অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్రిములు - వ్యాధులు

క్రిములు - వ్యాధులు

వాటంతట అవి పుట్టే సిద్ధాంతం తప్పని నిరూపిస్తూ పాశ్చర్ ప్రయోగాలు చేస్తున్న కాలంలోనే ఫ్రాన్స్ లో  ఓ తీవ్రమైన సమస్య చెలరేగుతోంది.

దక్షిణ ఫ్రాన్స్లో మల్బరీ పంట పండించేవారు. ఆ మొక్కల ఆకులు పట్టుపురుగులకి (silk worms) ఆహారంగా ఉండేవి. ఆ పట్టుపురుగుల గూడు (cocoons) నుండి పట్టుదారం తీసేవారు.

వట్టు పరిశ్రమ ఫ్రాన్స్ కి చాలా ముఖ్యమైన పరిశ్రమ. ఇష్పడది నాశనమైపోతోంది. పట్టుపురుగులకి ఏదో వ్యాధి సోకి చచ్చిపోతున్నాయి. ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు.

పాశ్చర్ కి పిలుపు వెళ్లింది. వైన్ పరిశ్రమను ఇతడే ఆదుకున్నాడు. పట్టు పరిశ్రమను కూడా ఇతడే ఆదుకోగలడు. ఆ నమ్మకంతోనే ప్రత్యేకించి అతడికి కబురు పెట్టారు. పట్టుపురుగుల గురించి నాకు పట్టుమని పది మాటలు కూడా రావు, నన్నొదిలేయండి' అంటూ మొత్తుకున్నాడు. అయినా అతన్నే ప్రాధేయపడ్డారు.

1865లో పాశ్చర్ దక్షిణాదిగా ప్రయాణించాడు. ఈ సందర్భంలో కూడా తన సూక్ష్మదర్శినిని ఉపయోగించాడు. కొన్ని మల్బరీ ఆకుల మీద సూక్ష్మక్రిములు కనిపించాయి, మరి కొన్నిటి మీద కనిపించలేదు. ఆ సూక్ష్మక్రిములు ఉన్న ఆకులు తిన్న పట్టుపురుగులకి వ్యాధిసోకింది. వాటి శరీరాల్లో కూడా అవే సూక్ష్మక్రిములు దొరికాయి.

ఈ సూక్ష్మక్రిములు సజీవమైనవని, అవి పట్టుపురుగుల శరీరాల్లో పెరుగు తున్నాయని పాశ్చర్! తేటతెల్లమయ్యింది. ఒక పెద్ద జీవంలో ఉంటూ, పెరిగే మరో చిన్న జీవాన్ని పరాన్న జీవి (పారసైట్) అంటారు. సూక్ష్మక్రిమి పట్టుపురుగుని పట్టుకుని ఓ పరాన్న జీవి బతుకుతోందన్నమాట.

ఇప్పుడేం చెయ్యాలి? వైన్ ని వేడిచేసి యిస్ట్ కణాలని చంపాం. దానివల్ల వైనికి హాని జరగదు. కాని పట్టుపురుగులని వేడిచేస్తే సూక్ష్మక్రిములు చచ్చిపోతాయో లేదో దేవుడెరుగు, అసలు పట్టుపురుగులకే ముప్పు వస్తుంది.

అయినా సరే. అవి చచ్చిపోవలసిందే. వేరే దారి లేదు. వ్యాధి వ్యాపించకుండా వుండాలంటే చీడపట్టిన పట్టుపురుగులని, మల్బరీ ఆకులని కూడా నాశనం చెయ్యాలి. ఆరోగ్యంగా ఉన్న పట్టుపురుగులతోను, ఆకులతోను ఉత్పత్తి కొనసాగించాలి.

అధికారులు పాశ్చర్ మాట విన్నారు. పథకం పనిచేసింది. పట్టుపరిశ్రమ నిలదొక్కుకుంది.

సూక్ష్మక్రిముల వల్ల వ్యాధులు వస్తాయన్న విషయం ఇప్పుడు పాశ్చర్ కి స్పష్ట మయ్యింది. వ్యాధి అంటుద్వారా (contagious) అంటే ఒక ప్రాణి నుండి మరో ప్రాణికి వ్యాపించే గుణం గలదైతే అది సూక్ష్మక్రిమి మూలంగా వచ్చినదే. వ్యాధిగల ప్రాణి నుండి ఆరోగ్యవంతమైన ప్రాణిలోకి రోగక్రిమిప్రవేశిస్తే వ్యాధి ఆరోగ్యవంతమైన జీవికి సోకుతుంది.

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు కూడా సూక్ష్మక్రిములు గాలి ద్వారా వ్యాపించగలవు. చేతుల ద్వారా కూడా వ్యాపించగలవు విసర్జిత పదార్ధం ద్వారా కూడా వ్యాపించ గలవు. ఇవి కంటికి కనిపించనంత చిన్నవి కనుక అనారోగ్యం కలిగే వరకు అవి లోనికి ప్రవేశించినట్టే ఆ మనిషికి తెలీదు.

ఇదంతా స్పష్టం చేసిన పాశ్చర్ "వ్యాధి కారక సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని" (germ theory of disease) ప్రతిపాదించాడు.

వ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిములు ఎక్కువగా బాక్టీరియానే. అసలు మామూలుగా మనం సూక్ష్మక్రిములుగా వ్యవహరించేది వీటినే. అయితే రోగాలు తెచ్చేది ఒక్క బాక్టీరియా మాత్రమే కాదు. స్ట్, ప్రోటోజువా మొదలైన తదితర సూక్ష్మక్రిములు కూడా రోగాన్ని కలుగజేయగలవు.

సూక్ష్మక్రిముల వల్ల రోగాలు వస్తాయన్నది నిజమే అయినా, ప్రతీ సూక్ష్మక్రిమి రోగకారకమైనదే అనడానికి లేదు. నిజానికి సూక్ష్మక్రిములలో చాలా చిన్న శాతం మాత్రమే ఇతర జీవాలకి హాని కలిగిస్తాయి. నేలలో, నీటిలో, గాలిలో నివసించే సూక్ష్మక్రిములు చాలా మటుకు హానిచేయనివే. వాటిలో ఎన్నో మనిషికి ఎంతో పనికొస్తాయి కూడా. కొన్ని బాక్టీరియా మట్టిని సారవంతం చేస్తాయి. మరికొన్ని చచ్చిన మొక్కల్ని, జంతు కళేబరాలని కుళ్లబెట్టి వాటిని వివిధ పోషకాల కింద మారుస్తాయి. ఆ పోషకాలు ఇతర మొక్కలకి, జంతువులకి ఉపయోగపడతాయి.

అయితే మరో రకం వ్యాధులు ఉన్నాయి. ఇవి అంటు ద్వారా రావు. ఇవి సూక్ష్మక్రిముల వల్ల రావు.

రోగం తెప్పించని సూక్ష్మక్రిములు ఉన్నా, సూక్ష్మక్రిముల వల్ల రాని రోగాలు ఉన్నా కూడా, పాశ్చర్ కాలంలో తెలిసిన రోగాల్లో చాలా మటుకు సూక్ష్మక్రిముల వల్ల వచ్చేవే. కనుక పాశ్చర్ తన సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు డాక్టర్లు దాన్ని గురించి లోతుగా ఆలోచించసాగారు.

అలాంటి డాక్టర్లలో ఒకరు ఇంగ్లీష్ దేశస్థుడైన జోసెఫ్ లిస్టర్. ఇతగాడు బాక్టీరియాలని స్పష్టంగా చూపెట్టగల సూక్ష్మదర్శినిని నిర్మించిన వ్యక్తికి కొడుకు. పాశ్చర్ సిద్ధాంతం గురించి విన్న లిస్టర్ కి సెమ్మెల్వేస్ మాటలు జ్ఞాపకం వచ్చాయి. బలమైన రసాయనాలతో చేతులు కడుక్కోవడం వల్ల చావులు తగ్గిపోవడానికి కారణం, ఆ రసాయనాలు చేతులమీద ఉండే సూక్ష్మక్రిములని చంపేయడమే కావచ్చు.

1867లో లిస్టర్ తన తోటి డాక్టర్లు శస్త్రచికిత్స చేయబోయే ముందు తమ చేతులని, చికిత్స చేసే సాధనాలని బలమైన రసాయనాలతో కడగాలని నియమం పెట్టాడు. అంతకు ముందు తరచూ ఆపరేషన్ విజయవంతం అయినా రోగులు జ్వరంతో మరణించేవారు. డాక్టర్లు తమ చేతులు, సాధనాలు కడుక్కోవడం మొదలు పెట్టాక అలాంటి చావులు ఆగిపోయాయి.

1870లో ఫ్రాన్స్ యుద్ధంలో మునిగిపోయింది. దేశభక్తిపరుడైన పాశ్చర్ యుద్దంలో చేరాలని అనుకున్నాడు. కాని అప్పటికే అతని వయసు 50 దగ్గర పడడంతో ఫ్రెంచ్ అధికారులు అతడు యుద్ధానికి అనర్హుడు అని చెప్పారు. పైగా అతడి సేవలు యుద్ధభూమిలో కన్నా ప్రయోగశాలలోనే ఎంతో అవసరం. కనుక పాశ్చర్ కి ఆసుపత్రి బాధ్యతలు అప్పగించారు. బాండేజిలని, సాధనాలని రసాయనాలతో శుభ్రం చేయమని డాక్టర్లని పాశ్చర్ ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా పాశ్చర్ ఎన్నో ప్రాణాలు కాపాడాడు.

యుద్ధం తరువాత ఆంత్రాక్స్ అనే వ్యాధి మీదకి పాశ్చర్ ధ్యాస మళ్లించాడు. ఈ జబ్బు పశువులకి, గొర్రెలకి వస్తుంది. ఇది చాలా భయంకరమైన వ్యాధి. ఆ జబ్బుతో పోయిన జంతువుల కళేబరాలని పూడ్చిన నేల కూడా ఆ జబ్బుతో కుతకుతలాడుతున్నట్టు ఉండేది.

బాక్టీరియాలజీకి పితామహుడైన కోన్తో పనిచేసిన రాబర్ట్ కోక్ అనే జర్మన్ డాక్టర్ ఉండేవాడు. అతడు సూక్ష్మక్రిమి సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని వ్యాధి సోకిన జంతువులని పరీక్షించడం ప్రారంభించాడు. ఆ రోగానికి కారణమైన ఓ క్రిమిని కనుక్కున్నాడు.

ఆ ఆంత్రాక్స్ బాక్టీరియమ్ జంతు దేహానికి బయట ఉన్నప్పుడు దాని చుట్టు ఓ బలమైన గోడని నిర్మించుకుంటుందని కనుక్కున్నాడు కోక్. అలాంటి గోడగల బాక్టీరియానే “స్పోర్" (spore) అంటారు. నీరు, ఆహారం లేకుండా ఈ స్పోర్ చాలా కాలం మనగలదు. అందుకే ఆంత్రాక్స్తో చచ్చిపోయిన జంతువులని పూడ్చినప్పుడు, ఆ మట్టిలో బాక్టీరియా స్పోర్లుగా జీవించేవి. అక్కడి గడ్డిమేసిన జంతువులకి ఆ వ్యాధి సోకుతూ వుండేది.

అది విన్న పాశ్చర్ ఆంత్రాక్స్తో చచ్చిపోయిన జంతు కళేబరాలని ముందు దహనం చెయ్యాలని సూచించాడు. దహనంలో స్పోర్లు కూడా చచ్చిపోతాయి.

పాశ్చర్ కి జెన్నెర్ ప్రయోగాలు కూడా గుర్తున్నాయి. ఒకసారి ఆంత్రాక్స్ వచ్చి బతికిన జంతువుకి మళ్లీ ఆంత్రాక్స్ రాదు. ఆంత్రాక్స్ని పోలిన, అంతకన్నా తక్కువ తీవ్రత గల వ్యాధి ఏదైనా ఉంటే, దాన్ని ముందు కలుగజేసి జంతువుల్లో రోగనిరోధకత కల్పించవచ్చు. దురదృష్టవశాత్తు అటువంటి వ్యాధి ఏదీ కనిపించలేదు.

ముందుగా ఆంత్రాక్స్ సోకిన జంతువుల నుండి కొన్ని బాక్టీరియాని సేకరించాడు. ప్రత్యేక ఆహారం మీద వాటిని పోషించాడు. అప్పుడు కొన్ని బాక్టీరియాని తీసుకుని వేడిచేశాడు. అవి పూర్తిగా చచ్చేంతవరకు వేడిచేయలేదు. సగం చచ్చేట్టు వేడిచేశాడంతే అవి చావలేదు, కాని చేవ తగ్గి స్తబ్దుగా ఉండిపోయాయి.

ఈ విధంగా క్షీణించిన (attenuated) బాక్టీరియాని జంతువులలోకి ఎక్కించాడు. ఆ జంతువులకి తీవ్రరూపంలో వ్యాధి సంక్రమించదు. ఎందుకంటే ఈ క్షీణించబడ్డ బాక్టీరియా మెల్లగా పెరుగుతాయి. అయినా ఆ జంతు దేహాలు, బాక్టీరియాని నాశనం చేసే పోరాటంలో, ఇంకా హానికరమైన బాక్టీరియాకి ప్రతికూలంగా భద్రతాశక్తిని, రోగనిరోధకతని కలిగించుకున్నాయి. పాశ్చర్ ఆ పద్ధతిని అమలు చేసి చూశాడు. అది మంత్రంలా పనిచేసింది.

ఈ విషయంలో 1881లో ఓ సామూహిక పరీక్ష ఏర్పాటు చేశాడు. ఓ గొర్రెల మందను తీసుకుని వాటిలో సగానికి క్షీణించబడ్డ ఆంత్రాక్స్ బాక్టీరియా ఎక్కిందాడు. గొర్రెల్లో రోగనిరోధకత ఏర్పడేంతవరకు ఎదురుచూశాడు. అది జరిగాక అన్ని గొర్రెలలోకి భయంకరమైన, పూర్తి తీవ్రత గల ఆంత్రాక్స్ బాక్టీరియా ఎక్కించాడు.

కొన్ని రోజుల్లో ఆంత్రాక్స్ ఇనోక్యులేషన్ ఆందని గొర్రెలు జబ్బుపడి చచ్చిపోయాయి. ఇనోక్యులేషన్ అందిన గొర్రెలు ఆరోగ్యంగా ఉండిపోయాయి. అప్పట్నుంచి సూక్ష్మక్రిమి సిద్ధాంతానికి ఎవరూ ఎదురు చెప్పలేదు. ముఖ్యంగా ఆ సిద్ధాంతం వల్ల రోగాన్ని అరికట్టే పద్ధతులు బయటపడుతున్నాయి కనుక డాక్టర్లు కూడా కిక్కురుమనలేదు.

పాశ్చర్ తరువాత వ్యాధికి క్రిమికి మధ్య ఉండే సంబంధాన్ని బాగా అధ్యయనం చేసిన వారిలో రాబర్ట్ కోక్ ముఖ్యుడు. మనుషులకీ, జంతువులకి వచ్చే రకరకాల వ్యాధులకి కారణమయ్యే బాక్టీరియాలని అతడు వెదుకుతూ పోయాడు.

ప్రతీ చోట ఎన్నో రకాల బాక్టీరియా కలిసి వుండటంతో వాటిలో ప్రత్యేకించి రోగానికి ఏది కారణమో తెలుసుకోవడం కష్టంగా వుండేది. క్రిములని పోషించడానికి రసానికి బదులు, "అగర్-గర్" అనే ఓ జెలటిన్ (gelatin) (జిగురులాంటి) పదార్భాన్ని వాడడం మొదలెట్టాడు

చదునైన, వెడల్పాటి పళ్ళెంలో పరిశుద్ధమైన అగర్-అగర్ పోసేవాడు. అది చల్లబడి గట్టిపడేది. బాక్టీరియా ఉన్నరసాన్ని దాని మీద కొద్దిగా పరిచేవాడు. సన్నగా పరచడంతో అవి ఇక్కడొకటి, అక్కడొకటి అలా దూరదూరంగా ఉండేవి. ఎక్కడున్నవి అక్కడ అగర్-జగర్లో పెరిగేవి కాని పెద్దగా కదలలేకపోయేవి. ఎక్కడ వేసిన బాక్టీరియా అక్కడే పెరిగి పెద్దయ్యేది. అవే కాక వాటి వంశాకురాలు కూడా అక్కడే వర్ధిల్లేవి. ఆ సంతతికి మూలవిరాట్టు అయిన బాక్టీరియా, దాని సంతతితో కలసి వంశపారంపర్యంగా ఒకేచోట స్థిరనివాసం ఏర్పరచుకునేది!

అలా పెరిగిన బాక్టీరియా సమాజాలని (colony) కోక్ వేరువేరుగా పరీక్షిస్తూ వచ్చాడు. వాటిలో ఏ సమాజం వల్ల వ్యాధి కలుగుతోందో పరిశీలించాడు. ఇలా క్రమంగా టీబీకి, కలరాకి కారణాలైన బాక్టీరియాలని కనుక్కున్నాడు. బ్లాక్ ఒత్తి కారణమైన బాక్టీరియాని కూడా అదే విధంగా కనుక్కున్నాడు.

ఒకసారి రోగకారక క్రిమి దొరికాక దాని సహాయంతో రోగాన్ని అరికట్టే పద్ధతులు రూపొందించవచ్చు. పాశ్చర్ కనిపెట్టిన బాక్టీరియాని వేడిచేసి క్షీణింపజేసే పద్దతి ఒకటి. కోక్ సహచరుడైన ఎమిల్ ఆడోల్ఫ్ ఫాన్ బెహింగ్ అనే జర్మన్ డాక్టర్ మరో పద్ధతిని కనుకున్నాడు.

అదే విధంగా ఇతర వ్యాధులకి కూడా ఆంటీటాక్సిన్లు రూపొందించగలమా అని ఆలోచించాడు బెహ్రింగ్. ఆ రోజుల్లో తరచు పిల్లలకి వచ్చే వ్యాధి డిప్తీరియా. బెహ్రింగ్, అతడి మిత్రుడు పాల్ ఎహర్లిక్ అనే మరో జర్మన్ డాక్టర్, డిప్తీరియా బాక్టీరియాని జంతువుల్లోకి ఎక్కించి, ఆ జంతువుల రక్తాన్ని తీసుకునేవారు. ఆ రక్తంలో డిప్తీరియా ఆంటీటాక్సిన్ ఉంటుంది.

ఆ విధంగా 1892లో పెద్ద మోతాదులో డిప్తీరియా ఆంటీ టాక్సిన్ తయారయ్యింది. ఈ మందు పిల్లలకి డిప్తీరియా రాకుండా కాపాడడమే కాక, వచ్చిన పిల్లలకి నయం చేస్తోంది కూడా. క్రమంగా మనుషుల్లో డిప్తీరియా భయం పోయింది.

బాక్టీరియా మీద ఎహర్లిక్ మరో విధంగా దండయాత్ర మొదలు పెట్టాడు. బహుశ రోగకారక క్రిమిని నిర్మూలించే రసాయనాలు ఉన్నాయేమో. వాటిని రోగిలోకి ఎక్కిస్తే రోగికి హాని కలగకుండా ఆ క్రిమిని మాత్రమే నాశనం చేస్తాయేమో. 1909లో ఆర్సినమీస్ అనే మందును అతడు, అతని సహచరులు కనుక్కున్నారు. అది సిఫిలిస్ అనే రోగాన్ని కలుగజేసే బాక్టీరియాని నాశనం చేస్తోంది.

పాశ్చర్, కోక్, బెహ్రింగ్, ఎహర్లిక్ మొదలైన వారి కాలం నుండి, మరెన్నో ఆంటీటాక్సిన్లు రూపొందించబడ్డాయి. ఎన్నోరకాల బాక్టీరియాని చంపగల మందులు కనుక్కున్నారు. ఇదిగాక రోగ నిరోధకతకి పరిశుభ్రత ఎంత అవసరమో మనుషుల్లో అవగాహన పెరగసాగింది. చేతులు శుభ్రంగా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం స్వచ్చంగా ఉండాలి. నీరు నిర్మలంగా ఉండాలి. వ్యరాలని జాగ్రత్తగా పారేయాలి. ఈ పద్ధతులన్నీ రోగకారక క్రిములకి కళ్లెం వేస్తాయి.

ఇలాంటి అవగాహనతో ప్రపంచంలో అంటువ్యాధుల బెడద చాలా మటుకు తగ్గింది. ఈ రోజుల్లో బ్లాక్ డెత్ మనమీద దండయాత్ర చేస్తుందన్న భయం లేదు. పోనీ చేసినా దాంతో ఎలా పోరాడాలో ఇప్పుడు డాక్టర్లకి తెలుసు.

అంతే కాదు. సూక్ష్మదర్శినిలో కూడా కనిపించనంత అతి సూక్ష్మక్రిముల వల్ల వచ్చే రోగాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అతి సూక్ష్మక్రిముల వల్ల వచ్చే ఓ రోగంతో ఇప్పుడు పాశ్చర్ పోరాటం ప్రారంభించాడు.

ఆధారము: చెకుముకి

 

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate