অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వేరుశనగను ఆశించే పురుగులు – సస్యరక్షణ

తెలుగు రాష్ట్రాలలో అత్యధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న నూనె గింజ పంటలలో ముఖ్యమైనది వేరుశనగ. ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు, అధిక దిగుబడినిచ్చే రకాలు లభించడం ద్వారా పంట విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ వేరుశనగను ఆశించే పురుగుల వలన దిగుబడి బాగా తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో వేరుశనగను ఆశించే పురుగులు, వాటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం.

ఎర్ర గొంగళి పురుగు

తల్లి పురుగు గోధుమ రంగులో ఉండి , ఒక్కొక్కటి దాదాపు 1000 పైగా తెల్లని గుడ్లని గుంపులు, గుంపులుగా వేరుశనగ ఆకుల పైన, ఏకవార్షిక గడ్డి వెక్కల పైన, వంటి గడ్డల పైన , రాళ్ళ పైన పెడతాయి. వీటి నుండి వచ్చిన పిల్ల పురుగులు గట్లపైన కానీ పొలంలో ఉండే గడ్డి మొక్కలను ఆశించి వాటి పైన ఉండే పచ్చదనాన్ని గోకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు వేరుశనగ ఆకులను, కొన్ని సార్లు పువ్వులను కూడా పూర్తిగా తినేసి రెమ్మలను మిగులుస్తాయి.

నివారణ: ఏప్రిల్, మే మాసంలో పడిన వరాలకు లోతు దుక్కి చేయడం వలన పురుగు కోశస్థ దశలు బయట పడి సూర్యరశ్మికి లేక పక్షుల బారిన పడి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన 48 గంటల తర్వాత రాత్రిపూట 7-11 గంటల సమయంలో సామూహిక మంటలు వేసి లేదా కాంతి ఎరలను ఏర్పాటు చేసి ఎర్రగొంగళి రెక్కల పురుగులను ఆకర్షించి అరికట్టవచ్చు. గుడ్ల సముదాయాలను పిల్ల పురుగులను గమనించి ఏరివేయాలి. మిథైల్ పారాథియాన్ లేదా క్వినాల్ పాస్ పొడి మందును ఎకరాకు 10 కిలోల చొప్పున చల్లాలి, అలసంద, ఆముదం పంటలను ఎరపంటగా వేయాలి. వెర్రి ఆముదం, జిల్లేడు కొమ్మలను పొలంలో అక్కడక్కడా ఎరగా వేసి, వాటిని ఆశించిన పురుగులన్నింటిని గుట్టగా వేసి తగలబెట్టాలి. తల్లి లేదా గుడ్డు లేదా నుసి పురుగు దశ గమనించగానే 5 శాతం (5 మి.లీ) వేప కషాయం పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. లేక మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. ను కలిపి పిచికారీ చేయాలి. విషపు ఎర (వరి తవుడు 10 కిలోలు + బెల్లం 1 కిలో +1 లీటరు క్వినాల్ ఫాస్ లేక 350 మి.లీ. మిథోమిల్) చిన్న ఉండలుగా తయారు చేసి, పొలంలో సమానంగా చల్లితే పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.

వేరుపురుగు

వేరుపురుగు తల్లి పురుగులు తొలకరి వరాలు పడిన వెంటనే భూమిలో నుండి బయటకు వచ్చి చుట పక్కల ఉన్న వేప, రేగు చెట్ల ను ఆశిస్తాయి. ఆడ పురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. బాగా ఎదిగిన వేరుపురుగు 'సి' ఆకారంలో ఉండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. వేరుపురుగు ఆశించిన మొక్కలు వాడి, ఎండి చనిపోతాయి. మొక్కలను పీకితే సులువుగా ఊడి వస్తాయి. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.

నివారణ: లోతు దుక్కి చేయడం వలన వేరుపురుగు కోశస్థ దశలు బయట పడి పక్షుల బారిన పడి లేక ఎండ వేడికి చనిపోతాయి. ఫోరేట్ 10 శాతం గుళికలు ఎకరాకు 6 కిలోల గింజ విత్తేటప్పుడు వేయాలి. ఒక కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ మందును కలిపి విత్తుకోవాలి.

ఆకుముడత పురుగు

ఆకుముడత పురుగు విత్తిన 15 రోజుల నుండి ఆశిస్తుంది. ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. వాటి లోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు ఉంటాయి. ఇవి 2,3 ఆకులను కలిపి వాటిలో ఉండి, పచ్చదనాన్ని తినివేయడం వలన ఆకులన్నీ ఎండి, కాలినట్లు కనబడతాయి.

నివారణ: అంతర పంటలుగా జొన్న, సజ్జ 7:1 నిష్పత్తిలో వేయాలి. సోయాచిక్కుడు తర్వాత వేరుశనగ వేయరాదు. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి రెక్కల పురుగు ఉనికిని, ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్న జీవులు 50 శాతం పైగా ఉన్నప్పుడు క్రిమిసంహారక మందులు వాడవలసిన అవసరం లేదు. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేక క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ. లేదా వేపనూనె 5 మి.లీ. లేక నోవాల్యూరాన్ 1.0 మి.లీ. లేక క్లోరిఫైరిఫాస్ 2.0 మీ. లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి,

రసం పీల్చే పురుగులు (పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు)

పచ్చదోమ వలన ఆకు మొనలు పసుపుపచ్చగా మారతాయి. పేనుబంక వలన మొక్కలు పేలగా అయిపోతాయి. తామర పురుగుల వలన ఆకులు ముడుచుకొని, మొక్కలు గిడసబారిపోతాయి.

నివారణ: పేనుబంక, పచ్చదోమ నివారణకు డైమిథోయేట్ 2.0 మి.లీ. లేక మిథైల్ డెమటాన్ 2.0 మి.లీ. లేక మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల నివారణకు ఎకరానికి మోనోక్రోటోఫాస్ 320 మి.లీ. + వేప నూనె 1 లీ. + ఒక కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీళ్ళకు కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.

వేరుశనగ కాయ తొలిచే పురుగు

ఇది ఎక్కువగా కాయలు నిల్వ ఉంచినప్పుడు వస్తుంది. తల్లి పురుగులు గోధుమ రంగులో ఉండి, వేరుశనగ కాయల పై తెల్లటి గుడ్లను పెడతాయి. పిల్ల పురుగులు కాయలను తొలిచి విత్తనాల్లోకి వెళ్ళి పొడిగా మారుస్తాయి. ఎదిగిన పురుగులు కాయలపై రంధ్రాలు చేసి బయటికి వచ్చి కాయలపై సంచులపై గూళ్ళు కట్టుకుంటాయి. సాధారణ పరిస్థితిలో ఈ పురుగు దాదాపు 40 రోజుల్లో ఒక జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది.

నివారణ: కాయల్లోగానీ, విత్తనాల్లో గానీ తేమ శాతం 9కి మించి ఉండరాదు. కిలో కాయలకు 5 మి.లీ. వేప నూనె లేదా కానుగనూనె కలిపితే దాదాపు 5 నెలల వరకు కాయతొలిచే పురుగు నుండి వేరుశనగను కాపాడవచ్చు.

పైన సూచించిన లక్షణాలను గమనించుకొని సరైన సమయంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చు.

ఆధారం: ఎం. నాగమల్లికాదేవి, సీనియర్ రీసెర్చ్ ఫెల్లో, ఇక్రీశాట్, కె. స్వాతి, సీనియర్ రీసెర్చ్ ఫెల్లో, కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, హైదరాబాద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate