অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పాములు మేలు చేస్తాయి

పాములు మేలు చేస్తాయి

పాము మాటెత్తితే చాలు మనం వాటిని చూసినా చూడకున్నా ఒక్కసారి ఒళ్లు జలదరిస్తుంది. వాటికి మనిషి భయపడటమే కాదు ఆ భయంతో వాటిని చంపుతాడు లేకుంటే పూజలు చేస్తాడు. మనకు కనబడే పాములన్నీ విషం ఉన్నవేమి కావు. మొత్తం పాముజాతులతో కొంచెం అటుఇటుగా 15 శాతం మాత్రమే విషసర్పాలు. వాటిలో విషం ఎందుకుంది? అన్నీ విషం లేకుండా ఎందుకులేవు? ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? విషన ర్పాలు కనబడిన వారినందరినీ కరుస్తాయనుకోవడం భ్రమ. అవి సాధారణంగా ఎవరికీ హానికలిగించవు. ఆత్మరక్షణ కోసం, ప్రమాదంలోంచి బయటపడటం కోసం విషాన్ని వాడుకుంటాయి. ఇది కూడా పూర్తి వాస్తవం కాదు. వాస్తవానికి పాములు విషాన్ని అవి తినే జంతువులను చంపేందుకు, వాటిని నిస్తేజంగా ఉంచి వాటి ఆహార అవసరాలు తీర్చుకోవటం కోసం మాత్రమే ఉపయోగిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

పాములను జతుభక్షకాలు(Carnivores)గా పేర్కొంటారు. ఇది తమ పరిసరాల్లో ఉండే చిన్న చిన్న జంతువులను తిని బతుకుతాయి. చిన్న చిన్న కీటకాల నుండి కప్పలు, ఎలుకల వంటి రకరకాల జంతువులు వీటికి ఆహారం. వీటికి అన్నింటికంటే ఇష్టమైన ఆహారం “ఎలుక'. అసలు పాములే లేకుంటే ఏమవుదో ఒక క్షణం ఆలోచించండి! అయితే ఏమవుతుంది. పాముల బాధ తప్పుద్ది. ఎప్పుడంటే అప్పుడు భయం లేకుండా తిరిగొచ్చునని కదా మీ ఆలోచన. నిజమే కానీ పాములే లేకుంటే అవి తినే ఎలుకల మాటేమిటి? ఇక వాటికి ఏ భయమూ ఉండదు. వాటిని తినే వాడొకడు లేకుండా పోతే వాటికి కావల్సిందేముంది? ఇక అవి వాటి సంఖ్యను నిర్భయంగా పెంచుకుంటూ పోతాయి. వాటికి పండగే.

ఎటొచ్చీ మనుషులకే అంటే మనకే ఇబ్బంది. ఎలుకల జనాభా పెరిగితే మనం తినే ఆహారధాన్యాలు మనకు కాకుండా పోతాయి. అందుకే కాకుండా ప్రకృతిలో రకరకాల జంతుజాలం, జీవుల మధ్య సమతుల్యత ఉండటం కోసం ఎలుకల్ని తినే పాముల అవసరం ఉంది. రకరకాల పురుగులు, మిడతలు వంటివి ఎన్నో వీటికి ఆహారం. మన వ్యవసాయం సాఫీగా సాగాలంటే పాములు చేసే మేలు అంతా ఇంతాకాదు. క్రిమికీటకాల రక్షణకు మనం పురుగుమందుల్ని వాడతాం కదా! అలాగే ఎలుకలు ఇతర జంతువులను అదుపులో ఉంచడానికి ప్రకృతి కల్పించిన ఒక రక్షణగా పాములను చెప్పుకోవచ్చు. ఇవి ఆవరణ వ్యవస్థ పని చేయటానికి ఎంతో అవసరం అని ఇప్పటికే మీరు గమనించి ఉంటారు.

చైనాలో పాములను, పాము చర్మాన్ని, పాములు విడిచిన కుబుసాలను వైద్యంలో ఉపయోగించడం రెండువేల సం.గా కొనసాగుతున్నది. చర్మవ్యాధుల్లో, మొటిమలు, మొలలు ఇలా అనే వ్యాధుల్లో చైనా సంప్రదాయవైద్యం పాముల చర్మాన్ని వాడుతుంది. పాము కుబుసం ప్రయోజనాలను చైనీయులు షెన్ నాంగ్ బెన్ కావో (Shen Nong Ben Cao) అనే 100 A.D. గ్రంథంలో వ్రాశారు. పాముల పిత్తాశయ రసాలను (Gall blader juices) “మింగ్ ఇబీలూ" (MingYi BieLu) అనే గ్రంథం వైద్యంలో ఎలా ఉపయోగించారో మనకు తెలియజేస్తుంది. దీన్ని ఉపయోగించి కీళ్ళనొప్పులు (Arthritis), కీళ్ళజాయింట్ల నొప్పి నివారణలో వాడారు. సోరియాసిస్, దురద, మొటిమలకు సైతం పాము చర్మాన్ని వాడినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయి. కళ్లు మసక బారినప్పుడు (Clouding of Cornea) చేసే చికిత్సలో కూడా వీటిని వాడేవారట. అకిస్టోడాన్ (Agkistrodon) అనే పింజరవిషసర్పాన్ని మూర్ఛలు, పక్షవాతం వంటి సరా సంబధ వ్యాధి నివారణకు వాడినారు.

పాము పిత్తాశయ రసం (bile)ను ప్రత్యేక ఆరోగ్యటానిక్ గా రెస్టారెంట్లలో ఇస్తారు. ఇటువంటి హోటళ్లు దక్షిణ చైనా, తైవాన్, హాంగ్ కాంగ్లలో మనకు కనిపిస్తాయి. ఈ రసాన్ని ఫ్రిజిల్లేరియా అనే (fritillaria) మొక్క పొడితో (1:6) కలిపి తాగుతారట. మరింత ఆశ్చర్యం గొలిపే సంగతేమంటే కాన్సర్ వ్యాధిని తగ్గించడంలో ముఖ్యంగా లుకీమియాలో పింజరపాము పిత్తాశయరసం బాగా ఉ పయోగపడుతుందని చైనా సంప్రదాయ వైద్యంతో పాటు నేటి ఆధునిక వైద్యంలో కూడా వాడుతున్నారు. ఆదిమతెగల్లో పాముల్ని వైద్యంలో వాడే పరిజ్ఞానాన్ని తెలియజేసే శాస్త్రాన్ని 'ఇథనో ఓఫియాలజి (Ethno ophilogy) అంటారు.

విషం అంటే ఏమిటి?

ప్రపంచం అంతటా కలిపి చూస్తే సుమారు 2950 జాతుల పాములున్నాయట. వీటిలో కేవలం 450 జాతుల్లో మాత్రమే విషం ఉంది. ఇక మన భారతదేశంలో 270 జాతుల పాములుంటే వీటిలో కేవలం 60 మాత్రమే విషసర్పాలు. విషం అంటే ఏమిటి? అది రూపాంతరం చెందిన లాలాజలం దీనిలో 90 శాతం మాంసకృత్తులు, 20 శాతం వరకూ ఎంజైములున్నాయి. feb05.jpgవిషంలో ఏముంటే ఏమిటి అనుకుంటున్నారా? మనం ఆ విషాన్ని కూడా వైద్య అవసరాలకు అంటే రోగాలను నయం చేసేందుకు వాడుతున్నాం. ఆశ్చర్యంగా ఉంది కదూ! కాని ఇది వాస్తవం. ఇలా విషాన్ని ఉపయోగించే, దానికి విరుగుడు పదార్థాన్ని (antivenom) తయారుచేస్తారు. అలా విషాన్ని తట్టుకునే శక్తి వచ్చిన గుర్రపు రక్తపు సీరమ్ (serum) తో విషానికి విరుగుడు (యాంటి వీనమ్)కు తయారు చేస్తారు. పాముకాటుకు గురైన వారికి సరైన సమయంలో ఈ విరుగుడు పదార్థాన్నిస్తే మంచిగా కోలుకుంటాడు. చూశారా మనిషి గొప్పతనం!

పాముల విశేషాలు

ప్రపంచంలో బాగా విషం ఉండే పాముజాతులు పది ఉన్నాయి. వీటిలో పేర్కొనదగినవి ఇన్లాండ్ తైపాన్ (Inland taipan), గోధుమవన్నెపాము (ఆస్ట్రేలియా), టైగర్ పాము (ఆస్ట్రేలియా న్యూగినియాల్లో ఉంటుంది). ఇవిగాక కోరల్ పాము అమెరికా ఖండంలో, బూమ్ స్లాంగ్ సహరన్ ఆఫ్రికాలో, డెత్ అడ్లెర్ ఆస్ట్రేలియాలో ఉంటాయి. మలయానీలికట్లపాము (Malayan blue krait) ఆసియా ఖండంలో ఉంటాయి. ఇక మనదేశంలో పింజర (viper), త్రాచుపాము (Cobra) కట్లపాము (Krait) విషసర్పాల్లో చెప్పుకోదగినవి.

పాముచెవులు అంటారు కదా! నిజానికి పాముకు చెవులే ఉండవు. దానికి వినపడనే వినపడదు. కానీ నాగస్వరం (పాములవాడు పాడే బుర్ర) ఊదినప్పుడు నేలపై వచ్చే కదలికలను పసిగట్టగలదు. అలాగే ఆ పాము ఎదుట కన్పించే వస్తువు ఎటు కదిలితే దాని తలను కూడా అలాగే ఆడిస్తుంది. పామునాలుక ద్వారా వాసన పసిగట్టగలదు. అలాగే ఎలుకల్ని వేటాడుతుంది. మనదేశంలో కూడా పాముకాటుకు మూలికా వైద్యం సంప్రదాయకంగా వస్తున్నది. భారతీయ పాముల వేరుచెట్టుగా రావుల్ఫియా అనే చెట్టుకు మంచి పేరుంది. దీని ఆకుల రసానికి విషాన్ని పనిచేయకుండా చేసే గుణం ఉంది. దీని ఆకులను, మిరియాలను ముద్దగా చేసి బాధితునితో మింగించడం కూడా చేస్తారు. ఈ మొక్క గురించి మరో సంచికలో తెలుసుకుందాం!

పాముల్లో రకాలు - పాముకాటుకు నివారణ

భారతదేశంలో ప్రతి సంవత్సరం పాముకాటు వల్ల 25 వేల ప్రజలు మరణిస్తున్నట్లు అంచనా. ఈ మరణాలలో 95 శాతం విషం వల్ల కాక అనవసర భయాందోళన వల్ల మరణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో న్యూజిలాండ్, ఐర్లాండ్లో తప్ప మిగిలిన దేశాల్లో పాములు కలవు. ఇవి అధికంగా ఉష్ణమండల దేశాలలో విస్తరించి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సర్పాలలో అధికశాతం విషరహిత సర్పాలే. చాలా తక్కువశాతం మాత్రమే విషసర్పాలు.

ముఖ్యమైన విషసర్పాలు : నాగుపాము రెండుమీటర్ల పొడవు వుండి గోధుమ లేదా నలుపు రంగులో తల పైన సున్నా వంటి గుర్తును కలిగి వుంటుంది. కట్లపాము శరీరం పైన షట్కోణాకృతిలో పొలుసులు ఉంటాయి. కట్లపాము నాగుపాముకంటే విషపూరితమైనది. రక్తపింజర (రక్తపొడ) పృష్ట తలంలో మూడు వరుసల డైమండ్ ఆకారపు మచ్చలు ఉంటాయి. తల పైన 'V' ఆకారము కనపడే వీటికి వెనుకకు తిరిగిన పొడవైన కోరలు ఉంటాయి. రాచనాగు అయిదు మీటర్ల పొడవు కలిగి పసుపు లేదా నలుపు రంగులో ఉంటుంది. వీటిలోని కొన్ని రకాలలో వలయాకారపు చారలు ఉంటాయి. వీటి పడగ నాగుపాము పడగను పోలి ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. లాభిసిస్ పాము శరీరం గోధుమరంగులో ఉంటుంది. మెడమీద గుర్రపు నాడ ఆకారంలో మచ్చ, తల పైన పొలుసులు ఉంటాయి. ప్రవాళపు సర్పాలు చిన్నవిగా ప్రకాశవంతంగా ఉండి పొట్టమీద మచ్చలను కలిగి ఉంటాయి. ఇవి విషసర్పాలైనప్పటికి వీటి వలన మానవులకు ఎక్కువ ప్రమాదం ఉండదు.

ముఖ్యమైన విషరహిత సర్పాలు : పసరికపాము ఆకుపచ్చ రంగును కలిగి ఎక్కువగా చెట్లమీద సంచరిస్తూ ఉంటుంది. గుడ్డిపాము(టిప్టోమ్స్) వానపామును పొలీ కళ్ళు చిన్న పొలుసులతో కప్పబడి ఉంటాయి. ఇవి చెదలను ఆహారంగా తీసుకుంటాయి. యురోపెలిటీస్ అనే పాము ఎక్కువగా తేమ గల ప్రదేశాలలో ఉంటుంది దీని శరీరము స్తంభాకారముగా ఉండి చిన్న కళ్ళను పొట్టి తోకను కలిగి ఉంటుంది. ట్యాస్ అనే పాము శరీరము గోధుమ, ఆకుపచ్చ మిశ్రమ రంగులో ఉండి తెలుపు గోధుమ రంగు మచ్చలను కలిగి ఉంటుంది. ఇది వేగంగా పరిగెత్తుతుంది. దీని ప్రధాన ఆహారం ఎలుకలు. కొండచిలువ (పైథాన్) అన్ని రకాల పాముల కంటే పెద్దది. పది మీటర్ల పొడవు, 110 కిలోల బరువు ఉంటుంది. ఇది జంతువులను చుట్టుకొని పెనవేసి ఊపిరాడకుండా చేసి చంపుతుంది. ఎరిక్స్ జానై అనే సర్పం రెండు తలలను కలిగి ఉంటుంది. దీని శరీరము మట్టి రంగులో ఉండి ఒకటి నుంచి రెండు మీటర్ల పొడవు ఉంటుంది. దీని తోక చిన్నగా మొద్దుగా ఉంటుంది.

విషసర్పాలను గుర్తించేదెలా?: విషరహిత, విషపూరిత పాములను feb06.jpgగుర్తించడం కొంచెం కష్టమైన పనే. ముందుగా తోకను పరిశీలించాలి. తోక ఉభయ పార్వలు నొక్కబడి తెడ్డులాగా ఉంటే విషసర్పంగా గుర్తించవచ్చు. తోకపొడవుగా పోను పోను సన్నగా ఉంటే ఉదరతలం పొలుసులను పరిశీలించాలి. ఉదరతలంలో సన్నని, చిన్న పొలుసులు ఉంటే అవి విషరహిత సర్పాలు. ఉదరతలంలోని పొలుసులు అడ్డంగా పెద్దవిగా ఉంటే అవి విషసర్పాలు కావచ్చు. తోక గుండ్రంగా ఉండి పోను పోను సన్నగా ఉదరతలంలో పొలుసులు ఒక చివరి నుండి రెండో చివరకు వ్యాపించినప్పుడు తల మీద పొలుసులను లేదా ఫలకాలను పరిశీలించాలి. తల త్రిభుజాకారంలో ఉండి చిన్న చిన్న పొలుసులతో కప్పబడి వుంటే వాటిని పొడపాము లేదా రక్తపింజరగా గుర్తించవచ్చు. ఇవి రెండు రకాలు. ఒకటి గుంట ఉన్న పొడపాము, రెండు గుంటలేని పొడపాము. తల పైన చిన్న పొలుసులు ఉండి గుంట లేకపోతే అధోపుచ్చియ పొలుసులను పరిశీలించాలి. అధోపుచ్చియ పొలుసులు ఒక వరుసలో ఉండి దాని తల పైన బాణం గుర్తుఉంటే అది విషసర్పమే. పాము తల పైన పెద్దపలకలుంటే గుర్తించడం కష్టం. విషరహితం లేక విషసరము కావచ్చు. ఈ లక్షణాలు గల పాము పృష్ట మధ్య భాగంలో కనేరు పొలుసులను పరిశీలించితే అవి షట్ కోణాకారములో ఉన్నట్లయితే దానిని విషసహిత కట్లపాముగా గుర్తించవచ్చు. పడగపైన మచ్చ ఉంటే నాగుపాముగా, దేహము పైన మచ్చలు ఉండిన ప్రవాళపు పాముగా గుర్తించవచ్చు. ఇవి రెండూ విషసర్పాలే. ఈ విధంగా గుర్తించడం సామాన్య ప్రజలకు కష్టమే కానీ ప్రయత్నిస్తే తేలికగానే గుర్తించవచ్చు.

విషయంత్రాంగం : విషసర్పాలన్నీ విష యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. విషయంత్రాంగంలో ఒక జత గ్రంథులు, ఒక జత కోరలు ఉంటాయి. విషరహిత సర్పాలలో విషయంత్రాంగం ఉండదు. విషసర్పాలలో కోరలు సాధారణంగా వెనుకకు వంగి ఉంటాయి. నోరు తెరిచినప్పుడు నిలువుగా ఉంటాయి. కాటువేసినప్పుడు దవడ కండరాలు నొక్కడం వల్ల విషగ్రంథుల నుంచి విషం కోరల ద్వారా కాటుకు గురైన జీవి శరీరంలోనికి చేరుతుంది. పాముల విషము స్వచ్ఛంగా ఎండుగడ్డిరంగులో ఉంటుంది. పాముల గురించి మంచి అవగాహన వుంటే ప్రమాదాలను నివారించవచ్చు.

పాముకాటుకు ప్రథమచికిత్స : పాము కరిచిన వ్యక్తికాటును పరిశీలిస్తే విషసర్పం కరిచిన ప్రదేశంలో రెండు రంధ్రాలు ఉండి వాటి నుండి రక్తం వస్తుంది. విషరహిత పాము కరిస్తే అనేక రంధ్రాలు ఏర్పడతాయి. కాటుకు గురైన వెంటనే కాటుకు గురైన అవయవం పై భాగంలో తాడుతో గాని, గుడ్డతో గాని, రక్తప్రసరణ జరగకుండా గట్టిగా కట్టాలి. కాటుకు గురైన భాగాన్ని పొటాషియం పర్మాంగనేట్తో కడిగి ఆ భాగంలో సుమారు రెండు సెంటీమీటర్ల లోతు గాడి పెట్టి రక్తం పీల్చివేయాలి. తరువాత కాటు పై భాగం నుండి వేడి నీటిని పోస్తు ఉండిన చాలా వరకు విషం బయటకు పోతుంది. తరువాత పాముకాటు ప్రదేశంలో పటికముక్కను ఉంచి నిముషం తరువాత ఆముక్కను తొలగించి మరొక ముక్కను ఉంచాలి. బాధుతున్ని కదలకుండా ఉంచి వేడి టీగాని, కాఫి గాని, పాలుగాని ఇవ్వాలి. ఒకవేళ బాధితుని శ్వాసక్రియ ఆగిపోతే కృత్రిమ శ్వాసక్రియ కల్పించాలి. కాటువేసిన పాము ఏదో తెలుసుకొని యాంటీవీనమ్ ఇవ్వాలి. తెలియనప్పుడు పాలివీనమ్ సీరమ్ ఇవ్వాలి.

పాముల గురించి మనందరికీ అవగాహన ఉంటే వాటిని చంపనే చంపం. పొరబాటున మన నివాస ప్రదేశాల్లో కనిపిస్తే వాటిని పట్టుకుని దూరంగా వదిలేయడానికి ప్రాధాన్యతనిస్తాం.

పాము కనిపించగానే భయపడకుండా, దానికి హాని కలుగజేయకుండా బ్రతకనిస్తే అవి మన పంటపొలాన్ని కాపాడి మన ఆహారాన్ని పదిలంగా కాపాడతాయి.

ఆధారము : డా. ఎ.మారుతీరావు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate