పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వడగండ్ల వాన... కడగండ్ల వాన

వడగండ్ల వాన గురించి తెలుసుకుందాం.

oct14“వానల్లు కురవాలి వానదేవుడా... వరిచేలు పండాలి వానదేవుడా...” అని చిన్నప్పుడు బడిలో పాటలు పాడుతూ ఆడుకున్నాం గుర్తుందా. “ఆకాశంలో హరివిల్లు విరిస్తే అవి మీకేయని ఆనందించే పిల్లల్లారా...” అని కవి వ్రాశాడు మీ గురించే. అప్పుడప్పుడు ఉరుములు.. మెరుపులు... గాలి... వాన భీభత్సంగా వర్షం వస్తుంది కదా. ఎప్పుడైనా వానతో పాటు చిన్న చిన్న మంచు రాళ్లు కూడా పడుతాయి కదా... ఆ అవే... వడగండ్లు (Hail Stones). ఈ వాననే వడగండ్ల వాన అంటారు. ఈ వడగళ్ల వాన మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ పడదు కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పడుతుంది. ఈ మంచురాళ్ల వాన గురించి మనం తెలుసుకుందామా...

భూమి పై ఆవిరైన నీరు ఆకాశంలో చేరి మేఘాలలో వుంటుంది కదా. వాతావరణం చల్లబడితే మేఘాలు వర్షిస్తాయని మీకు తెలుసుకదా. అలాగే బలమైన తుఫాను మేఘాలు (క్యుములోనింబస్)ల వల్ల ఈ వడగళ్ల వాన వస్తుంది. క్యుములోనింబస్ మేఘాలలో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. ఈ మేఘాలు చాలా ఎత్తులో ఉంటాయి. అందులో నీటి తుంపరలు (Water Droplets) ఎక్కువగా ఉంటాయి. భూమి పై చెట్ల వల్ల చల్లగాలి వీచి వాతావరణం చల్లబడినప్పుడు ఈ మేఘాలు కూడా చల్లబడతాయి. దీని వల్ల మేఘాలలోని నీటి తుంపరలు కూడా చల్లబడి గడ్డ కట్టుతాయి. ఈ చిన్న మంచు రేణువులు కింద పడేటప్పుడు గాలి ఒత్తిడికి గురై అవి కలిసిపోయి వడగళ్లుగా మారుతాయి.

ఇంకా వివరంగా చెప్పాలంటే ఘనీభవించిన నీటి తుంపరలు గాలి ఊర్థ్య పీడనం వల్ల దగ్గర దగ్గరగా చేరి చిన్న మంచురాయిగా ఏర్పడుతుంది. కానీ గాలిపీడనం వల్ల ఈ చిన్నరాయి మేఘం గుండా పైకి ప్రయాణిస్తుంది. (గాలి వేగం 180 కి.మీ./గం. కంటే ఎక్కువ ఉండాలి). అలా వెళ్లేటప్పుడు ఇతర చిన్న చిన్న మంచురాళ్లను తాకి ఆకర్షించి, కాస్త పెద్దరాయిగా మారుతూ పోతుంది. అలా మారేటప్పుడు గుప్తోష్ణము (Latent heat) విడుదల అయి మంచురాయి వెలుపలికి చేరుతుంది. దీని వల్ల మంచురాయి ఉపరితలం కాస్త ద్రవరూపంలో వుండి బంక బంకగా తయారవుతుంది. దీని వల్ల ఇంకా కొన్ని చిన్న చిన్న మంచురాళ్లు వచ్చి ఈ పెద్ద మంచురాయికి అంటుకుపోతుంది. అందుకే వడగళ్లు రకరకాల ఆకారాలలో సైజులలో ఉంటాయి.

oct15గాలి ఊర్థపీడనం వల్ల మంచురాయి మేఘంలో పైకి పోతూ పై విధంగా చాలా చిన్న చిన్న మంచురాళ్లను కలుపుకుంటూ పెద్ద మంచురాయిగా ఏర్పడుతుంది. అప్పుడు దాని బరువు పెరుగుతూ పోతుంది. దాని భారం వల్ల భూమ్యాకర్షణ పెరుగుతుంది. గాలి ఊర్థ్వపీడనం కంటే రాయి పై భూమ్యాకర్షణ పెరిగినప్పుడు మంచురాయి క్రిందకు పడడం మొదలవుతుంది. పైన చెప్పిన మొత్తం ప్రక్రియ జరగడానికి 30 ని. పడుతుంది. దాదాపు భూమికి 4 నుంచి 10 కి.మీ. ఎత్తులో ఇది జరుగుతుంది. ఇలా చాలా రాళ్లు మేఘాలలో ఏర్పడి కిందకు పడుతాయి. ఇదే వడగండ్ల వాన.

ఈ వడగండ్ల వ్యాసము 5 మిల్లీ మీటర్ల నుండి 15 సెంటీ మీటర్ల దాకా వుంటుంది. పెద్ద వడగండ్ల బరువు 500 గ్రాముల వరకు వుంటుంది. వడగండ్లు ఏర్పడేటప్పుడు మంచు రాళ్లు పొరలు పొరలుగా తెల్లగా, పారదర్శకంగా ఏర్పడి రాయిగా మారుతాయి. అంటే ఉల్లిపాయ (ఎర్రగడ్డ) పొరలులాగ అన్నమాట.

పర్వత ప్రాంతాలలో ఈ వడగండ్ల వాన ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే పర్వతాల అడ్డు వల్ల వీచేగాలి నిలువుగా ఆకాశంవైపు మళ్లి మేఘాలపై ఊర్థ్వ పీడనాన్ని కలుగజేస్తాయి. మంచురాళ్లు ఏర్పడి క్రిందకు పడేటప్పుడు పర్వతం ఎత్తు వల్ల రాయి ప్రయాణించే దూరం తగ్గి రాళ్లు కరగక ముందే భూమిని చేరుతుంది. అందుకే దక్షిణ భారతం కంటే ఉత్తర భారతంలో ఈ వడగళ్ల వాన ఎక్కువ.

వడగళ్ల వాన వల్ల చాలా నష్టాలున్నాయి. ఈ రాళ్లు పడినప్పుడు ఆస్తినష్టం, ప్రాణనష్టం జరుగుతుంది. చాలా వేగంగా ఈ రాళ్లు భూమిని చేరినప్పుడు (గురుత్వాకర్షణ 9.8 మీ/సె2) చాలా బలంతో నేలను, నేల మీద ఉన్న వస్తువులను తాకుతాయి. దీని వల్ల ఇళ్ళ పైకప్పులు, వాహనాలు, పొలాల్లో పంటలు దెబ్బతింటాయి. మేకలు, గొర్రెలు, పశువులు చనిపోతాయి. ఒక్కోసారి మనుషులు కూడా చనిపోతారు.

9వ శతాబ్దంలో రూప్కుండ ప్రాంతంలో కురిసిన వడగండ్ల వాన వలన కొన్ని వందల మంది మనుషులు చనిపోయారు.

ఏప్రిల్ 30, 1888 రోజున ఉత్తరప్రదేశే లో కురిసిన విపరీతమైన వడగండ్ల వాన వల్ల 230 మంది మనుషులు చనిపోయారు. ఒక్కొక్క మంచురాయి బతాయి పండు సైజులో కురిసింది. భూమిపై రెండు అడుగుల మేర ఈ రాళ్లు పేరుకుపోయాయని చరిత్ర చెబుతుంది. వేలాది ఎకరాల పంట భూములు దెబ్బతిన్నాయి. దీని వల్ల వ్యవసాయదారులు చాలా నష్టపోయారు. అందుకే వడగండ్లు... కడగండ్లు అంటారు.

ఆధునిక కాలంలో ఈ వడగండ్ల వాన రాక ముందుగానే పసిగట్టవచ్చు. దీనికై RADAR వ్యవస్థ ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త వల్ల నష్టాన్ని నివారించవచ్చు. చూసారా... వడగండ్ల కడగండ్లు..

ఆధారం: పలమనేరు యుగంధర్ బాబు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు