অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వీసా తీస్కోడానికి చేయాల్సినవి చేయకూడనివి.

వీసా తీస్కోడానికి చేయాల్సినవి చేయకూడనివి.

వీసా తీస్కోడానికి మీరు చేయాల్సినవి

  1. వీసా ఇంటర్వ్యూకు ముందు తగిన ఆహారాన్ని తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి. పెద్ద కాన్సలేట్లలో వేచి ఉండాల్సిన సమయం ఎక్కువగా ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో తాజాగా, ఉత్సాహంగా ఉండడం చాలా కీలకం.
  2. స్టూడెంట్‌ వీసాకి మెదటిసారిగా దరఖాస్తు చేస్తున్నపుడు వీసా దరఖాస్తు ఫీజు మాత్రమే కాకుండా SEVIS (స్టూడెంట్‌ ఎక్సే్చంజి అండ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
  3. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన పత్రాల జాబితా సిద్ధం చేసుకోవడం అత్యవసరం. ముందురోజు రాత్రే అన్ని పత్రాలను సరిచూసుకోవాలి. వాటిని మీ సంచిలో జాగ్రత్తగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల టెన్షన్‌, ఒత్తిడి తగ్గుతాయి.
  4. అన్ని దరఖాస్తులనూ, డీఎస్‌ ఫారాలనూ జాగ్రత్తగా నింపాలి. రాతప్రతులన్నీ చదవగలిగేలా ఉండేటట్లు చూసుకోవాలి. పుట్టినతేదీ వంటి కీలకమైన సమాచారాలను సరిచూసుకోవాలి.
  5. ఇంటర్వ్యూ కోసం సాధన చేసేటపుడు బిగ్గరగా మాట్లాడుతూ సాధన చేయాలి. మాక్‌ ఇంటర్వ్యూలకు హాజరవడం, మిత్రులతో కలిసి ప్రశ్నావళిలోని ప్రశ్నలకు జవాబులు చెప్పడం వంటివి సాధన చేయాలి.
  6. ఇంటర్వ్యూ ఆంగ్లంలోనే జరుగుతుంది. కాబట్టి మాక్‌ ఇంటర్వ్యూల్లో ఇంగ్లిష్‌లో జవాబులు చెప్పడం అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
  7. మీరు చేరబోయే కోర్సు/ ప్రోగ్రామ్‌ గురించి పూర్తి సమాచారం సేకరించుకుని ఉండాలి. మీ కెరియర్‌ ప్రణాళికలపై అది ఎలా ప్రభావం చూపుతుందో వివరించడం చాలా కీలకం. విద్యార్థి తగిన కారణాలు చూపి, కాన్సలర్‌ ఆఫీసర్‌ను ఒప్పించగలగాలి.
  8. ఇంటర్వ్యూ విజయవంతం కావాలంటే నిజాయతీగా జవాబులు చెప్పడం అవసరం. ఎక్కువమంది విద్యార్థుల ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు చేయవలసి ఉన్నందువల్ల ఆఫీసర్లకు సమయం చాలా తక్కువగా ఉంటుంది.
  9. అమెరికాకి వెళ్లే ప్రధాన ఉద్దేశం చదువు కోసమే కానీ, ఉద్యోగం కోసం కాదు. కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి ఎలా వద్దామనుకుంటున్నారో అధికారులకు వివరించాల్సి ఉంటుంది.
  10. బ్యాంకు స్టేట్‌మెంట్లు, లెటర్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సపోర్ట్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, అవార్డులు, సర్టిఫికెట్ల వంటి అనుబంధ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
  11. అమెరికాలో ఎందుకు చదవాలనుకుంటున్నారు? ఈ విశ్వవిద్యాలయానికే ఎందుకు దరఖాస్తు చేస్తున్నారు? గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాక మీ ప్రణాళికలు ఏమిటి? మిమ్మల్ని స్పాన్సర్‌ చేస్తున్నది ఎవరు? వంటి మౌలికమైన ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి.
  12. సంబంధిత పత్రాలన్నింటినీ ఒక క్రమంలో ఒక ఫోల్డరులో పెట్టుకుని ఉంచుకోవడం వల్ల, అవసరమైన పత్రాన్ని అడిగిన వెంటనే తడబాటూ, కంగారూ లేకుండా తీసి ఇవ్వడానికి వీలుంటుంది.
  13. ఇంటర్వ్యూ కోసం వీలైనంత శుభ్రంగా తయారయి వెళ్లాలి. ఫార్మల్‌ దుస్తులను ధరించాలి. ప్రశాంతంగా ఉండాలి, ఇంటర్వ్యూ చేసేవారి కళ్లలోకి సూటిగా చూస్తూ ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. జవాబులు క్లుప్తంగా చెప్పాలి. సంభాషణకి నప్పేలా మీ హావభావాలు ఉండేలా చూసుకోవాలి.
  14. ఫొటోలు అమెరికా ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేలా 2X2 సైజులో ఉండేలా జాగ్రత్త వహించాలి.

 

చేయకూడనివి

  1. ఆహారం, పానీయాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఇంటర్వ్యూకి తీసుకెళ్లకూడదు.
  2. తప్పు పత్రాలను సమర్పించాలని చూడకూడదు. అలా చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. అటువంటి ఆలోచన కూడా చేయవద్దు. ఎంత చిన్న సమాచారమైనా తప్పుగా ఇవ్వవద్దు.
  3. అడిగితే కానీ మాట్లాడవద్దు, అడగనిదే ఏ పత్రాలనీ ఇవ్వవద్దు.
  4. అసమగ్ర, అసంపూర్తి సమాచారం ఇవ్వవద్దు. సంబంధిత పత్రాలు కూడా పూర్తిగా ఉండేటట్లు చూసుకోవాలి. దీనిలో ఏ చిన్న తేడా వచ్చినా మీకు వీసా ఇవ్వకపోవచ్చు/ తిరస్కరణకు గురికావచ్చు.
  5. ఎక్కువగా మాట్లాడవద్దు. అలా అని మరీ తక్కువగా మాట్లాడవద్దు. కాన్సలర్‌ ఆఫీసర్‌తో వాదనకి దిగవద్దు. క్లుప్తంగా, అడిగినవాటికి మాత్రమే జవాబివ్వండి.
  6. మీ పత్రాలు ప్రెజెంటబుల్‌గా ఉండేట్లు చూసుకోవాలి. చిరిగిన, నలిగిన పత్రాలను దాఖలు చేయవద్దు.
  7. జవాబులు చెప్పేటపుడు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొంచెం కంగారుగా ఉన్నా దాన్ని ప్రదర్శించకూడదు.
  8. నత్తిగా మాట్లాడడం, ఒకే విషయాన్ని ఎక్కువసేపు చెప్పడం చేయకూడదు. అన్ని ప్రశ్నలకూ సూటిగా, నిజాయతీగా, స్పష్టంగా జవాబులు ఇవ్వాలి.
  9. ఇంటర్వ్యూకి ఆలస్యంగా వెళ్లకూడదు.
  10. మీకు అమెరికాలో చాలామంది చుట్టాలున్నారని చెప్పవద్దు.
  11. అమెరికన్‌లా మాట్లాడడానికి ప్రయత్నించకూడదు. అది కృత్రిమమని వాళ్లు గ్రహిస్తారు. అలాగే పూర్తి భారతీయ యాస/ దేశభక్తి నిండిన స్వరంతో మాట్లాడవద్దు. మీలా మీరు మాట్లాడితే చాలు.
  12. అమెరికాలో అడుగు పెట్టాక, మీరు (ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన) ఇబ్బందులను ఎదుర్కుంటారనే అభిప్రాయాన్ని వాళ్లకి కలిగించకూడదు.
  13. మీకు ప్రశ్న అర్థం కాకపోతే మరోసారి చెప్పమని అడగవచ్చు. లేదా మీకు అర్థమయ్యేలా ప్రశ్నను మార్చి అడగమని కోరవచ్చు

ఆధారము : ఈనాడు

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate