অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గోధుమ

గోధుమ యాసంగిలో చల్లటి వాతావరణంలో సాగు చేసే ముఖ్యమైన ఆహార పంట. దీనిలో ప్రోటీన్లు మరియు పీచుపదార్ధాలు అధికంగా ఉండటం వలన ఆరోగ్య పరంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మన రాష్ట్రంలో గోధుమ మెదక్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు.

నేలలు

తగిన నీటి నిలువతో పాటు అధిక గాలి ప్రసరణ, అధిక కర్బనశాతం కల బరువైన నేలలు, మురుగు నీటి వసతి గల నేలలు అధిక దిగుబడికి అనుకూలం. విత్తే ముందు నేలను నాగలితో దున్ని కల్టివేటర్ లేదా గుంటక సహాయంతో మేత్తగా చదును చేసి విత్తుకోవాలి.

తెలంగాణలో వివిధ పరిస్దితులకు అనువైన రకాలు

రకంపంట కాలం (రోజుల్లో)దిగుబడి (క్వి/ఎ)గుణగణాలు
సోనాలిక 120-134 15 బ్రెడ్ రకము, నీటి పారుదలతో ఆలస్యంగా విత్తుటకు అనుకూలం
కళ్యాణ్ సోనా 110-125 14 కాండం త్రుపు తెగులును తట్టుకుంటుంది
యంఏసిఎస్ 2496 110-125 15 చపాతి తయారికి ఉపయోగపడుతుంది
డిడబ్ల్యుఆర్ 162 126-134 15 బ్రెడ్ రకము, వర్షాధారంగా సాగుకు అనుకూలం
యంఏసీఏస్ 2846 120-130 12 డ్యూరం రకము, రవ్య తయారిలో ఉపయోగపడుతుంది

పంట కాలము మరియు అనుకూల సమయము

గోధుమ పంటను అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు వితుకోవచ్చు. దేశీయ మరియు స్వల్పకాలిక రకాలను అక్టోబర్ చివరి వారంలో, దీర్ఘకాలిక రకాలను అక్టోబర్ రెండవ పక్షంలో విత్తుకోవాలి. స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా విత్తాల్సి వచ్చినచో ఎట్టి పరిస్దితుల్లో నవంబర్ మొదటి వారంలో విత్తుకోవాలి.

విత్తన మోతాదు

ఎకరానికి 40 కిలోలు

విత్తనశుద్ధి

కిలో విత్తనానికి 2.5 గ్రా. థైరంతో విత్తిన శుద్ధి చేసి తుప్పు తెగులు సోకకుండా నివారించుకోవచ్చు.

విత్తే దూరం

వరుసల మధ్య 22.5 సెం.మీ. ఉండేట్లుగా విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తే పంటను వరుసల మధ్య 15-18 సెం.మీ. ఉండేట్లుగా విత్తుకోవాలి. నేలలో తేమ శాతమును మరియు నేల రకాన్ని బట్టి పొడవైన రకాలను 5-7 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. కాని కొత్తగా వచ్చే పొట్టి రకాలను 2.5 నుండి 5 సెం.మీ. లోతులో విత్తుకోవడం మంచిది.

విత్తు పద్ధతి

వితనాన్ని గొర్రుతోగాని, నాగటి చాళ్ళలోగాని ట్రాక్టరుతో నడిచే విత్తే యంత్రముతో గాని విత్తుకోవాలి. విత్తే సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. విత్తనాన్ని 5 సెం.మీ. లోతు మించకుండా విత్తుకోవాలి.

ఎరువుల యాజమాన్యం

ఎకరాకు 4-6 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. మొత్తం భాస్వరం మరియు పోటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజని ఎరువులను మూడు దఫాలుగా, మొదటి దఫా విత్తిన సమయంలో, రెండవ దఫా వత్తిన 30 రోజులకు మరియు మూడవ దఫా 50-55 రోజులకు వేసుకోవాలి.

జింకు ధాతువు లోపించిన గోధుమ పంటలో ఈనెలు పసుపు రంగులోకి మారి, పెళుసుగా తయారవుతాయి. దీని నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారి చేసుకోవాలి.

నీటి యాజమాన్యం

అధిక దిగుబడినిచ్చే రకాలకు సుమారు 5-6 నీటి తడులను దగ్గర దగ్గరగా ఇచ్చుకోవాలి.

నీటి తడులకు కీలక దశతడి ఇవ్యవలసిన సమయం
పిలక తొడిగే దశ విత్తిన 21-29 రోజులకు
పూత దశ విత్తిన 45-55 రోజులకు
గింజ పాలుపోసుకునే మరియు గట్టిపడే దశ విత్తిన 65-85 రోజులకు

ఉష్ణోగ్రతలు పెరగక ముందే పంట గింజ పాలు పోసుకునే దశ దాటాలి. మన రాష్ట్రంలో గోధుమ పంటకు సుమారు 300-400 మి.మీ. నీరు అవసరమవుతుంది. సాంప్రదాయ నీటి పారుదల పద్దతిలో పొడవైన మళ్ళ పద్ధతిలో నీరు అందించవచ్చు. అదే సూక్ష్మ నీటి పాకుదల పద్ధతిలో అయితే తుంపర పద్ధతిలో తడి అందించినట్లయితే సుమారు 20-30% నీటిని ఆదా చేయవచ్చు.

కలుపు నియంత్రణ మరియు అంతరకృషి

పెండిమిధాలిన్ 30% ద్రావకం ఎకరాకు 1.0 నుండి 1.25 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజున పిచికారి చేసుకోవాలి. విత్తిన 20-25 రోజులకు గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించుటకు ఎకరాకు 13 గ్రా. సల్ఫోసల్ఫ్యూరాన్ లేదా 100 గ్రా. మెట్రిబ్యూజీన్ పొడిమందును పిచికారి చేసుకోవాలి. వెడల్పాటి కలుపు మొక్కలను ఎకరాకు 5౦౦ మి.లీ. 2,4-డి డైమిథైల్ ఎమైన్ సాల్ట్ 58% ఎస్ఎల్ లేదా 8 గ్రా. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్ పిచికారి చేసి అదుపు చేయవచ్చు. గడ్డి జాతి కలుపు మొక్కలు అధికంగా ఉన్నచో ఎకరాకు 160 గ్రా. క్లాడినోఫోప్ ప్రొపార్ జిల్ 15 శాతం డబ్ల్యుపి పిచికారి చేసి నివారించుకోవచ్చు. కలుపు మందులు పిచికారి చేసే సమయంలో భామిలో తగినంత తేమ వుండాలి.

త్రుప్పు తెగులు

ఆకుల మీద రెండువైపులా గోధుమ రంగు కలిగిన చిన్న చిన్న ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు ఆకు తొడిమ మరియు కాండం మీద కూడ ఏర్పడుతాయి. ఈ మచ్చలు ఎక్కువైన ఎడల ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 2.5 గ్రా. మాంకోజెబను కలిపి పైరుపై తెగులు గమనించిన వెంటనే పిచికారి చేసుకోవాలి.

మరియు నూర్పిడి

పంటకోత పత్రాలు పసుపు రంగులోకి మారి విత్తనాలు గట్టిపడినపుడు పంటను కోయాలి. కోత సమయంలో గింజలలో తేమ శాతం 25-30 ఉండాలి. కోతానంతరం గింజలలో తేమ శాతం 10-12 కు తగ్గే వరకు ఎండలో ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి.

మన రాష్ట్రంలో గోధుమను చల్లని మరియు పొడి వాతావరణం గల మెదక్, అదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. అదిక ఉష్ణోగ్రతలు, గాలిలో తేమతో కలిగిన వాతావరణం వలన తృప్ప మరియు మధ్య కుళ్ళు తెగుళ్ళు ఆశించి, పంటకు నష్టం కలిగిస్తాయి. గోధువు సాగులో స్వల్ప మరియు మధ్య కాలిక రకలైనటువంటి సొనాలిక, ఎన్, యి, ఎ,డబ్యు-917, ఎన్,యి,ఎ,డబ్ల్యు-295, సాగారిక డి,డబ్ల్యు, ఆర్-162 వంటి రకాలు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలము.

సాధారణంగా గోధుమ పంటను అక్టోబరు 15 నుండి నవంబర్ 15 వరకు నీటి పారుదల క్రింద బంకతో కూడుకున్న నేలలో విత్తుకోవచ్చు. దేశీయ మరియు స్వల్ప కాలిక రకాలను అక్టోబర్ చివరి వారంలో, దీర్ఘకాలిక రకాలను అక్టోబర్ రెండవ పక్షం అనుకులమైన సమయము. గోధుమ పంట కాలపరిమితిలో ముఖ్యంగా వెసవి ఉష్ణోగ్రతలు పెరగక ముందే పంట గింజ పాలు పోసుకునే దశను పూర్తి చేసుకోవాలి, లేనిచో గింజ బరువు తగ్గి దిగుబడి తగ్గే అవకాశం వుంది. ఎకరాకు 40 కిలోల నాణ్యమైన విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకొని చదును చేసిన నేలలో వరుసల మధ్య విత్తనాన్ని గొర్రుతో గాని, నాగలి చాళ్ళలోగాని, ట్రాక్టరుతో నడిచే వితే యంత్రముతో గాని విత్తుకోవాలి. వితే సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి.

ఎకరాకు 4-6 టన్నుల పశువుల ఎరువు తో పాటు, 48 కిలోల నత్రజని, 24 కిలోల 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. నత్రజని ఎరువులను మూడు దఫాలుగా, మొదటి దఫా విత్తే సమయంలో, రెండవ దఫా విత్తిన 30 రోజులకు మరియు మూడవ దఫా 50-55 రోజులకు వేసుకోవాలి. బరువైన నేలలో జింక్ దాతులోపంను సవరించుటకు ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ అనే మందును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఈ ధాతువు లోపించిన గోధుమ పంటలో ఈనెలు పసుపు రంగులోకి మారి, పెళుసుగా తయారవుతాయి. దీని నివారణకు 2 గ్రా.ల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారి చేసుకోవాలి. గోధుమ పంటలో పిలకదశ అంటే 3 వారాల సమయాన్ని తేమ సున్నితదశగా అంటారు. పంట ఈ దశలో నీటి ఎద్దడికి పిలకల సంఖ్య పై ప్రభావం పడి దిగుబడులు తగ్గుతాయి. పిలకదశ మరియు గింజ పాలు పొసుకొనే దశలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి.

గోధుమలో కలుపు మందులు పిచికారి చేసే సమయంలో భూమిలో తగిన తేమ వుండాలి. కలుపు నివారణకు 30% పెండిమిథాలిన్ ద్రావకం ఎకరాకు 1.0 లీటరు చొప్పన విత్తిన వెంటనే లేదా మరుసటి రోజున పిచికారి చేసుకోవాలి. గోధుమ విత్తిన 20-25 రోజులకు గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలను నివారించుటకు ఎకరాకు 13 గ్రా, సల్పోసల్పూరాన్ లేదా 100 గ్రా, మెట్రిబ్యుజిన్ పొడిమందును పిచికారి చేయాలి. వెడల్పాటి కలుపు మొక్కలు అధికంగా వున్న సందర్భాలలో ఎకరాకు 60 గ్రా. 24 - డి లేదా 8గ్రా మెట్సల్యురాన్ మిథైల్ పిచికారి చేసి అదుపు చేయవచ్చు. గడ్డి జాతి కలుపు మొక్కలు అధికంగా ఉన్నచో ఎకరాకు 60 గ్రా. క్లాడినోఫాప్ ప్రాపార్జిల్ పిచికారి చేసి నివారించుకోవచ్చు.

గోధుమ పండించే ప్రాంతాలలో ఆవాలు, శనగ చెరకు మరియు వలిశెలతో అంతర సస్యవర్ధనం

తెలంగాణలో గోధుమ పంటకు సాధారణంగా త్రుప్ప తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెగుళ్ళు ఆశించినప్పడు ఆకులు, తొడిమ మరియు కాండం మీద రెండువైపులా గోధుమ రంగు కలిగిన చిన్న చిన్న ఉబ్బెత్తు మచ్చలు ఏర్పడి క్రమేపి ఆకుల అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి మొక్క చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటిలో 2.5 గ్రా. మాంకోజెబ్ ను కలిపి పంటపై పిచికారి చేయాలి.

గోధుమ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా:

ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, బసంత్ పూర్ ఫోన్ నెం. 9849535756

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate