పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సత్యాన్వేషణ

సైంటిస్టులు అనేక చిక్కు సమస్యలను పరిష్కరించి సత్యాన్ని ప్రపంచం ముందు నిలబెడతారు.

feb4మానవ శ్రేయస్సు కోసం సైంటిస్టులు అనేక చిక్కు సమస్యలను నిరూపణలతో సహా పరిష్కరించి సత్యాన్ని ప్రపంచం ముందు నిలబెడతారు. దాని మూలంగా నిజమని నమ్మిన అనేక భ్రమలు తొలగి పోతుంటాయి. కానీ, మనుషులు అంత తొందరగా నమ్మకాలను వదులుకోవడానికి యిష్టపడరు. అందుకే “అబద్ధం లోకం చుట్టివస్తే నిజం యింకా చెప్పులు తొడుక్కునే దగ్గరే మిగిలిపోతుందని” లోకులు అంటారు. సైన్సు విశ్వాసం మీద కాక రుజువుల మీదే నిలబడి వుంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పిన శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు దుర్మరణం చెందిన ఘటనలు ఎన్నో సైన్సు చరిత్రలో వున్నాయి.

వాల్మీకి రామాయణంలో కూడా జాబాలి మహర్షి రాముడ్ని వుద్దేశించి యిదే తత్త్వాన్ని బోధించడానికి ప్రయత్నం చేశాడు. చార్వాకులు అనుసరించిన 'బృహస్పత్య సూత్రాలు' అనే తాళపత్ర గ్రంథంలోని సూక్తులు చాలా వరకు కాలగర్భంలో కలసిపోయాయి. అక్కడక్కడా కొన్ని తాళపత్ర గ్రంథాలలో పైన పేర్కొన్న శ్లోకం లాంటివి కనపడ్డాయి. తర్వాతి కాలంలో సమాజాన్ని అధ్యయనం చేసిన బుద్ధుడు కూడా వేదాలను, క్రతువులను, యాగాలను, కులవ్యవస్థను నిరసించాడు. పుష్యమిత్రుడునే మౌర్య సేనాని మౌర్యవంశం మీద తిరుగుబాటు చేసి, బౌద్ధారామాలను నాశనం చేసి, కనపడిన బౌద్ధసన్యాసులందర్నీ నరికి చంపాడు. బౌద్ధ దేవాలయాలను, జైన దేవాలయాలను హిందూ దేవాలయాలుగా మార్చాడు. సర్వమానప సమానత్వ ధర్మాన్ని బోధించిన బౌద్ధమతాన్ని భారతదేశంలో నిర్మూలించడానికి కంకణం కట్టుకుని కులవ్యవస్థను మరింత బలోపేతం చేశాడు.

ప్రపంచంలో శాస్త్రజ్ఞులు చాలా మంది సమాజాలు అనుసరిస్తున్న విశ్వాసాలను ప్రశ్నించారు. సత్యం ఎప్పుడూ చేదుగానే వుంటుంది. అందుకే ‘సత్యవాది లోక విరోధి' అన్నారు. సత్యాన్ని సమర్థించిన శాస్త్రజుల మీద ఆయా సమాజాల్లో పాలకులు, మత పీఠాధిపతులు కన్నెర్ర చేయడమే గాకుండా ధారుణమైన శిక్షలను విధించారు, చంపేశారు.

feb519 ఫిబ్రవరి 1473 న జన్మించిన నికొలస్ కోపర్నికస్ 1514 లో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అప్పటి వరకూ ప్రపంచంలోని అన్ని మతాలు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే భావించేవి. అలాగే భూమి నలుచదరంగా వుందని భావించే వాళ్ళు. మన పురాణాల్లో భూమిని చాపలాగా చుట్టి తీసుకువెళ్తున్న హిరణ్యాక్షుడ్ని వరాహావతారం దాల్చిన విష్ణుమూర్తి సంహరించాడని కథపుంది. కోపర్నికస్ సిద్ధాంతం ఆ రోజుల్లో ఒక సంచలనం. అయితే కోపర్నికస్ క్రైస్తవ మతాధిపతులతో వున్న సాన్నిహిత్యాన్ని బట్టి ఆయనను శిక్షించకుండా వదిలేశారు. కానీ 1548 లో జన్మించిన గియోనార్డో బ్రూనో కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించడమే గాకుండా బైబిల్లో పాత నిబంధన గ్రంధంలోని అనేక అంశాలను ప్రశ్నించాడు. ఈ ఖగోళ శాస్త్రజుడ్ని మతవాదులు 17 ఫిబ్రవరి 1600 సంవత్సరంలో గుంజకు కట్టి మంటపెట్టి కాల్చివేశారు. నిజాన్ని నిర్భయంగా ప్రబోధించిన బ్రూనో మరణించిన రోజుని విజ్ఞాన జగత్తు 'సత్యాన్వేషణ దినోత్సవం' గా పరిగణిస్తున్నది. ఆ రోజున సైన్సు టీచరు, సైంటిస్టులు సమావేశాలు ఏర్పాటు చేసి, సత్యం కోసం ఆత్మబలిదానం అయిన బ్రూనోని గుర్తుచేసుకుంటారు.

గెలీలియో గెలీలి ఈ సిద్ధాంతాన్ని టెలిస్కోపు ద్వారా రుజువు చేసి సమాజ వ్యతిరేకతను, మతాధిపతుల దుర్మార్గాన్ని చవిచూశాడు. తన జీవితంలో చివరి ఎనిమిది సంవత్సరాలు గృహ నిర్బంధంలో గడిపాడు. ఆయన 8 జనవరి 1642 లో మరణించాడు. ఆధునిక ప్రపంచంలో కూడా అనేక నూతన ఆవిష్కరణలు చేసిన సైంటిస్టులు రాజకీయవాదుల వల్లనో, వ్యాపారవేత్తల మూలంగానో అర్ధాంతరంగా జీవితాన్ని చాలించారు.

అంటార్కిటికాలో పరిశోధనలు చేస్తున్న ఆస్ట్రో ఫిజిస్ట్ డా. రాడ్నీ మార్చ్ (ఆస్ట్రేలియా మే 12, 2000), జీవాయుధాల మీద పరిశోధన చేసిన డేవిడే క్రిస్టోఫర్ కెల్లీ (17, జూలై 2001) హత్యకు గురయ్యారు. ఆంథ్రాక్స్ మీద పరిశోధనలు చేసిన డా. బెనితో క్యూ అనే శాస్త్రజ్ఞుడ్ని 12, నవంబర్, 2001 లో ధారుణంగా తుపాకితో కాల్చి చంపారు. ఆయన హెచ్.ఐ.వి మీద పరిశోధనలు చేసినందుకు ఈ హత్య జరిగింది. తిరిగి నవంబరు 16 న అవే పరిశోధనలు చేస్తున్న శాస్త్రజ్ఞుడు డా. డాన్ విల్లీ అదృశ్యమై, మిసిసిపి నదిలో ఆయన శవం దొరికింది. నవంబరు 23 న డా. వాల్టిమర్ సాశ్చనిక్ అనే రష్యన్ శాస్త్రజ్ఞుడు బ్రిటన్లో అనుమానస్పదంగా మరణించాడు. అదే సంవత్సరం డిసెంబరు 10 న డా. రాబర్ట్ ష్వార్జ్ వర్జీనియాలో హత్య చేయబడ్డాడు. ఆస్ట్రేలియాలో సెట్టాన్ న్యూగేన్ అనే శాస్త్రజ్ఞుడు డిసెంబరు 14 న ప్రయోగశాలలో ప్రమాదంలో మరణించాడు. 'ది ఎక్స్ ఫైల్స్' అనే హాలివుడ్ చలన చిత్రం యిదే కథాంశంతో నిర్మించారు.

2002 లో డా. తాన్యా హూచ్ మేయర్ అనే శాస్త్రజ్ఞురాలు కాల్చి చంపబడింది. దీని గురించి వివరాలు మాట్లాడరాదని ఆ ప్రయోగశాల అధికారులు ఉద్యోగులను ఆదేశించారు. జన్యుచిత్రాన్ని (Gene Mapping) తయారు చేస్తున్న రాబర్ట్ వెస్లీ బుర్గాఫ్ అనే శాస్త్రజ్ఞున్ని టెక్సాస్ లో 20 నవంబరు 2003 లో ఉద్దేశ పూర్వకం. ఆయన మీదకు వాహనం నడిపి చంపారు. మరో ఇద్దరు మైక్రోబయాలజిస్టులు డా. వాల్టీమర్ కొరుష్నోవ్, అలెగ్జీ బ్రష్ లింస్కీ వెంటవెంటనే హత్యకు గురయ్యారు. ఉచిత విద్యుత్తు కోసం పరిశోధనలు చేస్తున్న యూజిన్ మల్లోవ్ అనే శాస్త్రజ్ఞుడు . 2004లో అనుమానాస్పదంగా మరణించాడు. 2004 లో ములైన్ అనే న్యూక్లియర్ శాస్త్రజ్ఞుడు జూన్ 2004 లో అర్సెనిక్ విషం వలన మరణించాడు. పర్యావరణం మీద పరిశోధనలు చేస్తున్న డా. ఇయాన్ వాంగ్ఫోర్డ్ మ నేటికీ మిస్టరీగానే మిగిలింది. 2005 లో జియాంగ్ ఇమ్ అనే మాంసకృత్తుల మీద పరిశోధన చేసే శాస్త్రజ్ఞుడు మిస్సోరీలో హత్యకు గురియ్యాడు.

ఆర్కిటిక్ ప్రాంతంలో కరుగుతున్న మంచు మీద ప్రయోగాలు చేసిన శాస్త్రజ్ఞులు డా. తిమ్ బాయిడ్, సీమోర్ లాక్సన్, కేథరిన్ గైల్స్ లండన్లో ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా మరణించారు. భారతదేశంలో కూడా 2009 నుండి 2013 వరకు 11 మంది న్యూక్లియర్ సైంటిస్టులు అసహజ మరణం చెందారని అణుశాస్త్ర విభాగం (Department of Atomic Energy) ఇటీవల సమాచార హక్కు చట్టం కింద వెల్లడించింది.

ఏ సంసృతి అయినా ప్రశ్నను ఆహ్వానించి ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగితేనే ఆ సంస్కృతి వికసిస్తుంది. ప్రశ్నించిన వారిని మట్టుపెట్టి, నమ్మకాలను మాత్రమే విశ్వసించమని చెప్పే సంస్కృతిలో విజ్ఞానం వెనకంజవేస్తుంది. ప్రశ్నించే, తర్కించే గొంతుకలను సమర్ధించడం ప్రతి ఒక్కరి బాధ్యత. నేటి బాలబాలికలు, ఆ మాటకు వస్తే, మొత్తం పౌరసమాజం ప్రతి అంశాన్నీ ప్రశ్నించి, తర్కించుకుని పరిష్కార దిశగా పయనిస్తేనే దేశాభివృద్ధి జరుగుతుంది. ఈ దిశగా మన చెకుముకి పాఠకులు పయనిస్తారని ఆశిద్దాం.

ఆధారం: పైడిముక్కల ఆనంద్ కుమార్

3.00735294118
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు