరు ఉన్నట్లయితే డిస్క్ ఫిల్టర్ తో పాటు హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ ను మరియు నీటి వసతి బావి అయినట్లయితే గ్రావల్ లేదా శాండ్ ఫిల్టర్ తో పాటు డిస్క్ లేదా స్క్రీన్ ఫిల్టర్లను ఉపయోగించుకోవాలి. ఈ ఫిల్టర్లను విధిగా క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవాలి.
  • క్రమం తప్పకుండా డ్రిప్పర్లను పరీక్షించుకోవాలి. వాటి ద్వారా సక్రమంగా నీరు విడుదల అవుతున్నదీ లేనిది గమనించాలి.
  • ఒకవేళ డ్రిప్ రంధ్రాలు మూసుకొని పోయి నీరు సక్రమంగా బయటకు విడుదల కానట్లయితే అవసరాన్ని బట్టి ఆమ్ల లేక క్లోరిక్ చికిత్సలు నిర్వహించాలి.

ఎరువుల యాజమాన్యం (ఫర్టిగేషన్)

డ్రిప్ పద్దతిలో నీటిలో కరిగే ఎరువులను కూడా పంటలకు అందించవచ్చు. ఈ ప్రక్రియనే ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ లో ఎరువులను నీటిలో కరిగించి ఫర్టిలైజర్ ట్యాంక్ ద్వారా లేదా వెంచూరి పంప్ ద్వారా నేరుగా నీటితో పాటు మొక్కకు అందించడం జరుగుతుంది. సామాన్యంగా ఫర్టిగేషన్ లో యూరియా, పొటాషియం నైట్రేట్, ఫాస్ఫారిక్ ఆమ్లం, కాల్షియం నైట్రేట్, అమ్మోనియం ఫాస్ఫేట్, మోనో పోటాషియం ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మరియు నత్రజని, భాస్వరం, పొటాష్ మిశ్రమంతో కూడిన ఎరువులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఈ ఎరువులను తగు పరిమాణంలో నీటిలో కలిపి పంట యొక్క ఆవశ్యకతను మరియు పెరుగుదల దశను పరిగణలోకి తీసుకొని కొద్ది మోతాదులో నీటిలో ప్రవహింప చెసి మొక్కలకు అందించవచ్చు. ఈ విధంగా ఎరువులను మొక్కలకు అందించడం వల్ల రసాయనిక ఎరువుల వాడకంలో మరియు కూలీల ఖర్చులో ఆదా చేసుకోవచ్చు. ఎరువులను పంట పెరుగుదల దశను బట్టి పంట కాలంలో ఎప్పుడైన అందించవచ్చు.

ప్రస్తుతం ఫర్టిగేషన్ పద్దతి చాలా రకాల పంటల్లో, వైవిధ్య భరితమైన నేలల్లో, వాతావరణ పరిస్థితులలో విస్తృతంగా వాడుకలో ఉంది. భారతదేశంతో సహ ప్రపంచ వ్యాప్తంగా ఫర్టిగేషన్ క్రింద విస్తీర్ణం ఏయేటికాయేడు పెరుగుతూ వస్తుంది.

ప్రస్తుతం భారతదేశంలో మాత్రం ఫర్టిగేషన్ పద్దతి వాడకం ఇంకా శైశవ దశలోనే ఉంది. సూక్ష్మ సాగు నీటి పద్దతుల క్రింద ఉన్న మొత్తం విస్తీర్ణంలో మాత్రమే ఫర్టిగేషన్ ద్వారా ఎరువులు అందిస్తున్నారు. రైతులు ఇంకా ఎరువుల వాడకం సాంప్రదాయ పద్దతుల్లోనే అంటే, వెదజల్లడంగానీ, లేదా మొక్కల మొదళ్ళో వేయడంకాని చేస్తూ ఉంటారు. ఫర్టిగేషన్ పద్దతుల వల్ల పోషకాలను ఖచ్చితత్వంతో మొక్క వేరు వ్యవస్థను సూటిగా అందించే సౌలభ్యం ఉంది. ఫర్టిగేషన్ ద్వారా మొక్క ఎదుగుదల దశలను అనుగుణఁగా వాటి అవసరాలకు ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ వేరు ఎదుగుదల, కాండం అభివృద్ధి చెందే దశ, పూత మరియు కాపు దశల్లో సిఫార్సు చేసిన పోషకాలను అందించే అవకాశం ఉంది.

ఫర్టిగేషన్ వల్ల కలిగే లాభాలు :
  • ఈ పద్దతిలో మొక్కలకు/పంటకు ఖచ్చితత్వంతో పోషకాలను అందించవచ్చు. పంట యొక్క పోషకాల అవసరాలను, ఎదుగుదల దశలను అలాగే వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం వల్ల పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. పంటకు కావల్సిన మొతాదులో పోషకాల లభ్యత.
  • సాంప్రదాయ పద్దతుల్లో ఎరువులను వెదజల్లడం, మొక్కల మొదళ్ళలో వేయడం లాంటి పరిస్థితులలో పోలిస్తే ఫర్టిగేషన్ వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం రెండింతలుంటుంది.
  • పోషకాలు భూమిలో ఇంకిపోవడం, ఆవిరి కావడం అలాగే అలభ్య పోషకాలుగా రూపాంతరం చెందటం లాంటి నష్టాలను ఫర్టిగేషన్ ద్వారా అధిగమించవచ్చు. ఈదురు గాలుల వల్ల పోషకాలు వ్యర్ధమయ్యే ప్రమాదం ఉండదు అలాగే తక్కువ సామర్థ్యం గల సూక్ష్మ ప్రవాహం వల్ల భూమి పై పొర కోతకు గురికాదు.
  • సూక్ష్మసాగునీటి పద్దతుల వల్ల పంటల్లో సూక్ష్మ వాతావరణం పొడిగా ఉంటుంది. కాబట్టి రోగాల వ్యాప్తికి దోహదం చేసే శిలీంధ్రాల ఎదుగుదల తక్కువగా ఉంటుంది.
  • ఎరువుల వడకం 15 నుండి 40 శాతం వరకు, రసాయనిక మందుల వాడకం 20 నుండి 30 శాతం వరకు, కూలీల అవసరం 10 నుండి 15 శాతం వరకు, అలాగే 20 నుండి 25 శాతం యాంత్రిక శక్తి ఖర్చులు తగ్గుతాయి.
  • వాలుగా ఉన్న పొలాల్లో అలాగే ఇతర సమస్యాత్మక భూములకు ఫర్టిగేషన్ చాలా అనుకూలమైన పద్దతి. అన్నింటి కంటే ముఖ్యంగా ఫర్టిగేషన్ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతుంది.

ఈ రకంగా ఫర్టిగేషన్ పద్దతి వల్ల అనేక రకములైన ప్రయోజనాలు ఉండడం వల్ల పంట దిగుబడులు దాదాపు 30 నుండి 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే పంట ఉత్పత్తుల నాణ్యత కూడా చాలా బాగుంటుంది.

ఎరువులను బిందు సేద్య వ్యవస్థ ద్వారా కలిపే పరికరాలు

ఈ పద్దితిలో డ్రిప్పర్ల ద్వారా నీటితో పాటు ఎరువులు కూడ మొక్కల వేరు భాగంలో పడి మొక్కలకు అందుబాటులో ఉంటాయి. వీటిని డ్రిప్ నీటిలో కలిపేందుకు మూడు రకాల పరికరాలు ఉన్నాయి.

  • వెంచురీ
  • ఫర్టిలైజర్ పంపు
  • ఫర్టిలైజర్ ట్యాంక్

వెంచురీ : వెంచురీ డ్రిప్ సిస్టమ్ ను శుభ్రపరిచేందుకే కాకుండా, ఎరువుల్ని డ్రిప్ తో పారే నీటిలో కలిపేందుకు కూడా ఉపయోగించవచ్చు.

ఫర్టిలైజర్ (బూస్టర్ పంపు) పంపు : ఒక ట్యాంకులో అవసరమైన ఎరువులను వేసి ట్యాంకుకు ఒక బూస్టరు పంపు బిగించి, పంపు యొక్క అవుట్ లెట్ ను స్క్రీన్ ఫిల్టర్ కు ముందుగాని, శాండ్ ఫిల్టర్ కు ముందుగా కాని అమర్చాలి. ఈ పద్దతిలో కూడా ద్రవ ఎరువులు ఒకే విధంగా, సమానంగా మొక్కలను లభ్యమవుతాయి.

పర్టిలైజర్ ట్యాంక్ : ద్రవ ఎరువును ఒక ట్యాంకిలో వేసి ట్యాంకు యొక్క అవుట్లెట్ ను మెయిన్లైన్ ఇన్లెట్ ను కలపాలి. మెయిన్లైన్ ఇన్లెట్ మరియు అవుట్లెట్ కు మధ్య కంట్రోల్ వాల్వును వెంచూరీలో అమర్చినట్టు అమర్చాలి. వాల్వును కంట్రోల్ చేయడం వలన మెయిన్ ఇన్లెట్ నుండి నీరు ద్రవ ఎరువులో కలిపి ట్యాంకు అవుట్లెట్ ద్వారా డ్రిప్పు సిస్టమ్ లోకి ప్రవేశించి డ్రిప్పర్ల ద్వారా మొక్కల వేర్లకు అందుబాటులోనికి వస్తుంది.

ఫర్టిగేషన్ పరికరం కంచ్రోల్ హెడ్ యొక్క అంతర్భాగంగా నిర్మింపబడి ఉంటుంది. ఇది సాధారణంగా రెండు ప్రధానమైన విడిభాగాలు – బైపాస్ ట్యాంకు మరియు వెంచూరీ ఇంజెక్టర్లను కలిగి ఉంటుంది. ఫర్టిగేషన్ పరికరం ఎంపిక ముఖ్యంగా వాడే ఎరువులను (పొడి లేదా ద్రవ రూపం) ఆధారిత శక్తి, పొలం విస్తీర్ణం, పరికరం యొక్క ఖరీదు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఫర్టిగేషన్ పద్దితిలో ఉపయోగించే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. లేకుంటే ఎరువుల అవక్షేపాలు డ్రిప్పరు రంధ్రాలకు అడ్డుపడి మూసివేస్తాయి.

ఫర్టిగేషన్ పద్దతిలో పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వాడుకోవచ్చు. అయితే ఎరువులకు నీటిలో కలిసిన తక్షణం కరిగిపోయే స్వభావం ఉండాలి. మంచి నాణ్యత మరియు దిగుబడులను సాధించటానికి క్లోరైడ్ లేనటువంటి ఎరువులను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.

ఫర్టిగేషన్ కు అనుకూలమైన కొన్ని రసాయన ఎరువులు:

  • యూరియా (46-0-0)
  • అమ్మోనియం నైట్రేట్ (34-0-0)
  • అమ్మోనియం సల్ఫైట్ (21-0-0)
  • కాల్షియం నైట్రేట్ (21-0-0)
  • మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ (12-61-0)
  • మోనో పొటాషియం ఫాస్ఫేట్ (0-52-34)
  • పొటాషియం నైట్రేట్ (13-0-46)
  • యూరియా ఫాస్ఫేట్ (17-44-0)
  • యూరియా అమ్మోనియం నైట్రేట్ (32-0-0)
  • మెగ్నీషియం నైట్రేట్ (11-0-0)
  • పొటాషియం క్లోరైడ్ (తెల్లనిది) (0-0-60)
  • పొటాషియం సల్ఫేట్ (0-0-50)

సూక్ష్మపోషకాలు

FeEDTA (13%), FeDTPA (12%), Fe EDDHA (6%), Zn EDTA (9.5%), Ca EDTA (9.7%), Rexolling రెక్సోలింగ్ (బోరాన్, కాపర్, ఐరన్, మాంగనీస్, జింక్, మెగ్నీషియం).

ఫర్టిగేషన్ పద్దతి యాజమాన్యంలో కీలకమైన అంశాలు

ఫర్టిగేషన్ ద్వారా పంటల యాజమాన్యంలో వివధ అంశాలను పరిగణలోకి తీసుకొని, వాటికి అనుగుణంగా పొషకాలను ఓ దశలో ఎంత మోతాదులో విడుదల చేయాలి అనే అంశాలను నిర్ణయించటం జరుగుతుంది.

ఫర్టిగేషన్ ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలు

  • ఎన్నుకునే పంట (రకం, పంట ఎదుగుదల దశ, నిర్ణీత విస్తీర్ణంలో మొక్కల సాంద్రత, పంట పోషకాలను తీసుకునే విధానం లక్ష్యంగా పెట్టుకున్న దిగుబడులు)
  • సాగు విధానం (సాధారణ సాగు, గ్రీన్ హౌస్ లో సాగు, మట్టి లేకుండా ఇతర మాధ్యమాలలో సాగు)
  • భూభౌతిక మరియు రసాయనిక లక్షణాలు (నేల స్వభావం, లవణ పరిమాణ సూచిక సి.ఇ.సి ఉదజని సూచిక, బంకశాతం, సేంద్రీయ కర్బనం, భూసారం)
  • వాతావరణ పరిస్థితులు
  • సాగునీటి నాణ్యత (ఉదజని సూచిక, ఇసి)

పైన సూచించిన విధంగా ఫర్టిగేషన్ యాజమాన్యం వివిధ అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఫర్టిగేషన్ ద్వారా పంటలకు పోషకాలను అందించే ప్రణాళికలను తయారు చేసేటప్పుడు క్రింద సూచించిన సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

  • మద్యస్థం నుండి లోతైన రేగడి భూముల్లో ఫర్టిలైజర్ ట్యాకు పరికరాన్ని వాడుకోవాలి. అలాగే తేలికపాటి భూముల్లో ఫర్టిలైజర్ అంజెక్టరు పరికరాన్ని వాడుకోవాని.
  • ప్రతి రోజు ఫర్టిగేషన్ ద్వారా పోషకాలను అందించడం అత్యంత శ్రేయస్కరం. వీలుకాకపోతే, వారానికి రెండుసార్లయిన ఫర్టిగేషన్ పెట్టుకోవాలి.
  • పంట యొక్క పోషకాల అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేయుకొనే ఎరువు పోషకాలను అందించటమే కాకుండా అవరమైతే నీటి ఉదజని సూచికను కూడా సవరించేదిగా ఉండాలి.
  • ఎంపిక చేసే రసాయనిక ఎరువు, సాగునీటి నాణ్యతకు అనువుగా ఉండాలి (లేకుంటే అవక్షేపాలు ఏర్పడి డ్రిప్పర్లు మూసుకుపోతాయి).
  • సాగునీటిలో ఎక్కువ మొతాదులో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్, ఇనుము లేదా మాంగనీసు ఉంటే అవి ఎరువులతో చర్య జరిపి ఎరువుల సామర్థ్యాన్ని తగ్గిస్తాయని రైతులు గుర్తించుకోవాలి.
  • సాధారణంగా దొరికే యూరియా, తెల్లరకం మ్యూరేట్ ఆఫ్ పొటాఫ్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులతో కలపడం వల్ల పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ల అవసరాలను తీర్చుకోవచ్చును.
  • ఒకే ట్యాంకులో కలిపిన వివిధ రసాయనిక ఎరువులు ఒక దానితో మరొకటి తేలికగా కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఫాస్ఫేట్ లేదా ఇనుము ధాతువును భాస్వరపు ఎరువుతో భాస్వరపు ఎరువులను ఇనుము మరియు మెగ్నీషియంతో, సూక్ష్మపోషకాలను పూర్తి పంట కాలంలో అందించే విధంగా రోజువారి మోతాదును లెక్కగట్టుకోవాలి. భాస్వరపు ఎరువులను ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వకుండా, ఆఖరి దుక్కిలో వేసుకోవడం శ్రేయస్కరం. నీటి నాణ్యత సరిగా లేనిచో అవశేషాల వలన డ్రిప్పర్లు మూసుకుపోయే అవకాశముంది.
  • పంటకు సిఫార్సు చేసిన మొత్తం పోషకాలను పూర్తి పంట కాలంలో అందించే విధంగా రోజువారీ మొతాదును లెక్కగట్టుకోవాలి.
  • ద్రవ లేదా పొడి రూపంలో ఉండే రసాయనిక ఎరువులను ట్యాంకులో కలిపేటప్పుడు ట్యాంకులో 50-75 శాతం నీళ్ళు ఉండేటట్లు చూసుకోవాలి.
  • ఫర్టిగేషన్ వ్యవధి, సాగు నీరు అందించే వ్యవధిలో అంతర్భాగమై ఉండాలి. ఫర్టిగేషన్ వ్యవధి ఎప్పుడు సాగు నీరు అందించే వ్యవధి కన్నా తక్కువగా ఉండాలి.
  • ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్ వ్యవస్థను నడిపించాలి. దీని వల్ల పొలం అంతటా నమానమైన ఒత్తిడితో నీరు విడుదల అవుతుంది.
  • డ్రిప్ సిస్టంను కొద్ది సేపు నడిపి, నీటి ఒత్తిడి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిగేషన్ ప్రారంభించాలి. దీనివల్ల సిస్టంను దూరంగా ఉన్న డ్రిప్పర్లు కూడా సమాన పీడనంతో నీటిని, పోషకాలను మొక్కలకు అందివ్వగలుగుతాయి.
  • ఫర్టిగేషన్ తరువాత నిర్ణీత వ్యవధిలో డ్రిప్ వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. దీనివల్ల పైపులలో మరియు డ్రిప్పర్లలో నిగిలిపోయిన పోషకాల అవశేషాలు కడిగి వేయబడుతాయి. నిర్ణీత వ్యవధి కన్నా మరీ ఎక్కువసేపు గనుక నీటిని పంపితే మొక్కల వేర్ల దగ్గరలో ఉన్న పోషకాలు నీటి ద్వారా భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోతాయి.
  • పర్టిగేషన్ కార్యక్రమాన్ని సాఫీగా కొనసాగించడానికి మరియు మొక్కలను ఎప్పటికప్పుడు అవసరమైన పోషకాలను అందించటానికి మొక్క కణజాలము మరియు నేల, సాగు నీరు, మురుగు నీటిలో పోషకాల స్టాయిని నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా విశ్లేషించి సవరించాలి.

వివిధ పంటలకు పర్టిగేషన్ ద్వారా అందించేందుకు అవసరమయ్యే వివిధ ఎరువుల మొతాదును క్రింద ఇవ్వబడిన పట్టికలో సూచించడం జరిగింది. ఈ సిఫార్సులు భాసారం మధ్యస్థంగా ఉండే భూములను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయి. అయితే ఈ సిఫార్సులను పాటించేటప్పుడు భూసారం, సాగునీరు వేసుకున్న పంట మరియు వాతావరణ పరిస్థితులకు సంభంధించిన వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

మొక్కజొన్న పంటకు బిందు సేద్య పద్దతిలో నీటి ద్వారా ఎరువులను అందించే ప్రణాళిక

సిఫారసు చేసిన పోషకాల మొతాదు: ఎకరాకు 80: 24:24 కిలోల న:భా:పొ (నత్రజని: భాస్లరం: పొటాషియం)

దశనత్రజని (కి/రోజుకు)పొటాష్(కి/రోజుకు)యూరియా(కి/రోజుకు)సల్ఫేట్ ఆఫ్ (కి/రోజుకు)పొటాష్
పెరుగుదల (10-30 రోజులు) 0.6 0.2 1.33 0.4
మోకాలు దశ-జల్లు (30-55 రోజులు) 0.2 0.4 2.6 0.8
జల్లు గింజ కట్టు (55-75 రోజులు) 1.0 0.3 2.2 0.6
గింజ పెరుగుదల(75-90 రోజులు) 0.8 0.2 1.8 0.4

జొన్న పంటకు బిందు సేద్య పద్దతిలో నీటి ద్వారా ఎరువులను అందించే ప్రణాళిక

సిఫారసు చేసిన పోషకాల మొతాదు: ఎకరాకు 40: 24: 16 కిలోల న:భా:పొ (నత్రజని: భాస్లరం: పొటాషియం)

దశనత్రజని (కి/రోజుకు)పొటాష్(కి/రోజుకు)యూరియా(కి/రోజుకు)సల్ఫేట్ ఆఫ్ (కి/రోజుకు)పొటాష్
పెరుగుదల (10-30 రోజులు) 0.3 0.2 0.7 0.4
మోకాలు దశ-జల్లు (30-60 రోజులు) 0.7 0.3 1.5 0.6
పూత - గింజ పెరుగుదల(60-80 రోజులు) 0.6 0.15 1.3 0.3

సజ్జ పంటకు బిందు సేద్య పద్దతిలో నీటి ద్వారా ఎరువులను అందించే ప్రణాళిక

సిఫారసు చేసిన పోషకాల మొతాదు: ఎకరాకు 12: 26: 12 కిలోల న:భా:పొ (నత్రజని: భాస్లరం: పొటాషియం)

దశనత్రజని (కి/రోజుకు)పొటాష్(కి/రోజుకు)యూరియా(కి/రోజుకు)సల్ఫేట్ ఆఫ్ (కి/రోజుకు)పొటాష్
పెరుగుదల (10-30 రోజులు) 0.1 0.1 2.2 0.2
మోకాలు దశ-జల్లు (30-60 రోజులు) 0.2 0.2 4.4 0.4
పూత - గింజ పెరుగుదల(60-80 రోజులు) 0.1 0.1 2.2 0.2

చెఱకు పంటకు బిందు సేద్య పద్దతిలో నీటి ద్వారా ఎరువులను అందించే ప్రణాళిక

సిఫారసు చేసిన పోషకాల మొతాదు: ఎకరాకు 100: 40: 48 కిలోల న:భా:పొ (నత్రజని: భాస్లరం: పొటాషియం)

దశనత్రజని (కి/రోజుకు)పొటాష్(కి/రోజుకు)యూరియా(కి/రోజుకు)సల్ఫేట్ ఆఫ్ (కి/రోజుకు)పొటాష్
గూడ దశ వరకు (10-45 రోజులు) 0.4 0.15 0.9 0.2
గూడ దశ నుండి పూత దశ వరకు (45-65 రోజులు) 0.80 1.30 1.8 0.6
పూత దశ నుండి కాయ పెరుగుదల (65-85 రోజులు) 0.68 0.40 1.5 0.8
మొదటి కాయ పగులు నుండి కోత వరకు (85-116 రోజులు) 0.56 0.15 3.4 0.3

గమనిక

పైన సూచించిన ఎరువులను కాకుండా ఇతర ఎరువులను వాడాలనుకుంటే సూచించిన పోషకాల మొతాదును బట్టి రోజువారీ ఎరువుల మొతాదును లెక్కించవలెను. భాస్వరపు ఎరువులను, దుక్కిలో వేసుకోవాలి.

పట్టిక

ఫర్టిగేషన్ కొరకు వాడే నీటిలో కరిగే ఎరువుల కలయిక / అనుగుణ్యత

ఎరువులుయూఅనైఅసమొఅఫామొపొఫాపొనైపొనైమైపొనైభాపొసకానైకాక్లోమెనై
యూరియా (యూ) - - - - - - - - - - - -
అమ్మౌనియం నైట్రేట్ (అనై) - - - - - - - - - - -
అమ్మౌనియం సల్ఫేట్ (అస) - - - - - - - - - -
మోనో అమ్మౌనియం ఫాస్ఫేట్ (మొఅఫా) - - - - - - - - -
మోనో పొటాషియం ఫాస్ఫేట్ (మొపొఫా)
- - - - - - - -
మల్టికె పొటాషియం నైట్రేట్ (పొనై) - - - - - - -
మల్టికె మెగ్నీషియం (పొనైమై) - - - - - -
మల్టికె నభాపొ(పొనైభా) - - - - -
పొటాషియం సల్ఫేట్ (పొస) - - - -
కాల్షియం నైట్రేట్(కొనై) - - -
కాల్షియం క్లోరైడ్ (కాక్లో) - -
మ్యాగ్నిసాల్ (మెగ్నీషియం నైట్రేట్) (మెనై) -
మెగ్నీషియం సల్ఫేట్ (మెస)

బిందు సేద్య పద్దతి సంరక్షణ

ఏదేని ఒక యంత్రము గాని, పనిముట్టును గాని దీర్ఘకాలము ఉపయోగించుకోవాలంటే వాటు సంరక్షణ చాలా అవసరము. అదేవిధంగా బిందు సేద్య పద్దతి కూడా నీటి సౌకర్యమును చేకూర్చే యంత్ర విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తామో బిందు సేద్య పద్దతిలో కూడా వహిస్తే మనకు ఎటువంటి సమస్య తలెత్తదు.

బిందు సేద్యములో సాధారణంగా, నీరు కారడం, డ్రిప్పర్లలో ఉప్పు పేరుకొని లవణాలు మూసుకోవడం, ఎలుకులు, ఉడుతలు లాటరల్ పైపులను కొరకడం జరుగుతుంది.

బిందు సేద్య పద్దతిలో ముఖ్య భాగాలను ఈ క్రింది విధంగా సంరక్షించుకోవచ్చు

1. శాండ్ /గ్రావెల్ /ఇసుక ఫిల్టరును శుభ్రపరచడం

నీటి మడుగు లేక బావులలోని నీరు లేక చెరవులోని నీరు ప్రధాన పి.వి.సి. పైపు (మెయిన్ లైను) గుండా శాండ్/ గ్రావెల్ ఫిల్టర్ లోనికి వస్తుంది. శాండ్ ఫిల్టర్ లో ఒక ప్రత్యేక రకమైన ఇసుక/ గ్రావెల్ ఉంటుంది. అంటే నీరు నీటి గుండా ప్రవహించివప్పుడు చెత్త చెదారము, నాచు ఈ ఇసుక /గ్రావెల్ పైన ఉండిపోతాయి. శుభ్రమైన నీరు ముందుకు సాగిపోతుంది. చెత్త చెదారము సరిగా వేరుచేయకపోతే నీటి ఒత్తిడి తగ్గిపోతుంది. అందుచేత ప్రతి వారము శాండ్ ఫిల్టరును శుభ్రపరుచుకోవడం ఎంతైన ముఖ్యం. ఈ ఫిల్టరును శుభ్రపరచడానికి ఈ క్రింది పద్దతులు పాటించాలి.

  • బ్యాక్ వాష్ పద్దతి: బ్యాక్ వాష్ వాల్వు తెరుచుకొని ఉంటే నీటి ప్రవాహం పై పద్దతి మూలంగా ఫిల్టర్లోకి తిరిగి ప్రవహించేటప్పుడు ఇసుకలో పోగుపడి ఉన్న చెత్త చెదారమ ఎదురు నీటి ప్రవాహము పైన తేలుతాయి. తేలిన చెత్త చెదారము బ్యాక్ వాల్వు గుండా బయటకు వెలుతుంది. ఈ విధంగా 1 – 2 నిమిషాలు బ్యాక్ వాష్ వాల్వును తెరిచి ఉంచునట్లయితే ఇసుక శుభ్రపడుతుంది. ఇసుక శుభ్రమైన వెంటనే బ్యాక్ వాష్ వాల్వును మూసివేయాలి. మూయకపోతే, లేటరల్స్ లోకి అపరిశుభ్రమైన నీరు ప్రవహించి డ్రిప్పర్స్ లోకి అతి సన్నని రంధ్రములలో మురికి పేరుకుపోతుంది, తద్వారా డ్రిప్పర్లు మూసుకు పోయ్యే అవకాశం ఉంటుంది.
  • చేతిలో శుభ్రం చేసే పద్దతి: ఈ పద్దతిలో ప్రతి వారముకు ఒకసారి ఫిల్టరును మూత తెరిచి లోపల ఉన్న ఇసుక/ గ్రావెల్ ను చెత్తో నలుపుతూ చెత్త చెదారమును బయట పారవెయ్యాలి. ఇలా చెయినప్పుడు లోపల ఉన్న ఎలిమెంట్సుకు చెయ్యి తగలకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఫిల్టరులోని ఇసుక స్క్రీన్ ఫిల్టరులోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా శాండ్ ఫిల్టర్లోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా శాండ్ ఫిల్టర్లో 3/4 భాగం వరకు ఇసుక ఉండాలి. ఒక వేళ ఈ పరిమాణఁ తగ్గితే, తగ్గిన మేరకు ఇసుక నింపాలి.
  • రసాయనిక పద్దతి: పైన చెప్పినట్టువంటి రెండు పద్దతులు కాకుండా యాసిడ్, క్లోరిన్ మైలుతుత్తం వాంటి రసాయనిక పదార్ధములను ఉపయోగించి కూడ శాండ్ ఫిల్టర్ లోకి ఫ్రవేశపెడతారు. అవి నీటిలో కరిగి కార్బోక్లోరిక్ ఆసిడ్, క్లోరిన్ లాంటి రసాయనాలు వెచూరి ద్వారా ఫిల్టర్లోకి ప్రవేశపెడతారు. అవి నీటిలో కరిగి కార్బోనేట్ల. లేహ పదార్దాలు, క్షారతత్వలను నిర్లించడంలో ఉపయోగపడుతాయి. ఈ రసాయనాలను వెంచూరి ద్వారా ఫిల్టర్లోకి ప్రవేశపెడతారు. అవి నీటిలో కరిగి కార్బోనేట్ల, లోహ పదార్ధాలు, క్షార తత్వాలను నిర్మూలించడంలో ఉపయోగపడుతాయి. ఈ రసాయనిక పద్దతి ద్వారా మరొక్క లాభం ఏమిటంటే నీటిలో ఉత్పత్తయ్యే అతి సూక్ష్మక్రిములను ఈ పద్దతి ద్వారా నాశనము చేయవచ్చును. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించ వలసిందేంటంటే మైలుతుత్తం విషపదార్దం కాబట్టి ఆ నీటిని మనుషులు త్రాగుటకు ఉపయోగపడకూడదు.

2. జల్లెడ ఫిల్టర్ ను శుభ్రపరచడం

శాండ్ ఫిల్టర్ లాగే, జల్లెడ/ స్క్రీన్ ఫిల్టర్ శుభ్రం చేయుటకు మొదలగు జల్లడ/స్క్రీన్ ఫిల్టర్ శుభ్రం చేయుటకు మొదటగా జల్లెడ మూత తెరిచి లోపల ఫిల్టర్ ఎలిమెంట్ ను (స్క్రీన్) శుభ్రం చెయ్యాలి. శాండ్ ఫిల్టర్ నుండి వచ్చిన సన్నని మట్టి కణాలు, ఇసుక రేణులు, మురికి స్క్రీన్ ఫిల్టరులోకి ప్రవేశిస్తూనే ఆగిపోతుంది. నెమ్మది నెమ్మదిగా ఈ గోలాకారపు ఫిల్టర్ ఫిలమెంట్ దగ్గర ఒక దుమ్ము పొర ఏర్పడుతుంది. అందుచేత దీని సరైన సమయంలో శుభ్రం చెయ్యకపోతే నీటి ప్రభావం ఆగిపోతుంది.

స్క్రీన్ ఫిల్టరులోని ఎలిమెంట్ ను రెండు వైపులా ఉన్న రబ్బరు రింగులోకి తీసి ఎలిమెంటును తెరవాలి. తదుపరి జల్లెడను రబ్బరు సీళ్ళను బాగా శుభ్రపరిచి తిరిగి జాగ్రత్తగా గట్టిగా బిగించాలి. ప్రతి రోజు సిస్టం ను ఆన్ చేసిన్నప్పుడు స్క్రీన్ ఫిల్టర్ కు ఉన్నట్లయితే, ఫిల్టర్ కు వెలుపల ఉన్నటువంటి మురికి నీరు బయటకి వెళ్ళిపోతుంది.

3. వివిధ భాగాలు గల పి.వి.సి. పైపును శుభ్రపరచడము

ఇసుక/శాండ్ ఫిల్టర్, జల్లడ/స్క్రీన్ ఫిల్టర్ ఉన్నప్పటికి, చాలా సన్నటి మట్టి కణాలు, ఇతర సేంద్రీయ పదార్ధాలు వివిధ భాగాలు గల పి.వి.సి. పైపులే చేరి స్థిరపడుతాయి. పి.వి.సి. పైపులైనుకు చివరలో ఒక ప్రత్యేకమైన ఫ్లష్ వాల్వు బిగించబడి ఉంటుంది. ఈ ఫ్లష్ వాల్వును తెరిచి ప్రతి వారముకొకసారి పూర్తి స్పీడ్ తో నీటిని ఒకటి నుండి రెండు నిమిఫాలు వదిలినట్లయితే లోపల పేరుకున్న మొత్తం చెత్త, చెదారము, నీటి ప్రవాహముతో బయటకు వస్తాయి. శుభ్రమైన నీరు బయటకు వచ్చిన తరువాత ఫ్లష్ వాల్వు మూసివేయాలి.

4. లేటరల్స్ శుభ్రపరుచుట

లేటరల్స్ ట్యాబులను శుభ్రం చేయుట చాలా అవసరం. ఒకవేళ లేటరల్స్ ట్యూబును శుభ్రం చేయకపోతే నీటిలో వచ్చే చెత్త, చెదారం, సూక్ష్మమైన ఇసుక రేణువులు డ్రిప్పర్స్ లోని రంధ్రాల్లో నిండిపోతాయి. అప్పుడు మొక్కలకు ఖచ్చితమైన నీరు అందడం ఆగిపోతుంది. లేటరల్ బ్యూబుల శుభ్రం కోసము, ప్రతి ట్యూబ్ చివరన ఒక ఎండ్ కాప్ లేదా ప్లగ్ అమర్చబడి ఉంటుంది. దీనిని ప్రతి వారం లేదా ప్రతి 15 రోజులకొకసారి తెరచినట్లయితే మురికి చెత్త చెదారము, ట్యూబ్ ద్వారా ప్రవహించే నీటిలో తెరిచి ఉన్న ఎండ్ ప్లగ్ ద్వారా బయటకి వచ్చేస్తాయి. లేటరల్స్ ద్వారా మురికి నీరు వస్తున్నంత సేపు వాటిని తెరిచి ఉంచాలి. స్వచ్చమైన నీరు వస్తున్నప్పుడు ఎండ్ ప్లగ్ క్యాప్ తిరిగి బిగించాలి. లేటరల్స్ పైన ఏదైన కన్నం పడితే వాటిని గూఫ్ ప్లగ్ సమయంతో నీరు కారడాన్ని ఆపవచ్చును.

5. డ్రిప్పర్లు - శుభ్రత

లేటరల్స్ పైన అమర్చిన డ్రిప్పర్ల ద్వారా నీరు రాకపోతే లేక ఎక్కువగా కారుతుంటే డ్రిప్పరును తెరిచి లోపలి డయాఫ్రమును శుభ్రపరిచి తిరిగి ఇంకోసారి సరిగా అమర్చాలి. అప్పుడు డ్రిప్పర్లలో ఏ ఇబ్బంది ఉండదు. నాచు లవణాలు బాక్టీరియా మొదలైనవి. ఫిల్చర్లను శుభ్రపరిచేటప్పుడు నీటి ప్రవాహంతో కొట్టుకుపోవును. కాని పాచి, లవణులు డ్రిప్పర్లో పేరుకుపోయి డ్రిప్పర్ల రంధ్రాల చివర్లలో చేసి నీటిని సరిగా బయటకు రానీయదు. డ్రిప్పర్లు లవణాల, పాచి ద్వారా మూయుకుపోయినప్పుడు ఆమ్లంలో (2 – 4 ఉదజని సూచి) లేదా క్లోరిన్ (20 మి.గ్రా/లీటరు నీటికి) బ్లీచింగ్ ద్వారా శుభ్రపరచాలి. బ్లీడింగ్ లేదా ఆమ్లంలో చికిత్స చేసిన్నప్పుడు, 24 గంటల పాటు ఆ నీటిని పైపులలో నిల్వ ఉండేటట్లు చూడాలి. మరుసటి రోజు కవాటా (వాల్వ్) లన్ని తెరిచి కొత్త నీటిలో ఫ్లష్ చెయాలి.

ఇతర జాగ్రత్తలు

  • పంటలను కోసిన తరువాత డ్రిప్ లేటరల్స్ పైపులను తీసి గట్లమీద పరిచి, దుక్కి చేసుకోవాలి.
  • అలాగే పంటలో అంతరకషి చేసేటప్పుడు లేటరల్ పైపులను మలిచి ప్రక్కన పెట్టి చేసుకోవాలి.
  • వేసవిలో ఎసుకలు/ ఉడుతలకు నీటి వసతి కల్పించినచో వాటి బెడద కొంత వరకు తగ్గించవచ్చును.
  • పైపులను, డ్రిప్పర్లను, లాటరల్స్ పైపులను మంటల నుంచి కాపాడుకోవలెను.
  • డ్రిప్పరు మరియు లాటరల్ పైపులో సరియైన పీడనము ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి.
  • పీడన మాపకాలను ప్లాస్టిక్ తో కప్పి ఉంచాలి. భూమిపైకి ఉన్న కావటాలను, పైపులను సూర్యరశ్మి నుండి కాపాడుటకు జనపనార బస్తాలతో కప్పి ఉంచాలి.
  • డ్రిప్పరు నీటి పారుదల సాంర్థ్యాన్ని పరిశీలించుకోవాలి.

డ్రిప్పరు నీటి విడుదల సామర్థ్యాన్ని పరిశీలించడం

కావలసిన పరికరాలు: 1. కొలజారు, 2. గడియారం, 3. ప్లాస్టిక్ బక్కంట్, కొలజారును డ్రిప్పరు కిందగా పెట్టి ఒక లీటరు నీరు నిండటానికి పట్టిన సమయాన్ని గడియారంతో తెలుసుకోవాలి. ఆ విధంగా ఆ డ్రిప్పరు గంటకు ఎంత నీరు విడుదల చేస్తుందో తెలుసుకోవచ్చు. కావల్సిన పరిమాణం కన్నా తక్కువ విడుదల చేస్తే సబ్ మెయిన్ మీద వున్న కవాటాన్ని నియంత్రించి నీటి ప్రవాహ పీడన్నాన్ని ఎక్కువ చేయాలి. ఉదాహరణకు మొదటి డ్రిప్పరు గంటకు 4 లీటర్ల నీటిని విడుదల చేస్తే – అదే లేటరల్ మీద 100 మీటర్ల దూరంలో వున్న డ్రిప్పరు కనీసం గంటకు 3.6 కన్నా ఎక్కువ లీటర్ల విడుదల చేయగల్గి వుండాలి లేదా ఎక్కువగా ఉంటే ఆమ్ల చికిత్స చేయాలి.

తుంపర/ జల్లు (స్ప్రింక్లర్) సేద్యం

తుంపర/ జల్లు (స్ప్రింక్లర్) సేద్యంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమి ఉపరితలంపైన విరడిమ్మటం జరుగుతుంది. ఈ విధానంలో నీటిని ఒక క్రమమైన పీడనంలో (1.5 నుండి 3 కేజీలు/సెం.మీ.2 ) పైపుల్లో ప్రవహింపచేసినప్పుడు ఆ నీరు పైపులపై అనర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడిపోయి వర్షవు జల్లుగా నేలపైన పడుతుంది.

స్ప్రింక్లర్ పద్దతిలోని అతి ముఖ్యభాగాన్ని “స్ప్రింక్లర్ హెడ్” అంటారు. దీనిలో 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రం సైజు 4 నుండి 5.6 మి.మీ. వరకు, రెండవది 3.13 మి.మీ. ఉంటుంది. స్ప్రింక్లర్ హెడ్ సామర్థ్యం పంపు అందజేసే పీడనాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ పీడనం కలిగి 2 - 4 కేజీలు/సెం.మీ.2 , తక్కువ పీడనం కలది 0.34 – 2.72 కేజీలు/సెం.మీ.2 వరకు పనిచేస్తాయి. ఎక్కువ పీడనం గలది సుమారు 35 మీటర్ల వ్యాసం కలిగిన నేలను తడుపగలదు. తక్కువ పీడనం గలది 30 మీటర్ల వ్యాసం గల నేలను తడుపగలదు.

స్ప్రింక్లర్ నాజిల్ నుండి వెదజల్లబడే నీటి బిందువుల పరిమాణం పైపులోని పీడనం (ప్రెషర్) వల్ల మారుతుంటుంది. పీడనం తక్కువగా ఉన్నట్లయితే నీటి బిందువులు స్ప్రింక్లర్ నాజిల్ ద్వారా పెద్ద పరిమాణంలో విడుదలవుతుంది. అట్టి పరిస్థితులలో పంటకు మరియు నేలకు హాని కలుగుతుంది. అందుచేత అవసరమైన పీడనంతో స్ప్రింక్లర్ పద్దతిని నడపాలి.

స్ప్రింక్లర్ పద్దతిలోని ముఖ్యభాగాలు

నీటువసతి మరియు పంప్ స్టేషన్, పంప్ కనక్టర్, 6 మీటర్ల పొడవు ఎక్కువ సాంద్రత గల పాలీఅథైలిన్ (HDPE) గల పైపులు, (కఫ్లర్ లేదా ల్యాచింగ్ తో సహా), స్ప్రింక్లర్ సాడిల్, స్ప్రింక్లర్ బెడ్ లేదా నాజిల్, రైజరు పైపులు (20 మి.మీ. చుట్టుకొలతతో 76 సెం.మీ. పొడవు), పైపు బెండు (కఫ్లర్ లేదా ల్యాచింగ్ తో సహా) మరియు ఎండ్ క్యాప్.

స్ప్రింక్లర్ పద్దతిని మూడు విధాలుగా అమర్చుకోవచ్చు

శాశ్వతంగా ప్రధాన, ఉపప్రధాన పైప్ లైన్లను, లాటరల్స్ ను భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చవచ్చు. రెండో పద్దతి కొంతవరకు శాశ్వతంగా అమర్చే పద్దతి. దీనిలో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగాతా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. మీడో పద్దతి తాత్కాలికంగా అమర్చే పద్దతి. ఈ పద్దతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరొక పొలానికి తీసుకొని పోయి అమర్చుకోవటానికి వీలవుతుంది.

స్ప్రింక్లర్ రకాలు

స్ప్రింక్లర్లోని వివిధ రకాలు మరియు అవి ఉపయోగించే పంటల వివరాలు.

  • ఇమపాక్ట్ స్ప్రింక్లర్స్: తక్కువ పరిధి కలపి, పనిచేసేందుకు కావలసిన పీడనం 2 నుండి 5 కేజీలు/సెం.మీ.2 . స్ప్రింక్లర్ నీటి జట్ ఏంగిల్ 30. నీటి విడుదల (డిస్చార్జి) గంటకి 1200 నుండి 4000 లీటర్లు. ఈ రకం స్ప్రింక్లర్లు అన్ని రకాల పంటలకు శ్(వేరుశనగ, గోధుం, ప్రొద్దుతిరుగుడు, ఆకుకూరలు) అనుకూలం.
  • మైక్రో స్ప్రింక్లర్ లేదా మైక్రోజట్స్ : ఉద్యానవన పంటలు, తోట పంటలకు అనుకూలం,. తక్కువ ప్రెషర్ తో (2 కేజీలు/సెం.మీ.2 ) పనిచేస్తాయి. నీటి జట్ ఏంగిల్ 40 నుండి 70, నీటి విడుదల గంటకు 20 నుండి 500 లీటర్లు.
  • జైట్ స్ప్రింక్లర్: ఎక్కువ పరిధి కలవి, రెయిన్ గన్ స్ప్రింక్లర్స్. అధిక పీడనం (5 కేజీలు/సెం.మీ.2 ) అవసరం. నీటిజట్ ఏంగిల్ 300 మరియు నీటి విడుదల గంటకు 6000 నుండి 18000 లీటర్లు. గడ్డి మరియు ఆహారధాన్య పంటలలో వాడుకోవచ్చు.
  • పాపర్ స్ప్రింక్లర్: మధ్యరకం పీడనం (ప్రెషర్) 2 నుండి 5 కేజీలు/సెం.మీ.2 తో పనిచేస్తాయి. ఈ రకం స్ప్రింక్లర్లు లాన్స్ లలో, పచ్చికలలో మరియు గోల్ఫ్ కోర్సులలో వాడుతారు. నీటి విడుదల గంటకు 500 నుండి 5000 లీటర్లు.
  • రెగ్యులేటెడ్ స్ప్రింక్లర్: ఎగుడు దిగుడు లేదా ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉన్న నేలల్లో వాడుతారు.
  • పార్ట్ సర్కిల్ స్ప్రింక్లర్: నేల అంచుల్లౌ ఒక ప్రక్క మాత్రమే అర్థ వలయం తడిపే విధంగా వాడుతారు.
  • పర్ఫోరేటెడ్ పైపులు: పచ్చికలలో మరియు లాన్స్ లో ఎక్కువగా వాడుతారు.

స్ప్రింక్లర్ పద్దతి వలన లాభాలు

  • స్ప్రింక్లర్ పద్దతిలో సాంప్రదాయ నీటి పారుదల విధానంలో వలె పొలంలో నీరు పారించేందుకు కాలువలు, గట్లు ఏర్పాటు చేయనవసరం లేదు. అందువలన పంట, భూమి నష్టపోకుండా పొలం మొత్తం సాగుచేయవచ్చు.
  • సాంప్రదాయ నీటిపారుదల విధానంలో నీరు కాలువల గుండా పారినప్పుడు వక్కలకి ఇంకి 35% పైగా నీరు వృధా అవుతుంది. స్ప్రింక్లర్ పారుదల పద్దతిలో అటువంటి నష్టం ఉండదు.
  • పంటకు తరుచూ అవసరమయ్యే పరిమాణంలో నీటిని అందించడం వలన ఎదుగుల బాగా ఉండి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడి (5 – 20 % వరకు) సాధించవచ్చు.
  • స్ప్రింక్లర్ పద్దతిలో నీటిని భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోనీయకుండా అవసరమయినంత లోతుకు మాత్రమే ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఇసుక నేలలలో సమర్థవంతంగా నీటియాజమాన్యం చేపట్టవచ్చు.
  • మొక్కలకు అవసరమయినంత నీటిని ఎక్కువ సార్లుగా తక్కువ మొత్తంలో అవ్వవచ్చు.
  • స్ప్రింక్లర్ లో ఉత్పన్నమయ్యే మృదువైన నీటి తుంపరల వలన భూమిపై అధికంగా నీరు నిలువ ఉండదు. మట్టి గడ్డకట్టదు, అవసరమైన నిష్పత్తిలో గాలి మరియు నీరు భూమిలో ఉంటూ విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. తద్వారా అధిక దిగుబడి సాధ్యమవుతుంది.
  • ఎగుడుదిగుడుగా ఉన్న నేలలను, నీటివసతి కన్నా ఎత్తులో ఉన్న భాములను కూడ సాగుచేయవచ్చు.
  • నీరు వర్షం మాదిరి తుంపర్లుగా పడుట వలన పరిసరాలు చల్లబడి అధిక ఉష్ణోగ్రత నుండి పంటలను కాపాడవచ్చు.
  • స్ప్రింక్లర్ వ్యవస్థ ఖర్చు వివరాలు

    స్ప్రింక్లర్ వ్యవస్థను అమర్చేదుకు ఒక ఎకరాకు సుమారుగా రూ. 5,000 – 5,600, రెండు ఎకరాలకు రూ. 6,500 – 7,000, మూడు ఎకరాలకు రూ. 9,000 – 10,000, నాలుగు ఎకరాలకు రూ. 11,500 – 12,000 ఖర్చు అవుతుంది. స్ప్రింక్లర్ పైపుల సైజులను బట్టి ధరలలో కొద్ది మార్పులు ఉండవచ్చు.

    నిర్వాహణ

    స్ప్రింక్లర్లు పనిచేసేటప్పుడు, కొన్ని సమయాల్లో గొట్టాలలో పీడనము తగ్గిపోవడం జరుగవచ్చును. కావున సక్షన్ పైపులో గాలి చొరబడటము, పంపు ఇంపేల్లరులో లేదా ఫుట్ వాల్వ్ వద్ద చెత్త చేరడం లేదా నీటి వనరులో నీటి మట్టం కగ్గడం వలన పీడనం సంభవించవచ్చును. పంపు లేదా మొటరు బేరింగులు అరిగి పోయినప్పుడు లేదా పంపింగ్ హెడ్, దాన్ని డిజైన్ చేసిన ఎత్తు కంటే తక్కువగా ఉన్నప్పుడు మొటరు (పవర్ యూనిట్) వేడేక్కకుండా సంభవిస్తుంది. కనుక ఈ విషయంలో తగిన శ్రద్ద వహించి స్ప్రింక్లర్లను మంచి సమర్థతతో పని చేయించినప్పుడు మంచి ఫలితము ఉంటుంది.

    జల్లెడ ఫిల్టర్ ను శుభ్రపరుచుట

    ఫిల్టరుపై మూతను తీసి, జల్లెడ బయటకు తీసి, పైన మరియు క్రిందవున్న రబ్బరు సీళ్ళను జల్లెడ నుండి వేరు చేయాలి. జల్లెడను, రబ్బరు సీళ్ళపై పేరుకు పోయిన మట్టిని వేగంగా పారే నీటిలో కరగాలి. తరువాత జల్లెజను రబ్బరు సీలు వాటి స్థానములో అమర్చి ఫిల్టరులో బిగించాలి. జల్లెడను బ్రష్ తో రుద్దరాదు. సాధారణంగా మురికి ఇతర పదార్ధాల అడుగున ఉన్న ఫ్లష్ అవుట్ గేట్ వాల్వును ఉపయోగించి తీసివేయవచ్చును. ప్రతీసారి నీరు పెట్టేటప్పుడు, జల్లెడ ఫిల్టరు యొక్క డ్రైన్ వాల్వు కొద్ది సేపు తెరిచి వుంచునట్టయితే ఫిల్టరులో ఉన్నట్టువంటి మురికి నీరు బయటకు వెళ్ళిపోతుంది.

    పైపులు మరియు అమరికలు (ఫిట్టింగ్సు)

    తరుచూ పైపులను మరియు కవ్లర్లను శుభ్రపరుచుకోవాలి. రబ్బరు వాషర్ పని తీరును గమనించి మార్చుకోవాలి. రబ్బరు వాషర్ పని తీరును గమనించి మార్చుకోవలెను. నట్ లు మరియు బొల్ట్ లను టైట్ గా బిగించాలి. పైపులను ఎట్టి పరిస్థితులలో ఎరువుల కుప్పలపై మరియు తడిగా ఉన్న కాంక్రీటు మీద వృధాగా పోతున్నదేమో గమనించి, లీకేజీలు ఉన్నచోట ఎమ్సీల్ తో బిగించాలి.

    స్ప్రింక్లర్ హెడ్

    స్ప్రింక్లర్ పరికరాలను అటు ఇటు కదల్చినప్పుడు స్ప్రింక్లర్ హెడ్ పాడవకుండా జాగ్రత్త వహించాలి. ఎట్టి పరిస్థితులలో స్ప్రింక్లర్ కు నూనె, గ్రీడ్ మరియు ఇతర లూబ్రికెంట్లు వాడరాదు. అరిగిపోయిన వాటర్లను ఎప్పుటికప్పుడు మార్చాలి. స్ప్రింగ్ టెన్నన్ తగ్గిన ఎడల, పెంచేందుకు స్ప్రింగ్ ఆర్మ్ గట్టిగా బిగించి స్ప్రింగ్ చివరలను పైకి లాగి వంచాలి. మూసుకుపోయిన నాజిల్స్ శుభ్రపరిచెందుకు ఇనుప చువ్వలకు బదులుగా సన్నని పుల్లలను వాడాలి. పైపులను నేల మూద లాగకుండా మనుషులచే మోసుకుపోవాలి.

    స్ప్రింక్లర్ నాజిల్, పంపు, ఇంపెల్లర్ మొదలగునవి సాధారణంగా అరుగుదలకు లోనవుతాయి. ప్రతి పంట అయిపోయిన తర్వాత వీటిని పరీక్షించి అవసరమైతే కొత్త భాగాలను మార్చుకోవాలి. పంట అయిపోయిన తర్వాత పైపులను కప్లర్స్ ను, స్ప్రింక్లర్లను పొడి ప్రదేశాలలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. రబ్బరు, ప్లాస్టిక్ పైపులు వాటి వాషర్స్ ను ఎలుకల బారి నుండి రక్షించుకొవాలి.

    కొన్ని సార్లు స్ప్రింక్లర్ల నాడిల్ తిరగకపోవడం జరుగుతుంది. ఇది పీడనము తగ్గినప్పుడు, పైపులలో లీకేజీలు (పగుళ్ళు) మరియు మట్లు వదులుగా ఉన్నప్పు జరుగుతుంది. ఈ లోపాలను సరిచేసి పీడనం ఉండునట్లు చూడాలి. స్ప్రింక్లర్ రంధ్రాలు (నాజిల్స్) మూసుకొని పోకుండా చూసుకోవాలి. పీడనము సరిగా ఉండేటట్లు చూడాలి. నీటి యొక్క విస్తరణ పద్దతిని మరియు పరిమాణమును పరిశీలించాలి. ఈ విస్తరణ గుణకము 0.83 కంటే ఎక్కువగా ఉన్నచో తుంపర వ్యవస్థ పనితీరు బాగున్నదని నిర్ధారించుకోవాలి.

    ఆధారం: వ్యవసాయ పంచాంగం

    చివరిసారిగా మార్పు చేయబడిన : 1/10/2023



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate