অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సత్యాన్వేషణ దినోత్సవం – ఫిబ్రవరి 17

సత్యాన్వేషణ దినోత్సవం – ఫిబ్రవరి 17

మన ప్రభుత్వ ముద్రిక (రాజముద్రిక) మూడు సింహాల బొమ్మ క్రింద “సత్యమేవ జయతే” అని వ్రాసి ఉంటుంది. అంటే సత్యమే ఎప్పటికీ feb01.jpgజయిస్తుందని అర్థం. ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడే హరిశ్చంద్రుడు ఎదుర్కొన్న ఆపదలను గూర్చి కథను మనం చదువుకుంటూనే వున్నాం వుంటాం. పూర్వకాలంలో భూమి నలుచదరంగా, బల్లపరుపుగా వుండేదని ప్రజలందరూ నమ్మేవాళ్ళు. పురాణాల్లోని కథ ప్రకారం నలుచదరంగా వున్న భూమిని చాపలా చుట్టి హిరణ్యాక్షుడు ఎత్తుకొని పోతుంటే వరాహవతారంలో విష్ణువు ఆ రాక్షసుడిని మట్టుపెట్టాడు. ఇలాంటి పురాణాలు ప్రపంచమంతా ఉన్నాయి.

భూమి, అంతరిక్షం గురించి మనిషి నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాడు. క్రీ.శ. ఒకటవ శతాబ్దంలో టాలెమీ అనే గ్రీసు శాస్త్రజ్ఞుడు భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి కేంద్రంగా సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అన్ని మతాలు నమ్మాయి. ఆయా మతగ్రంథాల్లో కూడా ఈ భూకేంద్ర సిద్ధాంత ప్రస్తావన ఉంది.

feb02.jpg15 శతాబ్దం వరకు ప్రజలు భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మారు. కానీ క్రీ.శ. 1543లో పోలెండు శాస్త్రవేత్త కోపర్నికస్ ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని వ్యతిరేకించి, సూర్యకేంద్ర సిద్ధాంతంను ప్రతిపాదించాడు. దీని ప్రకారం సూర్యుడు కేంద్రంగా ఉండి అన్ని గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అంతే కాకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నదనీ, అది కూడా కోణాన్ని మార్చుకుంటూ చలిస్తుందని తెలిపాడు. దీనితో కోపర్నికస్ మత పెద్దలు ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. అందువల్ల On the revolution అనే తన పుస్తకం పేరును On the revolution of heavenly spheresగా మార్చి “ఈ వాదం నిజం కాకపోవచ్చు" అని పున ప్రచురించాడు. అయినప్పటికి మత పెద్దలు అతడిని కరుణించలేదు. గృహ నిర్బంధానికి గురైన కోపర్నికస్ 1543లో మరణించాడు.

1548లో ఇటలీలో జన్మించిన గ్యియర్థినో బ్రూనో కోపర్నికస్ సిద్ధాంతానికి ఆకర్షితుడైనాడు. 1572లో మతగురువుగా అభిషక్తుడైనప్పటికీ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. దీనిపై మరింత పరిశోధనలు పరిశీలనలను చేసి మరిన్ని అదనపు అంశాలను చేర్చి “అనంత విశ్వ సిద్ధాంతం”ను ప్రతిపాదించాడు. సూర్యకేంద్ర సిద్ధాంతం సూర్యుడు స్థిరంగా వున్నాడని చెబుతుంటే ఈ అనంత విశ్వ సిద్ధాంతం విశ్వంలో సూర్యుడిలాంటి నక్షత్రాలు అనేకం వుంటాయని, సూర్యుడు కూడా తన చుట్టూ తాను పరిభ్రమిస్తుందని తెలిపాడు.

అనంత విశ్వ సిద్ధాంతం ముఖ్యాంశాలు

1. విశ్వానికి కేంద్రంగా సూర్యుడు అని సూర్యకేంద్ర సిద్ధాంతం చెబితే, సూర్యుడు లాంటి నక్షత్రాలు ఎన్నో వున్నాయని, ఈ గ్రహకూటమికి మాత్రమే సూర్యుడు కేంద్రకమని బ్రూనో ప్రతిపాదించాడు.

2. సూర్యుని పోలిన మిగతా నక్షత్రాల చుట్టూ కూడా గ్రహవ్యవస్థ ఉండి వుండవచ్చని, ఈ విధంగా గ్రహాలు నక్షత్రాల చుట్టూ పరిభ్రమిస్తాయే తప్ప నక్షత్రాలు గ్రహాల చుట్టూ తిరగవని ఖరాఖండిగా చెప్పాడు.

3. విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు ఆయా అక్షాలపై తన చుట్టూ తాను పరిభ్రమిస్తాయని, అదే విధంగా సూర్యుడు కూడా స్థిరంగా వుండక తన చుట్టూ తాను పరిభ్రమిస్తాడని మరొక ప్రతిపాదన కూడా చేశాడు.

4. విశ్వంలోని గ్రహం, ఉపగ్రహ, నక్షత్రాలు అన్నింటికీ ఆరంభం, అంతం వున్నాయనీ, ఇవి నిరంతరం మార్పునకు లోనవుతూ ఉంటాయని తెలిపాడు.

5. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వానికి కేంద్రం దానికి సరిహద్దు అంటూ ఏమీ ఉండవని, ఇది అనంతదూరం వరకు వ్యాపించి ఉంటుందని బ్రూనో ప్రతిపాదించాడు.

బ్రూనో ప్రతిపాదనలు మత విశ్వాసాలకు విరుద్ధమైనవి కదా! మత బోధకులకు కోపం తెప్పించిన అంశం భూమికి, సూర్యునికి అంతం, ఆరంభం ఉంటాయన్నది. బ్రూనోపై 131 అభియోగాలను మోపి 1591లో కేసును నమోదు చేశారు. 1593లో బ్రూనోను గాలి, వెలుతురు చొరబడని ఒక కారాగార గృహంలో బంధించి ఎన్నో హింసలకు గురిచేశారు. ఈ కారగారంలో బ్రూనో సుమారు 7 సంవత్సరాల పైగా నరకయాతన అనుభవించాడు.

ప్రతిరోజూ మత గురువుల నుండి బ్రూనోకి వర్తమానం వచ్చేది. దాని సారాంశం బ్రూనో ప్రతిపాదనలు తప్పని ఒప్పుకోవడం. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఖండించడం, తను ప్రచారం చేసిన అంశాలు తప్పని బహిరంగంగా ఒప్పుకోవడం. అయితే ప్రతిరోజూ బ్రూనో ఈ ప్రతిపాదనలు తిరస్కరించేవాడు. చివరకు బ్రూనోని “మతద్రోహిగా, సైతానుగా, రెచ్చగొట్టే ఉపన్యాసకుడుగా, మతానికి పరమ శత్రువుగా ప్రకటించి ఒక్కరక్తంబొట్టు నష్టపోకుండా అగ్నికి ఆహుతి చేయాలన్న మరణశిక్ష ఆదేశాలు జారీచేశారు.

ఆ రోజు ఫిబ్రవరి 17, 1600. మత పెద్దల ఆదేశాల మేరకు ఇనుపసంకెళ్ళతో బ్రూనోను బంధించి, పెడరెక్కలు విరిచికట్టి, తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెప్పనీయకుండా వుండటానికి వీలుగా నాలుకను ఇనుపతీగలతో చుట్టి, నోటికి అడ్డంగా గుడ్డను కట్ట రోమ్ నగర్ వీధుల గుండా ఊరేగిస్తూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏ పని చేసినా వారికి ఈ శిక్ష తప్పదంటూ నినదిస్తూ ఊరేగించారు. బ్రూనో ఆశయాల వల్ల ప్రభావితమైన ప్రజలు వీధిలో బారులుతీరి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు.

బ్రూనోను ఊరేగిస్తూ పేద మతసన్యాసులు నివసిస్తున్న భవన సముదాయం మధ్యలో వరశిలగా పిలిచే నిలువెత్తు స్తంభానికి బంధించి అతనినోట కట్టిన గుడ్డనూ, ఇనుప తీగను తొలిగించిన తప్పును ఒప్పుకున్నా క్షమించి బతకనిస్తామన్నారు. బ్రూనో “నా మరణశిక్ష నాకన్నా మిమ్ములను ఎక్కువ యాతన పెడుతున్నది. దీనికి కారణం నేను పలికే నిజాలు. నేను నమ్మిన సిద్ధాంతం ఖచ్చితమైనది, సత్యమైనది. నేను ఏ తప్పూ చేయలేదు” అని తేల్చి చెప్పాడు.

బ్రూనో కాళ్ళవద్ద ఆముదంలో ముంచిన గుడ్డలను వేసి నిప్పంటించారు. బ్రూనో పాదాలకు మంటలంటుకొని కొద్ది కొద్దిగా ఎగిసి పడుతూ శరీరభాగాలను దహించి వేస్తున్నా, తన కనుబొమలూ, వెంట్రుకలు కాలుతూ సజీవదహనం అయిపోతూ కూడా “సత్యం ఎల్లప్పటికీ శాశ్వతమైనది. విశ్వం గూర్చి సత్యాన్ని త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారు” అని నినదిస్తూ మరణించాడు.

30 సం. తర్వాత పలువురు మేధావులు దీన్ని తప్పిదంగా గుర్తించి బ్రూనో స్మారకార్థం ఒక స్థూపాన్ని అక్కడ నిర్మించారు. తర్వాత కాలంలో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని పలు సవరణలతో ప్రపంచం మొత్తం ఆమోదించింది. బ్రూనో బలిదానానికి గుర్తుగా వైజ్ఞానిక లోకం, విద్యార్థి వర్గాలు ఫిబ్రవరి 17న సత్యాన్వేషణ దినోత్సవంగా పరిగణిస్తాయి. తెలియనప్పుడు మానవ సమాజం కొన్ని నమ్మకాలను, విశ్వాసాలను తయారు చేసుకోవచ్చు. కాలక్రమంలో పరిశీలనల వల్ల ప్రయోగాల వల్ల ఆ నమ్మకాల, విశ్వాసాల డొల్లతనం బయటపడవచ్చు. ఋజువైన సత్యాన్ని మతం పేరుతో, సంప్రదాయం పేరుతో తిరస్కరించే శక్తులు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వుంటాయి. వీరిని ఎదుర్కొని సత్యాన్ని ముందుకు తీసుకెళ్లినప్పుడే సమాజం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది. అందుకే ఆధునిక తెలుగు వైతాళికుడు కందుకూరి వీరేశలింగం "ప్రస్తుతం పాతకొత్తల మధ్య, సత్యా సత్యాల మధ్య పోరాటం జరుగుతున్నది. బుద్ధిమంతులైన వారు ఏ పక్షంలో చేరాలో, అంతిమవిజయం ఎవరిదో చెప్పనక్కరలేదు. ఈ సంగ్రామం సుదీర్ఘంగా సాగవచ్చు. తీవ్రంగా ఉండవచ్చు. అయితే జ్ఞానం అజ్ఞానాన్ని, సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయి అని చెప్పాడు. బ్రూనో వంటి దీరోధాత్త సత్యాన్వేషకుడి బలిదానం మనకు అందించేస్ఫూర్తి ఇదే!

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate