పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఫుట్ బాల్ ప్రపంచ కప్

FIFA WORLD CUP 2014

july12నలుగురు ఒక చోట కలిస్తే సాధారణంగా మాట్లాడుకునే విషయాలు మూడు. 1. సినిమాలు 2. రాజకీయాలు 3. క్రీడలు (ముఖ్యంగా క్రికెట్). అదే విద్యార్థులైతే యివిగాక అప్పుడప్పుడూ తమ చదువులూ, తమ జీవనోపాధి (Career) మార్గాలూ చర్చించుకుంటారు.

ఈనాడు ప్రపంచమంతా క్రీడల్లో ఫుట్ బాల్ గురించే ఆసక్తిగా చర్చించుకుంటున్నది. బ్రెజిల్ లో ఎంతో అట్టహాసంగా జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ అందర్నీ ఆకర్షిస్తున్నది. ఈ ప్రపంచకప్ ని అంతర్జాతీయ ఫుట్ బాల్ ఫెడరేషన్ (Federation Internationale de Football Association - FIFA) నిర్వహిస్తున్నది.

చరిత్ర

july13ఫిఫా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంటు 1930 లో ప్రారంభమైంది. ప్రతి నాలుగేళ్ళకోసారి ఫిఫా సూచించిన దేశంలో దీన్ని నిర్వహిస్తారు. (1942, 1946 సంవత్సరాలలో రెండవ ప్రపంచయుద్ధం వలన ఈ టోర్నమెంట్ జరుగలేదు). మొదటి టోర్నమెంట్లో దేశాలు పాల్గొన్నాయి.

1982 నుండి ఈ టోర్నమెంటులో 24 దేశాలు పాల్గొనేవి. 1998 వ సంవత్సరం వచ్చేసరికి మొత్తం 32 దేశాలు పాల్గొనేలా సంఖ్యను పెంచారు. రాబోయే కాలంలో ఈ సంఖ్య 40 కి పెంచాలన్న యోచన ఫిఫాకి వుంది. 2018 లో రష్యాలోను, 2022 లో ఖతర్ లో ఈ పోటీలు జరుగుతాయి.

ప్రపంచ కప్

ఛాంపియన్ జట్టు గెల్చుకునే ఫిఫా కప్పు 368 సెం.మీ. ఎత్తు వుంటుంది. 18 కేరట్ బంగారంతో 6.175 కిలోల బరువుంటుంది. ప్రస్తుత కప్ పీఠం (Base) మీద 1974 నుండి ఈ కప్పు గెల్చుకున్న దేశాల పేర్లు లిఖించి వున్నాయి.

1930 నుండి 1970 వరకు ప్రపంచకప్ ని ‘జూల్స్ రిమెట్ కప్' అనిపిల్చారు. జూల్స్ రిమోట్ 1930 లో ఫిఫా అధ్యక్షుడు. అతనున్నప్పుడే ప్రపంచకప్ పోటీలు ప్రారంభమయ్యాయి. అతని గౌరవార్ధం దీనికి ఆయన పేరు పెట్టారు. ఈ కఫ్ ని ఫ్రెంచి శిల్పి 'ఏబెల్ లా ఫ్లయిర్' రూపొందించాడు. 1970లో బ్రెజిల్ ప్రపంచకప్ ని మూడోసారి గెలవటంతో ఈ కప్పుని శాశ్వతంగా బ్రెజిల్ కి బహుకరించారు. కాని 1983లో రియోడిజనరో పట్టణంలో వున్న ఈ కప్పుని దొంగలు దొంగిలించారు. ఆ తర్వాత దాని జాడలేదు. అంతకు ముందు 1966లో కూడా ఇంగ్లాండ్ లో దీన్ని ప్రదర్శించినప్పుడు దొంగలు ఎత్తుకెళ్లే ఇంగ్లాండ్ పోలీస్ శాఖ (స్కాట్లాండ్ యార్డ్) 'పికెల్స్' అనే కుక్క సాయంతో దాన్ని తిరిగి తెచ్చుకోగలిగారు. 1974 నుండి ఫుట్ బాల్ కొత్త ప్రపంచకప్ ని 'ఫిఫా ప్రపంచకప్' అని పిలుస్తున్నారు. దీనిని ఇటలీకి చెందిన శిల్పి 'సిల్వియో గాజానిగా' రూపొందించాడు.

అయితే ఛాంపియన్ జట్టుకు ఒరిజినల్ కప్ ను కాకుండా దాని ప్రతిరూపాన్ని ఇస్తారు.

స్త్రీల ప్రపంచకప్

ఫుట్ బాల్ క్రీడాకారిణులకు కూడా 1991 నుండి ఫిఫా ప్రపంచకప్ పోటీని నిర్వహిస్తున్నది. ఇది కూడా నాలుగేళ్ళకోసారి జరుగుతుంది. 2015లో కెనడాలో ఈ పోటీ నిర్వహిస్తారు. ఇదికాకుండా స్త్రీలకు అండర్-20 ప్రపంచకప్ ను ఈ సంవత్సరం నిర్వహిస్తారు.

ప్రపంచ కప్ లో పాల్గొనే దేశాల అర్హత

ఫిఫా ప్రపంచాన్ని ఆరు భాగాలుగా విభజించింది. ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర మధ్య అమెరికాలు, ఓషియానియా, దక్షిణ అమెరికా (లాటిన్ అమెరికా). ఇందులో ఆసియా విభాగంలోనే ఆస్ట్రేలియా కూడా వుంది. ఓషియానియా విభాగంలో న్యూజిలాండ్, తాహితి, సమోవా లాంటి అనేక ద్వీపాలు వున్నాయి. ప్రపంచకప్ లో అర్హత పొందడానికి సుమారు 200లకు పైగా దేశాలు పోటీపడ్డాయి. వివిధ టోర్నమెంట్లలో గెలుపు ద్వారా 31 దేశాలు + అతిథ్య దేశం ప్రపంచకప్ లో పాల్గొంటాయి.

ఈసారి ఓషియానియా గ్రూప్ నుండి ఒక్క దేశమూ అర్హత పొందలేదు. ఈసారి పాల్గొన్న దేశాలు ఆఫ్రికా నుండి అల్జీరియా కేమరూన్, ఐవరీకోస్ట్, ఘనా, నైజీరియా - ఆసియా నుండి ఆస్ట్రేలియా, ఇరాక్, జపాన్, కొరియా రిపబ్లిక్ (దక్షిణ కొరియా) - యూరప్ నుండి బెల్జియం, బోస్నియా మరియు హెర్జగోలినా, క్రోయేషియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, రష్యా, స్పెయిన్, స్విట్జర్లాండ్ - ఉత్తర మధ్య అమెరికాల నుండి కోస్టారికా, హెూండురాస్, మెక్సికో, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దక్షిణ అమెరికా నుండి అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, యూకెడార్, ఉరుగ్వే దేశాలు అర్హత సంపాదించాయి. వీటిని ఎనిమిది గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ లో 4 దేశాలుంటాయి. గ్రూప్ లో ఒక దేశం మిగతా 3 దేశాలతో తప్పనిసరిగా ఒక మ్యాచ్ ఆడాలి. గ్రూప్ లో లభించిన పాయింట్ల ఆధారంగా ప్రతి గ్రూప్ లోని మొదటి రెండు స్థానాల్లో వున్న దేశాలు ప్రీ క్వార్టర్ ఫైనల్ ఆడతాయి. ఇక్కడ నుండి ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఒకదానితో ఒకటి తలపడిన జట్లలో ఓడిపోయిన జట టోర్నమెంటు నుండి నిష్క్రమిస్తుంది.

జూన్ 12 నుండి జులై 13 వరకు మొత్తం 64 మ్యాచులు ప్రపంచకప్లో జరుగుతాయి.

ప్రపంచకప్ లో ఆసక్తికర అంశాలు

  1. అర్జెంటీ నా ఆటగాడు 'ఏంజిల్ డి మారియా’ చిన్నతనంలో అధిక శక్తి (హైపర్ ఆక్టిలిటీ) కలిగి వుండేవాడు. దానితో అతని డాక్టర్ అతడికి ఫుట్ బాల్ లో శిక్షణ ఇప్పించమని తల్లిదండ్రులకు సూచించాడు.
  2. సాధారణంగా ఆటలాడితే చదువు మూలపడుతుందని తల్లిదండ్రులంటారు. కాని బెల్జియం ఆటగాడు ‘విన్సెంట్ కంపనీ' తన తల్లితండ్రులు చదువు విషయంలో కూడా ప్రోత్సహించడం వలన ఎంత ఆట ఆడి ఇంటికి చేరినా తన చదువుని నిర్లక్ష్యం చేయలేదని గర్వంగా చెప్తాడు.
  3. జర్మనీ ఆటగాడు 'మేరియా గొమెట్టె' కి ఒక కోరిక వుంది. జర్మన్ భాషలో 'గోమెట్జె' అంటే 'ఆరాధ్యుడు' అని అర్థం. తన దేశాన్ని గెలిపించడం ద్వారా తను సార్థక నామధేయుడు కావాలని అతడి ఆశ.
  4. 'లూయిస్ సౌరెజ్' ఉరుగ్వే ఆటగాడు. ఉరుగ్వే ఇటలీతో తలపడినప్పుడు 'గియోర్గియో చిల్లిని' అనే ఆటగాడి భుజం కొరికాడు. దానితో అతడ్ని వెంటనే నాలుగు నెలలు ఫుట్ బాల్ ఆడకుండా నిషేధించడమే కాకుండా ఇప్పటి నుండి తొమ్మిది అంతర్జాతీయ మ్యాచుల్లో అతడు ఆడటానికి వీల్లేదని ఫిఫా ఆదేశాలు జారీ చేసింది. ఇది సౌరెజ్ కి చాలా కఠినమైన శిక్ష అనీ, ఇంత శిక్ష విధించకుండా వుండాల్సింద'ని చిల్లిని అన్నాడు. ఈ సంఘటన ఆధారంగా నెదర్లాండ్స్ కి చెందిన 'ఆక్టుంగ్' అనే యువకుడు ఒక వీడియోగేమ్ ని రూపొందించి సొమ్ముచేసుకుంటున్నాడు.
  5. కొలంబియా గోల్ కీపర్ ‘ఫరీద్ మోన్ డ్రాగన్' ఇంతవరకు ప్రపంచకప్ లో ఆడిన అతి పెద్ద వయసున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. జపాన్ తో కొలంబియా ఆడుతున్నప్పుడు కొలంబియా 3-1 గోల్స్ తో ముందంజలో ఉండగా చివరి ఐదు నిమిషాల్లో అతడ్ని గోల్ పోస్ట్ లోకి కోచ్ జోన్ ‘పెర్క్ మాన్’ అనుమతించాడు. ఫరీద్ వయస్సు 43 సంవత్సరాల 3 రోజులు. అంతకు ముందు సంవత్సరాలలో కేమరూన్ కి చెందిన ‘రోజర్మిల్లా’ 42 సంవత్సరాల 39 రోజుల వయస్సులో వరల్డ్ కప్ లో ఆడాడు.
  6. ఇంతవరకు ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లల్లో రొనాల్డో (బ్రెజిల్) 15 గోల్ఫ్ చేశాడు. ఈ గోల్స్ 1998, 2002, 2006లో అతడు సాధించాడు. ఇప్పుడతను ఆడటంలేదు. ఈ వరల్డ్ కప్ లో ఆడుతున్న జర్మన్ ఆటగాడు మిరోస్లావ్ క్లోజ్ (వయస్సు 36 సం.లు) ఘనాతో జరిగిన మ్యాచ్ లో ఒక గోల్ కొట్టడం ద్వారా 15 గోల్స్ చేసిన రెండవ ఆటగాడు అయ్యాడు. అయితే రోనాల్డో అతనిని మనస్పూర్తిగా అభినందించాడు.
  7. బ్రెజిలియన్ ఆటగాడు హల్క్ గోల్ కొట్టిన తర్వాత 'మేకరేనా' అనే సంగీతానికి నృత్యం చేశాడు. దీనికి ప్రేక్షకులందరూ కరతాళధ్వనులు చేశారు.
  8. ఐవరీకోస్ట్ ఆటగాడు 'గెర్వినీ హెూ' జుత్తు కత్తిరించుకునే శైలిని బట్టి అతడికి 'ది కర్టెన్' అని పేరు పెట్టారు.
  9. అర్జెంటీనాకి చెందిన లియోనెల్ మెస్సీ, బ్రెజిల్ కి చెందిన నేమర్, జర్మనీకి చెందిన థామస్ మిల్లర్ లను. నేటి ఫుట్ బాల్ ఆటకు త్రిమూర్తులని పిలుస్తారు. ప్రస్తుతం వీరు ముగ్గురూ పోటీల్లో నాలుగు చొప్పున గోల్స్ చేశారు. జేమ్స్ రోడ్రిగ్వే (కొలంబియా) ఆటగాడు 5 గోల్స్ చేసి ముందంజలో ఉన్నాడు.
  10. యు.ఎన్.ఏ కు ఆడుతున్న జెర్మన్ జోన్స్ జర్మనీలో పుట్టాడు. అంతేగాక ఈ 22 ఏళ్ల ఆటగాడు జర్మనీకి 2008 లో ప్రాతినిధ్యం వహించాడు కూడా (ప్రపంచకప్ లో కాదు). ప్రపంచకప్ లో జర్మనీ, అమెరికాల జాతీయగీతాలు విన్నప్పుడు నా మనస్సు ఎంతో సంతోషిస్తుంది' అంటాడు.

అవార్డులు

ప్రపంచకప్ లో ఫిఫా కప్ తో పాటుగా ఇతర బహుమతులు కూడా ఇస్తారు. అవి.

  1. పోటీల్లో అత్యుత్తమ ఆటగాడికి బంగారు బంతి (గోల్డెన్ బాల్) అవార్డు.
  2. ప్రస్తుత పోటీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికిచ్చే బంగారు బూటు (గోల్డెన్ బూట్) అవార్డు.
  3. అత్యుత్తమ గోల్ కీపర్ కి గోల్డెన్ గ్లవ్ అవార్డు.
  4. ఈ పోటీల్లో చిన్న వయస్కుడిగా ప్రతిభ ప్రదర్శించిన ఆటగాడికి యువ ఆటగాడు (యంగ్ ప్లేయర్ ) అవార్డు. అయితే ఆటగాడు జనవరి 1, 1993 ముందు జన్మించి ఉండకూడదు.
  5. క్రమశిక్షణతో ఆడిన జట్టుకి ఫెయిర్ ప్లే అవార్డు.

భారతదేశం పరిస్థితి

ఇండియా ఇప్పటివరకూ ప్రపంచకప్ లో ఆడలేదు. కాని 1948 లండన్ ఒలింపిక్స్ లో, 1952లో హెల్సింకీ ఒలింపిక్స్ లో, 1956 లో మెల్ బోర్న్ ఒలింపిక్స్ లో పాల్గొంది. రోవర్స్ కప్, డ్యూరాండ్ కప్ నిజాం గోల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక కప్ లు మనదేశంలో ఫుట్ బాల్ ఆటకు ప్రసిద్ధికెక్కాయి. రహీంలీగ్ అనీ, డివిజన్ లీగ్ అనీ హైద్రాబాద్ లో ఫుట్ బాల్ పోటీలు జరిగేవి. కాని ప్రస్తుతం స్కూల్ స్థాయి పోటీలు నిర్వహించే స్థితిలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలూ లేవు. ఇదెంతో బాధాకరం.

ఆరోగ్యం

శారీరక, మానసిక, సామాజిక స్థాయిల్లో ఉల్లాసంగా ఉండడమే ఆరోగ్యం అని అంటారు. శారీరక ఉల్లాసానికి ఆటలెంతో ముఖ్యం. ఎక్కువ మంది బాలబాలికలు మైదానంలోకి వెళ్లి ఆడే ఆటల్ని పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతం ప్రపంచకప్ లో ఆడిన రష్యా ఆటగాడు అలెగ్జాండర్ కోకోరిన్ బాలబాలికలు గాడ్జెట్ల మీద, మొబైల్ గేమ్స్ మీదా, కంప్యూటర్ దగ్గరా తమ సమయాన్ని వినియోగించి తగిన శారీరక శ్రమలేకుండా చేసుకుంటున్నారని వాపోయాడు. ఇది ఎంతో నిజం.

ఆటల్లో రారాజు ఫుట్ బాల్. దీనికి అమెరికన్లు 'సాకర్' పేరు పెట్టారు. పేరేదైనా యువతీయువకుల్ని శక్తిమంతంగా తీర్చే ఆట. ఇది. ఈ సంచికను మీరు చదివేటప్పటికి కొత్త ప్రపంచకప్ ఫుట్ బాల్ ఛాంపియన్ ఎవరో మీకు తెలిసిపోయుంటుంది.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థుల్లో దృక్పథం మారి ఆటలను తగిన విధంగా ఆదరించి బాలబాలికలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిద్దాం!

ఆధారం: పైడిముక్కల ఆనంద్ కుమార్

2.99689440994
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు