অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రబీ వేరుశనగ సాగులో పాటించాల్సిన మెళకువలు

తెలంగాణలో పండించే నూనె గింజల పంటలలో వేరుశనగ చాలా ప్రధానమైనది. రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 1.60 లక్షల టన్నుల కాయ ఉత్పత్తి, 1.45 టన్నులు హెక్టారుకు ఉత్పాదకత కలిగి ఉంది. ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీ, వేసవిలో నీటి పారుదల కింద సాగవుతోంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా మహాబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పండిస్తున్నారు.

ఖరీఫ్ లో వర్షపాతం తగినంత నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు అంటడిగి (తగ్గిపోయి) బావులు, బోర్లు సైతం నీళ్ళు తగ్గిపోవడంతో రైతులు అందరూ ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమం, అందువలన ఆరుతడి పంట అయిన వేరుశనగను, ముఖ్యంగా ఎర్రనేలలు కలిగిన రైతులు ఎంచుకుంటే అధిక దిగుబడి సాధించి లాభాలను పొందవచ్చు.

వేరుశనగలో దిగుబడులు తగ్గటానికి ప్రధాన కారణాలు

  • విత్తన మోతాదు తగ్గించి నాటడం
  • మొక్కల సంఖ్య తక్కువగా ఉండడం
  • విత్తనశుద్ది పాటించకపోవడం
  • పాత విత్తనం వాడుకతో మొలకశాతం తగ్గటం
  • దగ్గరగా నీటి తడులు ఇవ్వడం
  • కలుపు నివారణ చేయకపోవడం
  • ఆకు వుచ్చ, త్రుప్పు తెగుళ్ళను నివారించకపోవడంతో పైరు కాల పరిమితి కన్నా ముందుగానే ఆకురాల్చడంతో కాయలో గింజ నిండుగా లేకపోవడం.

అనువైన రకాలు

కదిరి-6, ధరణి, జె. సి. -88. కదిరి-9, కదిరి-7

విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మంచి - నాణ్యత, మొలకెత్తే శక్తిని (85 శాతం) కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా విత్తనం 5 కొరకు వేరుశనగకు కాయల రూపంలో నిలువ ఉంచి విత్తేముందు గింజలను వేరుచేయాలి. గింజలను వేరు చేసేటప్పుడు గింజ పై పొర బాగా ఉండి రంగు సమానంగా ఉన్న విత్తనాలను ఎన్నుకోవాలి.

విత్తనశుద్ధి

మంచి విత్తనాన్ని ఎన్నుకొని, కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండిజమ్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ తో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ తో కలిపి శుద్ధి చేయాలి. కొత్తగా వేరుశనగ వేసే నేలల్లో 60 కిలోల విత్తనానికి 1 కిలో రైజోబియం కల్చరుతో కలిపి విత్తుకోవాలి.

విత్తే సమయం

రబీ - సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 15 వరకు.

వేసవి - జనవరి 15 నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు.

విత్తే దూరం

వరుసల మధ్య 22.5 - 80.0 సెం.మీ, మొక్కల మధ్య 10.0 - 15.0 సెం.మీ. విత్తనాన్ని 5 సెం.మీ. కంటే ఎక్కువ లోతులో పడకుండా నాగలితో విత్తుకోవాలి.

ఎరువులు

ఎకరానికి 4-0 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు, ఎకరానికి 27 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను దుక్కిలో వేయాలి. మిగిలిన 9 కిలోల యూరియా పైపాటుగా విత్తిన 30-35 రోజులకు వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేటను ఫాస్పేట్ ఎరువులతో కలుపకుండా ఆఖరి దుక్కిలో వేయాలి.

200 కిలోల జిప్సంను పైరు పూత, ఊడ దిగే సమయంలో మొక్కల మొదళ్ళ దగ్గర 50 సెం.మీ. లోతులో వేసి మట్టి ఎగదోయాలి. జిప్సంలోని కాల్షియం కాయలు బాగా ఊగడానికి, గంధకం గింజలలో నూనెశాతం పెరగడానికి దోహదపడుతుంది.

నీటి యాజమాన్యం

పంటకాలంలో 8 - 9 నీటి తడులను వాతావరణ పరిస్థితులను బట్టి 7 - 12 రోజుల వ్యవధిలో తడులు ఇవ్వాలి. ఊడ దిగే దశ నుండి గింజ గట్టి/కాయ గట్టి పడే వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

కలుపు నివారణ

నిత్తిన 3 రోజులలో ఎకరానికి 0.8 లీ. అల్లాక్లోర్ లేదా 1.3 - 1.6 లీ పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలిసి తడి నేలపై పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు.

  • విత్తిన 25 రోజులలోపు పైరుపై ఇనజీతాఫిర్ 300 మి.లీ. లేదా క్విజాలోఫాస్ ఇథైల్ 400 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి,
  • విత్తిన 45 రోజుల వరకు కలుపును సమర్థవంతంగా అదుపు చేయాలి. సరైన సమయంలో కలుపు తీయకపోతే 45 శాతం దిగుబడి తగ్గుతుంది.

సమగ్ర సస్యరక్షణ

  • వేరుపురుగు, పచ్చదోమ, తామర పురుగు, పేనుబంక, ఆకుముడత, పొగాకు లద్దె పురుగు, బిహారీ గొంగళి పురుగు, శనగ పచ్చ పురుగు, సెమిలూపర్, మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు, మొవ్వకుళ్ళు, ఆకుమచ్చ, తుప్పు తెగులు ముఖ్యమైనవిగా గుర్తించవచ్చు.
  • వేరుపురుగు వచ్చే ప్రాంతాలలో కిలో విత్తనానికి 100 మి.లీ. క్లోరిపైరిఫాస్ విత్తనశుద్ధి చేసి నీడలో 30 నిమిషాలు ఆరబెట్టి విత్తుకోవాలి.
  • పైరును లేత దశలో తామర పురుగు, పచ్చదోమ, పేనుబంక, అకుముడత (వెబ్బర్) ఆశించి పంటకు నష్టాన్ని కలిగిస్తాయి.
  • వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేసి నివారించాలి.
  • పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు ఉనికిని తెలుసుకోవడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి.
  • వేరుశనగ పైరుచుటూ 50-100 ఆముదపు మొక్కలను నాటి రెక్కల పురుగుల ఉధృతిని అంచనా వేయాలి.
  • ఎకరానికి పంటపై అడుగు ఎత్తులో 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
  • గుడ్లు/చిన్న లద్దె పురుగుల సముదాయాలను ఏరీ నాశనం చేయాలి.
  • 10 కిలోల వేప గింజల పొడి 200 లీటర్ల నీటిలో 12 గంటలు నానబెట్టి వడగట్టి ఎకరా పైరుపై పిచికారీ చేయాలి.
  • లద్దె పురుగు, శనగపచ్చ పురుగులను క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. లేదా నోవాల్యూరాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పంటపై పిచికారీ చేసి నివారించాలి.
  • బాగా ఎదిగిన లద్దె పురుగులు, ఎండకు మొక్కల మధ్య లేదా మట్టి పెళ్ళం కింద దాగి సాయంత్రం చల్లని సమయాల్లో పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎటువంటి పురుగు మందులకు లొంగవు.
  • బాగా ఎదిగిన లద్దె పురుగుల నివారణకు విషపు ఎరను తయారు చేసి నివారించాలి. తవుడు 10 కిలోలు + బెల్లం 2 కిలోలు - క్లోరోఫైరిఫాస్ 20 శాతం ఇ.సి. 500 మి.లీ. 4-5 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం వేళలో ఉండలు ఉండలుగా చేసి మొక్కల మధ్య వేసి నివారించాలి.

తెగుళ్ళు

  • వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు తెగులు విత్తనశుద్ధితో నివారించాలి.
  • మొదలు కుళ్ళు ఆరించిన పొలంలో మొక్కలను పీకి కాల్చివేయాలి. 2 గ్రా/లీ మాంకోజెబ్ కలిపి మొక్కల మొదళ్ళు తడపాలి.
  • వేరుకుళ్ళు సోకిన పొలంలో బ్రాసికాల్ (5 గ్రా. లి) ద్రావణంతో చ.మీ.కు ఒక లీటరు చొప్పున భూమిని బాగా తడపాలి.
  • అకుమచ్చ, తుప్పు తెగులు నివారణకు ఒక లీటరు నీటికి మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బండిజమ్ 1 గ్రా. ద్రావణాన్ని పైరుపై విత్తిన 45 రోజుల నుండి 10-15 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారీ చేసి నివారించవచ్చు.

పంట కోత

గుత్తి రకాలు 110-115 రోజులకు కోత వస్తుంది. తీగ రకాలు (పాక్షిక తీగ) 120-130 రోజులకు పక్వమవుతాయి. 70-80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు వర్ణంగా మారినప్పుడు 80-90 శాతం కాయ లోపలి పెంకు భాగం నల్లగా మారినప్పుడు పైరును తీయాలి. పంట తీసిన తర్వాత కాయలు కోసి 9 శాతం తేను వచ్చే వరకు బాగా ఆరబెట్టాలి. నిలువ చేసే ముందు కాయలపై మలాథియాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసి నిలువ చేయాలి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate