పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఔషధ పుట్టగొడుగులు

పుట్టగొడుగులు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

june014.jpgపుట్టగొడుగులు 5000 సంవత్సరాల పూర్వం నుండి వాడుకలో ఉన్నాయి. చాలా పుట్టగొడుగులు ఆరోగ్యాభివృద్ధికి, మానవుల క్షేమానికి అవసరమైన గుణాలను కలిగి ఉన్నాయి. పుట్ట గొడుగు (Mushroom) అనేది శిలీంధ్రాలలో లైంగిక ఉత్పత్తి ద్వారా ఏర్పడే ఫలనాంగము (Fruiting body). మామూలు మొక్కలలో, ఫలాలలో ఏర్పడే విత్తనాల ద్వారా ఉత్పత్తి జరిగితే శిలీంద్రాలలో సిద్ధబీజాల (Spore) ద్వారా జరుగుతుంది. పుట్టగొడుగులలో ఈ సిద్ధబీజాలు ప్రత్యేక నిర్మాణం గల ఫలనాంగాలలో ఉత్పత్తి అవుతాయి. ఫలనాంగాలు కాడతో గొడుగు మాదిరిగా ఉంటాయి. గొడుగు వంటి నిర్మాణంలో గోధుమరంగు కలిగిన మొప్పల (gills) క్రింది భాగంలో ఏర్పడిన స్పోరులు గాలి ద్వారా సుదూర ప్రాంతాలకు కూడ వ్యాప్తి చెందుతాయి.

కొన్ని కోట్ల స్పోరులు ఒక పుట్టగొడుగులో ఏర్పడతాయి. జైంట్ పఫ్ బాల్ (gaint puff ball) తో ఏర్పడే స్పోరులన్ని మొలకెత్తి ఫలనాంగాలను ఏర్పరిచితే సూర్యుడికి మూడింతల పరిణామమవుతుంది. కొన్ని స్పోరులైనా ఖచ్చితంగా పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొని శిలీంధ్ర వ్యాప్తికి తోడ్పడి ఇంత ఎక్కువ స్పోరులను ఉత్పత్తి చేస్తాయి. చాల శిలీంధ్రాలు స్పోరులను ఫలనాంగాలలో ఉత్పత్తి చేయకుండా వ్యాప్తికి వేరే విధానాన్ని అనుసరిస్తాయి.

సుమారు 15 లక్షల శిలీంధ్రా జాతులు భూమిపై ఉన్నాయని అంచనా. కాని ఇప్పటివరకు 2 లక్షల జాతులను మాత్రమే గుర్తించారు. వీటిలో మన కంటికి కనబడే ఫలనాంగాలను ఏర్పరిచే శిలీంధ్రాలు 22,000ల వరకు ఉండవచ్చు. వీటిలో 10,000 వరకు ఆహారంగా వాడబడేవి ఉంటే, కొన్ని మాత్రం అత్యంత విషపూరితమైనదిగా మనకు కనబడతాయి. బాగా అనుభవం గల వారు మాత్రమే ఈ రెండింటి మధ్యలో తేడాను కనిపెట్టగలరు. కాబట్టి పిల్లలూ! జాగ్రత్త. కనబడిన పుట్టగొడుగుల్ని తినేవి కావు మరి!

పుట్టగొడుగులలో ఔషధ గుణాలున్నాయని వైద్యంలో ముఖ్యంగా కాన్సర్ (Cancer) నిర్మూలనకుగాను జపాన్, చైనా దేశాలలో విరివిగా వాడేవారు. సాగు కూడ చేస్తున్నారు. కాని చాలా రోగాలు ఒకే పుట్టగొడుగు ఔషద గుణాల ద్వారా నయం అవుతాయనేది మాత్రం నిజం కాదు. పుట్టగొడుగులలో ఉండే ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యానికి గురికాకుండా కాపాడతాయి. వీటిలో ఉన్న అనేక రకాల విటమిన్లు, చాల ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (Amino acids), అత్యధికంగా ప్రొటీన్లు, పీచు పదార్థం, కొంత పిండి పదార్ధాలు, ఖనిజాలు, చాల తక్కువ ప్రమాణంలో కొవ్వు పదార్థాలు ఉండటం వలన మంచి పోషకాహారంగా గుర్తించబడ్డాయి.

ఇంతేకాకుండా కొవ్వు పదార్థాలు చాల చాల తక్కువ ఉన్నందువల్ల ఆరోగ్యానికి చాల మంచివన్నవి శాస్త్రీయంగా ఋజువు చేయబడింది. ఇన్ని విధాలుగా మంచి గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి తూర్పుదేశాలలో ప్రాముఖ్యతను సంతరించుకొన్న పుట్టగొడుగుల వాడకం ఇప్పుడు ప్రాచ్యదేశాలలో కూడ చాల జనాదరణ పొందాయి. సాధారణంగా దుకాణాలలో దొరికే తాజా లేక ఎండిన ఫలనాంగాలలో కంటే తంతులలో ఉండే పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులు బాగా పనిచేస్తాయి. ఎందుకంటే వ్యాధిని నివారించగల ఔషదాలు ఫలనాంగాలలో కంటే తంతులలోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి. రకరకాలైన పుట్ట గొడుగులను వివిధ ప్రయోజనాలకై వాడతారు.

వీటిలో 'కార్టిసిప్స్ సైనాన్షిన్' (Cordyceps Sinesis) అనే శిలీంధ్రం గురించి ఇపుడు తెలుసుకొందాం. 680 రకాలైనా కార్డినిప్స్ లో కార్డిసిప్స్ సైనాన్షిన్ అనేది ఒక జాతి.

సెప్టెంబరు 1993 బీజింగ్ లో చైనా జాతీయ ఆటపోటీలలో ఒకేవారంలో, పరుగుపందాలలో ఒక్కసారే మూడు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టబడ్డాయి. ఈ ఆశ్చర్యకరమైన వార్త సంచలనాన్ని సృష్టించింది. ఆటగాళ్ళు గుణపేరక మందులను (drugs) చట్టవిరుద్ధంగా వాడారా? అనే ప్రశ్న ఉదయించింది. కాని ఈ అనుమానం వైద్య పరీక్షలో అబద్దం అని తేలింది. కోచ్ మాజన్ రెన్ రహస్యం బయటపెట్టింది. అది ఏదో కాదు ఆటగాళ్ళు సంజీవని వంటి కార్టిసిప్స్ సైనాన్ పిన్' వాడటం వలన వారికి అత్యంత శక్తి వచ్చిందని అర్థమయింది.

ఈ శిలీంధ్రం వేయి సంవత్సరాల నుండి పవిత్రమైన అరకుగా వాడుతున్నారని వినికిడి. ఇది చాల సురక్షితమైన ఔషధాహారము. చైనాలో పూర్వకాలం నుండి ఒక అద్బుతమైన జివి చాల ఎత్తైన టిబెట్ పర్వతాలలో ఉందని గ్రంథస్థం చేయబడింది. పశువు నుండి మొక్కగా మారి మళ్ళా పశువుగా మారుతుందని నమ్మేవారు. ఈ అభిప్రాయానికి కారణం దీని అసాధారణమైన జీవనవిధానమే. దీని స్పోరులు ఒక రకమైన రెక్కల పురుగులో (పై) మొలకెత్తి, ఆ పురుగును చంపి, దాని నుండి ఆహారాన్ని పొంది, చనిపోయిన పురుగులో వృధి పొంది, పొడుగైన కొమ్మవలే, మొదలు మట్టి రంగులో, చివర నల్లటి రంగు ఉండే ఫలనాంగాన్ని ఏర్పరుస్తుంది.

చాల రకాలైన పురుగులపై ఈ శిలీంధ్రం ఫలనాంగాన్ని ఏర్పరుస్తుంది. బొద్దింకలపై, తేనెటీగలపై, చీమలపై, లద్ది, పేడపురుగులపై, కుమ్మరి పురుగులపై, చిమ్మెట పురుగుల పై అనేక రకాలైన పురుగులను ఇది ఆహారంగా వాడుకుంటుంది. ఈ రకమైన జీవన విధానం కలిగి ఉండటం వలన దీనిని 'గొంగళి పురుగు శిలీంధ్ర'మని చైనీయులు పిలుస్తారు. ఇంకా చైనా వారు ‘శీతాకాల జంతువని, వేసవి కాల కాయగూరని అంటారు.

దీనిని 1850లో చైనా నుండి జపానీయులు విరివిగా దిగుమతి చేసుకొనేవారు. చైనా, జపాన్ దేశాలలో దీనిని "winter Worm' అని అంటారు. C.Curiculianum శిలీంధ్రం చీమలపై పెరిగినపుడు, చీమలు చిటారు కొమ్మ వరకు ఎగబ్రాకితే అంత ఎత్తు వరకు కూడ దీని స్పోరులు వెదజల్లబడతాయి. సాధారణంగా రాత్రిపూట తిరిగే 'బాటిమాత్'పై మొలకెత్తి ఆ తరువాత దాన్ని చంపి ఆ చనిపోయిన పురుగుపై ఆవాసం ఏర్పరచుకొంటుంది. ఈ అసాధారణమైన జీవనశైలి కలిగి ఉన్నందువలన దీనిని "Caterpillar fungus" అని సాధారణంగా పిలుస్తారు.

కార్టిసిప్స్ శిలీంధ్రం చనిపోయిన గొంగళి పురుగు నుండి మొలకెత్తి తొడుగులేని పోచవలె ఉండే ఫలానాంగాన్ని ఏర్పరుస్తుంది. ఒక్కొక్కసారి దీని ఫలనాంగం చిలముగా చీలి దుప్పికొమ్మువలె కనబడుతుంది. కాబట్టి 'దుప్పి శిలీంధ్రం' (deer fungus) అని కూడ అంటారు.

ఈ శిలీంధ్రం ఇప్పుడు 14,000 నుండి 21,000 అడుగుల ఎత్తైన ప్రదేశాలలో పెరుగుతుంది. చైనా, టిబెట్, భూటాన్, నేపాల్ దేశ హిమాలయ ఆల్ఫ్ (Alpise) మైదానాలలో ఎక్కువగా విస్తరించి ఉంది. దీని ఫలనాంగాలు ఉత్పత్తి అయ్యేకాలంలో చాలా మంది పర్వతారోహణ చేసి వీటిని సేకరిస్తారు. దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. 2012లో జరిగిన ఒలంపిక్స్ ఆటపోటీల సమయంలో ఒక కిలో 25 లక్షల రూపాయల వరకు అమ్ముడయిందని సమాచారం.

దీనికి చైనా దేశంలో అది ప్రాచీనమైన చరిత్ర ఉంది. టాంగ్ తరం రాజుల కాలంలో మొట్టమొదటి సారిగా దీని గురించి ప్రస్తావన కనబడుతుంది. టిబెట్లో మైకోట్ అనే తెగవారు నేపాల్ దేశానికి వలస వచ్చారు. యాక్స్ జంతువులు ఎత్తైన హిమాలయ ప్రాంతాలకు పచ్చిక కోసం వచ్చినపుడు పర్వత ఎత్తువల్ల ప్రాణవాయువు తగ్గటం వలన కలిగే వ్యాధిని (mountain sickness) ఎదుర్కోటానికి పశు వుల కాపరులు దీన్ని తినేవారు. కార్డినివ్స్ ను పచ్చికతోపాటు పశువులు కూడ తినేవి.

యాక్స్ తింటే అవి ఏ వ్యాధికి గురికాలేదు అనే విషయాన్ని కాపరులు గమనించారు. ఈ విధంగా కొండ జాతుల వాళ్ళు దీనిని వాడటం మొదలు పెట్టారు. ఆ తరువాత అక్కడకు వెళ్ళే బౌద్ధసన్యాసులతో ఈ సమాచారాన్ని పంచుకునేవారు. అలా చైనా దేశంలో దీని ప్రాముఖ్యత వ్యాప్తి చెందింది. చైనా వైద్యులు వారి చక్రవర్తి వాడుకకు సలహా యిచ్చారూ. ఆ తరువాత ఈ పుట్టగోడుగును చక్రవర్తి ఉద్రోగులు మాత్రమే అనుమతి ఇవ్వాలని హకుం జారి అయింది. ఈ సమాచారం అక్కడి నుండి ఐరోపా దేశాలకు రవాణా అయింది.

దీనిని ఉన్న విధంగా పచ్చిగా కాని, ఎండబెట్టి కాని తినేవారు. పసుపచ్చ వైన్లో నానబెట్టి, ఆ వైన్ ను మోకాళ్ళు, గజ్జల నొప్పులకు వాడేవారు. చంపిన బాతు పొట్టలో గొంగళి పురుగుకు ఇంకా అతుక్కుని ఉన్న కారిసిప్స్ ను పెట్టి సన్నని సెగమీద ఉడకపెట్టేవారు. బాతు . బాగా ఉడికిన తరువాత, బాతు మాంసాన్ని 8-10 రోజులకు లేక ఆరోగ్యం సరిగా అయేవరకు తినేవారు. దీనిని కాన్సర్ నివారణకు, అలసట తగ్గటానికి వాడలేరు.

2006లో డా. జాన్ హలిడే మొట్టమొదట క్రొత్త కార్డిసిప్స్ రకాలను కనుగొన్నాడు. 250 క్రొత్త రకాలను పెరూ దేశంలో కనుగొని కొత్త రకాలైన మందులను ఎయిడ్స్, కాన్సర్ నివారణకు తయారు చేస్తున్నారు. దీనిలో ఉండే పిండి పదార్థాలు, కార్టిసైసిన్, ఇంకా ఇతర గ్లూకియోసైళ్ళు వైరస్ వ్యాధి నివారకాలుగా గుర్తించారు. ఆస్త్మా బ్రోంఖైటిస్, గుండె సంబంధిత వ్యాధులకు, కాలేయ సంబంధిత వ్యాధులను, క్యాన్సర్, క్షయ, కామెర్ల వ్యాధులను, రక్త హీనతను, నపుంసకత్వాన్ని నివారించటానికి మందుగా వాడుతున్నారు. డయాబెటిస్ (మధుమేహం), రక్తనాళాల్లో కొవ్వు కరగటానికి ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు సవ్యంగా పనిచేయటానికి దోహదపడుతుంది.

చైనాలో ముఖ్య ఔషదంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయటానికి వాడతారు. ఎందుకంటే ఈ రెండు అవయవాలు మనిషి జీవించటానికి అతి ముఖ్యమైనవి కాబట్టి. అనేక వ్యాధులను నివారించకలిగి మరియు అతిశక్తి కారణంగా పనిచేసే ఈ పుట్టగొడుగును 'సంజీవని'గా పిలుస్తారు. దీనికి ఇంత ప్రాముఖ్యం ఉంది కాబట్టి అనేక సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా కార్టిసిప్స్ ను పెంచటానికి నిమగ్నమైనారంటే ఆశ్చర్యం లేదు.

ఆధారం: ప్రొ. అడుసుమిల్లి నాగమణి.

3.00584795322
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు