অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నీటి కాలుష్యం

నీటి కాలుష్యం

mar010.jpgఅనునిత్యం ఎక్కడ చూసినా పొల్యూషన్ పొల్యూషన్. అదే మాట వింటూనే ఉన్నాం. అంతగా భాగమైపోయింది.. మానవ జీవితంలో ఈ పొల్యూషన్, ఈ పదం లాటిన్ భాషలోని 'పొల్యూటోనియమ్' అనే పదం నుంచి వచ్చింది. పొల్యూషన్ ను తెలుగులో 'కాలుష్యం' అంటున్నాం. కాలుష్యానికి కారణమైన వాటిని కలుషితాలు అంటారు. కలుషితాలు అనేవి మొక్కలు, జంతువులు, మానవులే కాక మొత్తం వాతావరణం మీదే ప్రభావం చూపిస్తున్నాయి. ఆధునిక శాస్త్రవేత్తలయిన ఓడమ్, స్మిత్, సౌత్ విక్ల అభిప్రాయం ప్రకారం అపరిమితంగా పెరుగుతున్న మావన జనాభా వారి అవసరాలు, త్వరితగతిన పెరుగుతున్న పట్టణ అభివృద్ధి, జనావాసాలకై అడవులను నరకటం, పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పటం, వాహనాల రద్దీ, పరిసరాల పట్ల ప్రజలలో సరైన అవగాహన లేకపోవడం వంటివన్నీ కలుషితాలు ఏర్పడటానికి కారణమవుతాయి. కలుషితాల వలన భూమి, గాలి, నీరు, పరిసరాలు మొత్తంగా వాతావరణంలోనే జరిగే హానికరమైన మార్పునే వాతావరణ కాలుష్యం' అంటారు.

కాలుష్య ప్రాంతాలలో నివసించే పిల్లల్లో పెరుగుదల తక్కువగా ఉంటోందని తెలుస్తున్నది. కాన్పూర్ వంటి అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతాలలో కాలుష్య పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలలో శ్వాస సంబంధమైన డిప్తీరియా, ట్యూబర్ క్యులోసిస్ వంటి జబ్బులు, మానసిక వైకల్యాలు, క్యాన్సర్ సంబంధిత రోగాల వలన మరణాలు సంభవిస్తున్నాయని గమనించారు. కాలుష్య ప్రాంతాలలో నివసించే పిల్లల్ని, కాలుష్య రహిత ప్రాంతాలలో నివసించే పిల్లలతో పోల్చిచూసినప్పుడు వారి ఎత్తులోనూ, బరువులోనూ తేడాలుండటం పరిశీలించారు. ఈ వాతావరణ కాలుష్యాన్ని ముఖ్యంగా ఆరు రకాలుగా విభజించారు. 1. వాయు కాలుష్యం 2. నీటి కాలుష్యం 3. భౌమ కాలుష్యం 4. ఆహార కాలుష్యం 5. ధ్వని కాలుష్యం 6. కాంతి కాలుష్యం.

mar011.jpgభూమి మొత్తంలో ఒక వంతు మాత్రమే నేల ఉండి మిగతా మూడు వంతులు నీళ్ళచే ఆవరించబడి ఉన్నది. ఈ నీరు సముద్రాలు, నదులు, సరస్సులు, కుంటలు, చెరువులు, కాలువలు మొదలగువాటి ద్వారా లభిస్తున్నది. నీరు మనకు సహజ వనరు. మానవులకు, జంతు సముదాయాలకు, మొక్కలకు నీరు లేనిదే మనుగడ సాధించలేవు. నీరు త్రాగటానికి, నిత్య జీవిత అవసరాలకు మాత్రమే కాకుండా వ్యవసాయానికీ, పరిశ్రమలకు, కరెంటు ఉత్పత్తికీ, నిర్మాణాల కట్టుబడికీ ప్రతి పనీ నీటితోనే ముడిపడి వున్నది. ఇంత ప్రాధాన్యత కలిగిన నీరు కలుషితమైతే అనేక వ్యాధులు రావటం, పంటలు పాడై పోవడం వల్ల జీవులు చనిపోవడం జరుగుతాయి.

వ్యవసాయ రంగంలో ఉపయోగించే తెగుళ్ళ మందుల, క్రిమిసంహాక మందులు, ఎరువులు ఇంకా పంచదార, తోళ్ళు, కాగితం వంటి పరిశ్రమల నుండి వెలువడే రసాయన పదార్థాలు దగ్గరలో ఉన్న నదులలో కాలవలలోకి వదలటం వలన నీరు కలుషితమవుతుంది. ఇటువంటి నీరు జీవులకు హానికరం. పరిశ్రమల నుండి వెలువడే రసాయనిక వ్యర్థాలలో పాదరసం, సైనైడ్, ఆర్సినిక్ యాసిడ్, ఫ్లోరిన్, సీసము, వెండి వంటివి మానవులకు హాని కలిగిస్తాయి. ప్రకాశం మరియు నల్గొండ జిల్లాల్లోని నీటిలో ఫ్లోరైడు ఎక్కువగా ఉన్నందున అక్కడి ప్రజలకు, పశువులకు ఫ్లోరిసిస్ వ్యాధి అధికంగా వస్తున్నది. ఈ వ్యాధి వలన ఎముకలు పలచబడిపోయి కాళ్ళు వంకరగా మారిపోతాయి. అలాగే నీటిలోకి చేరిన పాదరసం, ఆ నీటిని తాగిన జీవుల్లోకీ చేరుతుంది. ఉదాహరణకు ఆయా నదుల్లో ఉన్న చేపలు ఈ నీటిని స్వీకరించటం వలన ఆ చేపల శరీరాల్లో కి ఈ పాదరసం చేరుతుంది. ఆ చేపలను మానవులు భుజించటం వలన మానవులకు 'మినీమోటా' అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వలన మానసిక వైకల్యము, చూపును కోల్పోవడం వంటి లక్షణాలు ఉండి ఒక్కోసారి మరణానికి దారితీయవచ్చు. .

ఫ్లోరోసిన్ వంటి వ్యాధుల వలన మానవులు ప్రత్యక్షంగానూ, కలుషిత నీటిని తాగిన చేపల్ని తిన్నందువల్ల పరోక్షంగానూ మానవులు నీటి కాలుష్యంతో బాధలకు గురౌతున్నారు. నీటిలోకి వదలబడిన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, యూరియా వంటివి బాక్టీరియాల చర్యల వలన నీటిలోకి కార్బన్ డయాక్సైడ్ అధికంగా విడుదల అవుతుంది. దీని వలన నీటిలోని ఆక్సిజన్ తగ్గి, ఆ నీటిలో జీవిస్తున్న మొక్కలు, జంతువులు మరణిస్తారు. ఇలా వాతావరణంలో జీవజాతులు నిష్పత్తిలో తేడా వచ్చి సమతుల్యత దెబ్బతింటుంది.

హైదరాబాద్ లోని పఠాన్ చెరు ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటం వలన ఆ ప్రాంతమంతా సైనైడ్స్, ఆక్సినిక్ ఆమ్లాలతో కలుషితమైనది. ఈ కలుషితాలు భూపాల్లోని మంజీరా నదిలో విడుదలయ్యే మిథైల్ ఐసోసైనేట్స్' కన్నా విషపూరితమైనది. దీనిని చూసి పరాన్ చెరువు పరిసరాల సంరక్షణ బోర్డు సభ్యుడు శ్రీ సుందర్లాల్ బహుగుణ “భూ లోకంలో నరకం” అని అన్నారు.

కలకత్తా నగరంలోని హుగ్లీ నదీ జలాలు అక్కడి జనపనార, వస్త్రపరిశ్రమల నుంచి వచ్చే రసాయనాల వల్ల కలుషితమవుతున్నాయి. తమిళనాడులోని వాహన పరిశ్రమల నుంచి వచ్చే మురుగు, వ్యర్థాలు అక్కడి కూయిమ్ నదిని కలుషితపరుస్తున్నాయి. దాల్మియా నగర్లోని సిమెంట్, కాగితం గుజ్జు కర్మాగారాల నుండి వెలువడే మురుగు వల్ల సోనీ నది నీళ్ళు పాడైపోతున్నాయి. ఢిల్లీలోని యమునా నదీజలాలు డిడిటి పరిశ్రమల వలన కలుషితమవుతున్నాయి. అలాగే కావేరి నది నీళ్ళు కూడా తోళ్ళు, కాగితపు పరిశ్రమల వ్యర్థాల వల్ల కలుషితమవుతున్నాయి.

చాలా కర్మాగారాలకు కూలింగ్ పవర్స్ లేకపోవటం వలన వేడినీళ్ళను అలాగే నదులలోకి వదలటం వల్ల ఆ నదుల్లోని జీవరాశి మొత్తం చనిపోతున్నది. జీవుల ఆహారం, ప్రత్యుత్పత్తి మరియు జీవన క్రియలపై ఉష్ణ కాలుష్య ప్రభావం వలన జీవుల జీవక్రియల సమతాస్థితి దెబ్బతిని మరణం సంభవిస్తుంది. అదే విధంగా నదుల ద్వారా కాలుష్యాలు సమద్రాల్లోకి చేరి ఆ జలాలనూ కలుషితం చేస్తున్నాయి. పెట్రోలు, చమురు వంటి నూనెల రవాణాలో ప్రమాదాల వల్ల సముద్ర ఉపరితలాలపై నూనె పేరుకుపోయి అక్కడి జలచరాలు నశిస్తాయి.

మురుగు నీటితో త్రాగేనీరు కలిసిపోవటం వలన కలరా, టైఫాయిడ్, విరోచనాలు, ఆంత్రాక్స్ వ్యాధులు, హైపటైటిస్, పోలియో వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ వ్యాధులు రాకుండా త్రాగేనీటిలో బ్లీచింగ్ పౌడరును కలిపి సూక్ష్మజీవుల్ని నిరోధించాలి. మురుగునీరు, మంచినీటిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ ఎలా ఉన్నా కనీసం నీళ్ళు మన ఇంటికి వచ్చాక మరగకాచి చల్లబరిచి త్రాగాలి. కర్మాగారాలలో కూలింగ్ టవర్స్ ను నిర్మించటం వలన వేడి నీటిని చల్లబరచవచ్చును. ఫలితంగా నదలులోని ఉష్ణ కాలుష్యాన్ని తగ్గించి జీవుల మరణాల్ని నివారించవచ్చు. మురుగునీటిని యంత్రాల ద్వారా శుభ్రపరచాలి. చేలలో తెగుళ్ల మందులను, కీటక సంహరిణులను అతిగా వాడే పద్ధతికి స్వస్తి పలకాలి. పరిశ్రమలు, కర్మాగాలు ప్రాణాంతక రసాయనాన్ని తాగునీటిలోకి వదలకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డిని నిర్మించుకోవడం వలన కూడా చెరువులు, కుంటలలోని నీరు కలుషితం కాకుండా కాపాడవచ్చు. కర్బన వృధ పదార్థాలు, రేడియో ధార్మిక పదార్థాలు, రసాయనిక పదార్థాలు, ఘన రేణువులు వంటి కలుషిత పదార్థాలను నీటిలో కలవకుండా చూడాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నీటి కాలుష్యాన్ని నివారించి మానవ జంతు జాల మరణాలను తగ్గించవచ్చు.

ఆధారం: కందేపి రాణిప్రసాద్.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate