অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వేరు శనగ

వేరుశనగ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విస్తిర్ణంలో (సుమారు 1.6-1.7 లక్షల హెక్టార్లు) సాగవుతున్న నూనె గింజల పంట. వేరుశనగ పంటను ప్రధానంగా యాసంగిలో మహబుబ్ నగర్, వరంగల్, నల్గొండ మరియు కరీంనగర్ జిల్లాలలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరియు తుంపర (స్ప్రింకర్ల) పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యసంగిలో ఈ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుచున్నది.

విత్తుకునే సమయము

ఖరీఫ్ లో వేరుశనగ పంటను జూలై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చును. ఈ పంటను యసంగిలో ఉత్తర తెలంగాణలో అక్టోబర్ రెండవ పక్షం లోపు, దక్షిణ తెలంగాణలో సెప్టెంబరు మొదటి పక్షం నుండి నవంబర్ రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చును.

నేలలు మరియు నేల తయారీ

ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కా నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ బంకమన్ను కలిగిన నల్లరేగడి నేలల్లో ఈ పంట వేయరాదు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కిచేసి చదును చేసుకోవాలి.

విత్తన మోతాదు

రకాలు విత్తన మోతాదు (కిలోలు/ఎకరాకు)
ఖరీఫ్ యాసంగి
కాయలు గింజలు కాయలు గింజలు
స్పానిష్ గుత్తి రకాలు కదిరి – 6, కదిరి – 9 అనంత, హరితాంధ్ర, ఐ.సి.జి.ఏస్ – 91114, ధరణి, టి.ఎ.జి. – 24 95 60 120 80
వర్జీనియా రకాలు కదిరి – 7, కదిరి – 8 బోల్డ్ (పెద్ద కాయలు) - - 85 55

 

ఈ పంటలో పొందుపర్చిన సస్యరక్షణ వివరాలు వివిధ పరిశోధన కేంద్రాలలో వేర్వహించబడిన పరిశోధన ఫలితాల ఆధారంగా సూచించబడినవి.

విత్తనశుద్ది

కిలో విత్తనానికి 1 గ్రా. తెబుకోనజోల్ 2డిఎస్ లేదా 3 గ్రా. మంకోజేబ్ పొడి మందు పట్టించాలి. కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో ఒక మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్ ను 7 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ తో విత్తనశుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసిటప్పుడు కిలో విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చరుని పట్టించాలి. వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కండము కుళ్ళు తెగుళ్ళు ఎక్కవగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మా విరిడిని పట్టించి మంచి ఫలితాలు పొందవచ్చు.

విత్తే దూరం

  • వర్షాధారంగా ఖరీఫ్ లో విత్తేటప్పుడు 30*10 సెం.మీ. దూరంలో మరియు యాసంగిలో నీటి పారుదల క్రింద సాగుచేసేటప్పుడు 22.5*10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.
  • ఖరీఫ్ లో ఒక చదరపు మీటరుకి 33 మొక్కలు, యసంగిలో ఒక చదరపు మీటరుకు 44 మొక్కలు ఉండేలా మొక్కల సాంద్రత పాటించాలి.
  • పెద్ద కాయ రకాలు వేసుకున్నపుడు 30*15 సెం.మీ. దూరము మరియు ఒక చదరపు మీటరుకి 28 మొక్కలు ఉండేలా విత్తుకోవాలి.

విత్తే పద్ధతి

విత్తనాన్ని గొర్రుతో గాని, లేక నాగటి చాళ్ళలో గాని లేక ట్రాక్టరుతో నడిచే విత్తే యంత్రముతో గాని విత్తుకోవాలి. విత్తే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని 5 సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి. ట్రాక్టరు ద్వారా నడిచే సీడ్ డ్రిల్ ను వాడినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవడమే కాక, ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చును. ఈ పద్ధతిలో ఒక ఎకరాన్ని 2 -3 గంటల్లో విత్తుకోవచ్చు.

ఎరువుల యాజమాన్యము

భుసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 3-4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి.

రకము పంట కాలము (రోజులు) దిగుబడి (కిలోలు/ఎకరానికి) ముఖ్య లక్షణాలు
ఖరిఫ్ యాసంగి
కదిరి – 6 100-110 100-110 600-800 చిన్న గుత్తిరకము. తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో ఉన్న రకము.
కదిరి – 9 110-120 110-120 600-800 నీటి ఎద్దడిని, అకుమచ్చ తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. గింజలు నిద్రావస్థను (20 రోజులు) కలిగి ఉంటాయి.
కదిరి హరితాంద్ర 100 700-800 1000-1200 బెట్ట పరిస్థితులు, ఆకుమచ్చ తెగులు మరియు తామర పురుగులను తట్టుకుంటుంది. పంట చివరి దశ వరకు కూడా పచ్చగా ఉండి ఎక్కువ కట్టే దిగుబదినిస్తుంది.
ధరణి 100-105 700-800 900-1000 నీటి ఎద్దడిని తట్టుకుంటుంది.
టి.ఎ.జి. – 24 95-100 - 800-1000 యాసంగి మరియు వేసవిలో సాగుకు అనువైన రకం. నిద్రావస్థ లేదు. మొక్కలు పొట్టిగా ఉంటాయి.
జె.ఎల్. – 24 105-110 600-700 1000-1100 గింజలు పెద్దవిగా ఉండి ఒకేసారి కాయలు పక్వతకు వస్తాయి.
ఐ.సి.జి.వి. – 91114 100-105 700-800 1000-1200 త్వరగా కోతకు వస్తుంది. పంట చివరి దశలో బెట్టను తట్టుకుంటుంది.
కదిరి – 7, కదిరి – 8 120-130 800-1000 1200-1400 పెద్ద గుత్తిరకాలు, పచ్చికాయలు అమ్మకానికి అనువైనవి.

మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 18 కిలోల యూరియాను విత్తే సమయంలో వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలి పూత దశలో మరో 10-15 కిలోల యూరియాను వేసుకోవాలి. ఎకరానికి 200 కిలోల జిప్సమ్ ను పూత దశ పూర్తియి ఊడలు దిగే సమయంలో మొదళ్ళ దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి. విత్తిని 45 రోజుల తర్వాత ఎట్టువంటి అంతర సేద్యం చేయరాదు.

సుక్ష్మ పోషకాల లోపాలు – సవరణ

జింకు లోపించిన పైరులో ఆకులు చిన్నవిగా మారి మొక్కలు గిడసబారతాయి. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరాకు 400 గ్రా. జింకు సల్ఫేట్ 200 లీటర్లు నీటిలో కలిపి కనీసం 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇనుప ధాతు లోపము నల్లరేగడి నెలల్లో అధిక తేమ ఉన్నపుడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపు పచ్చగాను తర్వాత తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపాన్ని అధిగమించుటకు ఎకరాకు 1 కిలో అన్నభేధి మరియు 200 గ్రా. సిట్రిక్ ఆమ్లం 200 లీ. నీటిలో కలిపి రెండు సార్లు పిచికారి చేసుకోవాలి.

కలుపు నివారణ, అంతరకృషి

కలుపు మొలకెత్తక ముందే నశింపజేయగల కలుపు నాశినులైన అలాక్లోర్ ఎకరాకు ఒక లీటరు లేదా పెండిమిధాలిన్ 30% ఇ.సి ఎకరాకు 1.30-1.60 లీ. చొప్పున 200 లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని లేదా 2-3 రోజుల లోపు నేలపై పిచికారి చేసుకోవాలి. విత్తిన 25-30 రోజుల దశలో గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి మరియు మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. విత్తిని 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేడుండ చూసి అటుపై ఎలాంటి అంతర సేద్యం చేయకూడదు లేనిచో ఊడలు దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి.

పంట విత్తన 20 రోజుల వరకు కలుపు తీయడానికి వీలుకాని పరిస్థితులలో పైరులో మొలచిన కలుపును (వేడల్పాకు మరియు గడ్డిజాతి) 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజితాఫైర్ 10% ఎకరాకు 300 మి.లీ. లేదా ఇమాజామాక్స్ 35% + ఇమాజితా పైర్ 35% డబ్లు.జి కలుపు మందును 40 గ్రా. ఎకరాకు చొప్పున 200 లీటర్లు నీటితో కలిపి పిచికారి చేసి అన్ని కలుపు మొక్కలను నివారించవచ్చును.

నీటి యాజమాన్యం

వేరుశనగ పంటకు మొత్తం 450-600 మి.మీ. నీరు అవసరమౌతుంది. తేలిక నేలల్లో 6-8 తడులు ఇవ్వవలిసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నపుడు విత్తనం వేసుకోవాలి. రెండవ తడిని విత్తన తర్వాత మొలక వచ్చిన 20-25 రోజులకు (పూర్తిగా ఒకేసారి పూత వచ్చేటందుకు) ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణం, బంక మట్టి శాతం అనుసరించి 7-10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. చివరి తడి పంటకోతకు 4-7 రోజుల ముందు ఇవ్వాలి.

పైరులో ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే వరకు (విత్తిన 45-50 రోజుల నుండి కాయలు ఊరె వరకు) సున్నితమైనది, కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతదులో కట్టాలి. నీటిని తుంపర్లు ద్వారా ఇచ్చినట్లయితే దాదాపు 25 శాతం నీరు ఆదా అయి, అధిక దిగుబడి మరయు నాణ్యమైన కాయలు తీసుకోవచ్చు.

పంటల సరళి

ఖరిఫ్ లో మొక్కజొన్న తర్వాత రబీలో వేరుశనగ ఒక లాభసాటి పంట సరిళిగా సాగు చేసుకోవచ్చును. యాసంగిలో వేరుశనగ సాగు చేసేటప్పుడు, ప్రతి 35-40 సాళ్ళకు ఒక వరుస సజ్జ వేసుకోవడం వల్ల తామర పురుగుల వ్యాప్తకి ఇవి అడ్డుగా పనిచేసి నష్టాన్ని నివారించువచ్చును.

సస్యరక్షణ

పురుగు/తెగులు గుర్తించే లక్షణము అనుకూల పరిస్థితులు నివారణ చర్యలు
వేరు పురుగు వేరుపురుగు ‘సి’ ఆకారంలో ఉండి భూమి లోపల కత్తిరిస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడి, ఎండి, చనిపోతాయి. మొక్కలను లాగితే సులభంగా ఊడి వస్తాయి. పెంట కుప్పలు పంట చేలకు దగ్గరగా ఉన్నపుడు, అలాగే పూర్తిగా మురగని పశువుల ఎరువును పొలంలో చల్లినప్పుడు ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. సమస్య ఉన్న ప్రాంతాల్లో ఒక కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ తో విత్తనశుద్ధి చేయాలి. ఫోరేటు 10% గుళికలు ఎకరాకు 6 కిలోలు చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి.
ఆకు ముడత పురుగు ఈ పురుగు 2-3 ఆకులను కలిపి గూడు చేసి పచ్చదనాన్ని తినడం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుండి కాలిపోయినట్లు కనపడతాయి. పంట విత్తిన 15 రోజుల నుండి 45 రోజుల వరకు ఈ పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 500 మి.లీ. లేదా ఎసిఫేట్ 300 గ్రా. 200 లీ. నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి.
పొగాకు లద్దె పురుగు ఈ పురుగు ఆకులపై పత్రహరితాన్ని తినివేసి, కేవలం ఈనెలను మాత్రమే మిగులిస్తుంది. ఈ పురుగు పగటివేళ మొక్కల అడుగున లేదా మట్టి పెళ్ళల క్రింద దాగి, రాత్రి పూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి. ఈ పురుగు నివారణకు ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఎర పంటలుగా ఆముదం లేదా ప్రొద్దుతిరుగుడు 30-40 మొక్కలు ఉండేలా విత్తాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషాయం పిచికారి చేసుకోవాలి. ఎకరాకు 8-10 పక్షి స్థావరాలు అమర్చాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు నోవల్యూరాన్ 200 మి.లీ. లేదా ప్ల్యుబెండమైడ్ 40 మి.లీ. ఒక ఎకరాకు సరిపోయేలా 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. విషపు ఎర (వరి తవుడు 5 కిలోలు + బెల్లం అర కేజీ + మొనోక్రోటోఫాస్ 500 మి.లీ.) ఎకరా పొలంలో సాయంత్రం వేల సమానంగా చల్లి పురుగు ఉదృతి తీవ్రంగా ఉన్నప్పుడు నివారించవచ్చు.
తామర పురుగులు ఈ పురుగులు ఆశించినపుడు ఆకుల అడుగు భాగాన గోధుమ/ఇనుము రంగు మచ్చలు ఏర్పడుతాయి. మొవ్వుకుళ్ళు, కాండం కుళ్ళు, వైరస్ తెగుళ్ళను వ్యాపింపజేస్తాయి. సగటు ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు ఈ పురుగుల ఉధృతి ఎక్కువవుతుంది. తామర, పచ్చదీపపు పురుగులు నివారణకు మొనోక్రోటోఫాస్ 320 మి.లీ. + వేప నూనె 1 లీ. + ఒక కిలో సబ్బు పొడి 200 లీ. నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాలి. ధయోమిథాక్సామ్ 100 గ్రా. చొప్పున 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
పచ్చ దీపపు పురుగులు ఆకుల అడుగున చేరి రసాన్ని పిలుస్తాయి. అకుకోన భాగాన ‘v’ ఆకారంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి.
తిక్కా ఆకుమచ్చ తెగులు పైరు 30 రోజుల దశలోపు ఆశించే ఆకుమచ్చ తెగులులో మచ్చలు ఆకుల పైభాగాన ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఆలస్యంగా వచ్చే తెగులులో మచ్చలు ఆకు అడుగు భాగాన నల్లని రంగులో ఉంటాయి. ఈ మచ్చలు తర్వాత ఆకుల కాడల మీద, కాండం, ఊడల మీద కూడ కనిపిస్తాయి. విత్తనశుద్ధి చేయని పరిస్థితులలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. 1 గ్రా. తెబ్యుకొంజోల్ విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. క్లోరోధాలోనిల్ 400 గ్రా. లేదా టేబ్యుకొనజోల్ 200 మి.లీ. ఒక ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
మొదలు కుళ్ళు తెగులు (కాలర్ రాట్) విత్తనం మొలకెత్తిన తర్వాత నేలకు ఆనుకోని కాండంపైన నల్లని శిలీంధ్రం బీజాలతో కప్పబడి ఉంటుంది. విత్తనశుద్ధి చేయని పరిస్థితులలో ఈ తెగులు ఎక్కవగా ఆశిస్తుంది. పంటమార్పిడి తప్పని సరిగా పాటించాలి. 1 గ్రా. టేబ్యుకోనజోల్ కిలో విత్తనం తో కలిపి విత్తనశుద్ధి చేయాలి. మొక్కల మొదళ్ళ దగ్గర కార్బండాజిమ్ + మాంకోజేబ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి నేలను తడపాలి.
వేరు కుళ్ళు తెగులు (డై రూట్ రాట్) ఈ తెగులు ఆశించినపుడు తల్లి వేరు కుళ్ళిపొయి నలుపు రంగుకి మారి నుజ్జునుజ్జుగా తయారవుతుంది. ఈ తెగులు పంట 30 రోజుల దశలో ఉన్నపుడు ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు సోకిన మొక్కల చుట్టూ నేలను 1 గ్రా. కర్బండాజిమ్ లీటరు నీటికి కలిపి తడపాలి.
కాండం కుళ్ళు తెగులు (స్టెమ్ రాట్/స్ల్కీరోషియ) ఈ తెగులు వల్ల నేల పై భాగాన ఉన్న కాండం పై తెల్లటి బూజు తెరలు, తెరలుగా ఏర్పడుతుంది. మొక్కలను లాగినప్పుడు పై భాగం మాత్రమే ఊడివస్తుంది. కాయలు కూడ కుళ్లి పొతాయి. ఈ తెగులు పంట 65-70 రోజుల దశలో ఎక్కువగా ఆశిస్తుంది. 1 గ్రా. టేబ్యుకోనజోల్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. తెగులు సోకిన మొక్కలు బాగా తడిచేలా 2 మి.లీ. హెక్సాకోనజోల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
మొవ్వు కుళ్ళు వైరస్ తెగులు (పి.బి.యన్.వి) మొక్కలు లేత దశలో ఉన్నపుడు ఆశిస్తే మొక్కలు కురచబడి ఎక్కువ రెమ్మలు వస్తాయి. ఆకులు చిన్నవిగా మారి మొవ్వు ఎండిపోతుంది. తామర పురుగులు ఈ తెగులును వ్యాప్తి చేస్తాయి. ఈ సమస్య ఉన్న ప్రాంతాలలో కిలో విత్తనానికి 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ తో విత్తనశుద్ధి చేయాలి. పైరుపై ఈ తెగులును నివారించడానికి థయోమిథాక్సామ్ 100 గ్రా. చొప్పున 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.
కాండం కుళ్ళు వైరస్ తెగులు (పి.ఎస్.యన్.డి) లేత ఆకులపై, ఆకుల ఈనెలపై నల్లటి మాడిన మచ్చలు ఏర్పడుతాయి. తర్వాత ఈ మచ్చలు కాండంకు విస్తరిస్తాయి. మొవ్వు ఎండిపోతుంది. తామర పురుగులు ఈ తెగులును కూడా వ్యాప్తి చేస్తాయి. పైరు చుట్టూ వయ్యారిభామ కలుపు ఎక్కవగా ఉంటె ఈ తెగులు త్వరగా వస్తుంది. ఇమిడాక్లోప్రిడ్ 2 మి.లీ. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. 80 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

విత్తనోత్పత్తి

ఈ పంటలో విత్తనోత్పత్తిని యసంగిలో చేయడం వలన అధిక విత్తన దిగుబడి మరియు నాణ్యమైన విత్తనం పొందవచ్చు. విత్తనోత్పత్తి చేసే రకాల మొక్క గుణగణాలపై పూర్తి అవగాహన ఉండాలి. సాధారణ వేరుశనగ పైరుకు పాటించే అన్ని యాజమాన్యం పద్ధతులను విత్తనోత్పత్తి చేసే పంటకు కూడ పాటించాలి. పైరులో ఊడలు దిగే దశ, కాయలు ఏర్పడే దశ మరియు కోత దశలో కేళీలను గుర్తించి తీసివేయాలి.

పంట కోత మరియు నిల్వ

వేరుశానగలో మొక్కల్లోని 75 శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినపుడే కోయాలి. కాయల్లోని లోపలి భాగం ముదురు గోధుమ వర్ణంలోకి మారినపుడు కోతకు వచ్చిందని గుర్తించాలి. పంట కోత తర్వాత, వేరుశనగ కాయలను మొక్కల నుంచి వేరు చేయడానికి వెట్ పాడ్/డ్రైపాడ్ త్రెషరును ఉపయోగించవచ్చు. ఈ యంత్రాల ద్వారా ఒక గంటలో 2-2.5 క్వింటాళ్ళ కాయలను మొక్కల నుంచి వేరుచేయవచ్చు. సాధారణంగా రబీ/వేసవిలో సాగు చేసిన పైరు నుంచి సేకరించిన విత్తనంలో మొలకెత్తే సామర్ధ్యం త్వరగా తగ్గడం ఒక ముఖ్య సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి, కోత సమయంలో నేల నుంచి మొక్కలను వేరు చేసిన తరువాత కట్టలుగా కట్టి నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి ఆరబెట్టాలి. కాయల్లో తేమ 8-9 శాతం తగ్గే వరకు ఇలా నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత కాయలను గోనె సంచుల్లో నింపి గాలి, వెలుతురూ ఉండే గోదాముల్లో నిల్వ ఉంచాలి.

వేరుశనగ పంటపై ఈ దశలో లదై పురుగు మరియు పచ్చ పరుగు ఆశించే అవకాశము ఉంటుంది.

  • లద్దె పురుగు మరియు పచ్చ పురుగు నివారణ చర్యల్లో తొలిదశ పురుగు నివారణకు క్వినాల్ఫాస్ 2.0 మి.లీ. ఒక లీటరు నీటికి, ఎదిగిన పురుగు నివారణకు ధయోడికార్చ్ 1.0 గ్రా. లేదా నొవాల్యురాన్ 1.0 మి.లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఎదిగిన లద్దె పురుగులను విషపు ఎరను ఉపయోగించి కూడా నివారించవచ్చును.

తెగుళ్ళు: వేరుశనగ ప్రస్తుతం 70–80 రోజుల పంట దశలో ఉంది. పొలంలో ఆకుమచ్చ తెగులు గుర్తించిన వెంటనే ఒక ఎకరానికి హెక్సాకొనజోల్ 400 మి.లీ.ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

  • పంట చివరి దశలో ఆశించే బూజు తెగులు, కాండం కుళ్ళ తెగులు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి. న కాలంలో ఆకువుచ్చ తెగులును నివారించడం ద్వారా కాండం కుళ్ళను అదుపులో పెట్టవచ్చు. పంట మీద ఒక ఎకరానికి 400 మి.లీ. టిబ్యుకొనజోల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • వైరస్ తెగుళ్ళ నివారణకు అన్ని రకాలైన కలుపు మొక్కలను పూత దశకు రాక ముందే తీసివేయాలి. పంటపై ఇమిడాక్లోప్రిడ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • రబీ వేరుశనగను అక్టోబర్ నుండి నవంబరు మాసం వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 75-80 కిలోల ఒలిచిన గింజలు అవసరమవుతాయి. కిలో విత్తనానికి 1 గ్రా, టెబ్యుకొనజోల్ తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.
  • ట్రాక్టర్ సహాయంతో లేదా ఎదుల సహాయంతో నడిచే గొర్రుతో వరుసలో విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 30 సెం.మీ. మొక్కల మధ్య దూరం 10 సెం.మీ. పాటించాలి.
  • రబీ వేరుశనగను దక్షిణ తెలంగాణ మండలంలో నవంబరు 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు.
  • రబీ పంటలో ఎకరానికి 75-80 కి. విత్తనం సరిపోతుంది. చదరపు మీటరుకు 44 మొక్కల సాంద్రత ఉండేటట్లు ట్రాక్టర్ లేదా ఎద్దుల సహాయంతో నడిచే గోర్రుతో వరుసల మధ్య 22.5 సెం.మీ,. మొక్కల మధ్య 10 సెం.మీ దూరంలో 5 సెం.మీ లోతు మించుకుండా విత్తుకోవాలి.
  • ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువు, 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తరువాత (పూత దశలో) 15 కిలోల యూరియాను పై పాటుగా వేసుకోవాలి.
  • విత్తే ముందు కిలో విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ మరియు 1గ్రా. టేబ్యుకోనజోల్ 2 డి.ఎస్ మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి.
  • విత్తిన 40 గంటలలోపు పెండిమిధాలిన్ 30% ఇ.సి అనే కలుపు మందును ఎకరానకి 1.3 – 1.6 లీటర్లు 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
  • విత్తిన 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. 20-25 రోజుల మధ్య 40 గ్రాముల ఇమాజితపీర్ + ఇమాజిమాక్స్ మిశ్రమాన్ని అనే కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి.
  • పొలం చుట్టూ 4-6 సాళ్ళు జొన్న లేదా సజ్జ పంటను రక్షక పైరుగా వేసుకోవాలి.
  • మొలక వచ్చిన తరువాత, కనీసం 22-25 రోజుల వరకు పంటను బెట్టకు గురించేయాలి. తద్వారా పూత అంతా ఒకేసారి వస్తుంది.
  • పశువుల ఎరువు వాడేటప్పుడు వేరు పురుగును గమనించినట్లయితే ఎకరాకు 8-10 కిలోల ఫోరేట్ గుళికలను దుక్కిలో కలిపి లోతు దుక్కులు చేసుకోవాలి. పంట తొలి దశలో వేరు పురుగు బెడద ఉన్నట్లయితే 2.5 మి.లీ క్లోరిపైరిఫాస్ అనే మందు ఒక లీటరు నీటిలో కలిపి మొక్క చుట్టూ పోయాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate