অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చిట్టి చిట్టి సైంటిస్టూ! DNA ను చూద్దామా !

చిట్టి చిట్టి సైంటిస్టూ! DNA ను చూద్దామా !

300.jpgప్రియమైన బాల సైంటిస్టులు మీ చిట్టి చిట్టి చేతుల్తో గొప్ప గొప్ప ప్రయోగాలు చేస్తారా ? మీకు తెలుసా... DNA అనేది జీవానికి మూలమని, DNA లేదా డీ ఆక్సీడై బోన్యూక్లిక్ ఆమ్లం (Depxyribo Nucleic Acid) ప్రతి జీవకణంలోనూ ఉంటుందని, ఇది జీవకణంలోపల ఉండే కేంద్రకంలోని క్రోమోజోముల్లో నిల్వ ఉంటుంది. ఎప్పుడూ తనను తాను తయారుచేసుకొంటూ ఉంటుంది. ఇలా తనను పోలిన మరొక అణువును తయారు చేసుకొనే లక్షణం ఉండడం కేవలం DNAసాధ్యం. 301.jpgఅందువల్ల జీవులు ఎదుగుతున్నాయి. పలు రకాల రూపాల్లోకి మారుతున్నాయి. మన మానవుని శరీరంలోని జీవకణాల్లో 23 జతల క్రోమోజోములున్నాయి. అలాగే అరటిపండులోనూ, నిమ్మకాయల్లోనూ, ద్రాక్ష పళ్లలోనూ, ఉల్లిగడ్డల్లోనూ గొంగళి పురుగుల్లోనూ ఉండే జీవకణాల్లో ఎంతో DNA ఉంటుంది. దారాన్ని మెలిక త్రిప్పి సరాసరి లాగినట్లయితే అదే కొన్ని మీటర్ల పొడవుంటుంది. ఒక్క మనిషి శరీరంలో ఉన్న కణాలలోని DNA ని ముడులు విప్పి విప్పార్పి లాగినట్లయితే మొత్తం DNA దారాన్నీ భూమికీ, చంద్రుడికీ మధ్య కలిపినా కొంత DNA దారం మిగిలిపోతుంది. అయినా 80 కిలోల బరువున్న మనిషిలోని DNA బరువు కొన్ని గ్రాములు మాత్రమే ఉంటుంది. DNA దారం ఎలా ఉంటుందో పటంలో చూడండి.

మరి యింత విచిత్రమా, యిందుగల దందులేదని సందేహములేదు DNA ఎందెందు జీవకణాల్లో వెదకి చూసినా అందందే కలదు చెకుముకి పాఠకాగ్రణి వింటే అని నిస్సంకోచంగా పాడగల ధైర్యాన్ని యిచ్చే DNA ను ప్రత్యక్షంగానే చూడాలని లేదా ? ఎపుడూ ఆ పుస్తకాల్లో బొమ్మల్లో చూడ్డమేనా ? నిజమైన DNA ని నిజంగా ఎలా చూడాలో చూడ్డమేనా ? నిజమైన DNA నిజంగా ఎలా చూడాలో మీరే చేసి చూడవచ్చు. మీరేయిక చిట్టి చిట్టి సైంటిస్టులు, కొవ్వు పదార్థాన్ని డిటర్జంట్ ధ్వంసం చేస్తుందని, జీవకణాల గోడల కొవ్వు పదార్థంతో నిర్మించ బడ్డాయనీ నిజాల ఆధారంగా ఈ ప్రయోగం చేస్తాము.

కావలసిన సామగ్రి

ఒక ఉల్లిగడ్డ, వంటయింటి చాకు, పారదర్శక గాజుగ్లాసు (250 మి.లీ), ఒక స్పూను, కొంచెం ఉప్పు, కొంచెం షాంపు లేదా డిటర్జంటు పౌడర్, వాడేసిన డిప్ టీ ఫిల్టర్ పేపరు.

చేసే విధానం:- ఇందులో రెండు దశలున్నాయి. మొదటి దశలో క్రొవ్వు పదార్థాల్ని కడిగివేసే కషాయాన్ని ను తయారు చేయడం. రెండో దశలో ఈ కషాయాన్ని వాడి జీవకణ జాలంలోని క్రొవ్వుల్ని కడిగేసి, కణ ద్రవాన్ని (సైట్ ప్లాజం) తీసేసి DNA ని దొరక బుచ్చుకోవడం.

మొదటి దశ: ఒక గాజు గ్లాసులో సుమారు 100 మిల్లీ లీటర్ల మంచినీరు తీసుకొని అందులోకి 4 గ్రాముల ఉప్పును, 10 గ్రాముల డిటర్జంటును కలిపి గాలి బుడగలు లేకుండా మెల్లగా చాలాసేపు స్పూనుతో గిలగొట్టాలి. గాలిబుడగలు కొంచెం ఉన్నా కొంపలు మునిగిపోవు. ఇప్పడిక మీ దగ్గర కషాయం ఉన్నట్లే ..

రెండోదశ: ఒక ఉల్లిగడ్డను ముక్కలు చేసి మిక్సీలో గానీ, రోట్లో గానీ వేసి బాగా మెత్తగా నూరుకోవాలి. అసలు దశః రెండో దశలో చేసిన ఉల్లిగడ్డ గుజ్జును జాగ్రత్తగా మొదటి దశలో చేసిన సబ్బు ఉప్పు నీటి కషాయంలో కలపాలి. మరోపాత్రలో నీటిని వేడిచేసుకొని ఆ పాత్రలోని వేడి నీటిలో ఈ గాజుగ్లాసును దింపి స్పూనుతో బాగా కలపాలి. ఉల్లిగడ్డ గుజ్జులో ఉన్న కణపుగోడల లిపిడ్లు అనబడే క్రొవ్వు పదార్థాలతో తయారయి ఉండడం వల్ల కణాల గోడలు ధ్వంసం అవుతాయి. అందులో ఉప్పుకూడా ఉండడం వల్ల ఆ కొవ్వు బిందువుల కొల్లాయిడుగా మారకుండా కరిగిపోతాయి. కణాల్లో ఉన్న కేంద్రకాల గోడలు కూడా లిపిడ్లలో తయారుకావడం వల్ల అది కూడా ధ్వంసం అవుతాయి. కణాల్లో ఉన్న కణద్రవం (సైటో ప్లాజం) అందులో ఉన్న కణాంగాలు నీటిలో కలిసి పోతాయి. DNA పోగులు మాత్రమే గుబురు పోగుల్లాగా ఉండిపోతాయి.

ఆ దశలో వాడేసిన డిప్ టీ ఫిల్టర్ పేరపర్లు రెండింటిని బాగా కడిగి అందులోంచి కషాయాన్ని వడపోయాలి. వడపోత కాగితంపై DNA నారలాగా నిలబడి పోతుంది. దాన్ని కాసేపు ఎండలో ఉంచితే పత్తిలాంటి పోగులు కొన్ని పొడిగా కనిపిస్తాయి. ఇదే DNA. ఆ తర్వాత దీన్ని ఒక పరీక్ష నాళికలోకి తీసుకొని అందులోకి పంపితే కొన్ని రొజులపాటు నిల్వ ఉంటుంది. దీనికి కొంచెం ఆల్కహాలు కలిపితే అందులో నారపోగుల్లాగా మధ్యలో వ్రేలాడుతూ కనిపిస్తుంది. ఒక్కచుక్క ఎర్రసీరాను కలిపితే కొంచెం రంగుకూడా వస్తుంది.

చివరగా ఓ చివరిమాట. మీరు ప్రయోగానికి ఉపక్రమించే ముందు పెద్దలు చుట్టుప్రక్కల లేకుండా, ఓ బకెటు మంచినీళ్లు దగ్గర పెట్టుకోకుండా ప్రయోగానికి పూనుకోవద్దు. మంచి సైంటిస్టు మంచి మెళికువలు తీసుంటాడన్న విషయం మరువవద్దు.

రచయిత: ప్రొ. ఎ. రామచంద్రయ్య.

చివరిసారిగా మార్పు చేయబడిన : 3/17/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate