অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కధలు - కాకర కాయలు

కధలు - కాకర కాయలు

ఆంగ్ల మాధ్యమంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కీర్తన తను చదువుతున్న పుస్తకం పూర్తి చేసి పక్కన పడవేసి తాతవైపు చూసింది.

తాత అది గమనించి కీర్తనవైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

“తాతా! నువ్వీ పుస్తకం చదివావా?” అని అడిగింది కీర్తన.

“ఏ పుస్తకం?” అని ప్రశ్నించాడు తాత.

“’ఎరౌండ్ ద వరల్డ్ యిన్ ఎయిటీ డేస్’ జూల్స్ వెర్న్ అనే రచయిత రాశాడు.” అని చెప్పింది కీర్తన.

“అవును. మంచి పుస్తకం. విమానాలు లేని కాలంలో ఓడలు, రైళ్ళు, కార్లు ఉపయోగించి 80 రోజుల్లో భూప్రదక్షిణం చేయవచ్చని, 1873లో జూల్స్ వెర్న్ వూహించి రాసిన పుస్తకం. దాన్ననుసరించి 'నెల్లీ బై’ అనే జర్నలిస్టు 72 రోజుల్లో 1889లో భూప్రదక్షిణం చేసింది కూడా. జూల్స్ వెర్న్ కి ఒక సైన్సు కల్పనా కథల రచయితగా పేరుంది.” అని చెప్పాడు తాత.

కీర్తన కళ్ళు విప్పార్చుకుని చూసింది. “సైన్సు కల్పనా కథలా?... అంటే?” అని ప్రశ్న వేసింది.

“అంటే సైన్సు సూత్రాలను అవగాహన చేసుకుని కథలల్లటం.” అన్నాడు తాత.

“కాస్త వివరంగా చెప్పు తాతా!” అంది కీర్తన.

“కథలూ, కాకరకాయలు అంటాం గాని కాకరకాయలు తరిగినంత ఈజీ కాదు కథలు రాయడం. అందులో సైన్సు కథలు. సైన్సు పట్లా, దాని సూత్రాల పట్ల అవగాహన వుండటమే కాకుండా భవిష్యత్తులో వాటి ద్వారా ఏం సాధించవచ్చో ఊహించగలిగి వుండాలి. పైగా కథల్లో హేతుబద్దత ఉండాలి. అంటే సకారణ వివరణ, అలాగే తగిన తర్కం వుండాలి అన్నాడు తాత. వున్నట్టుండి నువ్వు సినిమాలు చూస్తావు గదా. ప్రేక్షకులకు ఇలా జరుగుతుంది అని నమ్మకం కలిగించేలా వున్న సినిమా కథలు చాలా మందికి నచ్చుతాయి. కథలేకుండా సినిమా తీయగలమా?” అని అడిగాడు.

“అదెలా కుదురుతుంది? సినిమాకు కథ కావాలి. నవలకు కూడా ఒక కథ వుండాలి.” అంది కీర్తన.

“సైన్సుని ఉపయోగించి రాసే కథలు సైన్సు కథలు. ఇటువంటి కథలను ఆధారం చేసుకుని ఆంగ్లంలో చాలా సినిమాలు వచ్చాయి. బ్లేడ్ రన్నర్, 2001 ఎ. స్పేస్ ఒడిస్సీ, స్టార్ వార్స్, ది మాట్రిక్స్, ఏలియన్, ఇంకా ఇటీవలే వచ్చిన అవతార్ (ఇంగ్లీషు వాళ్ళు ఎనేటర్ అని పలుకుతారు), జురాసిక్ పార్క్ మొదలయినవన్నమాట. ఇవన్నీ సైన్సుని ఆధారం చేసుకుని వూహించి రాసిన కథలతో తయారైన సినిమాలు.” అని చెప్పాడు.

“అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా జనవరి 2వ తారీఖుని సైన్సు కల్పనా కథా దినోత్సవం (Science Fiction Day) గా జరుపుకుంటారని నీకు తెలుసా?” అని మరో ప్రశ్న వేశాడు తాత.

కీర్తన తల అడ్డంగా వూపింది.

“కాని మనదేశంలో ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్సు దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే సర్ సి.వి.రామన్ ఫిబ్రవరి 28న 'రామన్ ఎఫెక్ట్' అనే కాంతి ధర్మాన్ని కనుగొన్నాడు. అందుకు ఆయనకు నోబుల్ బహుమానం వచ్చింది కూడా.” అని చెప్పింది.

నిజమే, ఆ రోజునే ఈ 'చెకుముకి' పత్రిక నడుపుతున్న సైన్సు ప్రచార సంస్థ జనవిజ్ఞాన వేదిక 1988లో ఆవిర్భవించింది. అయితే, ఐక్యరాజ్యసమితి సూచనల ప్రకారం ప్రపంచం నవంబర్ 10ని శాంతి, కోసం, మానవ శ్రేయోభివృద్ధి కోసం విశ్వ శాస్త్రం విజ్ఞాన. దినోత్సవంగా లేక అంతర్జాతీయ సైన్సు దినోత్సవంగా జరుపుకుంటుంది. కాని జనవరి 2ని మాత్రం అందరు 'సైన్సు ఫిక్షన్ డే' గా ఎందుకు పరిగణిస్తారో నీకు తెలుసా” అని అడిగాడు తాత.

మళ్లీ తల అడ్డంగా తిప్పింది కీర్తన.

ప్రపంచంలోనే అతి ప్రసిద్ధిచెందిన సైన్స్ కల్పనా కథ రచయిత ఐజాక్ అసిమోవ్. ఈ వైజ్ఞానిక కధా రచయిత రష్యాలోని పెట్రోవిచి లో జనవరి 2, 1920లో జన్మించాడు. తర్వాత కాలంలో అమెరికా తరలివచి అమెరికన్ పౌరసత్వం తీసుకున్నాడు. ఏప్రిల్ 6, 1992 లో మరణించే నాటికి ఆయన 500 పుస్తకాలు, తొంబైవేల లేఖలు, వ్యాసాలు అన్నీ సైన్సు గురించే రాశాడు. ఇన్ని రచనలు చేసిన వ్యక్తి మరొకడు లేడు. ఆయన రచన ఆధారంగా తీసిన నైట్ ఫాల్, బైసెంటిన్నియల్ మ్యాన్ ఐ-రోబో, ఫార్ములా ఆఫ్డెత్ మొదలైన సినిమాలు బాగా ప్రసిద్ధి పొందాయి. ఆయన జీవరసాయనశాఖ (Biochemistry) అధ్యాపకునిగా పనిచేశాడు. ఆధునిక సైన్స్ కల్పనాకథకు పితామహుడు, గొప్ప హేతువాధి మానవతావాది, నిరీశ్వరవాది. మనం ఈనాడు వాడుతున్న 'రోబోటిక్స్' అనే పదాన్ని ఆయనే తన ‘లయర్'లో సృష్టించాడు. ఇంకా 'సైకోహిస్టరీ' (మనస్తత్వశాస్త్రం, సాంఘిక, గణిత శాస్త్రాల ఆధారంగా గతం, వర్తమానం, భవిష్యత్తులో ప్రజా సమూహాల ప్రవర్తన తెలియజేసే చరిత్ర 'స్పోమె' (భౌతిక వనరుల ద్వారా గ్రహించి జీవవ్యవస్థ ద్వారా ఉష్ణత్ప జరగడం) అనే వైజ్ఞానిక పదాలన సృష్టించాడు. ఇంకో విషయం తెలుసా సైన్స్ ఫిక్షన్ ని సంక్షిప్తంగా సై.ఫి. అని అంటున్నారు. కార్ల్ సాగాన్ వంటి సై.ఫి. రచయితలు కూడా ఖ్యాతి పొందారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వేధింపుల మూలాన ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల తన అంతిమ లేఖలో కార్ల్ సాగాన్ని ప్రస్తావించాడు కూడా.” అని చెప్పాడు తాత.

“అయ్యో!” అంది కీర్తన.

“మరి తెలుగులో సై. ఫి రాసేవారు లేరా?” అని అడిగింది.

“ఉన్నారు. కానీ పాఠకుల దృష్టి ఆకర్షించేంత రచనలు ఇంకా రాలేదు.” అన్నాడు తాత.

“నేను సైంటిస్టుని అవుతాను. సై.ఫి కధలు రాస్తాను తాతా!” అంది కీర్తన.

“Wish you all the Best” అన్నాడు తాత!

ఆధారం: పైడిముక్కల ఆనంద్కుమార్, వరంగల్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate