অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఇది కధ కాదు !

ఇది కధ కాదు !

jun009.jpgమీరు శుద్ధ 'బుద్ధిమంతులో', అల్లరి పిల్లలో నాకు తెలియదు కాని పిల్లలు చేసే అల్లరి పనుల్ని చూసి పెద్దవాళ్లు వాళ్లను 'వీళ్లు పిల్లలు కాదురా నాయన పిడుగులు' అంటుంటారు. అలాంటి ఒక చిచ్చర పిడుగు గురించి తెల్సుకుందామా! సహజంగానే మీలాంటి పిల్లలు ఏది కనిపించినా అది బొమ్మయినా, మరొకటయినా చేతికందిందంటే దాన్ని చీల్చి చెండాడి ఏ ముక్కకా ముక్క చేసి చూస్తారు. విడ గొట్టి ఆ బొమ్మ ఎలా తయారైందో తెల్సుకోవాలనే కుతూహలం దాని వెనుక దాగివుందని మాబోటి ‘పెద్ద వాళ్లకు' అర్థం కాదనుకోండి! పగలగొట్టటమే కాదు మళ్లీ ఆ ముక్కల్ని జమ చేసి, పేర్చి తిరిగి బొమ్మను చేయాలనీ చూస్తారు సుమా! అంటే అర్థం మీరు ప్రయోగాలు చేస్తున్నారని, ఏదో కనిపెట్టేందుకు చూస్తున్నారని, అందుకే అంటారు పిల్లలు గొప్ప శాస్త్రవేత్తలని.

బారీ మార్షల్ కూడా మీలాంటి అల్లరి పిల్లవాడే. వాళ్ల నాన్న వృత్తి ఫిట్టర్ కావడం బారీ కుతుహలానికి మరింత తోడ్పడింది. భారీ మార్షల్ తల్లిదండ్రులు కార్నర్ వాన్ అనే సముద్రతీరంలో ఉండే తిమింగలాల నుండి రకరకాల ఉత్పత్తులను తయారు చేసే పట్టణంలో నివాసం ఉండేవారు. వాళ్ల ఇల్లు బీచ్ కు 100 గజాల దూరంలో ఉండే చిన్న ద్వీపం, బాబేజ్ ఐలాండ్ పై ఉండేది. సెలవుల్లో మీలాగే బారీ కూడా వాళ్ల అమ్మమ్మ గారి ఊరు కూల్ గూర్లీ (Kalgoorlie) వెళ్లేవాడు. ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలో ఉండే పెద్ద పట్టణ పెర్త్కు 370 మైళ్లు తూర్పుగా ఉండే బంగారు గనుల ప్రాంతం కాల్ గూర్లీ. ఎప్పటికీ ఏదో ఒకటి చేయటంతో తమ్ముళ్లతో ఆడటంతో బారీ తీరిక లేకుండా గడిపేవాడ అంత చిన్న వయస్సులోనే విల్లు, బాణం, ఉండేలు వంటి వాటిని తయారుచేసేవాడు. సెలవుల్లో మీరేం చేశారు! మరి ఈ ఎండాకాలం మీరేం చేశారు!

పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని చూసి వాళ్ల తాత ‘చిల్డ్రన్స్ ఎన్ సైక్లోపీడియా ( Children's Encyclopedia) పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. దాంతో మన చెకుముకిలో చేసిచూద్దాం' వంటి ఒక అధ్యాయం బారీ మార్షల్ ను బాగా ఆకట్టుకొంది. దాన్ని చూసి అనేక ప్రయోగాలు చేయటం మొదలెట్టాడు. తండ్రి షెడ్ లో పనిచేయడానికి కావలసిన పరికరాలు(Tools) అందుబాటులో ఉండేవి. తండ్రి కూడా ఓపిగ్గా పిల్లలకు తాను కారు రిపేరు చేసేటప్పుడు వాటి భాగాల గురించి అవి ఎలా పనిచేస్తాయో వివరించి చెప్పేవాడు. ఉండేలు తయారుచేయడంతో మొదలయిన భారీ ప్రయోగాలు క్రమంగా మోర్స్ కోడ్ సెట్ ను, తుపాకీలను, హైడ్రోజన్ తయారు చేసే జనరేటర్ ను తయారు చేసే వరకూ వెళ్లాయి. తమ్ముళ్ల కోసం ఒకసారి గాలిలో ఎగిరే బెలూన్లను తయారుచేశాడు. గాలికంటే తేలిగ్గా ఉండే వాయువుతో నింపితే బెలూన్లు బాగా ఎగురుతాయని వంటగ్యాస్ తో నింపి బెలూన్లు చేశాడు. అవి ఎగరటానికి బాగానే ఎగిరాయి. కాని ఒక వేళ నిప్పు, మంట తాకితే? గ్యాస్ వాడటంతో వచ్చే ప్రమాదాన్ని తెలియజేయాలని భారీ తండ్రి సిగరెట్ ను వెలిగించి ఎగిరే ఒక బెలూన్ కు అంటించాడు. అంతే పెద్ద మంట తండ్రి మొహం మంటల్లో చిక్కుకుంది. కనుబొమ్మలతో సహా మొహం కాలిపోయింది. అయినా తండ్రి వాళ్లని నిరుత్సాహపరచలేదు. వాళ్లు చేసే టపాసులు, బాంబులు పేలి ఒక్కోసారి పక్క ఇండ్ల వాళ్లతో తగాదాలు కూడా వచ్చేవిట! తండ్రి తాత్కాలికంగా పనిష్మెంట్ ఇచ్చినా కొడుకు ప్రయోగాలను మెచ్చుకొని ప్రోత్సహించేవాడట. పిల్లలకు కేవలం చదువులోనే కాకుండా ఆటలు, ఈత వంటివి నేర్పించేవాడు. బారీ ఎంత అదృష్టవంతుడో అనుకుంటున్నారు కదూ!

jun0010.jpgపన్నెండేళ్ల వయసులో జరిగిన ఒక సంఘటన బారీ మార్షలకు మంచి పేరునూ, ప్రఖ్యాతిని తెచ్చి పెట్టింది. ఇంట్లో పెద్దవాడైనందున బారీకి తమ్ముళ్లు, చెల్లెల్ని చూసుకోమని చెప్పి తల్లి సామాన్లు కొనుకొచ్చేందుకు బజారుకెళ్లింది. బారీ బాధ్యతగా తన తమ్ముళ్లనూ, చెల్లెల్ని చూసుకునేవాడు. కానీ ఆ రోజు మాత్రం చెల్లెలు ఉన్నట్లుండి ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడి కళ్లు తేలేసింది. బారీకి, తమ్ముళ్లకూ ఏమి పాలుపోలేదు. ఎందుకలా అయిందో తెలియదు. ఏం చేయాలో తోచక కంగారు పడ్డారు. చెల్లెలి వయసు కేవలం సంవత్సరంనర. ఆమె కూడా ఏమి చెప్పలేని స్థితి. బారీమార్షల్ వెంటనే తేరుకుని అంబులెన్స్ కోసం ఎమర్జెన్సీ నంబర్ కు (మన 108 వంటిది) ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చేలోగానే చెల్లెలికి కృత్రిమంగా శ్వాస ఇవ్వడం మొదలుపెట్టాడు. తాను ఈత నేర్చుకున్నప్పుడు నేర్చుకున్న ప్రథమ చికిత్స పద్దతిలో నోటిలో నోరు ఉంచి శ్వాస అందించే ప్రయత్నం చేశాడు. అప్పుడు గాని తెలియలేదు చెల్లెలు కిరోసిన్ తాగిందని. ఆ సంగతి వచ్చిన డాక్టర్లకు చెప్పడం, చెల్లెలు క్షేమంగా బయటపడటం జరిగిపోయాయి. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మరుసటి రోజు బారీమార్షల్ ఏడాదిన్నర చెల్లెని ఎలా కాపాడందీ, అంబులెన్స్ ను పిలవడంలో చూపిన సమయ స్ఫూర్తినీ మెచ్చుకుంటూ పత్రికల్లో పెద్ద ఫోటోతో కథనాలు వచ్చాయి. ప్రథమ చికిత్స చేసి పసిపిల్ల తాగిన కిరోసిన్ ను కనిపెట్టినందుకు బారీ మార్షల్ ను ఒక హీరోగా పొగిడాయి. విష పదార్థాలను పాల సీసాల వంటి నిత్యం వాడే పాత్రల్లో దాచి ఉంచరాదనే విషయాన్ని ప్రచారం చేయటానికి ఈ ఉదంతాన్ని పత్రికలు బాగా వాడుకున్నాయి. అత్యవసర పరిస్థితిలో అంబులెన్స్ కోసం ఫోన్ చేయాలని భారీ మార్షల్ అందరికీ మంచి పాఠం నేర్పాడని రాశాయి. అల్లరి పిల్లోడు బారీ మార్షల్ ఎంత చురుకైన వాడో, హేతుబద్దంగా ఆలోచించాడో! చిన్నతనంలోనే ఎన్నో ప్రయోగాలు చేసిన బారీ మార్షల్ పెద్దవాడయ్యాక ఎంత గొప్ప వాడయ్యుంటాడో ఒకసారి ఆలోచించండి. 2005వ సం. వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెల్చుకున్న బారీమార్షల్ మరెవరో కాదు మన చిచ్చరపిడుగే!

ఆధారం: కట్టా సత్యప్రసాద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate