పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జలం కోసం జనం విలవిల

జలం కాపాడుకుందాం.

నీరే ప్రాణధారం రోజుల తరబడి వర్షాలు కురిసి కొండల్నీ కోనల్ని ముంచెత్తినప్పుడు, వంతెనలు మునిగి రహదారుల ఆనవాల్లు చెరిగి, సమాచార బంధనాలు తెగిపడి నప్పుడు జలప్రళయం గుర్తుకొచ్చి ఒళ్లు జలదరిస్తుంది. అలాగే రివ్వున సాగే మబ్బులు రిక్త హస్తాలతో ఊరును దాటి వెళ్లిపోయినప్పుడు తాగునీటికి సాగునీటికి తీవ్రమైన కొరత ఏర్పడినప్పుడు అడుగంటిన బావులతో, పూడిక వేసిన చెరువులతో ఊరంతా హోరెత్తినప్పుడూ మనకి గుర్తుండకపోవడం ప్రస్తుత పరిస్థితులకు కారణమని పర్యావరణ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నుయ్యి ఎండిపోయిన తరువాతే నీటి విలువ తెలుస్తుందని 250 సంవత్సరాల కిందట అమెరికా ప్రజల్ని హెచ్చరించిన బంజిమిన్ ఫ్రాంక్లిన్ మాటల్ని గుర్తుకు తెస్తున్నారు.

నీరూ, ఆరోగ్యం ఒక లాంటివే. బాగున్నంతకాలం పట్టించుకోకపోవడం మనిషి లక్షణం. నెలల తరబడి నిరాహారంగా వుండటం సాధ్యమే గాని నీళ్ళు లేకుండా కొద్ది రోజులు మాత్రమే జీవించగలమన్నది యదార్థం.

jun0021.jpgజనాభా పెరుగుదల, నగరాల విస్తరణ, గృహ నిర్మాణ కార్యక్రమాలు, నీటి వినియోగాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రోజు సగటున 2,30,000 మంది జనాభా పెరగడంతో మితిమీరుతున్న అవసరాలకూ పరిమితికి లోబడిన వనరులకూ మధ్య వైరుధ్యం ఏర్పడుతోంది. రానున్న కాలంలో ఈ పరిస్థితి మరింత గడ్డుగా మారుతుందని భూగర్భజల నిపుణులు ప్రచార ఘంటికల్ని వినిపిస్తున్నారు. 1992లో వైద్యనాథన్ కమిటీ నీటి సమస్యను విస్తృతంగా అధ్యయనం చేసింది. మన దేశంలో రానున్న యాభై సంవత్సరాల్లో నీటి ఎద్దడి పెరుగుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 2050 నాటికి సంవత్సరానికి 2.788 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరంగా కాగా కేవలం 1403 బిలియన్ క్యూబిక్ వీటర్లు మాత్రమే లభ్యమవుతాయని అంటున్నారు.

నీరు పుష్కలంగా ఉందనుకోవడం అపోహ మాత్రమేనని, కొత్త వనరులు పుంఖానుపుంఖలుగా పుట్టుకు వస్తాయని భావించడం గాల్లో మేడలు కట్టడం లాంటిదేనని మన దేశంలో నీటి సమస్యను సమీక్షించిన యునిసెఫ్ జలనిపుణుల కమిటీ కూడా అభిప్రాయపడింది. 1992లో రియో డిజనెరో గరిత్ర సదస్సు ప్రపంచదేశాలు జలనిర్వహణపై దృష్టిని కేంద్రీకరించాలని గట్టిగా కోరినా, ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు అంతంత మాత్రమేనని ప్రతి దేశంలోని పర్యావరణ నిపుణులూ ఫిర్యాదులు చేస్తూనే వున్నారు.

jun0022.jpgనీటిని పొదుపుగా వాడటం కోసం వివిధ దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. తక్కువ నీటితో పనిచేసే కంపోస్టింగ్ టాయ్ లెట్ లను, నీటిని పొదుపుగా ఉపయోగించే వాషింగ్ మిషన్లను అమెరికాలో మాసాచుసెట్స్ కు చెందిన ఓ సంస్థ రూపొందించింది. నార్వేలో జరిగిన ఇంటర్నేషనల్ ఎకాలజీ ఇంజనీరింగ్ సొసైటీ సమావేశంలో నీటికి సంబంధించిన ప్రదర్శన నిర్వహించారు. నీటిని పొదుపుగా వాడటంతో పాటు, మురుగు నీటిని సద్వినియోగం చెయ్యడం రీసైకిలింగ్ పద్దతుల ద్వారా వాటికి వినియోగార్హత కల్పించడం లాంటివి ఇందులో ప్రముఖాంశాలు. ఇందుకోసం వేస్ట్ వాటర్ గార్డెన్స్ ప్రక్రియను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని నిపుణులు సూచించారు.

బహుళార్ధక ప్రయోజనాలు సాధించే పథకాలు, నదుల అనుసంధానం వివిధ రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణిలాంటివి వివిధ కారణాల వల్ల త్వరిత గతిన పూర్తికావడంలో మన దేశంలో వివిధ ప్రాంతాలు వరుణ దేవుడి కరుణమీదే ఆధారపడుతున్నాయి. ఒకప్పుడు నీటిని పుష్కలంగా అందించిన సంప్రదాయ జలవనరులు నేడు పూర్తిగా ఎండిపోవడంతో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. పశ్చిమ వాయువ్వ ప్రాంతాల్లో గ్రామాలు ఎడారులుగా మారి, జంతు కళేబరాల మించి మనుషులు వలసకు వెళ్తున్న హృదయ విదారక దృశ్యాలు రాజస్థాన్, గుజరాత్ లలో కానవస్తున్నాయి. ప్రజల్లోనూ పాలకుల్లోనూ దూరదృష్టి లోపించడమే ఇలాంటి స్థితికి కారణమని నిపుణులు అంటున్నారు.

దీర్ఘకాలిక పథకాల ద్వారా నదీ జలాల్ని తరలించడం శ్లాఘనీయమే అయినా ప్రస్తుత అవసరాల్ని తీర్చే నీటి పరిరక్షణ లాంటి సన్నకారు పథకాల్ని నిర్లక్ష్యం చెయ్యడం తగదని సూచిస్తున్నారు. అభివృద్ధి పేరిట చెరువుల్ని సైతం ఆక్రమించి, జలవనరులకు వాననీరు అందే మార్గాల్ని కాంక్రీటు నిర్మాణాల ద్వారా అడ్డగించి నీటి ఎద్దడి ని చేజేతులా సృష్టించుకొన్నామని చెబుతున్నారు. గుజరాత్ కమిటీ, హిమాలయస్ ఎన్విరామెంటల్ స్టడీస్ సంయుక్తంగా నిర్వహించిన జల్ ఆందోళన్లో సాంప్రదాయక జలవనరుల పరిరక్షణ వాననీటిని నిల్వచేయడం ద్వారా భూగర్భజలాల పరిపోషణలాంటి అంశాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. డెహ్రాడూన్ లోని పీపుల్స్ సైన్స్ ఇన్ స్టిట్యూట్, రాజస్థాన్ లోని తరుణ్ భారత్ సంఘ్ లాంటి సంస్థలు భూగర్భజలాల సంరక్షణకు కృషి చేస్తున్నాయి. మహారాష్ట్రలోని రాలేగామ్ సిద్దీని నందనవనంలా తీర్చిదిద్దిన అన్నాహజరేలాంటి వ్యక్తులు సాంప్రదాయక జలవనరుల్ని కాపాడాలని ఉద్యమిస్తున్నారు. ప్రవహించడం నీటి లక్షణమని, పరుగులు తీసే వాన నీటిని నిల్వ చేసి, భూగర్భ జలాల్ని పరిరక్షించడం మన కర్తవ్యమని వాటర్ షెడ్ పథకాల ద్వారా రుజువు చేస్తున్నారు. అన్నాహజారే స్ఫూర్తితో వాటర్ షెడ్ పథకాల్ని అమలులోకి తీసుకురావడంతో పాటు ఈ మహోద్యమంలో వ్యక్తులు సైతం పాలుపంచుకునేందుకు చిన్న చిన్న పథకాల్ని ప్రచారంలోకి తీసుకువస్తున్నారు.

ఇళ్ళ కప్పుల మీద కురిసే వాననీరు, గృహావసరాలకు వినియోగించిన నీటిని వృధా కాకుండా నేలపొరల్లోకి ఇంకిపోయేలా చేసి భూగర్భజలాల్నీ, పరిసరాల్లోని జలవనరుల్నీ పరిరక్షించవచ్చును.

2015 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపు “700 కోట్ల మంది జనాభాకు ఉన్నది ఒక్కటే భూమి అనే గ్రహం. దీనిని జాగ్రత్తగా కాపాడుకుందాం”. ఈ పిలుపుని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ మరియు ముఖ్యంగా జలసంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. మిషన్ కాకతీయ అయినా లేదా ఓం దీక్షా అయినా పేరు ఏదైనా నీటి పరిరక్షణ మనందరి కర్తవ్యం.

సముద్ర జలాల్లో ఉష్ణోగ్రత అంతంత ఒకే విధంగా ఉండడం, ధృవ ప్రాంతాల వద్ద సముద్ర జలం ఉష్ణోగ్రత 0°C నుండి భూమధ్య రేఖ ప్రాంతంలోని జలాలు 20°C వరకు ఉంటాయి. భూ ఉష్ణోగ్రత కన్నా సముద్ర జలాల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. సూర్య కిరణాలు సముద్ర జలాలపై విస్తరించినప్పుడు వేడికి నీరు భాష్పీకరణ చెందుతుంది. దీని వలన సముద్ర జలాలు చల్లగా ఉంటాయి. అంతే కాకుండా సూర్య కిరణాలను సముద్ర జలాలు ఎక్కువ పరివర్తనం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో పసిఫిక్ మహా సముద్ర జలాలు సాధారణ స్థాయిలో వేడెక్కుతాయి. ఉష్ణ ప్రవాహం దీనిలో మార్పులు సంభవించడం వలన వాతావరణంలో ఏర్పడే మార్పులను ఎల్ నిన్ అంటారు. మేఘాలను మోసుకెళ్లే గాలుల దిశలో మార్పులు జరిగి అనేక దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఆఫ్రికాలోని చాలా దేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాలు అనావృష్టి కరువు కాటకాలు చవిచూస్తున్నాయి. ఇండోనేషియాలో అడువులు దగ్దం కావడం, కెనడాలో మంచు తుఫాన్లు ఏర్పడడం, దక్షిణ ఉత్తర అమెరికాలలోని చాలా ప్రాంతాల్లో వరదలు రావడం, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదుకావడం, వడగాల్పుల మరణాలు పెరగడం, వానలు కురవక దుర్భిక్షం ఏర్పడడం వంటివి ఎల్ నినో కారణంగానే సంభవిస్తున్నాయి. అయితే ఖచ్ఛితంగా ఎల్ లోనో ప్రభావాన్ని అంచనా వేయడం, దాని గురించి తెలుసుకోవడం కోసం అనేక శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి. ఏదేమైనా మానవ తప్పిదాలు భూతాపం కూడా దీనిని తోడవుతుంది.

ఆధారం: డా. తుమ్మల శ్రీకుమార్.

3.00884955752
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు