অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రత్యామ్నాయ మార్గాల్లో వైద్య విద్య

ప్రత్యామ్నాయ మార్గాల్లో వైద్య విద్య

వైద్య విద్యకు విభిన్న మార్గాలు
వైద్య రంగం అంటే... కేవలం డాక్టర్ మాత్రమే కాదు. నర్సులు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు కూడా వైద్య రంగంలోకే వస్తారు. చాలా మందికి వైద్య రంగంలోకి రావాలని ఉన్నా ఎంసెట్‌లో సరైన ర్యాంక్ రానందువల్ల వైద్య వృత్తిలోకి ప్రవేశించలేకపోవచ్చు. అలాంటి వారికి విభిన్నమైన కోర్సులను దేశంలోని వర్సిటీలు అందిస్తున్నాయి. వాటిలో చేరడం ద్వారా వైద్యులకు సేవచేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్న వారు అవుతారు.
వైద్య రంగంలో ప్రవేశించాలనుకునే వారికి రాష్ట్రంలో, దేశంలో అనేక యూనివర్సిటీలు వివిధ స్పెషలైజేషన్లతో బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ, పారామెడికల్ డిప్లొమా తదితర కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి కొన్ని రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంటే మరికొన్ని ఇంటర్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ తదితర సబ్జెక్టులు) వచ్చిన మార్కుల ఆధారంగా చేర్చుకుంటున్నాయి.
బి.పి.టి. (ఫిజియోథెరపీ)
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీని బి.పి.టి.గా పిలుస్తున్నారు. శారీరక నొప్పులతో ( మెడ, వెన్ను, మోకాళ్లు తదితర శారీరక భాగాలు) ఇబ్బందులు పడే వారికి క్రమపద్ధతిలో చికిత్సలు చేయాల్సి ఉంటుంది. వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులను ఇందులో నేర్పుతారు. ఈ కోర్సు చేసినవారు సొంతంగా ఫిజియోథెరపిస్టులుగా కెరీర్ ప్రారంభించవచ్చు. ఆసక్తి ఉంటే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరవచ్చు.
బీఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ)
వ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్ ల్యాబ్‌లలో ఎలాంటి పరీక్షలు నిర్వహించాలో నేర్పుతారు. కెమికల్, బ్యాక్టీరియోలాజికల్, మైక్రోస్కోపిక్, బయోలాజికల్ టెస్టులు చేయడంలో పాటించాల్సిన విషయాలు తెలియజేస్తారు. ఈ కోర్సులో చేరేందుకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ చదివి ఉండాలి. లేదా ఇంటర్ ఒకేషనల్ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి.
బి.యు.ఎం.ఎస్. (యునానీ)
పురాతన వైద్య విధానాల్లో యునానీ వైద్య విధానం ప్రత్యేకమైంది. వ్యాధిగ్రస్తులకు సహజ సిద్ధంగా లభించే వివిధ ఔషధాలతో చికిత్సలు ఎలా చేయాలి? తదితర విషయాలు నేర్పిస్తారు.
రాష్ట్రంలో రెండు యునానీ కళాశాలలున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష (బి.యు.ఎం.ఎస్.సెట్)ను ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీ నిర్వహిస్తుంది. పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుంది.
కాలేజీలు..
1. నిజామియా టిబ్బి ప్రభుత్వ యునానీ కళాశాల (హైదరాబాద్).
2. డాక్టర్ అబ్దుల్ హక్ యునానీ కళాశాల (కర్నూలు).

నర్సింగ్
ఇంటర్ సైన్స్ విద్యార్థులకు విలువైన కోర్సు - నర్సింగ్. ఉన్నతమైన, ఉదాత్తమమైన భవిష్యత్తును అందించడంలో నర్సింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కోర్సును ప్రపంచ వ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, హాస్పిటల్స్ నిర్వహిస్తున్నాయి. వైద్య అవసరాలకు తగిన సేవలు అందించేందుకు శిక్షణ ఇస్తున్నాయి.
మన దేశంలో నర్సింగ్ విద్యా వ్యవస్థ పనితీరును సరైన పంథాలో అమలు చేసేందుకు 1947లో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నర్సింగ్ కళాశాలల ఏర్పాటు మొదలు, కరిక్యులమ్‌ను రూపొందించడం, ప్రవేశ ప్రక్రియ తదితర అంశాలన్నింటినీ నిర్దేశిస్తుంది. కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేపడుతుంది.

రాష్ట్రంలో...
నర్సింగ్‌కు సంబంధించిన డిగ్రీ, డిప్లొమా కోర్సులను రాష్ట్రంలోని పలు విద్యా సంస్థలు, ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన కాలేజీలు నిర్వహిస్తున్నాయి. వీటిని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా ఎ.పి. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షిస్తుంది. నర్సింగ్‌లో డిగ్రీ కోర్సుల ప్రవేశ ప్రక్రియను విజయవాడలోని డాక్టర్ ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ చేపడుతుంది.
కోర్సుల వివరాలు....
బీఎస్సీ ( బేసిక్ నర్సింగ్- 4 సంవత్సరాలు): నర్సింగ్ వృత్తిలో రాణించడానికి కావాల్సిన ప్రాథమిక సూత్రాలను నేర్పుతారు. కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి. ఇందులో చేరేందుకు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలనీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు అవసరం. వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 35 ఏళ్లు దాటకూడదు. ఇంటర్లో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జి.ఎన్.ఎం. (మూడున్నరేళ్లు): జనరల్ నర్స్ మిడ్‌వైఫ్‌గా పిలుస్తారు. దీన్లో చేరేందుకు వయసు 17 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులుండాలి. ఆర్ట్స్ సబ్జెక్టులు చేసినవారు కూడా దరఖాస్తు చేయవచ్చు. లేదా ఒకేషనల్ ఎ.ఎన్.ఎం. కోర్సు పూర్తిచేసి ఉండాలి.
* ఆగ్జిలరీ నర్స్ మిడ్‌వైఫ్ (ఎ.ఎన్.ఎం.) చేసేందుకు టెన్త్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి.%
పోస్ట్ బీఎస్సీ (నర్సింగ్): ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఈ కోర్సును రెగ్యులర్ విధానంలో అందిస్తోంది. కాల వ్యవధి రెండేళ్లు. దూరవిద్యావిధానంలో ఇగ్నో అందిస్తోంది. కాల వ్యవధి 3 ఏళ్లు. ఇంటర్‌తోపాటు జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తారు.
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) యూనివర్సిటీ బీఎస్సీ (నర్సింగ్), డిగ్రీ, పీజీ, డాక్టొరల్ ప్రోగ్రాములను అందిస్తోంది.
1. బీఎస్సీ (నర్సింగ్) (మహిళలకు మాత్రమే)
2. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బి.పి.టి.): వీటికి జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
3. పీజీ డిప్లొమా ఇన్ ఎక్స్ రే- టెక్నాలజీ: ఈ కోర్సులో చేరడానికి ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
డిగ్రీ తర్వాత చేరదగిన పీజీ కోర్సుల్లో ఎంఎస్సీ నర్సింగ్, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ మొదలైన కోర్సులు ఉన్నాయి.
వెబ్‌సైట్: www.nims.ap.nic.in

జాతీయ స్థాయిలో...
నర్సింగ్ కోర్సుకు సంబంధించి డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఇతర కోర్సులను జాతీయస్థాయిలో ఎయిమ్స్, నిమ్‌హాన్స్, అహల్యాభాయ్ నర్సింగ్ కాలేజ్ మొదలైనవి నిర్వహిస్తున్నాయి.
ఎయిమ్స్
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ఆఫ్‌మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్వహిస్తున్న కోర్సుల్లో బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్, పారామెడికల్ ఉన్నాయి.
1) బీఎస్సీ (ఆనర్స్): ఈ కోర్సుకు ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులుండాలి. అఖిల భారత స్థాయిలో జరిగే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటారు.
2) బీఎస్సీ ఆనర్స్ - పారా మెడికల్ కోర్సులు (ఆఫ్తాల్మిక్ టెక్నిక్, మెడికల్ టెక్నాలజీ ఇన్ రేడియోగ్రఫీ మొదలైనవి): కనీసం 55 శాతం మార్కులతో ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివినవారు దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.aiims.edu

ఇగ్నో బీఎస్సీ (ఆనర్స్)
పారామెడికల్ విభాగంలో ఆఫ్తాల్మిక్ స్పెషలిస్టులు బహువిధాలుగా సేవలందించాలనే లక్ష్యంతో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) బీఎస్సీ (ఆనర్స్) ఆప్టొమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్ కోర్సును ప్రవేశ పెట్టింది.
ఇందులో కంటి పరీక్షలకు సంబంధించిన ప్రయోగాల ప్రక్రియలను నేర్పుతారు. శిక్షణ తర్వాత వీరు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఆప్టోమెట్రిస్ట్ అండ్ రిఫ్రాక్షనిస్ట్‌గా చేరవచ్చు. ఆప్టీషియన్, ఆప్ట్టోమెట్రిస్ట్, హెల్త్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ తదితర స్థాయుల్లో ఉపాధి పొందవచ్చు.
ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులతో కనీసం 45 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు. వయసు 17 సంవత్సరాలు నిండాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.ignou.ac.in
అహల్యాభాయ్ నర్సింగ్ కాలేజ్
న్యూఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్‌కు అనుబంధంగా ఉన్న అహల్యాభాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్ కోర్సు (4 ఏళ్లు)ను అందిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
చిరునామా: Ahalyabai Nursing College,
Near Lok Nayak Jayaprakash Narayan Hospital,
NewDelhi.

నిమ్‌హాన్స్
మానసిక వికలాంగుల సంరక్షణకు అవసరమైన ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య నిపుణులు, సేవా సిబ్బందిని తీర్చిదిద్దడానికి బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్) ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తోంది. ప్రభుత్వ రంగ పరిధిలో స్వయం ప్రతిపత్తి సంస్థగా కొనసాగుతూ 1994 నుంచి డీమ్డ్ వర్సిటీగా గుర్తింపు పొందింది.
ఈ సంస్థ అందిస్తున్న కోర్సుల వివరాలు...
1) బీఎస్సీ నర్సింగ్: కాల వ్యవధి 4 ఏళ్లు. ఇంగ్లిష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులున్న వారు అర్హులు.
2) బీఎస్సీ (రేడియోగ్రఫీ): కాల వ్యవధి 3 సంవత్సరాలు. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివి ఉండాలి.
3) బీఎస్సీ (అనెస్తీషియా టెక్నాలజీ): కాలవ్యవధి 3 ఏళ్లు. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులుండాలి. ప్రవేశపరీక్ష ద్వారా విద్యార్థులను చేర్చుకుంటారు. వయసు 17 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వెబ్‌సైట్: www.nimhans.kar.nic.in

పారా మెడికల్ కోర్సులు
ఆస్పత్రుల్లో డాక్టర్ ఒక్కరే ఉంటే సరిపోదు. చికిత్స కోసం వచ్చిన వారికి కట్టు కట్టడంతోపాటు, వ్యాధి నిర్ధారణలో ఎక్స్‌రే, స్కానింగ్ తదితర పనులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విధుల్లో పాలుపంచుకునే వారే పారా మెడికల్ సిబ్బంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పారామెడికల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఈ కోర్సులను ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు నిర్వహిస్తోంది. ఇవి ప్రధానంగా డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు. వివరాలు..
డిప్లొమా కోర్సులు (కాల వ్యవధి 2 సంవత్సరాలు)
1) మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్
2) ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్
3) ఆప్టొమెట్రీ టెక్నీషియన్
4) మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ (ఇంటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే)
5) ఆడియోమెట్రీ టెక్నీషియన్
6) పెర్ఫ్యూజన్ టెక్నీషియన్
7) రేడియో థెరపీ టెక్నీషియన్ (ఇంటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే)
8) డయాలసిస్ టెక్నీషియన్
9) హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్
10) మెడికల్ స్టెరిలైజేషన్ టెక్నీషియన్
11) మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (పురుషులు మాత్రమే).

సర్టిఫికెట్ కోర్సులు (కాల వ్యవధి సంవత్సరం)
1) కార్డియాలజీ టెక్నీషియన్
2) క్యాథ్‌ల్యాబ్ టెక్నీషియన్
3) ఈసీజీ టెక్నీషియన్
4) బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్
5) రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ (ఇంటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే)
6) డార్క్ రూమ్ అసిస్టెంట్ (ఇంటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే)
7) అనెస్తీషియా టెక్నీషియన్

ప్రవేశ విధానం: ఇంటర్‌లో గ్రూప్ సబ్జెక్టుల్లో అభ్యర్థికి వచ్చిన సగటు మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికపై ఎంపిక చేస్తారు. వయసు 15 సంవత్సరాలు ఉండాలి.
చిరునామా: Andhra Pradesh Paramedical Board,
Room No.306 of the Directorate of Medical Education Complex,
Behind Kendriya Sadan,
Koti,
Hyderabad - 001.

వెబ్‌సైట్: www.appmb.org.in
భవిష్యత్తు
ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. దీనికోసం పెద్దఎత్తున ఆస్పత్రులను ఏర్పాటు చేసి వైద్యసేవలను విస్తరిస్తోంది. ప్రైవేటు రంగం కూడా వైద్య సేవల ప్రాధాన్యాన్ని గుర్తించి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతున్నాయి. విదేశాల్లో కూడా ఆస్పత్రులు నర్సులను, వైద్య సహాయ సిబ్బందిని అధికంగా నియమించుకోవడానికి, వారి సేవలను విస్తృతపరచడానికి కృషి చేస్తున్నాయి. నర్సుల నియామకానికి అనేక ప్రైవేటు ఆస్పత్రులు సొంతంగా నర్సింగ్ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య కోర్సులు చేసినవారికి మంచి భవిష్యత్తు తప్పక ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆదార౦:ఈనాడు

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/1/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate