హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి / ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో వ్యవసాయ రంగము
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో వ్యవసాయ రంగము

వాణిజ్యపంటలు,సాగు విస్తీర్ణత,వర్షాభావం,కమతాల పరిమాణం

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే కీలక పాత్ర. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువమంది తమ జీవనోపాధి కోసం పూర్తిగా లేదా అధిక భాగం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. పేదరిక నిర్మూలనకు వ్యవసాయాభివృద్ధి కీలకమవుతోంది. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని పేదరికాన్ని తగ్గించవచ్చు. గత కొన్ని దశాబ్దాల్లో రాష్ట్ర వ్యవసాయ రంగం గణనీయమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 80వ దశకంలో కీలక మార్పులు ప్రారంభమయ్యాయి.

సంప్రదాయిక ఆహారపంటలతోపాటు వాణిజ్యపంటలు

సంప్రదాయిక ఆహారపంటలతోపాటు వాణిజ్యపంటల సాగులోనూ మార్పు చోటుచేసుకుంది. నూనెగింజలు, పత్తి, చెరకు పంటల సాగు పెరిగింది. 1990వ దశకంలో తరచూ కరవులు సంభవించడం వల్ల దిగుబడులు పడిపోయాయి. ఉత్పత్తిలో భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అయినా రాష్ట్ర వ్యవసాయ రంగంలో మార్పులు కొనసాగాయి. ముఖ్యంగా అధిక విలువ ఉన్న పంటల సాగు మొదలైంది. పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, కోళ్లు, చేపల ఉత్పత్తి దిశగా రాష్ట్ర వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో మార్పు వచ్చింది. అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర మొత్తం వ్యవసాయ ఆదాయంలో, అనుబంధ రంగాల వాటానే ఎక్కువగా ఉంది. పంటల రంగంలోనూ ఉద్యానవన పంటల వాటా ఎక్కువ. అధిక విలువ ఉన్న ఉద్యాన పంటలు, అనుబంధ రంగాల్లో మంచి వృద్ధిని సాధించాం. ఈ మార్పులే వ్యవసాయ రంగాన్ని కాపాడాయని చెప్పవచ్చు.
రాష్ట్ర అభివృద్ధి వ్యూహంలో భాగంగా

 1. రైతుల ఆదాయాలను పెంచడం
 2. వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధిని సాధించడం
 3. అనుబంధ రంగాల్లోని అధిక అభివృద్ధిని సుస్థిరం చేయడం
 4. పన్నెండో ప్రణాళికా కాలంలో రాష్ట్ర వ్యవసాయ రంగం మరింత వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం సూక్ష్మ నీటిపారుదల (మైక్రో ఇరిగేషన్), శ్రీ సాగు విధానం, సూక్ష్మ పోషకాలు, మెట్ట ప్రాంత వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు.

రాష్ట్రంలోని మొత్తం భూ వైశాల్యం

రాష్ట్ర మొత్తం భూ వైశాల్యంలో 22.7 శాతంలో అడవులున్నాయి. 2010-11 లో రాష్ట్రంలోని మొత్తం భూమిలో 52.8 శాతంలో పంటలు ఉన్నాయి. అంటే పంటల విస్తీర్ణం ఉన్న మొత్తం ప్రాంతం 145.12 లక్షల హెక్టార్లు. మొత్తం భూమి వైశాల్యం 275.04 లక్షల హెక్టార్లు. 2010-11 లో రాష్ట్రంలోని మొత్తం పంటల విస్తీర్ణంలో 67.07 శాతంలో ఆహార పంటలు, మిగిలిన 32.93 శాతం విస్తీర్ణంలో ఆహారేతర పంటలు సాగయ్యాయి.

2009-10తో పోలిస్తే 2010-11లో రాష్ట్రంలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం 10.2 శాతం పెరిగింది. అదేవిధంగా వీటి ఉత్పత్తి 0.6 శాతం పెరిగింది. 2009-10తో పోలిస్తే 2010-11లో రాష్ట్రంలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 20.4 శాతం, ఉత్పత్తి 30.2 శాతం పెరిగాయి. పప్పుదినుసులు, ఆహారధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణాన్ని జిల్లాల వారీగా చూస్తే అనేక తారతమ్యాలున్యాయి. పప్పు దినుసుల సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ముందుంది. ఆ తర్వాతి స్థానాల్లో ప్రకాశం, మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాలున్నాయి. కర్నూలు జిల్లా ఆహారధాన్యాల సాగులోనూ ముందుంది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, కృష్ణా, మహబూబ్‌నగర్ ఉన్నాయి. 2009-10లో రాష్ట్రంలో నూనె గింజల సాగు విస్తీర్ణం 22.24 లక్షల హెక్టార్లు కాగా, 2010-11లో 24.72 లక్షల హెక్టార్లకు పెరిగింది. అత్యధికంగా (34.74%) అనంతపురంలోనే సాగవుతోంది.

అతి తక్కువగా (0.44%) కృష్ణా జిల్లాలో సాగయ్యింది. ప్రధాన నూనెగింజల పంటలు వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు. అనంతపురంలో మాత్రం ప్రధాన నూనెగింజ పంట వేరుశనగ. ఈ ఒక్క జిల్లాలోనే 8.34 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగయ్యింది.
రాష్ట్రంలో సాగయ్యే ఇతర ప్రధాన పంటలు పత్తి, మామిడి, మిర్చి, ఉల్లి, చెరకు, పొగాకు. 2009-10తో పోలిస్తే 2010-11లో కొన్ని పంటల సగటు దిగుబడి పెరిగింది. ఇదే సమయంలో మరికొన్ని పంటల దిగుబడి తగ్గింది. గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగులు, ఉల్లి, వేరుశనగ, చెరకు పంటల దిగుబడి పెరగ్గా; మిర్చి, చింతపండు, నువ్వులు, పత్తి, పొగాకు లాంటి పంటల దిగుబడి తగ్గింది. దిగుబడి విషయంలోనూ వివిధ జిల్లాల మధ్య గణనీయమైన తేడా ఉంది. 2010-11లో నిజామాబాద్ జిల్లాలో బియ్యం దిగుబడి అధికంగా ఉంది. తర్వాతి స్థానాల్లో నెల్లూరు, మెదక్, కరీంనగర్ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో బియ్యం సగటు దిగుబడి హెక్టారుకు 3809 కిలోలు. అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో హెక్టారుకు 866 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో సగటు బియ్యం దిగుబడి హెక్టారుకు 3035 కిలోలు.

సవాలుగా మారిన వర్షాభావం!

రాష్ట్ర వ్యవసాయ రంగానికి అతి పెద్ద సవాలు తరచూ సంభవించే వర్షాభావ పరిస్థితులు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో నైరుతి రుతుపవనాల ద్వారా రాష్ట్రంలో కురిసిన వర్షపాతం 539 మిల్లీ మీటర్లు. నిజానికి వీటివల్ల కురవాల్సిన సాధారణ వర్షపాతం 624 మిల్లీమీటర్లు. అంటే లోటు 13.6 శాతం. ఈశాన్య రుతుపవనాల ద్వారా వచ్చిన వర్షపాతం 113 మిల్లీ మీటర్లు కాగా, రావాల్సిన సాధారణ వర్షపాతం 224 మిల్లీ మీటర్లు. లోటు 49.6 శాతం. 2012-13లో కూడా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండనుందనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

2011-12లో వర్షాభావ పరిస్థితుల వల్ల ఆహారధాన్యాల పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గాయి. 2010-11లో రాష్ట్రంలో మొత్తం 80.29 లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాల పంటలు సాగైతే, 2011-12లో 70.60 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అంటే తరుగుదల 12.07 శాతం. 2011-12లో ఆహారధాన్యాల మొత్తం ఉత్పత్తి అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 30 లక్షల టన్నుల మేరకు తగ్గుతుందని అంచనా. 2010-11లో రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 203.14 లక్షల టన్నులు కాగా ఇది 2011-12లో 173.05 లక్షల టన్నులకు తగ్గింది. ఇది 14.81 శాతం తరుగుదల.

2011-12 ఖరీఫ్‌లో ఆహారధాన్యాల విస్తీర్ణం 43.06 లక్షల హెక్టార్లు ఉండగలదని అంచనా. 2010-11లో సాగైన 45.81 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణం కంటే ఇది 6 శాతం తక్కువ. అదేవిధంగా 2010-11లో ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి 98.52 లక్షల టన్నులుండగా, 2011-12లో స్వల్పంగా 98.03 లక్షల టన్నులకు తగ్గింది. అంటే తరుగుదల 0.5 శాతం. 2011-12 రబీలో ఆహారధాన్యాల పంట విస్తీర్ణం 27.54 లక్షల హెక్టార్లు. ఇది అంతకుముందు ఏడాదిలోని 34.48 లక్షల హెక్టార్ల కంటే తక్కువ. అదేసమయంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 75.02 లక్షల టన్నులని అంచనా. అంతకుముందు ఏడాదిలోని 104.62 లక్షల టన్నుల కంటే చాలా తక్కువ. గత దశాబ్దకాలంలో కరవులు, వరదలు, అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతివైపరీత్యాల వల్ల ఆహారధాన్యాల విస్తీర్ణంలో, ఉత్పత్తిలో భారీగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అయితే, అధిక దిగుబడినిచ్చే వంగడాల వాడకం, కొత్త సాగు పద్ధతులను అనుసరించడం వల్ల ఆహారధాన్యాల ఉత్పత్తి మొత్తం మీద పెరిగింది.

తగ్గిన పరిమాణం... పెరిగిన సంఖ్య!

రాష్ట్రంలో భూకమతాలకు సంబంధించిన సమాచారాన్ని 1970-71 నుంచి సేకరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం 2005-06 సంవత్సరానికి సంబంధించింది. రాష్ట్రంలో సగటు భూకమతాల సైజు స్వల్పంగా తగ్గింది. 2000-01లో సగటు భూకమతాల సైజు 1.25 హెక్టార్లుండగా 2005-06లో ఇది 1.20కి తగ్గింది. ఇదేకాలంలో రాష్ట్రంలో భూకమతాల సంఖ్య మాత్రం 1.153 కోట్ల నుంచి 1.204 కోట్లకు పెరిగింది. తొమ్మిదో భూకమతాల గణన 2011 అక్టోబరు 1న ప్రారంభమైంది.

వ్యవసాయరంగంలో ఇప్పటివరకు ఉన్న ఈ ధోరణుల నేపథ్యంలో రాష్ట్రం ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అవి:

 1. వ్యవసాయరంగంలో సుస్థిరాభివృధ్ధి సాధించాలి
 2. రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయం వాటాను మరింతగా పెంచాలి
 3. వ్యవసాయాదాయాన్ని ముఖ్యంగా రైతులకు వచ్చే సగటు ఆదాయాలను పెంచాలి
 4. ఈ రంగంలో స్థిరమైన వృద్ధిరేటును తీసుకురావాలి
 5. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి.
 6. ఫలితంగా రైతులకు పెట్టిన పెట్టుబడిపై అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.99540078844
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు