অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కర్నూలు

కర్నూలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ నగరం వైశాల్యంలో పెద్దది, అతి పెద్ద జనాభా కల నగరం. 1953 నుండి 1956 వరకు కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండేది. కర్నూలు నగరం హంద్రి నది, తుంగభద్రా నదుల ఒడ్డున దక్షిణం వైపు ఉంది. కర్నూలు అతిపెద్ద జిల్లా. ఇది హైదరాబాదు నుండి షుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కడప, చిత్తూర్, అనంతపూర్ చేరడానికి కర్నూల్ గుండా ప్రయాణించవలసి ఉండటం వల్ల దీనిని రాయలసీమ ప్రవేశ ద్వారం అంటారు. ఈ ప్రాంతం చిన్న ఊళ్ళ అందం, అతిధి సత్కారాల సంస్కృతితో పర్యాటకులలో ఒక మంచి అనుభూతిని కల్గిస్తుంది. చారిత్రిక సంస్కృతి, సాంప్రదాయ సంపదతో ఈ ప్రాంతం ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది.

చారిత్రిక వివరం

ప్రాచీన సాహిత్యం, శాసనాల్లో చెప్పబడినట్టు కందనవోలు అనే తెలుగు పదం నుంచి కర్నూల్ అనే పేరు వచ్చింది. కర్నూల్ కి వేల సంవత్సరాల చరిత్ర వుంది. కర్నూల్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న కేతవరంలో దొరికిన రాతి చిత్రం ప్రాచీన రాతి యుగం నాటిది. జుర్రేరు లోయ, కటవాని కుంట, యాగంటి లలో లబించిన రాతి శిల్పాలు 35000 నుంచి 40000 ఏళ్ళ నాటివి. మధ్య యుగాలలో భారత దేశాన్ని సందర్శించిన జువాన్ జాంగ్ అనే చైనా దేశపు పర్యాటకుడు తన కధనాల్లో కరాచీ వెళ్ళే దారిలో కర్నూల్ ను దాటానని రాసుకున్నాడు. ఏడవ శతాబ్దంలో కర్నూల్ బిజాపూర్ సుల్తాన్ల పాలనలో వుండేది. అంతకు ముందు దీన్ని శ్రీ కృష్ణదేవరాయల వారు పాలించారు. 1687 లో ఈ ప్రాంతాన్ని ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చేజిక్కించుకుని దీన్ని నవాబుల అధీనంలో వదిలేశాడు. తరువాత నవాబులు స్వాతంత్ర్యం ప్రకటించుకుని కర్నూల్ ను 200 ఏళ్ళ పాటు స్వతంత్రంగా పాలించారు. 18వ శతాబ్దంలో నవాబులు బ్రిటిష్ వారి తో పోరాడారు.

పురాతన కట్టడాలు, ఆలయాల నగరం

పురాతన కట్టడాలు, చారిత్రిక నిర్మాణాలు పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులకు, కర్నూలు అటువంటి ప్రదేశాలను విస్తృతంగా అందిస్తుంది. మధ్య యుగంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించిన కోటల శిధిలాలలో పురాతన కాలపు అరబ్బీ, పర్షియా శాసనాలు ఉన్నాయి.

ఈ కోటను తప్పక సందర్శించాలి. కొండారెడ్డి బురుజు, అబ్దుల వహాబ్ సమాధి చూడదగిన అద్భుత ప్రదేశాలు. కర్నూల్ పాలకుల వేసవి విడిది, వరద రక్షిత గోడ, కొన్నిప్రాముఖ్యత కల్గిన పేట ఆంజనేయస్వామి ఆలయం, నగరేశ్వరస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, షిర్డీ సాయి బాబా ఆలయం కూడా చూడ దగిన ప్రదేశాలు. కర్నూలు నవంబరు, డిసెంబర్ నెలలలో ప్రసిద్ధ రధొత్సవాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ పండుగ ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది. దీనిని ఆంజనేయస్వామి పేరున జరుపుకుంటారు.

నగరానికి ప్రయాణం

కర్నూలు నగర ప్రయాణం సులువుగా, సౌకర్యవంత౦గా ఉంటుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కర్నూల్ కి సమీప విమానాశ్రయం. కర్నూలు నగరం నుండి ఈ విమానాశ్రయానికి మూడున్నర గంటల సమయం పడుతుంది. కర్నూలు లో కర్నూల్ పట్టణం, ఆదోని, నంద్యాల, ధోన్ జంక్షన్ అనే నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లోని నగరాల నుండి అలాగే బెంగుళూర్, చెన్నై నగరాల నుండి బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. తీవ్రమైన వేడితో కూడిన కర్నూలు లోని వేసవి ఆహ్లాదకరంగా ఉండదు. కర్నూలులో వర్షాలు కూడా బాగా పడతాయి; అందువల్ల అక్టోబర్ నుండి మార్చ్ నెలలలో వర్షాల తరువాత వచ్చే శీతాకాలం కర్నూలు సందర్శనకు ఉత్తమమైనది. ఈ సమయంలో, మధ్యస్థ ఉష్ణోగ్రతతో ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది, పర్యాటక కార్యకలాపాలకు అనువుగా వుంటుంది.

కర్నూలు కోట లేదా కొండ రెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజుగా కూడా పిలిచే కర్నూల్ కోట కర్నూల్ నగరంలోఎంతో ముఖ్యమైన ప్రాంతం. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన ఈ కోట నగర౦ నడిబొడ్డున ఉంది. ఈ అద్భుతమైన కట్టడం లో మిగిలిన భాగం కొండ రెడ్డి బురుజు మాత్రమే. ఈ కోటలో ఉన్న కారాగారంలోనే కొండ రెడ్డి తుది శ్వాస వదలడం వలన ఈ స్తంభానికి ఆయన పేరు పెట్టారు.

ఈ కోట చాల వరకు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, కొన్ని భాగాలు ఇంకా బలంగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఎర్ర బురుజు. ఈ బురుజు క్రింది భాగంలో రెండు చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవి ఎల్లమ్మ తల్లికి చెందినవి. ఈ బురుజు లో గుప్త నిధులు ఉన్నాయని విశ్వసిస్తారు. ఈ నిధులను కనుగొనడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు,చెక్కడాలు ఉన్నాయి.

బాల సాయిబాబా ఆలయం

బాల సాయిబాబా ఆలయం, షిర్డీ సాయిబాబా ఆలయానికి దగ్గరలో ఉంది. ఇది కర్నూలు నగర౦లోని అవతార పురుషుడు శ్రీ బాల సాయిబాబాకు చెందినది. ఈ మధ్య కాలంలో బాగా పేరుగాంచిన బాల సాయిబాబా మందిరం పెద్ద ప్రాంగణంలో ఉంది. మీరు అవతారపురుషులను, వారి ఆధ్యాత్మిక శక్తులను విశ్వసిస్తే ఈ ప్రదేశాన్ని సందర్శించండి.

జగన్నాధ గట్టు ఆలయం

జగన్నాధ గట్టు ఆలయం, కర్నూలులో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. శివునికి ప్రసిద్ది చెందిన ఈ ఆలయం కర్నూలు లోని బి.తాండ్రపాడు లో ఉంది. ఈ లింగానికి ఉన్న చరిత్రవల్ల ఈ ప్రాంతం ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవ రాజైన భీముడు తీసుకువచ్చాడని పురాణాల కధనం. ఈ శివలింగాన్ని గ్రానైట్ రాయితో చేశారు. ఈ శివలింగం ఎత్తు 6 అడుగులు, వెడల్పు 2 అడుగులు.

కర్నూలు మ్యూజియం

భారత పురావస్తు శాఖ వారు కర్నూలు మ్యూజియాన్ని స్థాపించారు. కర్నూల్ ప్రాంతం నుండి త్రవ్విన ఎన్నో కళాఖండాలతో కర్నూలు ప్రాంతం చారిత్రక పురావస్తు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యూజియాన్ని నిర్మించారు. కర్నూలు మెడికల్ కాలేజ్ పక్కనే, హంద్రి నది సమీపంలో ఈ మ్యూజియం ఉంది. సంగమేశ్వరం, ఆలంపూర్, శ్రీశైలం వంటి సమీప ఆలయాల విరిగిన శిల్పాల వంటి కళాఖండాలు, సామంత రాజులు ఆయుధాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ మ్యూజియం కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకానికి సమీపంలో ఉంది.

కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారకం

ఈ స్మారక కట్టడం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి స్మృతిగా కట్టింది. కర్నూలు నగరానికి చెందిన ఈయన రాష్ట్రంలోనే కాక దేశంలోని అతి ప్రసిద్ధ రాజకీయ నాయకుడు. తన ప్రజలచే అభిమాని౦చబడిన ఈయనను అనుచరులు పెద్దాయనగా పిలుచుకునేవారు. హంద్రి నది ఒడ్డున ఉన్న ఈ స్మారకం ప్రస్తుతం ఒక ప్రముఖ విహార కేంద్రం.

నల్లమల అడవి

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నిరంతర అటవీ ప్రాంతాల్లో నల్లమల అడవి ఒకటి. ఇది తూర్పు కనుమలలో ఒక భాగమైన నల్లమల కొండలలో ఉంది. ఇది కర్నూలు, గుంటూరు, కడప, మహబూబ్ నగర్, ప్రకాశం ఈ ఐదు జిల్లాలలో విస్తరించి ఉంది. కొన్ని సంవత్సరాలక్రితం ఈ అడవి క్రీడలకు పేరుగాంచింది. ప్రసిద్ధ వన్యప్రాణుల రచయిత కెన్నెత్ ఆండర్సన్ ఈ అడవిలోని సాహసాల గురించి రాసారు.

ఈ అడవిలో పులులు ఎక్కువగా ఉండేవి, నాగార్జునసాగర్-శ్రీశైలం కు చెందిన పులులు ఈ అడవిలో ఒక భాగం. ఈ అడవులలో చిరుతలు తరచుగా కనిపిస్తాయి.

షిర్డీ సాయిబాబా ఆలయం

షిర్డీ సాయిబాబా ఆలయం, 70 సంవత్సరాల క్రిందట నిర్మించిన ప్రత్యెక ప్రాంతం. అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. ఇది నక్షత్రం ఆకారంలో వుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ దేవి, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయ వాతావరణం చల్లగా, నిర్మలంగా ఉంటుంది. అన్ని సమయాలలో ఈ ఆలయాన్ని సందర్శించ దగినప్పటికీ, పూజలు నిర్వహించే ఉదయం, సాయంత్ర సమయాలు సందర్శనకు అనుకూలంగా ఉంటాయి, ఈ నదినుండి వీచే చల్లని గాలి ఈ ప్రదేశాన్ని ఎంతో ఆహ్లదపరుస్తుంది. షుమారు 800 మంది ప్రజల సామర్ధ్యం గల పెద్ద ధ్యాన మందిరంలో ధ్యానం చేయవచ్చు. ఈ ఆలయం కొండారెడ్డి బురుజుకి దగ్గరలో ఉండడం వల్ల సులభంగా చేరుకోవచ్చు.

వెంకన్న బావి ఆలయం

వెంకన్న బావి ఆలయం నగరంలోని గొప్ప ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటి. అయితే, ఈ ఆలయం స్థానికులలో మాత్రం అంతగా పేరుగాంచలేదు. ఈ ప్రదేశంలో రెండు ఆలయాలు ఉన్నాయి; ఒకటి కొండ దిగువన శివునికి చెందిన ఆలయం. శిధిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని గుప్త నిధుల కోసం వేటగాళ్ళు తవ్వారు.

ఈ ఆలయంలో బంగారం వంటి విలువైన వస్తువులు ఉన్నాయని విశ్వసిస్తారు. మండపం చుట్టూ శిల్పాలతో ఉన్న ఈ ఆలయం సమీపంలో ఒక చెరువు ఉంది. వేరొక ఆలయం చిన్న కొండపై ఉంది. ఈ కొండపై ఎగుడు దిగుడు రాళ్ళతో ఎక్కడ౦ కష్టమైనప్పటికీ, పైనుండి కనపడే దృశ్యాలు పూర్తి విలువనిస్తాయి. ఈ నేపధ్యంలో సుందరమైన దృశ్యాలను చూడవచ్చు.

మంత్రాలయం

మంత్రాలయం దక్షిణ భారత దేశ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో ఉంది. ఈ పట్టణం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రం తో సరిహద్దు పంచుకుంటుంది. ఈ పట్టణం మంచాలే అనే పేరు తో ప్రసిద్ధికెక్కింది.గురు రాఘవేంద్ర స్వామి నిర్మించిన బృందావనం వల్ల తెలుగు వారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. శ్రీ మధ్వాచార్యులుని నాయకునిగా పరిగణించే మధ్వ సన్యాసుల శాఖ ను అనుసరించిన పవిత్ర వ్యక్తి గురూజీ.

స్థానికుల నమ్మిక ప్రకారం, గురు రాఘవేంద్ర స్వామి దక్షిణ బృందావనం లో గత 339 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. మరో 361 సంవత్సరాలు ఇక్కడే నివసిస్తారు. గురూజీ బృందావనం లో అడుగుపెట్టినప్పుడే ఆ ప్రదేశాన్ని 700 సంవత్సరాల పాటు తన ఆవాసం గా స్వీకరిస్తానని ప్రకటించారు. ఈ కారణం చేత దేశం లోని హిందువులచే ఇది పవిత్ర పట్టణం గా పరిగణించబడుతుంది.

మంత్రాలయం లోని ఆసక్తికరమైన ప్రదేశాల్లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం, బిక్షాలయ గుడి, పంచముఖి ఆంజనేయ ఆలయం ఉన్నాయి. ఈ పట్టణం లో విమానాశ్రయం లేదు, అయితే ఇక్కడికి రహదారి గుండా లేక రైలు మార్గంలోనూ సునాయాసంగా చేరుకోవచ్చు. పట్టణం యొక్క కేంద్ర ప్రదేశం నుంచి రైల్వే స్టేషన్ సుమారు 16 కి.మీల దూరంలో ఉంది. మంత్రాలయం చేరుకోవటానికి ఎన్నో ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఉష్ణ మండల వాతావరణం నెలకొని ఉంది. వేసవులు చాలా వేడిగా, పొడిగా, శీతాకాలాలు కాస్త చల్లగా ఉంటాయి.

బిక్షాలయ

స్థానిక భాష లో బిచాలి గా పిలవబడే బిక్షాలయ, మంత్రాలయానికి సుమారు 20 కి.మీల దూరంలో ఉంది. శ్రీ అప్పనాచార్య జీవితం లో అధిక భాగం ఇక్కడే జీవించిన ప్రదేశం గా దీనికి పేరు. శ్రీ అప్పనాచార్య గురు రాఘవేంద్ర స్వామి కి పరమ భక్తుడే గాక శిష్యుడు కూడా. గురు రాఘవేంద్ర స్వామి బిక్షాలయ లో శ్రీ అప్పనాచార్య తో పాటు 13 సంవత్సరాలు జీవించారన్న విషయం విదితమే.

తుంగభద్ర నదీ తీర ప్రాంతపు అత్యద్భుతమైన అందాల మధ్యల ఉండటం వల్ల బిక్షాలయలో పచ్చ పచ్చని మరియు ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. నగర జీవనపు ఉరుకులు పరుగులు నుంచి తప్పించుకోవటానికి నేడు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ చోటు వారికి ధ్యానం చేసుకుని తమ అంతర్గత వ్యక్తులను తెలుసుకునేందుకు కావలసిన శాంతిని, ప్రశాంత పరిసరాలను అందిస్తుంది.

బిక్షాలయ యాత్రికులకు, దగ్గరి వారితో అమూల్యమైన క్షణాలు గడపడానికి విహారయాత్ర కై వచ్చే స్థానికులకు ఇష్టమైన ప్రదేశంగా మారిపోయింది.

పంచముఖి ఆంజనేయ ఆలయం

పంచముఖి ఆంజనేయ ఆలయం మంత్రాలయం పట్టణం నుంచి సుమారు 5 కి.మీల దూరం లో ఉంది. ఆంజనేయ స్వామి లేదా హనుమాన్ ఈ ఆలయంలోని ఆరాధ్య దైవం. ఇక్కడి విగ్రహానికి గరుడ, నరసింహ స్వామి, హయగ్రీవ, హనుమాన్ మరియు వరాహ స్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ అయిదు తలలు ఉంటాయి.

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి శ్రీ రామునికి మరియు హనుమాన్ కి గొప్ప భక్తుడని నమ్ముతారు. 12 సంవత్సరాల ఘోర తపస్సుకు మెచ్చి హనుమాన్ గురూజీ కి ప్రత్యక్షమయ్యారు. హనుమాన్ గురూజీ కి పంచముఖి ఆంజనేయునిగా దర్శనమిచ్చారు.

అత్యంత అందమైనది కావటం వల్ల ఈ ఆలయం యాత్రికుల తప్పక చూడవలసిన ప్రదేశాల జాబితా లో ఉంటుంది. రాళ్ల మధ్య ఉన్నా సుందరమైన నిర్మలమైన భూభాగం మీద ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయానికి వెళ్ళే దారి లో మీకు మంచం, తలగడ, దేవతల విమానం లాంటి సహజ ఆకృతి లో ఉన్న రాళ్ళు ఎదురుపడతాయి.

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం

మంత్రాలయం లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం ఈ ప్రాంతపు అతి ముఖ్యమైన సందర్శక ప్రదేశం. గురూజీ శ్రీ మహా విష్ణువు భక్త తత్పరుడైన ప్రహ్లాదుని అవతారమని నమ్మకం. శ్రీ మహా విష్ణువు , శ్రీ నరసింహ స్వామి అవతారమెత్తి ప్రహ్లాదుని రాక్షస తండ్రి ని వధించి ఆతని దుష్ట యోచనలనుంచి తన భక్తుని కాపాడుకున్నారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి బృందావనం ఏర్పాటుచేయడానికి మంత్రాలయాన్నే ఎంచుకున్నారు.

ఈ ఆలయం గురూజీ వేలాది భక్తులలో బాగా ప్రాచుర్యం పొందినది. వారు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం గురు జయంతి రోజు ఆలయాన్ని సందర్శించుకుంటారు. జయంతి రోజు ఉత్సవాలు జరుపుకోవటం వల్ల ఆలయం విభిన్న కార్యకలాపాలతో కోలాహలంగా ఉంటుంది. రెండు రోజులు పాటు సాగే ఈ వేడుకలలో హాజరుకావటానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గురూజీ ఇప్పటికీ బృందావనంలోనే నివసిస్తున్నారని, మరో 361 సంవత్సరాలు ఇక్కడే ఉంటారని చాలా మంది భక్తుల నమ్మకం.

శ్రీశైలం

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా లో నల్లమల కొండలలో చిన్న పట్టణం శ్రీశైలం హిందువులకు చాలా పవిత్ర మైనది. ఈ పట్టణం కృష్ణ నది ఒడ్డున కలదు. హైదరాబాద్ ఈ పట్టణానికి సుమారు 212 కి. మీ. ల దూరం వుంటుంది. ఎంతో పవిత్ర యాత్రా స్థలంగా భావించే ఈ శ్రీశైలం పట్టణానికి లక్షలాది హిందువులు ప్రతి సంవత్సరం దేశం లోని అన్ని మూలల నుండి వచ్చి దర్శించుకుంటారు. ఈ టవున్ లో అనేక దేవాలయాలు, తీర్థాలు కలవు. భక్తులకు, పర్యాటకులకు కావలసిన వివిధ రకాల ఆకర్షణలు ఇక్కడ కలవు.

ఇక్కడి దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడు గా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబ గా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాల లో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటి లో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.

శ్రీశైలం కు ఎయిర్ పోర్ట్ లేదా రైలు స్టేషన్ లేనప్పటికీ తేలికగా చేరగల చక్కటి రోడ్ మార్గం కలదు. ఇది ఒక ఉష్ణమండల ప్రదేశం కావున, వేసవులు అధిక ఉష్ణోగ్రతలు కలిగి పర్యాటకులకు అసౌకర్యంగా వుంటుంది. శ్రీశైలం చూడాలంటే శీతాకాలం అనుకూలమైనది.

అక్క మహాదేవి గుహలు

అక్క మహాదేవి గుహలు నల్లమలై శ్రేణులలోని కొండలపై శ్రీశైలం కు సుమారు 10 కి. మీ. ల దూరం లో కలవు. ఈ గుహలు చరిత్రకు పూర్వం నాటివని తెలియజేసే ఆధారాలు కూడా కలవు. పట్టణ చరిత్రలో ఈ గుహలు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి. ఈ గుహలకు 12 వ శతాబ్దపు వేదాంతి మరియు కర్ణాటక గాయని అయిన అక్కమహాదేవి అక్కడ గుహల లోపలి భాగాలలో కల సహజ శివలింగం కు తపము , పూజలు చేయుట వలన ఆమె పేరు పెట్టారు.

అక్క మహాదేవి గుహలు సహజంగా ఏర్పడిన గుహలు. కృష్ణా నది కి ఎగువ భాగంలో కలవు. ప్రధాన గుహకు సహజంగా ఏర్పడిన ఒక అద్భుత ఆర్చ్ వుంటుంది. ఈ ఆర్చ్ కొలతలు సుమారుగా 200 x 16 x 4 గా వుండి ఎట్టి ఆధారం లేక వుంటాయి. పర్యాటకులు గుహలలోని భాగాలకంటే కూడా ఈ ఆర్చ్ సహజ నిర్మాణానికి ఆనందిస్తారు. ఈ గుహల లో కల రాళ్ళు ఎపుడో భూమి పుట్టిన నాటివి, పురాతనమైనవి కనుక ఒక మంచి ఆకర్షణగా వుంటాయి.

ఈ గుహలకు కృష్ణా నది గుండా వెళ్ళడం ఒక మంచి అనుభవం. సుమారు 150 అడుగుల పొడవు వుండే ఈ గుహల సందర్శన మరింత మంచి అనుభవం గా కూడా వుంటుంది.

మల్లెల తీర్థం

మల్లెల తీర్థం ఒక జలపాతం. శ్రీశైలం పట్టణానికి ఇది సుమారు 50 కి. మీ. ల దూరం లో కలదు. ఈ నీరు ఎంతో పవిత్రమైనదని భావించటం తో భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చి స్నానాలు చేస్తారు. ఈ జలపాతాలు దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గం లో తేలికగా ప్రయాణించవచ్చు. వర్షాకాలం లో మాత్రం రోడ్ సరిగ్గా వుండదు.

ఈ మల్లెల తీర్థం లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని మోక్షం దొరుకుతుందని భావించటం తో ఈ జలపాతాలు ప్రాముఖ్యతని సంతరించుకొన్నాయి. అయితే, ఈ నీటిలోకి చేరాలంటే సుమారు 250 మెట్లు దిగి వెళ్ళాలి కనుక, చాల జాగ్రత తీసుకోవాలి. జారి పడే అవకాశం వుంటుంది. వేగిర పడకుండా నిదానంగా మెట్లు దిగి వెళ్ళాలి.

శివాజీ స్ఫూర్తి కేంద్ర

శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం లో ఒక క్రీడల కేంద్రం గా వుంది. ఈ సెంటర్ కు మారాట్టా యోధుడు శివాజీ పేరు పెట్టారు. ఈ సెంటర్ చేరాలంటే, సుమారు 30 మెట్లు ఎక్కవలసి వుంటుంది. సెంటర్ యొక్క భవనం ఆకర్షణీయంగా వుండి దానిలో శివాజీ విగ్రహం ఒక సింహాసనం పై కూర్చుని వుంటుంది. ఈ సెంటర్ చుట్టూ అన్నివైపులా సంరక్షణ చేయబడి అక్కడ నుండి లోయ లోని ప్రకృతి దృశ్యాలు మరియు దూరంగా వుండే శ్రీ శైలం డాం ని చూచి ఆనందించేలా వుంటుంది.

ఈ క్రీడల కేంద్రాన్ని , రాష్ట్రం లోని క్రీడల లో అన్ని వయసుల పిల్లలు పాల్గొనేందుకు గాను శిక్షణ ఇచ్చేందుకు స్థాపించారు. చాలా మంది తమ పిల్లలని ఈ కేంద్రానికి పంపుతారు. క్రికెట్, ఫుట్ బాల్ , టెన్నిస్ , బాడ్మింటన్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రీడలలో ఈ కేంద్రం లో ట్రైనింగ్ పొందిన పిల్లలు చాల మంది పాల్గొన్నారు.

శ్రీశైలం డాం

శ్రీశైలం డాం ని ప్రధాన శ్రీశైలం పట్టణానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది పై కట్టారు. వ్యూహాత్మకంగా దీనిని నల్లమల కొండలలో ఒక లోతైన మలుపు లో నిర్మించారు. ఈ డాం ఇండియా లో రెండవ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గా పేరొందినది. శ్రీశైలం డాం ప్రాజెక్ట్ ని 1960 వ సంవత్సరం లో నిర్మాణం మొదలు పెట్టగా, దానిని పూర్తిచేసేందుకు సుమారు 20 సంవత్సరాలు పట్టింది. చివరకు ఇది 770 మెగా వాట్ల విద్యుత్ ఉత్పతి సామర్ధ్యం కలిగి ఒక బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ గా రూపొందింది. నేడు ఈ డాం సుమారు 2,200 చదరపు కిలోమీటర్ల భూమిని సాగు చేస్తోంది.

ఈ రిజర్వాయర్ నీటి నిలువకు విద్యుత్ అవసరం లేనందున అధిక మొత్తాలలో నీటిని ఇక్కడ నిలువ చేస్తారు. వరదలు వచ్చినపుడు, శ్రీశైలం రిజర్వాయర్ చాలా త్వరగా నిండిపోయి మిగిలిన నీరు నాగార్జునసాగర్ డాం లోకి ప్రవహిస్తుంది. వరద నీటిని పవర్ జనరేషన్ కు ఉపయోగించరు.

శ్రీశైలం శాంక్చురి

శ్రీశైలం చుట్టుపక్కల మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ కల సంరక్షిత అడవిని తప్పక చూడాలి. ఇది ఇండియా లోనే అతి పెద్ద టైగర్ రిజర్వు గా పేరొందినది. సుమారు 3568 చ. కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి వుంది. ఏ జంతువు కనబడక పోయినా, ఈ ప్రదేశం లో తిరిగి రావటమే ఒక సాహసంగా భావించాలి. శాంచురి లోపల ఎన్నో రకాల వృక్షాలు, వెదురు మొక్కలు వంటివి చూడవచ్చు.

శాంక్చురి లోపల వివిధ రకాల జంతువులను అంటే పులులు, చిరుతలు, హయనాలు, అడవి పిల్లులు, ఎలుగులు, లేళ్ళు , దుప్పులు వంటివి చూడవచ్చు. శ్రీశైలం డాం కు సమీపం లో కల సాన్క్చురి భాగం లో మీరు నీటి మడుగులలో వివిధ రకాల మొసళ్ళ ని కూడా చూడవచ్చు.

ఆధారము: నేటివ్ ప్లానెట్.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate