অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మూర్ఛ

మూర్ఛ

ఆదెమ్మ: మామా...! ఓ మామా...! నీ కొడుక్కి మళ్ళీ మూర్చొచ్చింది, బిర్సరా!

ఆదెమ్మ: (భర్తను పొదివి పట్టుకుంటూ) అయ్యో...! ఏందయ్యా...! (అంటుంది. ఇంతలోనే దబ్బుమని మొదలు నరికిన చెట్టులా క్రిందపడి గిల గిల కొట్టుకొంటున్నాడు రామప్ప.)

దాసప్ప: (రామప్ప తండ్రి) ఆదెమ్మా! నే పట్టుకుంటాలే, నువ్వేళ్ళి తాళాలగుత్తి పట్రాపో...!

(అదెమ్మ పరుగు లంకించింది, అరుపులు విని పక్కింటి రఘురాం తాత, నానమ్మ అక్కడికి చేరిపోయారు) . ఆదెమ్మ: తాతా, చూడు తాతా! నా మొగుడేలా పడిపోయాడో

(దానప్ప అతి ప్రయత్నం మీద గిలగిల తన్నుకుంటున్న రామప్ప చేతిలో తాళాల గుత్తి పట్టిస్తున్నాడు)

తాత: దాసప్ప. ఏం చేస్తున్నావు...? ఆ తాళాల గుత్తితో నీ కొడుకు తనకు తాను గాయ పరుచుకొంటాడు.

దాసప్ప: మూర్ఛోడికి! ఇనప వస్తువు పట్టిస్తే మూర్చ తగ్గుతుంది సామి!

తాత: అది ఒక మూఢనమ్మకం, అంతే! మూర్చ అనేది ఓ నాడీ సంబంధమైన వ్యాధి.

దాసప్ప: మరి ఈ నరాల బలహీనతకు ఏం చేయ్యాలి సామీ?

తాత: మొదట నీ కొడుకు నోటిలో నుండి వచ్చే నురగ, గళ్ళ తుడిచేయ్యి, అది అతని శ్వాసకు ఇబ్బంది కలిగిస్తుంది.

నానమ్మ: ఒరే, వంశీ! డాక్టర్ గారిని పిల్చుకొని రా, పో, నాయన!

(వంశీ డాక్టర్ కోసం పరిగెత్తాడు!)

తాత: ఆదెమ్మ! ఇలారా! రామప్పను ప్రక్కకు తిప్పి పడుకో పెట్టాలి. లేకపోతే గళ్ళ శ్వాసకు అడ్డు పడుతుంది.

(అందరూ కలసి రోగిని అదిమి పెట్టయినా ప్రక్కకు వత్తిగిల పడుకో పెట్టాలని చూస్తున్నారు, రామప్ప లొంగక పోగా, మట్టినేల గీచుకొని చర్మం లేచిపోతున్నది)

నానమ్మ: అతని తల క్రింద ఈ దిండు పెట్టండి. తల నేలకు కొట్టు కొంటున్నాడు.

(రామప్ప పళ్ళు గిటక కరిచి, రొప్పుతున్నాడు...)

ఆదెమ్మ: అయ్యో! నాలుక కొరుక్కున్నాడే! నోట్లో నుండి రక్తం వస్తుందే...!

తాతయ్య: ఓ చిన్న కర్రముకకు, మెత్తని గుడ్డ చుట్టి తీసుకొనిరండి.

(నానమ్మ తెచ్చిఇచ్చింది)

తాత: దాసయ్య! నీ కొడుకు నోరు తెరిచి, ఈ గుడ్డను పళ్ళ మధ్య నుంచు!

నానమ్మ: నాలుక కొరుక్కోడు! పళ్ళు విరగవు.

(దాసయ్య ప్రయత్నిస్తున్నాడు.)

దానయ్య: వామ్మో (గట్టిగా అరిచి వెనక్కు పడ్డాడు)

ఆదెమ్మ: మామా! ఏమైంది...?

దానయ్య: వేలు కొరికేశాడే...! (వేలిపై పళ్ళండ్ల గాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి!)

రామప్ప: (నోట్లో కూతలు తగ్గాయి, గింజుకోవడం కూడా తగ్గింది)

నానమ్మ: హమ్మయ్య! మూర్ఛ తగ్గిందే తల్లి!

ఆదెమ్మ: మామా! కాసిన్ని వేడిపాలు తెస్తాను! నీ కొడుకుతో తాగించు.

నానమ్మ: కాస్తా కుదురు కోనీవే...! శ్వాస కష్టమైనపుడు ఏవైన తాగించినా, తినిపించినా ఊపిరాడక హరీమంటాడు!

వంశీ: తాతా! డాక్టరుగారు...!

డాక్టర్: ఏంటి ఆదెమ్మ! మళ్ళీ మూర్ఛేనా...?

ఆదెమ్మ: ఔనండి! ఏం మాయరోగమో, చంపుతోంది!

డాక్టర్: (ఇంజెక్షన్ కు ఏర్పాట్లు చేసుకొంటూ) తాతగారు, మూర్ఛ వచ్చినప్పుడు, చూడటానికి భయం పుట్టించేలా వున్నా, ఇది మెడికల్లీ ఎమర్జెన్సీ కేసు కాదండి!

తాత: ప్రాణపాయం కాదని నాకు తెల్పండి!

(రామప్ప లేచి కుర్చున్నాడు)

డాక్టర్: ఏం రామప్పా? పెదాలు అలా వాచిపోయాయే?

తాత: నాలుక కొరుక్కుంటుంటే, కర్రముక్కను పండ్ల మధ్య పెట్టి ప్రయత్నించాము!

దాసయ్య: నా వేలు కొరికేశాడండి...!

డాక్టర్: (పక పక నవ్వుతూ) మూర్ఛతో కొట్టుకొనే వాడి నోట్లో వేలు పెట్టావా? ఇంకానయం వేలు తెగిపోయేది!

తాత: మూర్ఛకు అది ప్రథమ చికిత్స కదండీ!

డాక్టర్: తాతగారు, సైన్సు, వైద్యం నిరంతరం కొత్తపోకడలు తొక్కుతుంటుంది. ఈ రోజు సరైనది, రేపు తప్పు కావచ్చు!

తాత: తాళాల గుత్తి పట్టించడం అపోహని తెల్సు, కాని...?

డాక్టర్: పండ్ల మధ్య గుడ్డ పెట్టడం, పక్కకు పడుకొనేలా అదిమి పెట్టడం కూడా అపోహే...!

తాత: ఇప్పటిదాక మేం చేసింది ప్రథమ చికిత్స కాదా?

డాక్టర్: మూర్ఛ వ్యాధి ప్రథమ చికిత్సలో ముఖ్యాంశాలున్నాయండి! అవి

  1. మనం ఆదుర్గా పడకుండా వుండటం,
  2. మూర్చతో బాధపడే వాడికి ప్రమాదం జరగకుండా కుర్చీలు, బల్లలు దూరంగా జరపాలి, నీటి గట్టున వుంటే ప్రమాదరహిత ప్రదేశానికి చేర్చాలి.
  3. మూర్చ ప్రారంభ, ముగింపు సమయాలు గుర్తించాలి.
  4. తలక్రింద మెత్తని దిండు వుంచాలి.

నానమ్మ: తలకు దెబ్బ తగలకుండా నేనే పెట్టించానండి.

డాక్టర్: ఇక ఐదవది వాళ్ళను కదలనీ కుండా అదిమి పెట్టరాదు! అలా చేస్తేనే మూర్ఛ వ్యాధి గ్రస్తుడు శ్వాస తీసుకో గలడనుకోవడం ఒక అపోహని నిరూపిత మయ్యింది. బాగా మూర్ఛకు లోనైన వ్యక్తి ఎంత గట్టిగా పండ్లు బిగపడతాడంటే, ఒక్కోసారి అతని పండ్లు విరిగి నోట్లో పడిపోతాయి!

తాత: మరి వూడిన పండ్లు శ్వాసకు అడ్డుపడితే?

డాక్టర్: మూర్ఛ తగ్గి రోగి తనకు తానుగా నోరు తెర్చుకొన్నప్పుడే, అతని నోటిలోని పదార్థాలు బయటకు తియ్యాలన్నదే ఆరవ అంశం. మూర్చ సమయంలో సాధారణంగా ఏ పదార్థాన్ని వ్యాధిగ్రస్తుడు మింగలేడు.

తాత: మొదట్లో మూర్ఛ సమయం నమోదు చేసుకొమ్మన్నారే! ఎందుకని? అనేది ఏడవ అంశం.

డాక్టర్: 5 నిమిషాలకు మించి మూర్ఛ తగ్గక పోతే 108 అంబులెన్స్ కు ఫోను చెయ్యాలి. కారణం రోగి పరిస్థితి విషమంగా వుందని భావించాలి. ఇది ఎనిమిదో అంశం.

తాత: రోగి పూర్తి రికవరీ అయ్యేంత వరకు చెంతనే వుండి ధైర్యం చెప్పడం తొమ్మిదో అంశం.

వంశీ: మరి పదో అంశమేంటి?

డాక్టర్: ఎక్కడైన పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడి వైద్యులతో పరీక్షచేయించడమే!

తాత: పసి పిల్లలు, పెద్ద వారనే తేడా లేకుండా, మూర్ఛరోగం వస్తుంది కదా! కారణం ఏమిటండి?

డాక్టర్: సాధారణంగా పసి వయస్సులో వచ్చే మూర్ఛకు కారణం హార్మోన్ల లోపం, ఇన్ఫెక్షన్లు లేదా తీవ్రమైన జ్వరం కావచ్చు, ఇవి తాత్కాలికం, సులభంగా నయం చేయవచ్చు!

ఆదెమ్మ: మరి మా రామప్పుకు తగ్గడం లేదు కద సార్!

డాక్టర్: కొన్ని క్రిటికల్ కేసులుంటాయమ్మ, వాటికి ఖచ్చితమైన కారణాలను వైద్యపరీక్షల ద్వారానే నిర్ధారించగలం!

తాత: కాస్త వివరంగా చెప్పగలరా!

డాక్టర్: మెదడుకు గాయాలు కావడం, తల లోపల కణుతులు ఏర్పడటం, మూత్రపిండాల జబ్బులు, ఎక్కువ మధుమేహం కల్గివుండటం, మెదడులోని రక్తనాళాలలో బద్దె పురుగు గుడ్లు ఇరుక్కోవడం లాంటి సమస్యల వల్ల క్రిటికల్ మూర్ఛ వ్యాధులు వస్తాయి.

తాత: వాటికి వైద్యం లేదంటారా?

డాక్టర్: మూర్ఛను పూర్తిగా నయం చేయగలం, కాని పెద్దాసుపత్రులు, న్యూరాలజిస్ట్ ల పర్వవేక్షణ అవసరం.

దాసప్ప: రేపే, పెద్దాసుపత్రికి వెళ్ళి వైద్యం చేయిస్తానండి!

రామప్ప: మీకందరికి కృతజ్ఞతలండి, ఈ విషయం నాలాంటి అభాగ్యులందరికి తెలియజేస్తారుగా!

తాత: తప్పకుండా! వైద్యుడిపై, వైద్యంపై నమ్మకం ఉంచుకో! అన్నీ చక్కబడతాయి సరేనా!

(పట్టుదల, ప్రయత్నం, ఓర్పు వుంటే, పరిష్కారం చిక్కని సమస్య ఏదీ వుండదనే విశ్వాసం, వారిని ముందుకు నడిపిస్తుంది...!)

ఆధారం: కె. చంద్రశేఖర్

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate