অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సైన్స్ ప్రగతి

పునర్వికాస కాలం నాటి శాస్త్రజ్ఞులు – సైన్సు ప్రగతి

“పిల్లలూ! పునర్వికాస కాలం నాటి శాస్త్రజ్ఞులను గూర్చీ, ఆనాటి సైన్సు ప్రగతిని గూర్చీ మీరు ఒక్కొక్కరూ ఒక్కో అంశాన్ని చెప్పాలన్నాను. మీరు చెప్పడానికి సిద్దపడి వచ్చారు గదా?” అన్నారు సైన్సు మాస్టారు. “ఓ!” అన్నారు పిల్లలు.

“వెరీగుడ్! సిరీ! జాన్ గుటెన్ బర్గ్ ను గూర్చీ, ఆయన తయారు చేసిన అచ్చు యంత్రాన్ని గూర్చీ, ఆ కాలంలో అభివృద్ధి అయిన ముద్రణా సామగ్రిని గూర్చీ వివరించు.” అన్నాడు మాస్టారు.

“జాన్ గుటెన్బర్గ్ జర్మన్ దేశీయుడు మాస్టారూ! ఈయన 1898 లో జన్మించి 1465 లో మరణించాడు. ఈయన ముద్రణాయంత్రాన్ని కనుగొనడమే కాక, అవసరాన్ని బట్టిమార్చగల అచ్చు అక్షరాల ముద్రలను కనుగొన్నాడు. ఆ కాలంలోనే సన్నని కాగితాన్నీ, ముద్రణకు కావలసిన నూనె ఆధారిత ఇంకును కనుగొనడం జరిగింది. వాటినుపయోగించి 1453 లో గుటెన్ బర్గ్ 41 లైన్లు వచ్చే కాగితంపై, మొదటి గ్రంధంగా, బైబిలను ముద్రించాడు. అప్పటి నుండి అనేక గ్రంధాలు, వేగంగా ముద్రించాడు. అప్పటి నుండి అనేక గ్రంధాలు, వేగంగా ముద్రించబడి యూరప్ ముఖచిత్రాన్నే మార్చివేశాయి మాస్టారూ!” అని చెప్పి కూర్చుంది సిరి.

“బాగా చెప్పావు సీరి.” అని మాస్టారు సూర్యాంశ్ వైపు చూశాడు.

“నేను ఆల్ బ్రెక్ట్ డ్యూరర్ ను గూర్చి చెబుతాను మాస్టారూ! ఈయన జర్మనీ దేశస్థుడు. 1471 లో జన్మించి 1528 లో మరణించాడు. ఆధునిక కాలంలో నగర నిర్మాణానికి సంబంధించి ప్లానులను మొదటగా రూపొందించిన ఇంజనీరు ఈయనే. ఈయన ప్లానులో సాంఘిక సౌకర్యాలూ, నగర రక్షణ విధానాలూ రెండూ చక్కగా రూపొందించబడ్డాయి. కర్మాగారాలు నగరానికి దక్షిణం చివరలో ఏర్పాటు చేయబడ్డాయి. ఎందుకుంటే యూరోపులో దక్షిణంవైపు వీచే గాలులే ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి కర్మాగారాల నుంచి వచ్చే విషగాలులు నగరం వైపు కాకుండా నగరం ఆవలికి వీచేట్టుగా వాటిని డ్యూరర్ అలా ప్లాను చేశాడు. రాగిపని చేసే వారూ కర్మాగారాలకు దగ్గరలో నివసించేట్లుగా ఆహారం అమ్మే వీధికి దగ్గరగా ఉండేట్లుగానూ, టౌన్ హాల్ సామాజిక కేంద్రం, అంగళ్ళూ నగరం మధ్యలోనూ ఏర్పాటు చేశాడు. ఇలా ఆధునిక నగర నిర్మాణ కర్తగా డ్యూరర్ కీర్తి గడించాడు మాస్టారూ!” అని వివరించాడు సూర్యాం. “గుడ్! సూర్యా! బాగా చెప్పావు. కాకపోతే ప్రపంచ చరిత్రలను క్షుణ్ణంగా చదివిన వారికి ఎవరికైనా, నగర నిర్మాణ పద్ధతులు ప్రాచీన కాలంనాటి భారతీయులకు హరప్పా, మొహంజోదారోల నిర్మాణకాలం నాటికే తెలుసని అర్థమవుతుంది. ఇప్పుడు పునర్వికాస కాలంలో వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో, ఆ వివరాలు తెలుసుకుందాం. సిద్దూ! నీవు చెప్పు.” అడిగాడు మాస్టారు.

“అలాగే మాస్టారూ! శరీరంలో రక్త ప్రసరణను గూర్చిన విజ్ఞానం ఈ కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది. ప్రాచీన కాలం నాటి వైద్యశాస్త్రవేత్త గాలెన్ చెప్పిన సిద్ధాంతాన్నే శాస్త్రవేత్తలు 1543 వరకూ ఎన అంగీకరించేవారు. గాలెన్ ఏం - చెప్పాడంటే, రక్తం గుండెలోని కుడి భాగం నుండి ఎడమ భాగానికి వాటి మధ్యనున్న సెప్టమ్ అనే గోడ ద్వారా ప్రవహిస్తుందని చెప్పాడు. కాని 1543 లో వెసాలియస్ అనే శాస్త్రవేత్త దానిని ఖండించాడు. వెసాలియస్ ఆనాటి నెదర్లాండ్స్ దేశంలో 1514 లో పుట్టాడు. ఈయన ఏమని సిద్ధాంతీకరించాడంటే, గుండె మధ్యభాగంలో ఉండే గోడ చాలా మందంగా ఉంటుందనీ, అందువలన దానిలో నుండి రక్తం ప్రవహిండం అసాధ్యమనీ అన్నాడు. కానీ వెసాలియస్ రక్తప్రసరణ గుండె ద్వారా ఎలా జరుగుతుందో చెప్పలేక పోయాడు, ఈయన 1564 లో మరణించాడు. ఈయన బ్రతికి ఉండగానే మైకేల్ సెర్వెటస్ అనే స్పెయిన్ శాస్త్రవేత్త ఆ వివరాన్ని చెప్పాడు. సెర్వెటస్ 1511 లో పుట్టాడు. ఈయన శాస్త్రవేత్తే కాదు. మత సంస్కర్త కూడా. ఈయన ఏం చెప్పాడంటే ‘రక్తం గుండెలోని కుడి భాగం నుండి ముందుగా ఊపిరితిత్తులలోనికి వెళుతుంది. అక్కడ ప్రాణ శక్తిని పెంచే గాలి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అక్కడి నుండి గుండెలోని ఎడమ భాగానికి చేరుతుంది’ అని సిద్ధాంతీకరించాడు. సెర్వెటస్ మత సంస్కర్త కూడా అని చెప్పాను గదా? క్రిస్టియన్ మతంలో కాథలిక్కులూ, ప్రొటె స్టెంట్ లూ ఇద్దరూ త్రిమూర్తి వాదాన్ని అంగీకరిస్తారు. కానీ సెర్వెటస్ దానిని అంగీకరించలేదు. అందువలన కాల్విన్ అనే మత నాయకుడు ఈయనను నాస్తికుడుగా ముద్రవేసి, సజీవదహనం చేయమని తీర్పుచెప్పాడు. అందువలన 1553 అక్టోబర్ లో చితి పేర్చి సెర్వెటస్ ను సజీవ దహనం చేశారు. ఆ విధంగా మరో శాస్త్రవేత్త మతనాయకుల చేతిలో బలియైపోయాడు.” అని చెప్పి కూర్చున్నాడు సిద్దూ.

“గుడ్! బాగా చెప్పావు సిద్దూ. ఇప్పుడు శైలజా మొట్టమొదటి రసాయన శాస్త్రవేత్తగా పేరుగాంచిన పార్సెల్ససను గూర్చి చెప్పమ్మా." అడిగాడు మాస్టారు.

“అలాగే మాస్టారూ! పార్సెల్సస్ స్విట్జర్లాండు దేశం వాడు. ఈయన 1493-1541 మధ్య జీవించాడు. అసలు ఈయన పేరు చాలా పెద్దది. ‘అరూలియస్ ఫిలిప్పస్ ధియోఫ్రస్టస్ బంబాస్ట్ వాన్ హెూ హెన్ హీమ్’ అనేది ఈయన అసలు పేరు. కానీ ఈయన తన పేరును ‘పార్సెల్సస్’ గా మార్చుకొన్నాడు. పార్సెల్సస్ చాల అహంభావి. గర్వపోతు, ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. ఎంత గర్వపోతు అంటే ప్రాచీన చరిత్ర వైద్యవిజ్ఞానానికి పునాదులు వేసిన ప్రాచీన వైద్యశాస్త్రజ్ఞులు గాలెన్, అవిసెన్నాలను గూర్చి చులకనజేసి మాట్లాడేవాడు. తన 33 వ ఏట ఇద్యశాస్త్ర ప్రొఫెసర్గా భాసిల్లో నియమింపబడగానే. ఈయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, గాలెన్, అవిసెన్నాల గ్రంధాలను బహిరంగంగా తగల బెట్టాడు. అయినా పార్సెల్సస్, తాను సాధించిన నూతన రసాయన మందుల ఆవిష్కరణల కారణంగా ఆధునిక కాల రసాయన శాస్త్రపు ఆద్యుడుగా గుర్తింపు పొందాడు.

ఈయన పరిశోధనలలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రసాయనాలు వ్యాధుల నిర్మూలనలో ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నించడం, దానికోసం ఆయన తన పేషెంట్లకు, వాళ్ళకు తెలియకుండా, అనేక వ్యాధులకు కొత్త కొత్త రసాయన పదార్థాలిచ్చి, వారి వ్యాధులపై అవి ఎలా పని చేస్తాయో పరీక్షించేవాడు. వాటిలో కొన్ని విషరసాయనాలు కూడా ఉండేవి. వాటి ప్రభావం వలన కొందరు రోగులు చనిపోయేవారు. పార్సెల్సన్ రోగుల మీద ఈ విధంగా వివిధ రసాయనాలను ప్రయోగిస్తున్నాడని తెలిసి, ఆయనను యూనివర్సిటీ యాజమాన్యం పదవి నుండి తొలగించింది. కానీ ఈ లోగా పార్సిల్సస్ అనేక కొత్త రసాయన పదార్థాలనూ, వివిధ వ్యాధులపై వాటి ప్రభావాన్నీ తెలుసుకోగల్లాడు, ఆ విధంగా ఆయన ఆధునిక రసాయన శాస్త్ర ఆద్యుడుగా పేరు తెచ్చుకున్నాడు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వైద్యరంగాన్ని ఒక మలుపు తిప్పిన ఈధర్ అనే రసాయనాన్ని ఈయన కనుగొన్నాడు. దానిని కొజ కొరత ప్రయోగించాడు. అది పీల్చినకోళ్ళు ఎక్కువ సేపు నిద్రపోతున్నాయనీ, తర్వాత ఏ మాత్రం ఇబ్బంది లేకుండా లేస్తున్నాయనీ గమనించాడు. అయితే ఈ రసాయనాన్ని తన పేషెంట్లపై ప్రయోగించి, పరీక్షించేలోగా ఆయన బాసిల్ నుండి బహిష్కరించబడటంతో ఆ ప్రయోగం చేసే అవకాశం తర్వాతి వైద్యులకు దక్కింది.

పదార్థ విజ్ఞాన శాస్త్రానికి పార్సెల్సస్ ఒక నూతన సిద్ధాంతాన్ని అందించాడు. అప్పటి వరకు, ప్రాచీన గ్రీకు తత్వవేత్త ఎం పెడోక్లన్ ప్రవచించిన 'నాలుగు మౌలిక పదార్థాల సిద్ధాంతమే’ తత్వవేత్తలు, శాస్త్రవేత్తలూ ఆమోదించారు. దాని ప్రకారం పదార్ధం నాలుగు మూలకాల సంయోగమే. ఆ నాలుగూ భూమి, గాలి, నిప్పు మరియు నీరు. పార్సెల్సస్ సిద్ధాంతం ప్రకారం అన్ని రసాయనిక పదార్థాలూ మూడు మూల స్థితుల సంయోగం మాత్రమే. అవి ఏమిటంటే, మొదటిది గంధకం. ఇది కాలే గుణం కలది. రెండవది పాదరసం. ఇది పారే గుణం కలది. మూడవది ఉప్పు. ఇది స్థిరత్వము కలది. ఈ మూడు స్థితుల సంయోగమే పదార్థం. ఇలా పదార్థ విజ్ఞాన శాస్త్రంలో మూడు మూల స్థితుల సంయోగ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు పార్సెల్సన్. ఆధునిక రసాయన శాస్త్ర మూల పురుషుడూ, మూడు మూల స్థితుల సిద్ధాంతకర్తి అయిన పార్సెల్సస్ జీవిత విశేషాలు ఇవే మాస్టారూ.” అని చెప్పి కూర్చుంది శైలజ.

“బాగా చెప్పావమ్మా శైలజా. పిల్లలూ, వచ్చే క్లాసులో పునర్వికాస కాలంనాటి సైన్సు ప్రగతిని గూర్చిన మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం." అంటూ లేచారు. మాస్తారు. పిల్లలు మాస్టారిని అనుసరించారు.

“పిల్లలూ! పునర్వికాస కాలంనాటి మరికొందరు శాస్త్రజ్ఞులను గూర్చీ, ఆ కాలంనాటి సైన్స్ ప్రగతిని గూర్చీ మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. వంశీ! టార్టాగ్లియాను గూర్చి చెప్పు” అడిగాడు సైన్సు మాస్టారు.

“టార్టాగ్జియా అసలు పేరు నికోలో ఫోంటానా మాస్టారూ! ఈయన గొప్ప గణితశాస్త్రజ్ఞుడు, ఇటలీ దేశస్థుడు. క్రీ.శ 1506-59 మధ్య జీవించాడు. ఈయన 20, 22 ఏళ్ళ వయస్సులో ఉండగా ఫ్రెంచి సైనికులు, . ఫోంటానా నివసించే బ్రెస్సియా మీద దాడి చేశారు. ఆ దాడిలో ఒక ఫ్రెంచి సైనికుడు ఆయన దవడలు, అంగిలి పై బలంగా కొట్టాడు. దానిలో ఫోంటానా అంగిలికి శాశ్వతంగా దెబ్బతగిలి నత్తివచ్చింది. అందువలన ప్రజలు ఆయనను టార్జాగ్జియా (నత్తివాడు) అని పిలిచేవారు. నత్తివాడే అయినా, తన కాలంనాటి ఉత్తమ గణిత శాస్త్రజ్ఞుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన సాధించిన కొన్ని గణితశాస్త్ర విశేషాలు చెబుతాను, ఒక వడిశెలను 45 డిగ్రీల కోణంలో విసిరితే, అది మిగిలిన అన్ని కోణాలలో విసిరిన దాని కంటే ఎక్కువ దూరం వెళుతుందని ఆయన లెక్కల ద్వారా నిరూపించాడు. అలాగే (1+a)b యొక్క విలువ తెలిస్తే (1+a)b+1 యొక్క విలువ తెలుసుకోవచ్చునని నిరూపించి, తద్వారా ద్విపద సిద్ధాంతానికి బాటలు వేశాడు.

1530 లో టార్టాగ్లియా, ఘన సమీకరణానికి పరిష్కారాన్ని కనుగొనగలనని ప్రకటించాడు. ఆంటోనియోడెల్ ఫియోర్ అనే వ్యక్తి ఆ విషయంపై టార్టాగ్లియాను సవాలు చేశాడు. ఆ సవాలును స్వీకరించి టార్టాగ్లియా, అన్ని ఘన సమీకరణాలనూ పరిష్కరించే సామాన్య సూత్రాన్ని కనుగొన్నాడు. టార్టాగ్లియా ప్రతిభను కార్డన్ అనే ఆయన విన్నాడు. కార్డన్ వైద్యశాస్త్రంలో ప్రొఫెసర్ కానీ ఆయనకు గణితంలో మంచి ఆసక్తి ఉంది.

అందువలన ఆయన టార్టాగ్లియా వద్దకు వచ్చి ఘన సమీకరణాలను పరిష్కరించే సూత్రాన్ని తనకు నేర్పమన్నాడు. టార్టాగ్లియా ఆ సూత్రాన్ని కార్డన్ ఇతరులెవరికి వెల్లడిచేయ కూడదనే షరతు పెట్టాడు. ఆ షరతకు ఒప్పుకుంటూ కార్డన్ ప్రమాణం చేశాడు. టార్టాగ్లియా ఆ సూత్రాన్ని కార్డన్ కు వివరించాడు. కానీ 15 ఏళ్ళ తర్వాత, కార్డన్ తను చేసిన ప్రమాణాన్ని గాలికి వదలివేసి, బీజగణితం మీద తాను వ్రాసిన గ్రంథంలో ఘన సమీకరణాల పరిష్కార సూత్రాన్ని వివరించి, ఆ సూత్రం తనదిగా ప్రకటించుకున్నాడు. ఆ విషయం టార్టాగ్లియాకు తెలిసి గొడవ చేశాడు. కార్డన్ ఆయనకు సమాధానమిస్తూ టార్జాగ్జియా తనకు గణిత సమస్యలను. ఇచ్చాడే కానీ, వాటిని పరిష్కరించే పద్దతిని ఇవ్వలేదని బొంకాడు, టార్జాగ్జియా దానిపై బహిరంగ చర్చకు రమ్మని కార్డన్ ను కోరాడు, కార్డన్ దానికంగీకరించాడు కానీ అనుకున్న టైముకు చర్చకు రాకుండా తప్పించుకున్నాడు. బాధాకరమైన విషయం ఏమిటంటే. ఈనాటికీ ఆ గణిత సూత్రం ‘కార్డన్ సూత్రం' అనే పేరుతోనే చెలామణీ అవుతోంది. ఇదీ మాస్టారూ! గణితశాస్త్రవేత్త టార్టాగ్లియా జీవితమూ, పరిశోధనలూ, పరిష్కారాల విశేషాలు" అని చెప్పి కూర్చున్నాడు వంశీ.

"బాగా చెప్పావు వంశీ!” అంటూ మాస్టారు ఉదయ్వైపు చూసి చిరునవ్వునవ్వారు.

ఉదయ్ లేచి “నేను పునర్వికాస కాలంనాటి సామూహిక ఉత్పత్తి పద్దతులు వివరిస్తాను మాస్టారూ! ఈ కాలం వాడైన బ్రింగిక్కి యో 'పైరో టెక్నియా' అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. దానిలో సారాం మొదలగువాటిని పెద్ద ఎత్తున కాచే విధానాన్నీ, తుపాకీ మందు తయారీని, లోహశాస్రాన్నీ, అచ్చుముద్రల తయారీని వివరించాడు. ఆనాడు లోహ వస్తువుల తయారీ ఎంత పెద్ద ఎత్తున జరిగేదనే విషయాన్ని బ్రింగిక్కియో తన గ్రంథంలో వివరించాడు. మిలాన్ పట్టణంలో ఉన్న ఒకే ఒక్క ఫౌండ్రీ, ఇటలీ మొత్తానికి కావలసిన ఇత్తడి గుర్రపు బండి కొక్కేలనూ, కప్పులనూ, బెల్లు కొక్కేలనూ, గొలుసులనూ, గంటలనూ, కుట్టుపనివారి వేళ్ళ రింగులనూ తయారు చేయగలిగేదిట. ఇంకా విశేషం ఏమిటంటే, ఈ వస్తువులన్నిటికీ అవసరమైన అచ్చులు ఒకేగదిలో తయారయ్యేవి. దానిలో పోత పనిలో నిపుణులైన 8 మంది, మరికొంతమంది కార్మికుల సహకారంతో కేవలం పోతఅచ్చులు మాత్రమే తయారు చేస్తుండేవారు. ఆ రకంగా అప్పటికే పెద్దఎత్తున వస్తువుల తయారీలో పని విభజన, పనిలో నిపుణత ప్రవేశించింది. దానివలన తయారీ ఖర్చు తగ్గింది. వస్తువుల నాణ్యత పెరిగింది.

ఇటలీలోని మరో నగరరాజ్యం వెనిస్లోని పనివారు పెద్ద ఎత్తున ఓడలనూ, యుద్ద సామగ్రిని, ఫిరంగులనూ తయారు చేసేవారు. మిలాన్లో అచ అత్యంత నిపుణతతో, తక్కువ ఖర్చుతో తయారు చేయడమే వారి ప్రత్యేకత. ఇలా పారిశ్రామిక విప్లవ ఫలితమైన సామూహిక వస్తు తయారీకి బీజాలు ఆనాడే పడ్డాయి మాస్టారూ.” అని కూర్చున్నాడు ఉదయ్.

“మంచిది ఉదయ్!” అని మాస్టారు మేఘన వైపు తిరిగి “అమ్మా మేఘనా! ఆ కాలంనాటి లోహ పరిశోధనా పద్ధతులు, ప్రగతిని గూర్చి చెప్పమ్మా.” అన్నారు.

“అలాగే మాస్టారూ! పునర్వికాస కాలంలో ముడిఖనిజం నుండి వెండినీ, రాగినీ విడదీసే ఆధునిక పద్దతి కనుగొనబడింది. ఈ పద్దతిలో రాగి, సీసంల మధ్య లోహదశ నుండి ద్రవస్థితిలోకి కరిగే ఉష్ణోగ్రతల తేడాలు ఆధారంగా వాటిని వేరుచేయడం జరిగింది. అలాగే వెండి, సీసంల మధ్య ఉండే రసాయనిక సాన్నిహిత్యం ద్వారా వాటిని వేరుజేసే ప్రక్రియ కనుగొనబడింది. ఈ ప్రక్రియలనుపయోగించి యూరప్ లోని అనేక దేశాలు వెండి, రాగి గనుల త్రవ్వకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాయి. వాటిలో జర్మనీ ముందుంది. 15 వ శతాబ్ది చివరలో ఘగ్గర్ అనే ధనికుడు, గనుల ఇంజనీర్ ధర్టో సహకారంతో గనుల తవ్వకం, లోహాల్ని కరిగించే ప్రక్రియద్వారా శుద్దలోహాలు తయారు జేయడం, మిల్లుల స్థాపన చేశాడు. 1495 నాటికి వారి కంపెనీ లోహపరిశ్రమలో యూరప్ మార్కెట్ ను ఆక్రమించింది. ఇవీ ఆ కాలంనాటి లోహపరి విశేషాలు మాస్టారూ!” అన్నది మేఘన.

“గుడ్ మేఘనా. బాగా చెప్పావు. సాత్విక్, ఆ కాలం నాటి సివిల్ ఇంజనీరింగ్ నిపుణతను గూర్చి చెప్పు.” అడిగాడు మాస్టారు.

“ఆ కాలంలో సివిల్ ఇంజనీర్ల నిపుణత బాగా పెరిగింది మాస్టారూ. అప్పటి సివిల్ ఇంజనీర్లలో ఇటలీలోని రోలా చాలా గొప్పవాడు. ఈయన ప్రపంచంలో మొదటిసారిగా దాదాపు 20 కిలోమీటర్ల పొడవుగల కాలువను, లాకుల ద్వారా నీటిని క్రిందకు పంపే ఏర్పాట్లతో నిర్మించాడు. దాని వలన మిలాన్ పట్టణం యొక్క వ్యాపారం బాగా అభివృద్ధిచెంది, ఈ పట్టణ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగయింది. విశేషం ఏమిటంటే మిలాన్ నగరపు ఈశాన్య భాగంలోని కాలువపై గల శాన్ మార్కో లాకుకు రూపకల్పన చేసింది ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఇంజనీరు, చిత్రకారుడు అయిన లియోనార్డో డావిన్సీ. ఆ లాకు 20 వ శతాబ్దం వరకు నిలిచే ఉంది. ఇవీ ఆనాటి సివిల్ ఇంజనీరింగ్ విశేషాలు మాస్టారూ.” అని చెప్పి కూర్చున్నాడు సాత్విక్,

“గుడ్ స్వాతిక్. స్వాతీ, నువ్వు ఆ కాలంనాటి ప్రఖ్యాతి ఖగోళ శాస్త్రవేత్త కోపర్నికసను గూర్చిచెప్పు.” అడిగాడు మాస్టారు.

“అలాగే మాస్టారూ! కోపర్నికస్ క్రీ.శ. 1473 లో జన్మించాడు. గణిత, ఖగోళ, వైద్యశాస్త్రాల్లోను, వేదాంతం అంటే మత విషయాల్లోను పట్టభద్రుడయ్యాడు. ఈయన పోలెండ్ దేశంవాడు. తన 22 వ ఏట చర్చిలో జీవితాంతపు మతాధికారిగా ఈయనకు ఉద్యోగం లభించింది. చర్చిలో ప్రార్ధనలు చేసేవాడు. బైబిల్లోని విషయాలపై ఉపన్యాసాలు చెప్పేవాడు. బైబిల్లో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని చెప్పబడింది. కానీ ఖగోళ గణితశాస్త్రాలలో పట్టభద్రుడైన కోపర్నికసకు దీనిపై తీవ్రమైన అనుమానాలుండేవి. దానితో తన విజ్ఞానానికి పదును పెట్టాడు. గణితాన్ని, ఖగోళ శాస్త్రాన్ని మధించాడు. చివరకు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనేకన్నా, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని భావిస్తే, రేయింబవళ్ళకు, రుతువులకూ కారణాలు సులభంగా అర్థమవుతాయని లెక్కలతో సహా నిరూపించాడు. తన పరిశోధనా సారాన్ని 1514లో ఒక వ్యాసంలో వివరించాడు. అప్పటి వరకూ అందరూ నమ్ముతున్న భూకేంద్రక సిద్ధాంతం తప్పన్నాడు. అయితే, ఆ రచనను ముద్రించి, ప్రచారం చేసుకోవడానికి అప్పటి మత నాయకులు అంగీకరించలేదు. ప్రచురిస్తే శిక్షిస్తామన్నారు. అయినా తన భావాలను రహస్యంగా 'ఫస్ట్ అకౌంట్' పేరుతో ముద్రించాడు. మతనాయకులు దీనిని వెలుగుచూడనీయలేదు. ఆయన 1543 లో మరణించాడు. ఆయన రచన 'ఫస్ట్ ఎకౌంట్' కాపీలలో ఒక దాన్ని ఆయన శవంపై మిత్రులు ఉంచగలిగారు. శవంతోపాటు ఆ కాపీ కూడా దహనమైంది. కానీ, ఆ చితి వెలుగులో ఆయన భావాలు జగతులో వ్యాప్తిచెందాయి." అని చెప్పి కూర్చుంది స్వాతి.

“మంచిది. స్వాతీ! బాగా చెప్పావు. పిల్లలూ, కోపర్నికస్ మరణంతో పునర్వికాస కాలం ముగిసింది. ఈ కాలంలో యూరప్లో సైన్సు బాగా అభివృద్ధి చెందింది. పాత భావాలు కొన్ని సవాలు చేయబడ్డాయి. ఆధునిక కాలానికి పునాదులు వేయబడ్డాయి. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాము. వచ్చే క్లాసులో మత యుద్దాలు కాలం నాటి విశేషాలు, సైన్స్ ప్రగతిని గూర్చి తెలుసుకుందాం. మీ కందరికీ తలా ఒక అంశం ఇస్తాను. చెప్పడానికి తయారై రండి.” అని చెప్పి పిల్లలకు తలా ఒక అంశం మాస్టారు ఇచ్చారు. మాస్టారూ, పిల్లలూ మెల్లగా బైటికి కదిలారు.

మత యుద్ధాల కాలం

“పిల్లలూ! క్రిందటి క్లాసులో పునర్వికాస కాలం నాటి సైన్స్ ప్రగతి, శాస్త్రజ్ఞుల పరిశోధనలూ, వాటి ఫలితాలు ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మత యుద్ధాల కాలంనాటి శాస్త్రజ్ఞులు, వారి పరిశోధనలు, వాటి వలన కలిగిన సైన్సు ప్రగతి వీటన్నిటిని గూర్చి తెలుసుకుందాం. అవన్నీ చెప్పడానికి మీరు తయారై వచ్చారు గదా?” అడిగారు సైన్సు మాస్టారు శ్రీనివాస్.

“ఓ!" అన్నారు కొంతమంది పిల్లలు.

“గుడ్! మొదలు పెడదాం. జాన్! నువ్వు చెప్పు. శాస్త్రజ్ఞులు ఏ కాలాన్ని మతయుద్ధాల కాలం అని పిలిచారు? ఎందుకు అలా పిలిచారు?”

"క్రీ. శ 1550 - 1650 ల మధ్య కాలాన్ని మత యుద్ధాల కాలం అని పిలిచారు. ఎందుకుంటే నూతన శాస్త్ర పరిశోధనలతో బాటు, యీ కాలంలో ఫ్రాన్సులోనూ, జర్మనీలోనూ, లోకంట్రన్ గా పిలవబడే మరికొన్ని దేశాల లోనూ మతయుద్దాలు జరిగాయి మాస్టారూ!” అని చెప్పాడు జాన్.

"గుడ్! ఈ కాలంలో అనేక మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు జీవించారు. వారిలో బ్రూనో అనే ఖగోళ శాస్త్రవేత్త మత నాయకుల ఆగ్రహానికిగురై, వారిచే సజీవ దహనం చేయబడ్డాడు. గెలీలియో గృహ నిర్బంధానికి గురైనాడు. ఇలాంటి వారి బలిదానాలు, త్యాగాల కారణంగానే సైన్సు పురోగమంచి మానవజాతి ముందుకుసాగింది. ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం. ముందుగా విజ్ఞానశాస్త్ర పరిధిని పెంచి అమరుడైన బ్రూనోను గూర్చి తెలసుకుందాం. శ్రీనూ, నువ్వు చెప్పు.” అడిగాడు మాస్టారు.

"బ్రూనో పూర్తి పేరు గియార్డినో బ్రూనో మాస్టారూ. ఈయన 1548 లో ఇటలీ దేశంలో జన్మించాడు. చిన్నతనంలోనే చర్చికి సంబంధించిన మోనాస్టరీలో విద్యాభ్యాసానికై చేర్చబడ్డాడు. ఆనాటికి కోపర్నికస్ వ్రాసిన ‘ఫస్ట్ ఎకౌంట్’ అనే గ్రంథం నిషేధించబడి ఉంది. అయినా బ్రూనో రహస్యంగా ఆ పుస్తకాన్ని చదివాడు. అది చదివాక, మతాధిపతులు చెప్పే ‘భూకేంద్రకం సిద్దాంతం’ ఎంతటి అశాస్త్రీయమైనదో, అజ్ఞాన పూరితమైనదో ఆయన గ్రహించాడు. తాను తెలుసుకున్న నూతన విషయాన్ని అంటే ‘సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని’ సహాధ్యాయులకు వివరింపసాగాడు. విషయం మోనాస్టరీ అధికారులకు తెలిసింది. బైబిల్ లో చెప్పబడిన దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నందుకు అతనికి కఠినదండన విధించాలని వారు నిర్ణయించారు. విషయం తెలిసి బ్రూనో మెనాస్టరీ నుండి పారిపోయడం, మతాధికారులు వెంటబడ్డారు. చివరకు దేశం విడిచి పారిపోయాడు.

అయినా మతాధికారుల ఆగ్రహం తగ్గలేదు. వారు బ్రూనో వెంటబడ్డారు. ఆయన 16 ఏళ్ళపాటు ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, హీమియా మొదలైన అనేక దేశాలకు పారిపోయి నివసించసాగాడు. చివరకు మాతృదేశమైన ఇటలీకి రహస్యంగా తిరిగివచ్చాడు. ఈలోగా ఆయన కోపర్నికస్ సిద్ధాంతంలోని లోపాన్ని సరిచేయడమే కాక, దాన్ని మరింత అభివృద్ధి చేశాడు. ఈ అనంత విశ్వంలో మన సూర్యుడు, దాని చుట్టూ పరిభ్రమించే మన భూమిలాంటి గ్రహాలు ఉన్నాయని గణితశాస్త్ర వివరాల ద్వారా నిరూపించడమే కాక, ఇంకా అనేక సూర్యులున్నారనీ, వారి చుట్టూ అనేక గ్రహాలు తిరుగుతున్నాయనీ, నిరూపించాడు. అంటే విశ్వంలో అసంఖ్యాకమైన నక్షత్రాలు ఉన్నాయనీ, అవి ఒక్కొక్కటీ ఒక్కొక్క సూర్యబింబం లాంటిదనీ, ప్రతిదాని చుట్టూ కొన్ని గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయనీ తెలిపాడు. అద్భుతమైన వక్పృత్వంతో తన సిద్ధాంతాన్ని దేశదేశాల్లో ప్రచారం చేశాడు. ప్రతిదేశంలోనూ, మతాధికారులచే బహిష్కరించబడి మరో దేశానికి చేరుకొనే వాడు. చివరకు స్వదేశానికి చేరాడు.

బ్రూనో ఇటలీ చేరుకున్న తర్వాత కొందరు ద్రోహుల దుర్మార్గం కారణంగా మతాధికారులకు పట్టుబడ్డాడు. వారు ఆయనను విచారించి, మతగ్రంధాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందుకూ, తప్పును ఒప్పుకొని క్షమాపణ అడగనందుకూ శిక్షగా మరణదండన విధించారు. అదీ సజీవ దహనం ద్వారా బ్రూనో మరణదండన క్రీ.శ 1600 సంవత్సరం, ఫిబ్రవరి 17 న అమలు జరుపబడింది. రోమ్ నగరం నడిబొడ్డున, ఒక పెద్ద చితి ఏర్పాటు చేయబడింది, మతాధిపతి ఆదేశాల మేరకు బ్రూనోను ఇనప సంకెళ్ళతో బంధించి, పెడరెక్కలు విరిచికట్టి, తమ విశ్వాసాలను వ్యతిరేకించిన ఏ వ్యక్తికైనా ఈ రకమైన శిక్ష తప్పదని చాటింపు వేస్తూ, రోమ్ లో వీధుల గుండా ఊరేగిస్తూ చితి ప్రదేశం దగ్గరకు తీసుకువచ్చారు. ఊరేగింపు సమయంలో బ్రూనో తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెబుతాడేమోనని భయపడి, ఆయన నాలుకను ఇనుపతీగతో చుట్టి, నోటికి అడ్డంగా గుడ్డను కట్టారు. ఊరేగింపు ముందుకు సాగుతున్న సమయంలో, బ్రూనోను చూసి జనం కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. ఆయనను చితి వద్దకు తీసుకువచ్చి, నిలువెత్తు స్తంభానికి ఆయనను కట్టివేసి నోటికి కట్టిన గుడ్డను, నాలుకకు చుట్టిన ఇనుప తీగను తీసివేసి, మతాధిపతులు తప్పును ఒప్పుకోవడానికి ఆఖరి అవకాశం బ్రూనోకు ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన “నా మరణశిక్ష నాకన్నా మిమ్ములను ఎక్కువ యాతన పెడుతుంది. నేను పలికేది సత్యం. నా సిద్ధాంతం ఖచ్చితమైనది.” అని ఎలుగెత్తి చాటాడు. అంతే! బ్రూనో సజీవ దహనమయ్యాడు. భౌతికంగా కాలి బూడిదయ్యాడు. కానీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సత్యాన్వేషణాపరుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే రోమ్ లో ఆయనకు మరణ శిక్ష అమలు జరిగిన చోట నిర్మించిన స్మారక చిహ్నంపై “ఈయన ప్రజలందరి కోసం, ఆలోచనా స్వేచ్ఛ కోసం ఎలుగెత్తి నినదించాడు. దాని కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు." అని వ్రాయబడింది. ఇవీ మాస్టారూ! ఖగోళశాస్త్ర విజ్ఞాన ప్రగతి కోసం తన ప్రాణాలను బలిపెట్టిన బ్రూనో జీవిత విశేషాలు." అని చెప్పికూర్చున్నాడు శ్రీను. “గుడ్! శ్రీనూ! సత్య నిరూపణలో అమరుడైన శాస్త్రవేత్త బ్రూనోను గూర్చి చక్కగా వివరించావు. పిల్లలూ! ఆ కాలం నాటి మరికొందరు వ్రాస్త్రవేత్తలను గూర్చిన విశేషాలు వచ్చే క్లాసులో తెలుసుకుందాం.” అంటూ లేచారు మాస్టారు. పిల్లలు మాస్టారిని అనుసరించారు.

ఆధారము:చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate