పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మేడి పండు చూడ...

పైకి ఆరోగ్యంగా, అందంగా కన్పించే పండ్లలో వినాశకర కీటకాలను చొప్పించాడు భగవంతుడు.

మా అమ్మ వంకాయలు కోస్తూ ఏమిటండీ అన్నీ పుచ్చు వంకాయలు తెచ్చారు. కాస్త చూసి తెచ్చుకోవద్దా అని మా నాన్నతో అనటం మా నాన్న అందుకు ఒకింత నొచ్చుకొని సమాధానం ఇవ్వటం నిన్ననే మా ఇంట్లో జరిగింది. నేనేం చేయను పైకి చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. లోపల ఉన్న పురుగును పసి గట్టడానికి నేనేమీ వేమనను కాను నా దగ్గరేమి అతీత శక్తులు లేవు. అని వివరణ ఇచ్చుకున్నాడు నాన్న.

మేడి పండు చూడ మేలిమైయుండును పొట్టవిప్పి చూడ పురుగులుండు... ఈ వేమన పద్యం మీకు తెలిసిందే. కానీ ఈ మేడిపండులోకి పురుగులెలా వచ్చాయి. ఒక్క మేడి పండేమిటి చాలా రకాల కూరగాయలు, పండ్లు పైకి చూడ్డానికి బాగానే కన్పిస్తాయి. ఇదెలా సాధ్యం? మా మిత్రుడొకడు వేమన పద్యం చదివి, ఎంత గొప్ప సృష్టో కదా, పైకి ఆరోగ్యంగా, అందంగా కన్పించే పండ్లలో వినాశకర కీటకాలను చొప్పించాడు భగవంతుడు. చిత్ర, విచిత్రాల సృష్టి, దీని తెల్సుకోవడం ఎవరి తరం... అంటూ మెట్ట వేదాంతంలోకి పోయాడు. నిజమే దీని రహస్యాన్ని ఛేదించడం మా క్లాసులో ఎవరికీ సాధ్యం కాలేదు. మా మిత్రుడు చెప్పినట్లు ఎవరికీ అర్ధం అయ్యేది కాదన్నట్లు నిర్దారించికుని మిన్నకుండిపోయాం. కాని ఎక్కడో మాష్టారు చెప్పిన మాటలు మెదడు ఆలోచనలను జిలకొట్టి మరింత కలత చెందటానికి కారణం అయ్యాయి. మానవుడు సాధించలేనిదంటూ ఏమి లేదనేది మా మాష్టారి మాట. మరయితే మనం నిత్యం చూసే ఈ మేడిపండు మాటేమిటి?

మా సందేహ నివృత్తికి ఎప్పటిలాగే సైన్సు మాష్టార్ని ఆశ్రయించాం. మాష్టారు మమల్ని చెకుముకి టాలెంట్ టెస్ట్ సందర్భంగా ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తలతో ముఖాముఖికి తీసుకపోయాడు. మా సందేహాన్ని అక్కడకు వచ్చిన వృక్ష శాస్త్రవేత్తలతో చెప్పాం. ఆయన కూడా మా మాష్టారి లాగే మానవుడు ఛేదించలేని రహస్యం అంటూ ఏదీ లేదు. ఇవ్వాళ కాకపోతే రేపు ఏదో ఒక రోజు తప్పక తెల్సుకొని తీరుతాం అని చెప్పాడు. మనం ఎంచుకునే మార్గంలో ఒక క్రమ పద్దతి శాస్త్రీయంగా ఉంటే గమ్యం చేరటం ఖాయం అన్నారు. పండ్లు, కాయగురల్లో కీటకాలుండడంపై వివరణ చెప్పారు. దీన్ని తెల్సుకోవాలంటే మనకు పురుగుల జీవిత చరిత్ర, మొక్కల జీవిత చరిత్ర తెలిసి ఉండాలి. కీటకాలు తమ జీవిత కాలంలో రకరకాల దశలను దాటి సీతాకోకచిలుకలు వస్తాయి. ఇక పోతే పుష్పించే మొక్కల్లో ప్రతి పుష్పం సాధారణంగా స్త్రీ, పురుష భాగాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా రక్షక, ఆకర్షక పత్రాలు కూడా వుంటాయి.

సరే, ఇప్పుడు చెప్పండి పువ్వు నుండి ఫలము లేదా కాయ ఎలా ఏర్పడుతుంది? ఫలదీకరణ జరగటం వలన కదా. సాధారణంగా పరపరాగ సంపర్కం ద్వారా పరాగరేణువులు కీలాగ్రానని చేరుకుని అక్కణ్ణుంచి కీలము ద్వారా అండాశయాన్ని చేరుకుంటాయి. అక్కడ ఫలదీకరణం జరిగి అండం పిండంగా మారి ఫలంగా అభివృద్ధి చెందుతుంది. పరపరాగ సంపర్కంలో కీటకాలు బాగా తోడ్పడతాయి కదా. ఈ క్రమంలో కొన్ని రకాల కీటకాలు తమ గుడ్లను అండాశయంపై వదులుతాయి. అవి అక్కడే ఉండి ఫలదీకరణ తర్వాత ఫలం అభివృద్ది చెందేటప్పుడు గుడ్డు కాస్త గొంగళి పురుగు గా రూపాంతరం చెందుతుంది. అందుకే మనకు లం లోపల వున్న కీటకం కన్పించదు. లోపలనే ఉండి ఫలాన్ని ఆహారంగా తీసుకుని తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదీ పండులో చేరిన పురుగుల కథ. ఫలం ఏర్పడక ముందే పువ్వుదశలోనే కీటకాలు గ్రుడ్లు పెట్టడం వలన ఫలం లోపల పురుగులు పెరుగుతాయి. ఇలా మనం ఒక పద్ధతి ప్రకారం విశ్లేషించితే ఏ విషయాన్నైనా సరిగ్గా అర్ధం చేసుకోగలం. దీన్నే శాస్త్రీయ పద్ధతి లేదా అవగాహన అంటాం.

ఆధారం: కట్టా సత్య ప్రసాద్

2.97950819672
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు