অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జొన్న

తెలంగాణ రాష్ట్రంలో మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా మరియు రబీలో అరుతడి పంటగా జొన్నను సుమారు ఒక లక్ష ఇరవై వేల హెక్టార్ల విస్తిర్ణంలో సాగు చేయడం జరుగుచున్నవి. జొన్న పంటను రొట్టె కొరకు, సాగు చేసుకోవచ్చును. ఈ పంటను మన రాష్ట్రంలో ప్రధానంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్ మరియు రంగరెడ్డి జిల్లాల్లో అధిక విస్తిర్ణంలో సాగు చేస్తునప్పటికీ, మెట్ట ప్రాంతాల్లో లేదా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలలో వాతావరణంలోని మార్పులను తట్టుకొని కనీస దిగుబడినిచ్చేటటువంటి పంట.

మన రాష్ట్రంలో రబీలో పండించే ధాన్యపు పంటలలో జొన్న ముఖ్యమైనది. జొన్న పంట ఆహారం దాణా మరియు పశుగ్రసాల కొరకు నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాలు లేదా వర్షాధారంగా నేలలో నిల్వ ఉన్న తేమ ఆధరంగా సాగుచేయబడుచున్నది.

భారతదేశంలో పండించే ధాన్యపు పంటలలో జొన్న పంట నాల్గవ స్ధానంలో ఉన్నది. మన రాష్ట్రంలో రబీలో జొన్న ఆరుతడి పంటగా నలబైవేల హెక్టార్లలో సాగుచేయబడుచున్నది. ముఖ్యంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో రబీ పంటగా, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మాఘి పంటగా కొంత విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది.

ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగించబడుతుంది. రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగించ బడుతుంది. జొన్నతో చేసిన రొట్టెలు నిధానంగా జీర్ణం అవ్వడం వలన రక్తంతో చక్కర స్ధాయిలు అదుపులో ఉంటాయి. దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా పరిగణించ బడుతుంది. దీనిలో ఎక్కువ మోతాదులో ఉండే పిచు, కాల్షియం, పొటాషియం, యాంటి ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, జిర్ణాశయ వ్యాధులు, కిళ్ళ నొప్పులు నుండి రక్షిస్తాయి. ఇటివలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాధారణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్ధాయిలో పండించడానికి రైతాంగం మొగ్గుచూపుతుంది. ప్రోఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అఖిల భారత చిరు ధాన్యాల పరిశోధనా స్ధానం, రాజేంద్ర నగర్ వారు విడుదల చేసిన మేలైన రకాలను ఎంపిక చేసుకొని, సూచించిన సాంకేతిక యాజమాన్య పద్ధతులను పాటించి రైతాంగం అధిక దిగుబడులను సాధించవచ్చు.

నేలలు

జొన్న పంట సాగుకు తేలికపాటి ఎర్ర చల్కా నేలలు మరియు తేమను నిలుపుకునే నల్లరేగడి నేలలు చాలా అనుకూలం. చౌడు నేలలు మరియు మురుగు నీరు నిల్వ ఉండే నేలల్లో పంట వేసుకోరాదు.

విత్తే సమయము

ఖరీఫ్ లో జొన్న పంటను (వర్షాధారంగా) జూన్ రెండవ పక్షం నుండి జూన్ 30 వరకు విత్తుకోవచును. రబీలో అక్టోబరు రెండవ పక్షం లోపు విత్తుకుంటే పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది. జొన్నను ఆలస్యంగా విత్తినపుడు మొవ్వు ఈగ తీవ్రంగా ఆశిoచి, మొక్కల సాద్రత తగ్గి, తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి .

అనువైన రకాలు

జొన్న పంట సాగు చేసేటప్పుడు తేమను నిలుపుకునే బరువైన నేలలు లేదా ఒకట్రెండు తడులు ఇచ్చే సదుపాయం ఉంటే హైబ్రిడ్ లను ఎంచుకొని అధిక దిగుబడులు సాధించవచ్చును. తేలిక పాటి నేలల్లో అయితే సూటి రకాలను (అధిక చొప్పను మరియు గింజ నిచ్చే రకాలు) ఎంచుకోవడం శ్రేయస్కరం.

రకాలు :

రకము/హైబ్రిడ్ పంట కాలము(రోజూల్లో) దిగుబడి(క్వింటాళ్ళు/ఎకరానికి) గుణగణాలు
ఖరీఫ్క కు అనువైన రకాలు మరియు హైబ్రిడ్ లు:
పాలమూరు జొన్న 105-110 13-15 అధిక గింజ మరియు చొప్ప దిగుబడి నిచ్టే రకము. తెలుపు రంగు పెద్ద గింజలను కలగి బూజు తెగులును తట్టుకుంటుంది.
సి.ఎస్.వి-15 110 12-14 కంకులు వదులుగా ఉండటం వలన గింజ బూజు తెగులును తట్టుకుంటుంది.
సి.ఎస్.వి-27 115 11-12 ఈ రకం బూజు తెగులు మరియు వర్షాభావ పరిస్థితులను తట్టుకుంటుంది.
సి.ఎస్.హెచ్-16 110 16-18 పసుపు-తెలుపు రంగు గింజలను కలిగి మధ్యస్త వదులుగా ఉన్న కంకి మరియు అకుమచ్చ గింజ బూజు తెగుళ్ళను తట్టుకుంటుంది.
సి.ఎస్.హెచ్-25 110-115 17-18 ఈ హైబ్రిడ్ మొవ్వు ఈగ బారి నుండి తట్టుకుంటుంది.
సి.ఎస్.హెచ్-30 105 10-12 వర్షాధార సాగుకు అనుకూలం. జొన్నను ఆశించే వివిధ కీటకాలు మరియు తెగుళ్ళను తటుకుంటుంది.
రబీకి అనువైన రాకాలు మరియు హైబ్రిడ్లు:
సి.ఎస్.వి-29 ఆర్ 115-120 10-12 రబీలో అధిక గింజ మరియు చొప్ప దిగుబడి నిచ్చే రకం.
సి.ఎస్.వి-216 ఆర్ 110-115 12-14 తెలుపు రంగు గింజలను కలిగి, అధిక గింజ దిగుబడి మరియు నాణ్యమైన చొప్పను ఇస్తుంది.
సి.ఎస్.హెచ్-13 105-110 16-18 కంకులు మధ్యస్థ వదులుగా ఉండి అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్.
సి.ఎస్.హెచ్-16 110 16-18 వరి మాగాణుల్లో సాగుకు అనకూలము.

తెలంగాణలో మాఘీ జొన్న ప్రధానంగా ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల్లో కొద్ది విస్తీర్ణంలో సాగు చేయబడుచున్నది. మాఘీలో కిన్నెర (ఎం.జె-276) రకం లేదా మహాలక్ష్మి హైబ్రిడ్లను ఎన్నుకొని సెప్టెంబరు 2వ పక్షంలోపు విత్తుకోవాలి.

విత్తన మొతాదు

ఎకరానికి 3-4 కిలోలు.

విత్తన శుద్ది

మొవ్వు ఈగ బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సమ్ 70% డబ్ల్యుఎస్ లేదా 12 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్ఎస్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

విత్తే దూరం

ఎద్దులు సహాయంతో నడిచే గొర్రుతో వరుసల మద్య 45 సెం.మీ మరియు వరుసల్లో మొక్కల మద్య 12-15 సెం.మీ. దూరంలో విత్తాలి. ఎకరాకు 60,000-74,000 మొక్కలు ఉండాలి.

ఎరువులు

ముందుగా ఎకరానికి 3-4 టన్నులు పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నలి. ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసినప్పుడు ఎకరాకు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పోటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలీ. రబీలో జొన్నను నీటిపారుదల క్రింద సాగు చేసినప్పుడు ఎకరాకు 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పోటాష్ ఇచ్చే ఎరువులు వేయాలి. నత్రజన ఎరువులను సగభాగం విత్తేముందు, మిగితా సగం పైరు 30-35 రోజుల దశలో వేయాల

సస్యరక్షణ

పురుగు/తెగులు పేరు గుర్తించే లక్షణం అనుకూల పరిస్థితులు నివారణ చర్యలు
మొవ్వు తొలుచు ఈగ ఈ పురుగు ఆశించిన మొక్క మధ్యలోని మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వును లాగినపుడు సులువుగా వచ్చి, కుళ్ళి పోయిన వాసన కలిగి ఉంటుండి. జొన్న వంటను ఆలస్యంగా విత్తినపుడు లేదా విత్తిన వెంబడే వర్షాబావ పరిస్దితులు వస్తే ఈ పురుగు ఎక్కవగా ఆశిస్తుంది.

1)ఖరీఫ్ లో జొన్నని జూలై 15 లోపు విత్తాలి. 2)కిలోవిత్తనానికి థయోమీథాక్సమ్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 12 మి.లీ. తో విత్తనశుద్ధి చేయాలి.       3)ఆలస్యంగా విత్తినపుడు కార్బరిల్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాండం తొలుచు పురుగు ఈ పురుగు ఆశించి నపుడు మొవ్వు చనిపోయి తెల్ల కంకి వస్తుంది. కాండాని చీల్చి చూస్తే లార్వాలు మరియు ఎర్రటి కుళ్ళిపాయిన కణజాలం కనిపిస్తుంది. ఈ పరుగు పంట 30 రోజుల దశ నుండి పంట కోసే దశ వరకు ఆశిస్తుంది. విత్తిన 30-35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల కార్బోప్యూరాన్ 3జి గుళికలను కాండము సుడులలో వేయలి.
కంకి నల్లి కంకిలో గింజలు నిండే దశ సమయాన ఈ పురుగులు రసం పీల్చడం వలన, గింజలు పూర్తిగా నిండకుండ నల్లగా మారుతాయి. ఆలస్యంగా విత్తినపుడు లేదా పైరు గింజ కట్టే దశలో ఎక్కువ రోజులు బెట్ట వస్తే ఈ పురుగు ఆశిస్తుంది. ఎకరాకు కర్బరిల్ 5 శాతం 8 కిలోల పొడి మందును కంకుల మీద చల్లాలి.
గింజ బూజు తెగులు గింజల పై నల్లని బూజు పెరుగుదల కనిపిస్తుంది. పూత మరియు గింజ కట్టే దశలో అధిక వర్షాలు పడినపుడు ఈ తెగులు ఆశిస్తుంది. తెగులు ఆశించే పరిస్దితుల్లో ప్రొపికొనజోల్ 1 మీ.లీ. లీటరు నీటికి కలిపి గింజ ఏర్పడే దశలో పిచికారి చేయాలి.
బంక కారు తెగులు తెగులు సోకిన కంకుల గింజల నుంచి తియ్యటి జిగురు వంటి ద్రవం కారుతుంది. పంట ఆలస్యంగా విత్తినపుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. బెనోమిల్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి కంకులపై పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం

జొన్న పంటకు సుమారుగా 450-600 మి.మీ నీరు అవసరమంటుంది. సాధారణంగా ఖరీఫ్ జొన్నను వర్షాధారంగా. సాగు చేస్తారు. అయితే వర్షాభావ పరిస్దితులు వస్తే పూత/గింజ కట్టే దశలో ఒక తడి ఇస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చును. రబీ జొన్నలో కూడ పూత మరియు గింజలు పాలు పోసుకునే సమయంలో నీరు పెడితే గింజలు బాగా నిండి అధిక దిగుబగులు పొందవచ్చును.

అంతర పంటలు

ఖరిఫ్ లో జొన్న: కింద 4:1 నిష్పత్తిలో వేసుకోవాలి

కలుపు నివారణ, అంతర కృషి

కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందుని ఎకరాకు 600 గ్రా. చోప్పున 200 లీ. నీటిలో కలిపి వితిన వెంటనే లేదా 2వ రోజు లోపు తడినేలపై పిచికారి చేయాలి. విత్తిన 30 రోజులకు గంటకు లేదా దంతితో వరుసల మద్య అంతరకృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి.

పంటకోత

కంకి క్రింది వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలోనున్న పాలు ఎండిపోయి పిండిగా మారినపుడు మరియు గింజ క్రింది భాగాన నల్లటి చార ఏర్పడిన తర్వాత పంట కోయాలి. గింజల్లో తేమ 9-10 శాతం ఉండేలా ఎండబెట్టుకొని తర్వాత గోనె సంచుల్లో నింపాలి.

విత్తనోత్పత్తి

జొన్నలో రకాలు మరియు హైబ్రిడ్ల విత్తనోత్పత్తిని యానంగిలో చేపట్టాలి. విత్తనోత్పత్తిని చేసేటప్పుడు ఫౌండేషన్ విత్తనమైతే 400 మీ., సర్టిఫైడ్ విత్తనమైతే 200 మీ. వేర్పాటు దూరం పాటించాలి. హైబ్రిడ్ విత్తనోత్పత్తితో 4-6 వరుసల ఆడ మొక్కలు మరియు 2 వరుసల మగ మొక్కల నిష్పత్తిని పాటించాలి. జన్యూ స్వచ్చతను సాధించుట కొరకు పూత దశకు ముందు, పూత దశలో మరియు పంట కోత సమయంలో బెరుకులను గుర్తుంచి వేరుచేయాలి.

జొన్నలో అధిక దిగుబడులు సాదించుటకు ముఖ్య సూచనలు

  • ఖరీఫ్ లో జొన్నను జూన్ 15 నుంచి జూలై 15 లోపు విత్తుకోవాలి.
  • విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిధథాక్సమ్ లేదా 12 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ తో విత్తనశుద్ధి చేయాలి.
  • ఖరీఫ్ లో అధిక చొప్ప ఒక మొస్తరు గింజ దిగుబదినిచ్చే రకాలను, రబీలో అధిక గింజ దిగుబదినిచ్చే రకాలను ఎన్నుకోవాలి.
  • పంట 30-35 రోజుల దశలో వత్తుగా ఉన్న మొక్కలను తీసివేసి ఎకరాకు 4 కిలోల కార్బొప్యూరాన్ గుళికలను మొక్కల కాండం సుడులతో వేయాలి.
  • గింజ బూజు తెగులు ఆశించే పరిస్దితులో ప్రొపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి కంకులపై పిచికారి చేయాలి.

రబీ జొన్న సాగులో సూచనలు

యాజమాన్య పద్ధతులు

నేలలు

రబీలో జొన్న సాగుకు తేమను నిలుపుకొనే నల్లరేగడి నేలలు చాలా అనుకూలం. 2 లేదా 3 తడులు ఇచ్చే అవకాశం ఉంటె ఎర్రచల్కా నేలల్లో కూడా సాగుచేయవచ్చు. చౌడు నేలలు, మురుగు నీరు నిల్వ ఉండే నేలల్లో ఈ పంటను వేయరాదు.

విత్తే సమయం

రబీలో అక్టోబరు రెండవ పక్షంలోపు విత్తుకోవాలి. లేదంటే పంట చివర దశలో బెట్టకు గురి అవుతుంది. ఆలస్యంగా విత్తినప్పుడు మొవ్వు ఈగ ఆశించి, మొక్కల సాంద్రత తగ్గి దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. మాఘిలోనైతే సెప్టెంబరు రెండవ పక్షంలోపు విత్తుకోవాలి. మాఘిలో కిన్నెరా (ఎం.జె. 278) యన్.టి.జె – 2, ఎన్-14 రకాలు లేదా మహాలక్ష్మి అనే హైబ్రిడ్ను ఎన్నుకోవాలి.

విత్తన మోతాదు

ఎకరానికి 3-4 కిలోలు

విత్తనశుద్ధి

మొవ్వు ఈగ బారి నుండి పంటను రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. ధయోమీధాక్సామ్ లేదా 12 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ ను కలిపి విత్తనశుద్ధి చేయాలి.

విత్తే దూరం

వరుసల మధ్య 45 సెం.మీ., వరుసలో మొక్కల మధ్య 12-15 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 68,000 – 72,000 మొక్కలు ఉండేలా చూసుకోవాలి.

ఎరువులు

వర్షాధారం కింద ఎకరానికి 24-32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పోటాష్ నిచ్చు ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నీటి పారుదల క్రింద 32-42 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాష్ నిచ్చు ఎరువులను వాడాలి. నత్రజని మోతాదును రెండు సమభాగాలుగా చేసి విత్తనం విత్తేటప్పుడు మరియు విత్తిన 30 రోజులకు (మోకాలు ఎత్తు దశ) వేసుకోవాలి. కాంప్లెక్స్ ఎరువులను కాకుండా సూటి ఎరువులను వాడటం ద్వారా సుక్ష్మపోషకాలు అందుబాటులో ఉండడమే కాకుండా, ఖర్చు కూడా తగ్గుతుంది.

రబీకి అనువైన రకాలు / హైబ్రిడ్లు

రకాలు

పంట కాలం

(రోజుల్లో)

దిగుబడి

(క్వి/ఎ)

గుణగణాలు

1. సి.యస్.వి 29 ఆర్

115-120

18-20 (గింజ)

22-24 (చొప్పు)

అధిక దిగుబదినిస్తుంది. బెట్ట పరిస్దితులను తట్టుకుంటుంది.

2. సి.యస్.వి 216 ఆర్

110-115

14-16 (గింజ)

20-22 (చొప్పు)

తెలుపు రంగు గింజలను కలిగి అధిక దిగుబడి మరియు నాణ్యమైన చొప్పున ఇస్తుంది.

3. సి.యస్.వి 22 ఆర్

110-115

14-16 (గింజ)

20-22 (చొప్పు)

అధిక దిగుబడినిస్తుంది. బెట్ట పరిస్దితులను తట్టుకుంటుంది.

4. ఎమ్.35-1

110-115

12-14 (గింజ)

20-22 (చొప్పు)

బెట్టను తట్టుకుంటుంది. గింజలు గుండ్రంగా లావుగా ఉంటాయి. రొట్టె నాణ్యత అధికంగా ఉంటుంది.

హైబ్రిడ్లు

1. సి.యస్. హెచ్ 13 ఆర్

105-110

16-18 (గింజ)

20-22 (చొప్పు)

కంకులు మధ్యస్ధ వదులుగా ఉండి చొప్పు దిగుబడి అధికంగా ఉంటుంది.

2. సె.యస్. హెచ్ 15 ఆర్

110-115

16-18 (గింజ)

20-22 (చొప్పు)

మొవ్వు చంపు ఈగను, కాండం కుళ్ళు తెగులును తట్టుకుంటుంది.

నీటి యాజమాన్యం

జొన్న పంటకు సుమారుగా 450-600 మి.లీ నీరు కవసరం ఉంటుంది. సెప్టెంబరు, అక్టోబరులో వచ్చే వానలకు రైతులు దుక్కి చేసుకొని విత్తు వేసుకోవాలి. ఎర్ర చల్కా నేలల్లో 3-4 తడులు అనగా మోకాలు ఎత్తు దశలో, పూత దశలో, గింజ పాలుపోసుకొనే దశలో ఇవ్వాలి. నల్లరేగడి భూముల్లో ఒకటి లేదా రెండు తడులు అనగా పూత దశ, గింజ పాలు పోసుకొనే దశలో ఇచ్చినట్టయితే పంట బెట్టకు గురికాకుండా అధిక గిడుబడులు సాధించవచ్చు.

కలుపు నివారణ, అంతర కృషి

కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందును ఎకరానికి 800 గ్రా. చొప్పున 200 లీ. నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2వ రోజు తడినేల పై పిచికారీ చేయాలి. దీని వలన విత్తిన నెల రోజుల వరకు కలుపు నివారించుకోవచ్చు. నెల రోజుల తరువాత గుంటక లేదా దంతి సాయంతో వారానికి ఒకసారి చొప్పున 2-3 సార్లు వరుసల మధ్య అంతర కృషి చేసుకోవాలి. దీని వలన కలుపు నివారణే కాకుండా భూమిలో పగుళ్ళు పుడ్చుకొని పోయి, తేమ నిలిచి పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా ఉంటుంది.

సస్యరక్షణ

పురుగులు:

  1. మొవ్వు తొలుచు ఈగ: పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి jonna1చనిపోతుంది. మోవ్వుని లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళి పొయిన వాసన కలిగి ఉంటుది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదట నెల రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు సకాలంలో పంటను విత్తుకోవాలి. కార్బోఫ్యూరాన్ 3 జి. గుళికలను మీటరు సాలుకు 10 గ్రా. చొప్పున విత్తేటప్పుడు సాళ్ళలో వేయాలి లేదా ల్యాంబ్బాసైహాలో త్రిన్ అనే మందును 1.5 మి.లీ లీటరు నీటికి కలిపి మొక్క మొలచిన 7,14 మరియు 21 రోజుల్లో పిచికారి చేయాలి.
  2. కాండం తొలుచు పురుగు : పురుగు పైరును 30 రోజుల తర్వత నుండి పంట కోత వరకు ఆశిస్తుంది. గుండ్రని వరుస రంధ్రాలు ఆకుపై ఏర్పడి మొవ్వు చనిపోయి తెల్లకంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనబడుతుంది. నివారణకు 30-35 రోజుల మధ్య ఎకరానికి 4 కిలోల కార్బోఫ్యూరాన్ 3 కి గుళికలను కాండపు సుడుల్లో వేయాలి.
  3. కంకి నల్లి : పిల్ల పెద్ద పురుగులు గింజ పాలు పోసుకొనే దశలో రసం పిల్చేటం వలన గింజలు నొక్కులుగా మారిపోతాయి. గింజల మీదా ఎరుపు రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారుతాయి. దీని నివారణకు 8 కిలోల కార్బరిల్ 5 శాతం పొడి మందును కంకుల మీద చల్లాలీ.
  4. పెనుబంక: నివారణకు డైమిదోయేట్ లేదా మలాధియాన్ మందును 2 మి.లీ ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్ళు

  1. గింజబూజు : సాధారణంగా రబీలో ఈ తెగులు కనిపించదు. కాని గింజ jonna2ఏర్పడే దశలో అనగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో అకాల వర్షాలకు గింజల పై గులాబి రంగు లేదా నల్లని బూజు పెరుగుదల గమనించవచ్చు. దీని నివారణకు 10 లీటర్ల నీటికి 20గ్రా. కాప్టాన్ మరియు 2 గ్రా. అరియోఫ౦గిన్ ను లేక లీటరు నీటికి 0.5 మి.లీ ప్రోపికోనజోల్ ను గింజ ఏర్పడే దశలో గట్టిపడే దశలో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
  2. నల్ల కాండం కుళ్ళు తెగులు : లేత మొక్కలలో నేల దగ్గర కాండం రంగు కోల్పోయి కృశించి మొక్కలు ఎండిపోయి, కాండం లోపల దొల్లగా మారి విరిగి పడిపోతాయి. దీని నివారణకు కార్బండాజిమ్ లేదా కాప్టాన్ 3 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పూత దశ ముందు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. తెగులును తట్టుకొనే రకాలను సాగుచేసుకోవాలి.

పంటకోత

కంకి క్రింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ నుండి తెలుపుగా మారి పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు, గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంట కోయాలి.

పైన సూచించిన మేలైన రకాలను ఎంపిక చేసుకొని, యాజమాన్య పద్ధతులను పాటించి, సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటించినట్లైతే రైతాంగం అధిక దిగుబడులను సాధించగలరు.

జొన్న సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త (చిరుధాన్యాలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం. ఫోన్ నెం. ౮౦౦౮౪౦౪౮౭౪

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate