অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆమ్ల – క్షార సూచికగా రెడ్ క్యాబేజీ జ్యూస్

ఆమ్ల – క్షార సూచికగా రెడ్ క్యాబేజీ జ్యూస్

మెజీషియన్ సుబ్బు ఒక ఎరుపు క్యాబేజి (Red Cabbage)ని తనతో పాటు తెచ్చి అందరికీ చూపించాడు. ఒక ద్రావణం లేదా ఏదైనా ద్రవం ఆమ్లమా, క్షారమా, తటస్థమా అని తెలుసుకోడానికి లిట్మస్ లేదా మిథైల్ ఆరంజి, ఫినాల్ఫ్తలీన్ వంటి సూచికను వాడతాం. కాని వీటితో పనిలేకుండా ఈ ఎరుపు క్యాబేజి జ్యూస్ ను ఉపయోగించి ఏదైనా ద్రావణం స్వభావం నేను తెలుసుకుంటా. ఇదే ఈ రోజు మ్యాజిక్ అన్నాడు మెజీషియన్.

apr0020.jpg'ఇదిగో చూడండి. ఈ గాజు గ్లాసులో నేను తయారు చేసిన ఎరుపు క్యాబేజి జ్యూస్ ఉంది' అని గ్లాసు పైకెత్తి అందరికీ చూపించాడు. ఎరుపు పర్పుల్ నీలం కలబోసిన రంగులో వుంది ఈ జ్యూస్ టేబుల్ మీద మూడు ఖాళీ గాజు గ్లాసులున్నాయి. వీటిలో దాదాపు సగం దాకా (50-100మిలీ) ఈ జ్యూస్ పోశాడు. వేరే మూడు సీసాలను తన బ్యాగ్ లోంచి బయటకు తీశాడు. ఈ మూడు సీసాల్లోనూ ఏవో రంగులేని ద్రవాలున్నాయి. ఒక సీసా మూత తీసి, అందులోని ద్రవాన్ని క్యాబేజి జ్యూస్ ఉన్న ఒక గ్లాస్ లో పోశాడు. ఆశ్చర్యంగా ఆ జ్యూస్ ఎరుపు రంగులోకి మారిపోయింది. మెజీషియన్ రెండో సీసా మూత తీసి క్యాబేజి జ్యూస్ ఉన్న రెండో గ్లాస్ లో పోశాడు. జ్యూస్ నీలం రంగులోకి మారింది. అలాగే మూడోసీసాలోని ద్రావణాన్ని మూడో గ్లాస్ లో పోశాడు. జ్యూస్ ఆకుపచ్చ-పసుపు రంగులోకి మారింది. అందరికీ ఆశ్చర్యం వేసింది. apr0021.jpgక్యాబేజి జ్యూస్ తో ఇన్ని రంగులా? విద్యారల్లో గుస గుసలు మొదలయ్యాయి. ఇంక మాట్లాడ్డం మెజీషియన్ వంతయ్యింది. 'చూశారుగా, క్యాబేజి జ్యూస్ ఎలా రంగులు మార్చిందో, మొదటి గ్లాస్ లో ఎరుపురంగు వచ్చింది. నేను కలిపింది ఆరంజి జ్యూస్. అంటే అది ఆమ్ల ద్రావణం అన్నమాట. రెండో గ్లాసులో నీలం రంగు బలహీన క్షారాన్ని సూచిస్తుంది. నేను కలిపింది కాస్టిక్ సోడా వణం అంటే మనం కలిపిన ద్రావణం స్వభావాన్ని బట్టి క్యాబేజి జ్యూస్ రంగులు మారుస్తోంది. అంటే PH కాగితంతో పని లేకుండానే ద్రావణం PHవని ఇంచుమించుగా ఈ క్యాబేజి జ్యూస్ తో తెలుసుకుంటున్నాం. చూశారా, క్యాబేజి మహిమ?' అన్నాడు. అంతా చప్పట్లు కొట్టారు. 'కాని కలిపిన ద్రావణం తటస్థం అయితే ఏ రంగు వస్తుంది, సార్?' ఆతృతతో అడిగాడు పదో తరగతి విద్యార్థి అనిష్. 'చాలా మంచి ప్రశ్న అడిగావు అనిష్, నీ చేతిలో వాటర్ బాటిల్ ఇలా పట్టుకురా. నువ్వే చూద్దువు గాని, ఏ రంగు వస్తుందో.' అన్నాడు మెజీషియన్. అనిష్ వాటర్ బాటిల్ తో వేదిక మీదికి వెళ్లాడు. మెజీషియన్ ఒక ఖాళీ గాజుగ్లాసులో క్యాబేజి జ్యూస్ పోశాడు, అనిష్ ఇప్పుడు వాటర్ బాటిల్ లోని నీరు కొంచెం ఈ క్యాబేజి జ్యూన్ కు కలుపు అన్నాడు మెజీషియన్. చెప్పినట్లే చేశాడు అనిష్, ఏ కొత్తరంగు వస్తుందో అనుకుంటున్నారంతా. కాని క్యాబేజీ జ్యూస్ రంగులో మార్పు లేదు. 'చూశారా, అనిష్ కలిసిన నీరు తటస్థంగా ఉంది. అంటే PH7 అన్నమాట.' అన్నాడు వెజీషియన్. హాలంతా చప్పట్లతో మార్మోగింది.

ఈ మేజిక్ చేయడం చాలా తేలిక. ఇందుకు కావలసినవి:

ఎరుపు క్యాబేజి, చాకు, పెద్దబీకరు, మరుగుతున్న నీరు, వడపోత కాగితం లేదా కాఫీ ఫిల్టర్, 4 లేదా 5 కాస్త పెద్ద సైజు గాజుగ్లాసులు, కొన్ని 250 మిలీ బీకర్ లు, అమ్మోనియా ద్రావణం, ఆపిల్ జ్యూస్, ఆరంజిజ్యూస్, డిటర్జెంట్ పౌడర్.

apr0022.jpgముందుగా రెడ్ క్యాబేజి జ్యూస్ ను తయారు చేసుకోవాలి. ఇందుకోసం క్యాబేజిని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఆ ముక్కల్ని ఒక పెద్ద బికర్లో ఉంచి ఆ ముక్కలు మునిగేలా మరుగుతున్న నీరు పోయాలి. సుమారు 10 నిమిషాల పాటు ఉంచిత తర్వాత వడబోసి, జ్యూస్ ని సేకరించాలి. ఇది ఎరుపు-పర్పుల్-నీలం రంగులో ఉంటుంది. ఈ ద్రవం Ph సుమారు 7 ఉంటుంది. అంటే తటస్థ స్వభావం అన్నమాట. ఈ జ్యూస్ ని సుమారు 50-100మిలీ చొప్పున నాలుగైదు గ్లాసుల్లో పోయాలి. ఇప్పుడు ఒక్కొక్క గ్లాసులో మనం తయారు చేసుకున్న ద్రావణాల్లో ఒకటి కలిపి రంగు మార్పు గమనించాలి. అలాగే మిగతా గ్లాసుల్లోని క్యాబేజి జ్యూసకు వేరే ద్రావణాలను కలిపి రంగు మార్పులు గమనించాలి. ఈ రంగుని బట్టి మనం కలిపిన ద్రావణం Ph ని తెలుసుకోవచ్చు.

ఎరుపురంగు గాఢ ఆమ్ల స్వభావం (PH2)ని సూచిస్తుంది. పర్ఫుల్ (PH4), వైలెట్ (PH6) కూడా ఆమ్ల స్వభావాన్నే సూచిస్తాయి. నీలంరంగు (PH8), నీలి, ఆకుపచ్చ(PH10), ఆకుపచ్చ -పసుపు(PH12) క్షారస్వభావాన్ని సూచిస్తాయి.

మనం ఇంట్లో వాడే జ్యూస్లు, డిటర్జెంట్ల, బేకింగ్ సోడా వంటి వేర్వేరు ద్రవాలు లేదా ద్రావణాలతో ఈ మేజిక్ చేసి వాటి స్వభావాన్ని తెలుసుకోవచ్చు.

రెడ్ క్యాబేజి జ్యూస్ తో PH పేపర్ ని కూడా మనం - తయారు చేసుకోవచ్చు. ఒక వడపోత కాగితాన్ని తీసుకొని ఏ చిక్కని క్యాబేజి జ్యూస్ లో నానబెట్టాలి. రెండు గంటల తర్వాత కాగితాన్ని బయటికి తీసి ఆరబెట్టాలి. తర్వాత కాగితాన్ని ముక్కలుగా కత్తిరించి, ఆయా ద్రావణాల PHకి తెలుసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

ఇలా ఎందుకు జరుగుతుంది? రెడ్ క్యాబేజి ప్రత్యేకత ఏమిటి?

రెడ్ క్యాబేజిలో ఫ్లావిన్ అనే ఒక రంగు పదార్థం (Pigment) ఉంటుంది. ఇది ఒక ఆంథోసయనిన్. రేగుపళ్లు, ఆపిల్ తొక్క ద్రాక్ష వంటి జ్యూస్ ల్లో కూడా ఇది ఉంటుంది. ఈ జ్యూస్ కి ఏదైనా ద్రావణం కలిపితే ఆ ద్రావణం PHని బట్టి రంగు మారుతుంది. నేల స్వభావాన్ని బట్టి కూడా క్యాబేజి వేర్వేరు రంగుల్లో ఉంటుంది. ఆమ్ల స్వభావం ఉన్న నేలల్లో క్యాబేజి ఆకులు ఎరుపుగా వుంటాయి. తటస్థ నేలల్లో పర్ఫుల్ రంగులోను, క్షారనేలల్లో ఆకుపచ్చ-పసుపు రంగులోను ఉంటాయి.

ఆధారం: డాక్టర్ ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate