অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మారిన బామ్మ

మారిన బామ్మ

“అమ్మా టిఫిన్ రెడీయా...?” అడిగాడు సాయి.

“ఒక్క పది మాట నిముషాలురా బాబీ...” అంది.

బాబీ అనేది సాయి కి వాళ్లమ్మ పెట్టుకున్న ముద్దు పేరు.

“ఇంకా పది నిముషాలా? ఏంటమ్మా... టైం ఎనిమిది అవుతుంటేనూ... ఆకలిగా ఉంది.” బుంగ మూతితో సాయి మూలిగాడు.

“ఒరేయ్! చింటూ, ఏమిట్రా అంత తొందర? ఇవేళ పాఠశాలకు సెలవేగా...!” వరండాలో కూర్చుని భగవద్గీత తిరగేస్తున్న బామ్మ రాములమ్మ అంది.

రాములమ్మ సాయి వాళ్ళ బామ్మ. పుస్తకాలు చదవడం తెలుసు. మనిషి మంచిదే. కానీ, మడి ఆచారాలు, చాదస్తాలు ఎక్కువ. పాతకాలపు మనిషి కదా!

(‘చింటూ' అనేది... సాయిని వాళ్ల బామ్మ పిలుచుకునే ముద్దు పేరు.)

“ఇదిగో...అనుష్కా...! నీ గీత నువ్వు చదువుకోవే...! నీకెందుకు?” అన్నాడు చింటూ.

(చింటూ వాళ్ళ నానమ్మతో బాగా సరదాగా ఉంటాడు. అందుకే కావాలనే, వాడికి ఏ సినిమా హీరోయిన్ పేరు గుర్తుకు వస్తే ఆ పేరుతో బామ్మను పిలుస్తుంటాడన్నమాట. అది వాళ్ళ బామ్మక్కూడా ఇష్టమే....)

“ఏమిట్రా? చిన్నీ... నానమ్మతో అలాగేనా మాట్లాడేది?” అక్కడే వరండాలో మరో వైపు కూర్చుని న్యూస్ పేపరు చదువుతున్న వాళ్ళ నాన్న రాజారావు అన్నాడు.

సాయి లేకలేక రాధ, రాజారావులకు కలిగిన ముద్దుల ఏకైక సుపుత్రుడు.

“సారీ నాన్నా!” అన్నాడు చిన్నీ. మన చిన్నీ అల్లరి వాడైనా చాలా మంచి వాడే పైగా క్లాసులో ఫస్ట్ కూడా హైస్కూల్ లో 6వ తరగతి చదువుతున్నాడు.

ఇంతలో “ఒరేయ్! బాబీ... టిఫిన్ రెడీ నాన్న వచ్చేయ్..” అంటూ అమ్మ వంట గదిలో నుండి కేకేసింది.

“వస్తున్నానమ్మా” అని, వెళ్ళబోతుంటే వాళ్ళ నానమ్మ చేయి పట్టుకుని ఆపి, “ఒరేయ్! చింటూ ...ఇంతకూ స్నానం చేశావట్రా?” అంది.

“లేదు కాజోల్....ఇవ్వాళ సెలవేగా.” నడుము తిప్పుకుంటూ, కులుకుతూ అన్నాడు.

“ఓరి భడవా! స్నానం చేయకుండా టిఫిన్ ఏంట్రా!

“అంటే... ఇవ్వాళ అయ్యగారు! కటింగ్ చేయించుకోవడానికి వెళుతున్నాడన్నమాట. అందుకు తెలిసిందా?” చేయి విడిపించుకుంటూ అన్నాడూ.

“శివ శివా! మంగళవారం పూట జుట్టు కత్తిరించుకోవడం ఏంట్రా? అసహ్యంగా.”

“ఎం...దు...కంటె.... రే...పు... బడి ఊటుంది కాబట్టి... సమంతా!” అంటూ టిఫిన్ కోసం ఇంట్లోకి తుర్రుమన్నాడు.

“ఒరేయ్, రాజా! ఏంట్రా ఇదీ ...” అంటు కొడుకు రాజారావుతో అంది.

"మళ్ళీ రేపటి నుండీ నాకు ఆఫీసు. వాడికి బడి. అనుకోకుండా ఈరోజు సెలవు వచ్చింది కదా. మరలా కుదరదు లేవే. స్కూల్లో ఇప్పటికే వాళ్ళ సారు అరుస్తున్నారట. పైగా చూడు... ఆ తలంతా ఎలా ఆసస్యంగా ఉందో గంప లాగా? ఇప్పటికే మూడు వారాల నుండి నాకు తీరిక కుదరడం లేదు. అయినా కంప్యూటర్ కాలం వచ్చినా, ఇలాంటి ఛాదస్తాలు ఏంటమ్మా నువ్వు.” అంటూ లోపలికి వెళ్లి పోయాడు.

“అబ్బ... ఎన్ని సార్లు చెప్పినా ఇంట్లో ఒక్కరూ నా మాట వినరుగా...” అంటూ గొణుక్కుంటూ... భగవద్గీతలో తలదూర్చింది.

కటింగ్ చేయించుకున్న సాయిని తీసుకుని వచ్చారు. రాగానే, సాయి వాళ్ల బామ్మను చేయి పట్టుకొని “హాయ్, సిమ్రాన్! ఎలా ఉంది నా కటింగ్? హీరోలా ఉన్నానా?” అన్నాడు.

వెంటనే తోక తొక్కిన త్రాచు పాములా, “ఛీ,ఛీ అంట్ల వెధవా! నన్ను తాకుతావేంట్రా, మంగలి దగ్గర నుంచి వచ్చి...”అంటూ పక్కనే తన చేతి కర్ర తీసుకుంది.

సాయి దొరకకుండా , “హహహ...” అనుకుంటూ తుర్రుమని ఇంట్లోకి పరిగెత్తాడు.

“ఒరేయ్ బాబీ... ఎందుకురా... ఎప్పుడూ నాన్నామని అస్తమానం అలా ఏడిపిస్తుంటావు? తప్పు కదా నాన్న?” అంటూ రాధ గ్లాసులో పసుపు నీళ్ళు కలపసాగింది.

ఇంతలో, “మంగళవారం పూట జుట్టు కత్తిరించుకొని వచ్చింది కాకుండా, ఆ అంటు నాకు గిలించాడే అమ్మాయ్. నీ కొడుకూ... కాస్త ఆ పసుపు నీళ్ళు ఇటు తేవే! నన్ను  మైల చేశాడు ఈ వెధవా....” అంటూ పురమాయించింది.

“ఇదిగో తెస్తున్నాను అత్తయ్యా...” అంటూ తెచ్చి ఇచ్చింది.

“రాను రాను వాడి అల్లరి శృతి మించి పోతోందే కధా!” అంటూ వాపోయింది.

“చిన్న పిల్లాడు కదా అత్తయ్యా!” సాయికి స్నానం చేయించడానికి లోపలికి వెళ్లింది.

ఉదయాన్నే ఆఫీసుకు బయలు దేరడానికి బండి తీశాడు రాజారావు. ఇంతలో టిఫిన్ బాక్స్ తెచ్చి ఇచ్చింది రాధ. సాయి పుస్తకాల బ్యాగ్ తగిలించుకుని, “టాటా! జెనీలియా…” అంటూ బండి ఎక్కాడు. బండి స్టార్ట్ చేశాడు రాజారావు. ఇంతలో ఎవరో దూరం నుండి 'ఠంపి' మని తుమ్మిన శబ్దం వినపడింది.

అక్కడే ఉన్న రాములమ్మ, “ఆగరా రాజా! ఎవరో తుమ్ముతున్నారు. కాస్త ఆ బండి ఆపి, ఒక నిముషం కూర్చుని వెళ్లు.” అంది.

"ఉండమ్మా! ఇప్పటికే లేటయింది. నీ ఛాదస్తం నువ్వూనూ. మరలా వీడిని స్కూలు దగ్గర దింపి నేను ఆఫీసుకి వెళ్ళేసరికి లేటవుతుంది.” అంటూ రయ్యిన వెళ్లిపోయాడు.

"చూశావా, చూశావా... అమ్మాయ్, వీళ్ళకి పెద్దల మాట అంటే లెక్క లేదు. మంచి చెబుతున్నా విననే వినరు.” అంది. రాధ మాట్లాడకుండా చిరునవ్వుతో ఇంట్లోకి వెళ్లి తన పని చూసుకో సాగింది.

కాసేపు గొణిగి, తన గీతా పఠనంలోకి జారుకుంది బామ్మ.

సాయంత్రం ఆఫీసు నుండి రాజారావు, సాయి వచ్చారు. బాత్ రూముకు వెళ్ళి వచ్చేలోగా టిఫిన్ రెడీగా చేసి ఉంచింది రాధ. “అత్తయ్యా! టిఫిన్ కు రండి” పిలిచింది రాధ.

అందరూ కలిసి హాల్లో కూర్చుని టిఫిన్ చేశారు. అక్కడే కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడూ హుషారుగా చలాకీగా మాట్లాడే రాములమ్మ దే మౌనంగా ఉండిపోయింది.

“ఏంటి అత్తయ్యా! అలా ఉన్నారు?” అడిగింది రాధ. పరిస్థితి గమనించి, "చిన్నీ! ఆరూములోకి వెళ్ళి నీ హెూమ్ వర్క్ చేసుకోపో." అంటూ చెప్పాడు రాజారావు.

“అలాగే, నాన్నా!” అంటూ వెళ్లాడు సాయి.

“ఈ మధ్య మీరెవరూ నా మాట అస్సలు పట్టించుకోవడం లేదు. నేనంటే గౌరవం లేదు. చేయరాని పనులన్నీ చేస్తున్నారు." అంది బాధతో. ఆమె బాధ పడితే కొడుకూ, కోడలూ ఇద్దరూ భరించలేదు. అంత ప్రేమగా చూసుకుంటారు. అందుకే ఆమెను ఎప్పుడూ బాధ పెట్టరు.

అందుకే రాజారావు, "అదేంటమ్మా! అలాగంటావు? నీవే గదే మాకు పెద్ద దిక్కు".

“అందుకే నా మాట అందరూ బాగా వింటున్నారు, పాపం?” కసురుకుంటూ అంది.

“ఇప్పుడేమయిందమ్మా? చెప్పు.” అడిగాడు.

“ఏమయింది, అంటావే? నీకు తెలియదా?” అంటూ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసింది.

“ఓ అదా! చూడమ్మా. ఇవన్నీ మూఢ నమ్మకాలే. అప్పట్లో కొందరికి తెలియక అలా నడుచుకునేవారు. కాకపోతే, మన ఆరోగ్యాలకు సంబంధించిన కొన్నిటికి సరియైన కారణాలే ఉన్నాయి. అవి పాటిస్తే సరి.” అన్నాడు.

రాములమ్మ కాస్తో, కూస్తో చదువుకుంది కనుక, మూర్ఖపు చాదస్తురాలు కాదు. అందుకే, "ఏరా! నన్ను మాయ పుచ్చుతున్నావా?” అంది.

“కాదమ్మా! తుమ్మిన వారికి ఒక్క క్షణం గుండె ఆగిపోతుందంటారు. అపుడు వాళ్ళు తమ పనిని కాసేపు ఆపాలన్నమాట. లేకుంటే ప్రమాదం కదా. అందుకే కాస్త ఆగాలని పెద్దలవేది. అంటే, తుమ్మినపుడు పనులు ఆపాల్సింది ఆ తుమ్మిన వారే కానీ, ఇతరులు కాదన్నమాట.

ఇక కటింగ్ అంటావా! నాన్న గారి కాలంలోనైతే, ఒక్కో ఊరికి, కటింగ్ చేయడానికి ఒక మంగలి వాడే ఉండేవాడు. ఆదివారం ఊర్లో అందరూ ఇండ్లలో ఉంటారు కదా. అందుకే ఆరోజు కటింగ్ చేయడానికి వచ్చేవాడు. ఒకవేళ ఆరోజుకు పూర్తి కాని వాళ్ళకి సోమవారం కూడా చేసేవాడు. ఇలా వరుసగా రెండు రోజులు చేసేసరికి అలసిపోయేవారట. అందుకే ఆ తరువాతి రోజు మంగళ వారం సెలవు తీసుకునే వారు. వారికీ విశ్రాంతికావాలి కదా. అంతే తప్ప వేరే కారణం లేదు. ఇది తెలియని వారు ఒక మూఢాచారంగా భావిస్తున్నారు.”

రాజారావు చెబుతున్న మాటల్లో వాస్తవాని గ్రహించి సాగింది రాములమ్మ. “అలాగే.. ఇక కటింగ్ చేయించుకుని ఇంట్లోకి వెళితే, శరీరంపైన ఉన్న వెంట్రుకలు, గాలికి కింద పడి ఆహార పదార్థాలపై పడతాయేమోనని అనుమానం. అలా వెంట్రుకలు కలిసిన ఆహార పదార్థాలు తింటే, హాని కదా అందుకే అప్పట్లో గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంటికి వెనుక ముందూ రెండు తలుపులు ఉంచేవారు. ఇంట్లో నుండి కాకుండా వెనుక నుండి వెళ్ళేవారు. అలా లేని వారు ఇంటి ముందరే స్నానం కానిచ్చేవారు. ఇప్పట్లో అంత ఇళ్లులూ లేవు. అలాంటి అవకాశాలూ లేవు. పైగా చేయించుకున్న వారికి షాపుల్లోనే శుభ్రంగా తుడిచి పంపుతారు.” అంటూ వివరించారు.

“అంతేనంటావా రాజా!”

“అంతేనమ్మా, ఇందులో వేరే ఏ ఎబ్బంది లేదు అన్నాడు.

అంతే. ఇక ఆనాటి మన రాములమ్మ ఏనాడూ బాధ పడలేదు. ఛాదస్తపు మాటలు మాట్లాడలేదు. ఏదన్నా అలా సందేహం వచ్చినపుడు కొడుకు రాజరావుతో కారణాలు తెలుసుకుంటూ హ్యాపీగా జీవితం గడిపేసింది మన కాజోల్…అహ… కాదు కాదు సిమ్రాన్‌ సారీ... సమంతా... ఊ...ఆ...రాములమ్మ.

రచన: మద్దిరాల శినివాసులు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate