অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పర్యావరణ ఉద్యమ తొలి సేనాని

పర్యావరణ ఉద్యమ తొలి సేనాని

యుద్ధాలు, రాజకీయ ఉద్యమాలు చూపే ప్రభావం సాధారణంగా పుస్తకాలు చేయలేవనంటే అందరం నమ్మోస్తాం. కాని కొన్ని పుస్తకాలు చరిత్రను సృష్టిస్తాయి. చరిత్రగతిని మార్చేస్తాయి. ఆ కోవకు చెందిందే రేచల్ కార్సన్ పుస్తకం “సైలెంట్ స్ప్రింగ్” (SILENT SPRING). పర్యావరణ వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది రచన. కిటకనాశని పురుగుమందుల వాడకం వలన, ముఖ్యంగా దోమల నివారణకు వాడే DDT వలన పర్యావరణానికీ, మన ఆరోగ్యానికి జరిగే అనర్ధాలను కళ్ళకు కట్టినట్లు వివరించింది రేచల్ కార్సన్. ఏదో కొంపలు మునిగిపోతాయని జరగబోయే దాని గురించి ఊహించి రాయలేదు. వాస్తవంగా జరిగిన దానినే అక్షరబద్ధం చేసింది. ఆ పుస్తకం తొలి అధ్యాయంలోనే ప్రకృతికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం వాస్తవంలో మనమేమనకు వ్యతిరేకంగా చేసిన యుద్దంగా పేర్కొంది. 1939 లో వెలుగులోకి వచ్చిన DDT పురుగుమందు రెండవ ప్రపంచం యుద్ద కాలంలో సైనికులు మలేరియా బారిన పడకుండా ఫసిఫిక్ దీవుల్లో బాగా ఉపయోగపడింది. ఇది కేవలం దోమలనే గాక వందకు పైగా ఇతర కీటకాలను నాశనం చేయగలదు. వీటిలో మెజారిటీ ప్రకృతికి, మానవ మనుగడకు తోడ్పడేవే. సైన్యం వాడే DDT యుద్దంతరం 1945లో పంటల పై సస్యరక్షణకు వాడే పెస్టిసైడ్ (PESTICIDE) గా కొత్త అవతారం ఎత్తి ప్రపంచవ్యప్తగా పెద్ద ఎత్తున వాడుకలోకి వచ్చింది. అమెరికా చేపల, వన్యప్రాణుల డిపార్ట్మెంటులో పనిసేస్తున్న కార్సన్ DDT విషప్రభావాలను 1949లోనే పసిగట్టి ‘రైడర్స్ డైజెస్ట్’ లో సీరియల్ రాయటానికి ప్రతిపాదించింది. కాని ఆమె ప్రతిపాదనకు మద్దతు కరువైంది. కార్సన్ కంటే ముందు ఎడ్విన్ వే టేల్ (EDWIN WAY TAEL) కూడ DDT దుష్పభావాలపై చెప్పాడు. స్వతహగా మంచి రచయిత్రి, శాస్త్రవేత్త అయిన కార్సన్ గొంతేత్తేదాకా పురుగు మందులు, ఎరువులు విచక్షణా రహిత వాడకం అనర్ధాలకు దారితీస్తుందని ప్రపంచం నమ్మలేదు.

1949లో తన మాట ఖాతరు చేయకపోయినా కార్సన్ అధ్యయనాన్ని కొనసాగించింది. 1958 లో DDT ప్రమాదం పై రాసిన ఒక మిత్రుడి లేఖ ఆమెను ‘సైలెంట్ స్ప్రింగ్’ వ్రాస్సేందుకు ప్రేరేపించింది. DDT చల్లటం వలన, అది చల్లిన పంటల పై జివించేపక్షులు పెద్దసంఖ్యలో మసాచుసెట్స్ రాష్ట్రంలో చనిపోవడం ఆలేఖ సారాంశం. పరిశోధనలను ప్రచురించే వత్రికలు DDT దుష్చలితాలను ప్రచురించడానికి నిరాకరించటంతో కార్సన్ ఈ పుస్తక రచనకు పూనుకుని 1962లో తొలిసారి ముద్రించింది. పుస్తకం విడుదలైన 24గంటల్లోనే 5 లక్షల కాపీలు అమ్ముడయ్యాయంటే ఆలోచించండి. దాని ప్రభావం!

DDT ఎలా ఆహార గొలుసు (food chain) లోకి ప్రవేశించి జంతువుల కొవ్వుతో ఉండే కణజాలాల్లో ఎలా పెరుకుపోతుందో అద్భుతంగా వర్ణించింది. DDTతో కలుషితమైన వాతావరణం, నేల, నీరు ఇలా రకరకాల మార్గాల్లో చేపల వంటి జంతువులకు వాటిని తినే మనుషులకు ఇలా ఒక గొలుసులా వ్యాప్తి చెందుతుంది. చేపల నుండి పక్షులు. ఆపిల్ పండ్ల నుండి మనుషులకు చేరి జీవితాలు మూగబొయేలా చేస్తుందని చెప్పింది. ఈ పుస్తకం ప్రజల్లో పర్యావరణం, కాలుష్యం, రసాయనాల దుష్ప్రచభావాల వంటి మనవజివితాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యల పట్ల అవగాహన కలిగించింది. ఒక విధంగా జనాన్ని మేలుకొలిపింది. అదే సమయంలో రసాయన పరిశ్రమ ఆమె పై నిప్పులు చెరిగింది. ఆమె రాతలు నమ్మితే, DDT ని వాడకపోతే మనం చికతిముగాల్లోకి పోతామని కరపత్రాలు వేసి మారి వ్యతిరేక ప్రచారం చేశాయి ప్రఖ్యాత బహుళజాతి కంపెనీలు. అమెరికన్ సైనమిడ్, మున్ శాంటో కంపెనిలయితే, కార్సన్ ను వేల మంది ప్రాణాలు బలికోరే మహామ్మారి దెయ్యంగా చిత్రించాయి.

రసాయన పరిశ్రమల అదిరింపులు, కంపెనీల బెదిరింపులకు కార్సన్ భయపడలేదు. ఆమె పకడ్బందిగా రాసిన వాస్తవాలను చూసి ప్రముఖ శాస్త్రవేత్తలు ఆమెకు మద్దతు పలికారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్కెన్నడి తన సైన్సు సలహామండలి చేత విచారణ జరిపించాడు. రేచల్ కార్సన్ స్వయంగా అమెరికన్ సెనేటు ముందు హాజరై తన వాదనలు వినిపించి పురుగుమందుల పై ఒక కమిషన్ వేయాలని వాదించింది. అధ్యక్షుని సైన్సు సలహాదారులు కూడ ఆమె వాదనలను బలపరిచారు. ప్రభుత్వం పెస్టిసైడ్ (పురుగుమందుల) కమిషన్ వేయించటంతో కార్సన్ విజయం సాధించింది. తరువాతి కాలంలో ఆ కమిషనే పర్యావరణ సంరక్షణా సంస్ధ (Environment Protection Agency-EPA) గా రూపు దిద్దుకుంది. ఈ సంస్ధ ఏర్పడిన మరుక్షణమే DDT వాడకాన్ని నిషేధించింది.

అందుకే ఆమెను పర్యావరణ ఉద్యమాలకు అమ్మగా (Mother of Environmental Movement) పేర్కొంటారు. నదీతీర పట్టణమైన స్ప్రింగ్ డెల్ లో 1907 సం.లో ఆమె జన్మించింది. వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి అందాల మధ్య ఆమె బాల్యం గడిచింది. అందుకే ఆమె ప్రకృతి ప్రేమికురాలైంది. కష్టాల కడగండ్ల నెదిరించి పర్యావరణ రక్షణ ఆమె చేసిన పోరాటానికి మూలం ఆమెకు ప్రకృతి పై ఉన్న ప్రేమే! ఈ పోరాటంలో ఆమె ఒక గ్లాడియేటర్లా (gladiator)ప్రకృతిని కాపాడింది. పెన్సిల్వేనియా మహిళా కళాశాల (ఇప్పటి చాతం యూనివర్సితి) నుండి 1929లో డిగ్రీ చదివి, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో యం.ఏ., పి. హెచ్డీలు చేసింది. మేరీలాండ్ యూనివర్సిటిలో ఐదు సంవత్సరాలు పాటాలు చెప్పింది. అమెరికా ఫిష్ రీస్ బ్యూరోలో సముద్ర జీవ శాస్త్రవేత్తగా చాలాకాలం పనిచేసి సముద్ర జీవుల పై పుస్తకాలు రాసింది. రేచల్ కార్సన్ శాస్త్రవేత్త కంటే ముందు రచయిత్రి. పదకొండవ ఏటనే ఆమె రాసిన కధ ప్రచురించబడింది. సముద్రమంటే, అందలి జీవుల జీవితమంటే ఆమెకు ప్రాణం. 1941లో ఆమె తొలి పుస్తకం Under the Sea Wind వచ్చింది. మన చుట్టూ ఉన్న సముద్రం (The sea Around Us) బహుళ ప్రాచుర్యం పొంది, ‘న్యూయార్స్ టైమ్స్’ పత్రిక నిర్వహించిన ఉత్తమ పుస్తకంగా 8 వారాలకు పైగా ఉండింది. మంచి రచయిత్రి, శాస్త్రవేత్త, పర్యావరణ వేత్త, ప్రకృతి ప్రేమికురాలు, పర్యావరణ ఉద్యమ తొలిసేనాని అయిన రేచల్ కార్సన్ తన ‘సైలెంట్ స్ప్రింగ్’ వచ్చిన రెండేళ్ళకే 1964లో కాన్సర్ బారినబడి 56 ఏళ్ళ వయసులో కన్నుమూసింది. కాన్సర్ కల్గించే రసాయనాలు వాడకం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలనే వుద్యమానికి ఆమె నాటిన బీజాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కార్యోన్ముఖుల్ని చేసింది. మనిషి ప్రకృతిలో ఒక భాగమే దానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలు మానవజాతికి వ్యతిరేకమైనవన్న ఆమె మాటలు అక్షర సత్యాలు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/26/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate