హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ఇస్రో కీర్తి కిరీటంలో మరో కిలికితురాయి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇస్రో కీర్తి కిరీటంలో మరో కిలికితురాయి

ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా PSLV - C34XL విజయం నమోదైంది.

june272016 జూన్ 22, బుధవారం ఉదయం 9.25 నిమిషాలు శ్రీహరి కోట షార్ కేంద్రంలోని మాస్టర్ కంట్రోల్ రూంలో అతిథులు, ప్రజలు, మీడియా ... అందరిలోనూ ఒకటే ఉత్కంఠ .... 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, 1, 2, 3, 4, 5, ..... అంటుండగానే ఒక్కసారిగా రెండో లాంచ్ ప్యాడ్ నుంచి PSLV - C34XL రోధసి వాహక నౌక నిప్పులు చిమ్ముకుంటూ, ఒకే అడుగు ముందుకేసూ ఆకాశం వైపు గర్వంగా దూసుకుపోతూ మొత్తం 26 నిమిషాల్లో 20 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ప్రయోగం విజయవంతం అంతే... హర్షధ్వానాలు మిన్నంటాయి. షార్ అంతటా సంబరాలు అంబరాన్ని అంటాయి. పరస్పర అభినందనల పరంపర కొనసాగింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా ఈ విజయం నమోదైంది.

ఇదొక అద్భుత విజయం. భారతీయ అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో ముందడుగు. ఒకే ప్రయోగంలో ఒకే రాకెట్తో 10 ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశ పెట్టడం ద్వారా రికార్డు విజయాన్ని నమోదు చేసుకున్న ఇస్రో, తన రికార్డులను తానే తిరగరాస్తూ జూన్ 22న ఒకేసారి ఒకే రాకెట్ తో 20 ఉపగ్రహాలను వేరు వేరు భూకక్ష్యలలోకి ప్రవేశ పెట్టి అంతర్జాతీయంగా అమెరికా, రష్యాల తరువాత 3వ స్థానాన్ని పదిలం చేసుకున్నది. 2014 లో రష్యా ఒకే రాకెట్తో 37 ఉపగ్రహాలను ప్రవేశ పెట్టి మొదటి స్థానంలో ఉన్నది. 2013 లో అమెరికా ఒకే రాకెట్ ద్వారా 29 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలలోకి ప్రవేశ పెట్టి రెండవ స్థానంలో ఉండగా బుధవారం ప్రయోగంతో భారతదేశం ఆ రెండు దేశాల సరసన సగర్వంగా నిలిచింది.

ఒకే ప్రయోగం - రెండు ప్రయోజనాలు:

ఒకే ప్రయోగం ద్వారా భిన్న ఫలితాలు సాధించాలని ఆశించి చేసిన బుధవారం ప్రయోగం నూటికి నూరుపాళ్ళు విజయవంతమైంది. ఒకేసారి ఒకే రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను పంపడం ఒక ప్రయోజనమైతే, వాటిలో కొన్ని ఉపగ్రహాలను వివిధ కక్ష్యలలోకి ప్రవేశపెట్టడం మరో ప్రయోజనం. ఇస్రో శాస్త్రవేత్తల కృషిలో ఇదో అద్భుత మలుపు.

PSLV రాకెట్లు నాలుగు దశలుగా పని చేస్తాయి. మొదటి మూడు దశలలో రాకెట్లు ఉపగ్రహాలను నిర్ణీత ఎత్తుకు చేరుస్తాయి. నాలుగో దశలోని ఇంజను ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేరవేస్తుంది. ఇప్పటివరకు ఈ పద్ధతిలో ఉపగ్రహాలన్నింటిని ఒకే కక్ష్యలోకి చేరవేస్తుండేవారు. అయితే ఈ సారి 20 ఉపగ్రహాలతో ఉన్న రాకెట్ 514 కి.మీ ఎత్తుకు చేరుకోగానే నాలుగో దశ ఇంజనీను పని చేయించటం ప్రారంభించి 7 నిమిషాలలో మిగిలిన 12 ఉపగ్రహాలను విడిచిపెట్టి సాహస క్రీడలో పూర్తి విజయాన్ని సాధించారు.

బీస్మార్:

ఈ ప్రయోగంలో పంపిన 20 ఉపగ్రహాలలో మూడు స్వదేశీ ఉపగ్రహాలు కాగా మిగిలిన 17 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి. మూడు స్వదేశీ ఉపగ్రహాలలో ఒకటి కార్టోసాట్-2C, దీని బరువు 727.5 కిలోలు. ఇదే ప్రధాన పేలోడ్.

కార్టొశాట్ - 2C:

గతంలో పంపిన కార్టోశాట్ - 2, 24, 2B ఉపగ్రహాలకు కొనసాగింపే ఈ కార్టోశాట్ - 2C. దీనియందు మరింత ఆధునీకరించి 0. 65 మీటర్ల కచ్చితత్వంతో పని చేసే కెమెరాలు అమర్చారు. june28ఈ ఉపగ్రహ ఖర్చు 350 కోట్ల రూపాయలు. ఇది 5 సం. ల పాటు సేవలను అందిస్తుంది. ఇది సైనిక అవసరాల కొరకే కాకుండా ప్రకృతి విపత్తుల సమయాలలో సేవలందిస్తుంది. విపత్తుల విస్తృతిని అంచనా వేయడానికి, సహాయచర్యలు గైకొనడానికి వీలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. ఏదైనా ప్రాంతం దాని చుట్టూ ప్రక్కట ఉండే ప్రాంత ఉష్ణోగ్రతలు తెలియ జేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రణాళికలకు, తీర ప్రాంత నిర్వహణకు, రహదారులు, నెట్వర్క్ పరిశీలనకు, నీటి సరఫరా పై అధ్యయానికి, భూ వినియోగ తీరుపై మ్యాపులు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే భూసంబంధ సమాచార వ్యవస్థ (LIS), భౌగోళిక సంబంధ సమాచార వ్యవస్థ (GIS)ల అనువర్తనాల కొరకు ఉపయోగపడుతుంది.

మిగిలిన రెండు దేశీయ ఉపగ్రహాలు ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు రూపొందించారు. ఒకటి 1.5 కిలోల 'సత్యభామ శాట్' ఇది తమిళనాడు రాష్ట్రానికి చెందిన సత్యభామ విశ్వవిద్యాలయ విద్యార్థులు వాతావరణంలో హరిత గృహ వాయువుల గాఢత తెలుసుకోడానికి రూపొందించారు. రెండవది పూణే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఒక కిలో 'స్వయం'. ఇది హ్యామ్ (HAM) వినియోగదారుల అవసరాల కొరకు రూపొందించారు.

17 విదేశీ ఉపగ్రహాలలో కెనడాకు చెందిన M3MSAT(85Kg), GHGSAT – D (25.5kg), ఇండోనేషియాకు చెందిన లపాన్ - A3(120Kg), జర్మనీకి చెందిన BIROS (130kg), అమెరికాకు చెందిన స్కైశాట్ - 2(110Kg), డోవ్ శ్రేణికి చెందిన 12 (ఒక్కోటి 4.7 Kg) ఉపగ్రహాలు.

రేసుగుర్రం:

ఇస్రో నమ్మినబంటు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (PSLV). ఇది ఇస్రో శాస్త్రవేత్తల నమ్మకాన్ని ఏనాడు వమ్ముచేయలేదు. PSLV - ద్వారా ఇప్పటివరకు 36 ప్రయోగాలు జరిపితే అందులో 35 ప్రయోగాలు విజయవంతమైనాయి. బుధవారం జరిపిన ప్రయోగం 36వది. PSLV - C34 అనేది XL శ్రేణిలో నాలుగోది. ఒక్కో PSLV నిర్మాణానికి 100 నుంచి 120 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. 44.4 మీటర్ల పొడవుండే PSLV బరువు 320 టన్నులు.

PSLV ని ఉపయోగించి ఇప్పటివరకు 20 దేశాలకు చెందిన మొత్తం 74 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందుచున్న దేశాలే కాకుండా అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా మన PSLV ని ఉపయోగించుకుంటున్నాయి. కారణం 60% తక్కువ ధరకే ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడ్తున్నారు. ఏటా రోదసిలోకి ప్రవేశ పెట్టే ఉపగ్రహాల సంఖ్య రెట్టింపు అవుతూపోతున్నది. రాబోయే కాలంలో రాకెట్ ప్రయోగాల సంఖ్యను ప్రస్తుతమున్న ఆరు నుంచి మరింతగా పెంచుకోవాల్సిన అవసరముంది. దీని ద్వారా భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. భారీ ఉపగ్రహాలను, భూస్థావర ఉపగ్రహాలను కక్ష్యలలో ప్రవేశపెట్టాలంటే PSLV రాకెట్ ఉపయోగకరం కాదు. GSLV శ్రేణి రాకెట్ల ద్వారానే సాధ్యం. 5000 కిలోల వరకు పేలోడ్స్ GSLV తీసుకెళ్తుంది. అందువలన GSLV ని మరింత అభివృద్ధి చేసుకునే దిశలో ఇస్రో అడుగులు వేయాలి. ఏది ఏమైనా PSLV మన ఇస్రో యొక్క రేసుగుర్రం అనడంలో అతిశయోక్తి లేదు.

1960లో బుడి బుడి అడుగులతో మొదలు పెట్టి 1962 లో తుంబా రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి అడు పెట్టిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కార్యక్రమాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అభివృద్ది చెందుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, శాస్త్రీయ ప్రయోజనాలకు రోధసిని సద్వినియోగం చేసుకుంటూ, కమ్యూనికేషన్లు, టెలివిజన్ ప్రసారాలు, వాతావరణ పరిశోధన, ఆహారోత్పత్తి, విద్య, పారిశ్రామిక ప్రగతి, సహజ వనరుల వినియోగం, పర్యావరణ నిఘా, నౌకా చోదన, రవాణా, వైద్యం, రక్షణ తదితర రంగాల్లో మన కార్యక్రమాలకు ఊతమిస్తున్నది. సొంతంగా తయారు చేసిన ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టగలిగే ఆరు దేశాల్లో ఒకటిగా, GSLV శ్రేణి రాకెట్ ప్రయోగాల్లో ఆరితేరిన నాలుగు దేశాల్లో ఒకటిగా భారత్ నేడు సగర్వంగా నిలుస్తున్నది. ఇస్రో శాస్త్రవేత్తలకు హాట్సాఫ్, జయహో భారత్.

ఆధారం: షేక్ గౌస్ భాష

3.00586510264
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు