పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జంక్ ఫుడ్స్

Say No To Junk Food .

0026.jpgమనం ఆహారాన్ని ఎందుకు తినటం? ప్రాథమికంగా పోషణకు. ఇటీవలి కాలంలో చాలామంది పోషణకోసం ఆహారం తీసుకుంటామనే విషయాన్ని మరచిపోయారు. పోషకాహార లోపంతో భావి భారత పౌరులెందరో పలురకాల రుగ్మతలకు లోనవుతున్నారు. ఇదిలా వుంటే మనకు, మన పిల్లలకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు పోషకాహారాన్ని అందించేవేనా? పిల్లల శారీరక, మానసిక వికాసానికి, పోషణకు ఏ మేరకు తోడ్పడుతాయి. నేటి వ్యాపార ప్రపంచంలో ప్రతిదీ. చిటికెలో జరిగిపోవాలి. ఎవరికీ సమయం దొరకటం లేదు. ఆ వెలితిని తీర్చేందుకా అన్నట్లు రకరకాల 'రెడీమేడ్” ఆహార పదార్థాలు మన మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా పట్టణాలలో లెక్కలేనన్ని వెలిశాయి. ఇక్కడ లభించే ఆహారాన్నే 'జంక్ ఫుడ్స్' లేదా 'రెడీమేడ్ ఫుడ్' అని పేర్కొంటారు.

ఈ జంక్ ఫుడ్స్ ను తిన్నవారికి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అందుకే ఇవి బహుళ ప్రాచుర్యం పొందాయి. పిల్లలు వీటికి బానిసలవుతారు. తల్లిదండ్రులను వేధించి మరీ పంతం నెగ్గించుకుంటారు. ఇంతగా కావాలనిపించే ఆ ఆహారపదార్థాల్లో ఉండేదేమిటి? ఇవి ముఖ్యంగా అత్యధిక కెలోరీల శక్తినిచ్చే చెక్కరలు, కొవ్వు పదార్థాలతో నిండి ఉంటాయి. వీటిలో శరీర పోషణకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండిలేనట్లుగా ఉంటాయి. అందుకే వీటిని మనం జంక్ ఫుడ్స్ గా పేర్కొంటాం.

అసలు 'జంక్' అంటే పనికిరానిదని అర్థం. మొట్టమొదటిసారి జనహితం కోరే సైన్సు సంస్థ (Centre for Science in the Public Interest) అధిపతి శ్రీ మైఖేల్ జాకబ్ సన్ వీటికి ఈ పేరును 1972లో పెట్టాడు. అప్పట్నుండీ ఈ పేరు వాడుకలో ఉంది. వీటిలో పోషక విలువలు లేనందువల్ల 'జంక్'గా పేర్కొన్నారు. చూయింగ్ గమ్, కాండీలు, ఫ్రైడ్ ఫుడ్స్ (చిప్స్), స్వీట్స్, బర్గర్లు, పిజ్జాలు ఇలా పాకేజీల్లో లభించే రెడీమేడ్ రకాలు దీని కిందికి వస్తాయి. తియ్యతియ్యగా ఉండే కార్బోనేటెడ్ డ్రింక్స్ (రకరకాల కోలాలు) లేదా శీతల పానీయాలు ఈ కోవకు చెందినవే.

వీటిని మళ్ళీ మళ్లీ తినాలనిపించడం లేదా అలవాటు పడిపోవడం ఎందువలన? కోకైన్, హెరాయిన్ (heroin) వంటి మాదకద్రవ్యాలవలె ఇవి కూడా మన మెదడు పనివిధానాన్ని ప్రభావితం చేస్తాయని స్క్రిప్స్ పరిశోధనాసంస్థకు చెందిన జాన్సన్, కెన్నీలు 2008లో తెలియజేశారు. ఎలుకలపై జరిపిన పరిశోధనలు కూడ ఈ విషయాన్ని నిర్ధారించాయి. వీటిలో వాడే మోనోసోడియా గ్లుటామేట్ (MSG) అనే లవణం ఈ ఆహార పదార్థాల రుచిని, సువాసనను పెంచుతుంది. కాని ఇది పిల్లల్లో అలాగే పెద్దవారిలో కూడ బరువు పెంచడానికి కారణం అవుతున్నది. అమెరికాలో పిల్లల్లో ఊబకాయానికి ప్రధానకారణం ఈ జంక్ ఫుడ్స్ మనదేశంలో కూడ ఇప్పుడిప్పుడే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని పిల్లలు ఈ ఆహారపదార్థాలకు అలవాటు పడుతున్నారు, ఇది ఆందోళనకరం. నేడు ఎక్కడంటే అక్కడ వస్తున్న సూపర్ మార్కెట్లలో, ఆహార భాండాగారాల్లో (Fast Food Joints) ఇవి మన జిహ్వకు పరీక్ష పెడుతున్నాయి. ఇవి పోషక పదార్థాలకు కాక రుచికి పెద్దపీట వేస్తాయి. దానితోనే మనల్ను దానికి బానిసలను చేస్తాయి.

దీనిలో వాడే లవణం MSG. మన మెదడులో ఆకలిని నియంత్రించే హైపోథలామస్ ను నియంత్రించి లెఫ్టిన్ అనే హార్మోన్ ను నిర్వీర్యపరుస్తుంది. లెఫ్టిన్ హార్మోన్ మనిషి ఎంత తినాలి, కడుపు నిండిందా లేదా అనే స్పృహను లేదా తెలివిని మనకు కలిగిస్తుంది. ఇది పనిచేయనపుడు ఎంత తినాలో మనకు తెలియదు. రుచిగా వుంది కాబట్టి ఇంకా ఇంకా తింటాం. ఫలితం ఊబకాయం. పెద్దయ్యాక అనేక రకాల వ్యాధుల బారిన పడటం. మామూలుగా 129 కాలరీల ఆహారం తీసుకునేవారు ఈ లవణం వలన 330 కాలరీల ఆహారాన్ని తీసుకుంటారని పరిశోధనల్లో తేలింది. MSG ఉత్తేజం కలిగించే ఒక రకమైన విషపదార్థంగా చెబుతారు.

ఆహార, పానీయాలను మార్కెట్ చేసే పెద్ద పెద్ద కంపెనీలు 'జంక్ ఫుడ్స్' మీద నియంత్రణ చేపట్టకుండా అడ్డుపడుతుంటాయి. డెన్మార్క్ దేశంలో 2011-2012 సంవత్సరంలో వీటి వినియోగాన్ని నియంత్రించేందుకు Fat Food Tax ను తొలిసారిగా ప్రవేశపెట్టింది. వంద మిల్లీ లీటర్ల పానీయంలో 20 మి.గ్రా. కేఫిన్ ఉంటే హంగేరీ ప్రభుత్వం పన్ను విధించింది.

ఈ ఆహార పదార్థాలను పిల్లలు తీసుకోవటం మంచిది కాదు. మున్ముందు మధుమేహం, రక్తపోటు, ఇంకా మాట్లాడితే గుండె జబ్బులకు కూడ ఇవి కారణమవుతాయి. ఇంతటి ప్రమాదకారులుగా తేలిన ఈ అనారోగ్యకర పదార్థాలను అమ్మటానికి కంపెనీలు ఆకర్షణీయమైన ఎడ్వర్టైస్మెంట్ ఇచ్చి మరీ మనలను బానిసలు చేస్తాయి. పిల్లలకు ఈ అనారోగ్యకర ఆహారాన్ని అందించేందుకు రోజుకు 5 మిలియన్ డాలర్లు వాణిజ్య ప్రకటనలకు ఖర్చు చేస్తాయంటే ఆలోచించండి.

స్కూలుకు వెళ్లే పిల్లలు చాల గంటలపాటు చురుకుగా, ఆరోగ్యకరంగా దృఢంగా ఉండాలి. వారు ఈ పనికిమాలిన ఆహారానికి అలవాటు పడితే వారికి తెలియకుండానే నీరసానికి, నైరాశ్యానికి (Depression) గురౌతారు. వారి జీర్ణవ్యవస్థ కూడ దెబ్బతింటుంది. అందుకని తల్లిదండ్రులు మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి. శీతల పానీయాలకు, జంక్ ఫుడ్స్ కు అలవాటు పడకుండా చూడాలి. మంచి చెడులను పిల్లలకు వివరించి చెప్పాలి. మనం కొనే ప్రతి వస్తువు మీద అందులో ఉండే వివిధ పదార్థాల మోతాదును విధిగా తెలియజేయాలి. కాని చాలా సందర్భాలల్లో MSG వంటి లవణాల గురించి ఆయా పాకెట్లపై సమాచారం ఇవ్వరు.

ఇటీవల సైన్స్ ఫర్ ఎన్విరాన్ మెంట్ సంస్థ మనదేశంలో లభ్యమయ్యే ఫాస్ట్ (జంక్) ఫుడ్స్ ను పరీక్షించి అందులో అనుమతికి మించిన మోతాదులో లవణాలు, కొవ్వులూ ఉన్నాయని సాధికారికంగా తేల్చింది.

ఇది మన బడులు తెరిచే సమయం . అనారోగ్యకరమైన రకరకాల ఆహారాలు మన పిల్లలను ఊరించేందుకు కూడ వారికిదే అదను. అందుకే చెకుముకి నేస్తాలైన చిన్నారులూ, వారి తల్లిదండ్రులూ విచక్షణతో వ్యవహరించాలి.

ఆధారం: ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్.

3.01547987616
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు