అప్పుడే పుట్టిన బిడ్డ మొదటిగా తీసుకునే ఆహారం తల్లిపాలే. ఎందుకని ? తల్లిపాలు అధిక పోషక విలువలు గల బలవర్థకమైన ఆహారం. అందుకనే ఆడ క్షీరదాలు తమ సంతానానికి పాలు ఇస్తాయి. పాలలో పెరుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు వుంటాయి. బిడ్డ పుట్టిన తరువాత కొన్ని నెలల వరకు ముఖ్యమైన ఆహారం తల్లిపాలే. పుట్టిన బిడ్డకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం తల్లిపాలే.
ఆడ క్షీరదాలలో క్షీర గ్రంథులలో పాలు తయారగును. చాలా క్షీరదాలలో చనుమొనలు వుండి పిల్లలు పాలు పీల్చుటకు అనువుగా వుండును. ఈ చనుమొనలు సన్నని నాళాల ద్వారా క్షీర గ్రంథులతో కలుపబడి వుండును.
అన్ని రకాల క్షీరదాలలోని పాలలో ఒకే రకమైన పోషకాలు వుంటాయి. కాని వాటి నిష్పత్తి మారుతుంటాయి. పాలలో 80 నుండి, 90% నీరు వుంటుంది. పాలలో ప్రొటీన్ లు, కార్బోహైడ్రేట్ లు, కొవ్వులు, విటమిన్ లు మరియు ఖనిజాలు వుండును. ఈ పోషకాలన్ని పెరుగుదలకు, ఎముకలు, కణజాలాలను బాగు చేయుటకు, అంతస్రావి గ్రంథులు సక్రమంగా పనిచేయుటకు అవసరం. పాలలో వుండే ఎసీన్, అల్బుమిన్ వంటి ప్రొటీన్ లు పెరుగుదలకు, రిపేరుకు అవసరమైన అమినో ఆమ్లాలను సరఫరా చేస్తాయి. లాక్టోజ్ లేక పాలఘగర్ వంటి కార్బోహైడ్రేట్ లు శక్తినిస్తాయి. మరియు కాల్షియం మరియు పాస్ఫరస్ లు శోషణలో తోడ్పడును. కొవ్వులు చిన్న చిన్న బిందువులు రూపంలో వుండును. పిల్లల జీర్ణాశయంలో పాలు పెరుగుగా మారి సులభంగా జీర్ణం కాబడుతుంది. కొవ్వులు జీర్ణం కావటంలో ఏర్పడే ఇబ్బందులను తొలగిస్తుంది. పాల ద్వారా A,B,C,D,E,K మరియు నయాసిన్ వంటి విటమిన్ లు కూడా అందుతాయి. ఈ విటమిన్ లు ఆరోగ్యకరమైన ఎముకలు, కణజాలాలు ఏర్పడుటకు అవసరం.
తల్లి బలవర్థకమైన ఆహారం తీసుకుంటే, తల్లిపాల ద్వారా బిడ్డకు కూడా బలవర్థకమైన ఆహారం అందుతుంది. వివిధ అంటువ్యాధులకు వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తుంది. బిడ్డ పుట్టిన వెంటనే ప్రతి మూడు లేక నాలుగు గంటల కొకసారి ఆహారం తీసుకుంటు రోజుకు సుమారు 600 మి.లీ. పాలు తీసుకుంటారు. 6 వారాల తరువాత ఆకలి చక్రం కొద్దిగా పొడిగింపబడి బేబి ఒక రాత్రి అంతా పాలు తీసుకోకుండా వుండగలిగే స్థితికి చేరుతారు.
రచన: వి. పాపాచారి