অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అతి చిన్న క్రిములు

అతి చిన్న క్రిములు

"రేబీస్" అత్యంత భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి సోకిన కుక్కల్లో వ్యాధి మెదడుకి సోకుతుంది. ఆ కుక్కలు నోట్లోంచి నురగలు కక్కుతూ దొరికిన వాళ్లందరినీ కరుస్తుంటాయి. వాటిని పిచ్చికుక్కలు అంటూంటారు. అవి మనుషులని కరిస్తే రెండు వారాలు తిరిగేసరికి వారికి వ్యాధి సోకుతుంది. ఎందుకంటే క్రిములు మెదడును చేరుకోవడానికి కొంత కాలం పడుతుంది. అది జరిగాక ఇక ఆ మనిషికి రేబీస్ వ్యాధితో మరణం తప్పదు.

ఈ వ్యాధిని అర్ధం చేసుకోవడానికి ఎంతో కృషి చేశాడు పాశ్చర్. అతడు, అతని అనుచరులు దొరికిన ప్రతీ పిచ్చి కుక్కని పట్టుకున్నారు. వాటిని కట్టేసి వాటి నోట్లోంచి వచ్చే నురగని సేకరించారు. (ఇది చాలా ప్రమాదకరమైన పని.) ఆ నురగని కుందేళ్లలోకి ఎక్కించి ఏం జరుగుతుందో చూశారు.

కుందేళ్లకి కూడా వ్యాధి సోకింది కాని అందుకు చాలా కాలం పట్టింది. అప్పుడు పాశ్చర్ నేరుగా ఆ నురగని కుందేళ్ల మెదళ్లలోకి ఎక్కించి చూశాడు. ఈసారి వ్యాధి చిహ్నాలు త్వరగా కనిపించాయి.

ఆ విధంగా బోలెడన్ని వ్యాధి సోకిన కుందేళ్ళు తయారయ్యాయి. ఇప్పుడేం చెయ్యాలి? ఆంత్రాక్స్ బాక్టీరియమ్తో చేసినట్టు ఈ బాక్టీరియమ్ని కూడా క్షీణింపచేయవచ్చా? పాశ్చర్ ప్రయత్నించి చూశాడు. జబ్బుపడ్డ కుందేళ్లలో క్రిమి మెదడులోను, వెన్నుపాములోను ఉంది. ఒకసారి ఓ వెన్నుపాముని తీసి దాన్ని

కొద్దిగా వెచ్చచేశాడు. రోజూ ఓ చిన్న ముక్కని కోసి పక్కన పెట్టి, మిగతా భాగాన్ని వేడిచేస్తూ వచ్చాడు.

ఈ విధంగా వివిధ వ్యవధుల పాటు వరుసగా వేడి చేసిన వెన్నుపాము ముక్కులు మిగిలాయి. ఒక్కో ముక్కని వేరు వేరుగా ద్రవంలో నానబెట్టి, ఆ ద్రవాన్ని వేరు వేరు కుందేళ్లలోకి ఎక్కించారు. ముక్కని ఎంత ఎక్కువ కాలం వేడిచేస్తే దాని నుండి వచ్చిన ద్రవాన్ని ఎక్కించిన కుందేట్లో అంత తక్కువ తీవ్రతతో వ్యాధి ప్రస్ఫుటమయ్యింది. రెండు వారాల పాటు వేడిచేసిన ముక్క వల్ల అసలు వ్యాధి సోకనే లేదు..

కాని దాని వల్ల జంతువుకి రోగనిరోధకత ఏర్పడుతుందా? పాశ్చర్ ఆ విధంగా క్షీణించబడ్డ రేబీస్ క్రిమిని ఓ ఆరోగ్యవంతమైన కుక్కలోకి ఎక్కించాడు. కుక్కకి రేబిస్ రాలేదు. అప్పుడు ఆ కుక్కని రేబీస్ ఉన్న మరో కుక్కతో బాటు ఒకే బోనులో పెట్టాడు. రెండు కుక్కలు కాట్లాడుకున్నాయి. జబ్బుపడ్డ కుక్క మంచి కుక్కని కరిచింది. అప్పుడు మంచి కుక్కని బయటికి తీసి దాని గాయాలకి చికిత్స చేసి కట్టుకట్టారు. ఆ కుక్కకు రేబీస్ రాలేదు.

దీన్ని మనిషి మీద పరీక్షించడం ఎలా? తెలిసి తెలిసి ఆరోగ్యంగా ఉన్న మనిషిలోకి క్రిమిని ఎక్కించలేం కదా? అయితే 1885 జులై 1వ తేదీ నాడు జోసెఫ్ మైస్టర్ అనే 9 ఏళ్ళ అబ్బాయిని పాశ్చర్ దగ్గరికి హడావుడిగా తెచ్చారు. ఇతణ్ణి ఓ పిచ్చి కుక్క బాగా కరిచింది.

జోసెఫ్ నరాలకి, మెదడుకి క్రిమి పాకితే పిల్లవాడికి మరణం తప్పదు అని పాశ్చర్జి తెలుసు. ప్రయోగాత్మకంగా ఏదైనా చేసినా జోసెఫ్ కి పోయిందేం లేదు. కాని చేసేదేదో త్వరగా చేయాలి. తన వద్ద ఉన్న క్రిములలో అన్నిటికన్నా ఎక్కువ క్షీణించిన క్రిములని పిల్లవాడిలోకి ఎక్కించాడు..

ఒక రోజు ఆగి మరికాస్త తక్కువ క్షీణించిన క్రిములని ఎక్కించాడు. రోజురోజుకీ మైస్టర్ లోకి ఇంకా ఇంకా ఎక్కువ తీవ్రత గల క్రీములని ఎక్కిస్తూ వచ్చాడు పాశ్చర్. అలా 11వ రోజుకి పూర్తి తీవ్రత గల రేబీస్ క్రిములని ఎక్కించాడు. పిల్లవాడికి రేబీస్ రానేలేదు..

లూయీ పాశ్చరికి ఇది మరో అసమాన విజయం. కాని ఇక్కడో చిన్న తిరకాసు ఉంది. రేబీస్ మీద తను చేసిన పరిశోధనల్లో రేబీసకి కారణమైన ఏవిధమైన కొత్త బాక్టీరియా గాని, క్రిమి గాని ఎప్పుడూ కనిపించలేదు.

మరి సూక్ష్మక్రిమి సిద్ధాంతం తప్పని అనుకోవాలా? లేదు. ఆ విషయంలో పాశ్చరికి సందేహం ఏ కోశానా లేదు. రేబీస్ ఒకరి నుండి మరొకరికి అంటుతుంది. అంటే రోగకారక అంశాన్ని ఏదో మోసుకుపోతోందన్నమాట. అది కనిపించలేదు అంటే అదేదో సూక్ష్మదర్శినిలో కూడా కనిపించనంత సూక్ష్మమైన క్రిమి అయ్యుండాలి.

మరికొన్ని వ్యాధుల్లో కూడా ఇదే నిజమయ్యింది. స్మాల్ పాక్స్, చికెన్ఫాక్స్, ఇన్ఫ్లూయెనా ఇవన్నీ కాక సర్వ సామాన్యంవైరస్లు ప్రత్యేక సాధనాలతో తప్ప చూడలేనంత చిన్నవే అయినా వాటి గురించి జాగ్రత్తగా వుండాలి. మొట్టమొదట జయించబడ్డ వ్యాధి అయిన స్ఫోటకం (స్మాల్ పాక్స్) వైరస్ వల్ల వచ్చేదే.

గా వచ్చే జలుబుకి కూడా కారణమైన క్రిమి ఏమిటో ఎవరికీ తెలీదు. వాటి క్రిములు మరీ చిన్నవి అన్నమాట.

మనుషులకే కాక ఇతర జీవరాశులకి సోకే కొన్ని వ్యాధుల విషయంలో కూడా ఇదే నిజమయ్యింది. ఉదాహరణకి పొగాకు మొక్కలకి ఒక విధమైన తెగులు పట్టి మొక్కల ఆకులు వొడిలిపోయేవి. ఆ తెగులు పట్టిన ఆకుల మీద స్ఫోటకపు మచ్చల్లా ఏవో చుక్కలు తేలేవి. అందుకే ఈ వ్యాధికి “టోబాకో మోసాయిక్" వ్యాధి అన్నారు.

రష్యన్ శాస్త్రవేత్త డిమిట్రీ ఇవానోవస్కీ దాని క్రిమి కోసం అన్వేషించి విఫలుడయ్యాడు. తెగులు పడ్డ మొక్కల ఆకులని పిండి తీసిన రసం వల్ల మంచి మొక్కలకి తెగులు పట్టేది. కాని ఆ రసంలో ఏవిధమైన క్రిమీ కనిపించలేదు.

ఇవానోవస్కీ ఆ రసాన్ని వడబోసి చూశాడు. అతిచిన్న కన్నాలున్న జల్లెడలోంచి రసాన్ని పోనిచ్చాడు. అవి సూక్ష్మదర్శినిలో కూడా కనిపించనంత చిన్న కన్నాలు. ఆ కన్నాలోంచి పారిన రసంలోంచి క్రిములు తొలగిపోవాలి. అలా వడపోసిన రసం వల్ల తెగులు రాకూడదు.

ఇవనోవస్కీ అతి చిన్న కన్నాలు ఉండే పోర్సిలేన్ (porcelain) తో చేసిన జల్లెళ్లని ఉపయోగించాడు. 1892లో అతడు తెగులు పట్టిన ఆకుల్లోంచి తీసిన రసాన్ని ఆ జల్లెడతో వడపోశాడు. ఎంత చిన్న క్రిమి కూడా ఆ జల్లెడని దాటలేదు అనుకున్నాడు.

కాని ఆ నమ్మకం వమ్మయింది. ఇలా వడపోసిన రసాన్ని మంచి మొక్కల ఆకుల మీద చల్లితే ఆ ఆకులకి కూడా 'బొబాకో మొసాయిక్ వ్యాధి సోకింది. ఆ క్రిములు ఎలా ఉంటాయో గాని, ఆ పోర్సేలేన్ జల్లెడ కన్నాల కన్నా సూక్ష్మమైనవి అయ్యుండాలి అన్న వాస్తవం ఇవనోవస్కీకళ్లెదుట కనిపిస్తోంది. అంత చిన్న క్రిములు ఉంటాయని అతడు ఊహించలేకపోయాడు. నిస్పృహతో ఆ మార్గంలో పరిశోధన విరమించుకున్నాడు.

1898లో మార్టినస్ విల్లెం బైజెరింక్ అనే డచ్ వృక్ష శాస్త్రవేత్త కూడా అదే ప్రయోగం చేసి చూశాడు. అతడు కూడా పొగాకు మొక్క ఆకులని పిండి, రసం తీసి ఆ రసాన్ని పోర్సెలేన్ జల్లెడలో వడపోశాడు. ఆ రసం వల్ల మంచి మొక్కలకి తెగులు పడుతుందని అతడు కూడా గమనించాడు.

అయితే టొబాకో మొసాయిక్ వ్యాధికి కారణమైన క్రిములు పోర్సెలేన్ జల్లెడలోంచి జారిపోయేంత చిన్నవని ఇతడు ఒప్పుకోడానికి సిద్ధంగా ఉన్నాడు. బహుశ ఆ క్రిములు నీటి అణువుల ఇంత పరిమాణంలో ఉన్నాయోమో. కనుక నీటి అణువులు దూరగలిగేటంత కంతలోంచి ఈ క్రిములు కూడా దూరి జారిపోతాయేమో.

మొక్కల్లోంచి వచ్చే విషపూరిత రసానికి "వైరస్" అని పేరుంది. తెగులు పట్టిన పొగాకు మొక్కల నుండి తీసిన రసం మంచి మొక్కలకి తెగులు తెస్తోంది కనుక దానికి "వైరస్" అని పేరు పెట్టాడు. క్రమేపీ ఆ పేరు ఆ రసంలో ఉండే అతి చిన్న క్రీములకి పెట్టిన పేరుగా పరిణమించింది.

మరి ఈ వైరస్లు ఎంత చిన్నవి? నిజంగానే అవి నీటి అణువుల కన్నా పెద్దవి కావా? చాలా కాలం వరకు దీనికి సమాధానం ఎవరికీ తెలీలేదు. 1931లో విలియం జోసెఫ్ ఎల్ఫోర్డ్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఈ సమస్యని పరిశోధనకి తీసుకున్నాడు. పోర్సెలేన్ జల్లెడలో కన్నా చిన్న కన్నాలున్న జల్లెడ తీసుకుంటే ఎల ఉంటుందో ఆలోచించాడు.

పోర్సేలేన్ కి బదులు అతడు కొలోడియాన్ (collodion) వాడాడు. ఈ కొలోడియాన్ సెలో ఫేన్ వంటి సన్నని పారదర్శకమైన పొర. అందులో అతి చిన్న కన్నాలు ఉంటాయి. కొలోడియాన్ని తయారు చేసే పద్ధతిని బట్టి ఈ కన్నాల పరిమాణం మారుతుంది. ఆ కన్నాలని ఇంకా ఇంకా చిన్నవి చేస్తూ పోవచ్చు.

బాక్టీరియమ్ పరిమాణంలో నూరోవంతు పరిమాణం గల కన్నాలు ఉన్న కొలోడియాన్ పొర లోంచి వైరస్ రసాన్ని పోనిచ్చాడు. ఆ కొలోడియాని వాడినప్పుడు నీరు బయటికి పోయింది గాని వైరస్ ఇవతలే ఉండిపోయింది. అలా బయటికి వచ్చిన రసం వల్ల వ్యాధి కలుగలేదు.

అంటే వైరస్ రేణువులు బాక్టీరియా కన్నా చిన్నవే అయినా నీటి అణువుల కన్నా పెద్దవన్నమాట.

తరువాత 1930లలో ఓ కొత్తరకం సూక్ష్మదర్శినులు కనుక్కున్నారు. వీటిల్లో కాంతికి బదులు ఎలక్ట్రాన్లు అనే మూలకణాలని వాడుతారు. సాధారణ సూక్ష్మదర్శినులు ఎన్నడూ చూపలేని అతి చిన్న వస్తువులని ఈ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినులు చూపగలిగాయి. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినుల సహాయంతో చివరికి శాస్త్రవేత్తలు వైరస్లని చూడగలిగారు. .

టొబాకో మొసాయిక్ వ్యాధిని కలుగజేసే వైరస్ ఓ చిన్న గొట్టంలా వుంటుంది. దాని పొడవు సగటు బాక్టీరియాలో సగం ఉంటుంది. చాలా సన్నగా ఉంటుంది. ఇలాంటి 7,000 వైరస్లని ఓ బ్యాక్టీరియాలో పట్టించేయొచ్చు.

ఇంకా చిన్న వైరస్లు కూడా వున్నాయి. యెల్లో ఫీవర్ వైరస్లు ఎంత చిన్నవంటే అలాంటివి 40,000 ఓ బాక్టీరియాలో పడతాయి.

వైరస్లు ప్రత్యేక సాధనాలతో తప్ప చూడలేనంత చిన్నవే అయినా వాటి గురించి జాగ్రత్తగా వుండాలి. మొట్టమొదట జయించబడ్డ వ్యాధి అయిన స్ఫోటకం (స్మాల్ పాక్స్) వైరస్ వల్ల వచ్చేదే.

గత 125 ఏళ్లుగా జరిగిన పరిశోధనల వల్ల నేడు మనుషులు మునుపటి కన్నా ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో బతుకుతున్నారు. పాశ్చర్ కాలానికి ముందు సగటు అమెరికన్, లేదా యూరోపియన్ 40 ఏళ్లు బతికేవారు. ఈ రోజుల్లో సగటు జీవితకాలం 70 ఏళ్లకి పెరిగింది.

పాశ్చర్ తదితరుల కృషి వల్ల మనలో ప్రతి ఒక్కరం అదనపు ఆయుషు పోసుకుని సుఖంగా బతుకుతున్నాం.

ఐసాక్ అసిమోవ్ ప్రఖ్యాత శాస్త్ర వేత్త, విజ్ఞానశాస్త్రంపై పుంఖాను పుంఖాలుగా రాసి ప్రఖ్యాతి గాంచాడు. ఇతను పెద్దలకోసం, పిల్లల కోసం, విరివిగా రాశాడు. రష్యాలో పుట్టిన ఆసిమోవ్ మూడేళ్ళ వయసప్పుడు తల్లిదండ్రులతోపాటు అమెరికాకు వచ్చి బ్రూక్లిన్లో పెరిగాడు. అతడు 200 పైగా పుస్తకాలు రాశాడు. తెలియనిదాని గురించి శోధించే గుణం, మానవ నైజం గురించి లోతైన అవగాహన కారణంగా అతని రచనలు లక్షలాది పెద్దలను, పిన్నలను అలరిస్తున్నాయి.

ఆధారము: చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate