অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గురుత్వాకర్షణను ఎదిరించే నీరు

గురుత్వాకర్షణను ఎదిరించే నీరు

ఏదైనా పాత్రలో నీరుపోసి పాత్రను తలక్రిందులు చేస్తే ఏమవుతుంది? నీరు కింద పడుతుంది. అలాగే మేఘాలు వర్షిస్తే వర్షం నీరు క్రిందింకే పడుతోంది కదా! ఇందుకు కారణం గురుత్వాకర్షణ. కాని గ్లాసును తలక్రిందులు చేసినా గ్లాసులోని నీరు కింద పడకుండా చేసి చూపిస్తా అంటే గురుత్వాకర్షణను నీరు ఎదిరిస్తోందన్న మాట. అదే ఈ రోజు మ్యాజిక్ అన్నాడు మెజిషియన్.

nov03.jpgమెజిషియన్ చెప్పినట్లే జరిగింది. ఒక గాజు గ్లాసు మీద తన జేబురుమాలును ఉంచి మధ్యలో నొక్కాడు. ఒక బేకరులోని నీరు జేబురుమాలు మీద పోశాడు. గ్లాసు చాలా వరకు నిండింది. జేబురుమాలును గ్లాసు మూతి మీద బిగువుగా లాగాడు. ఒక చేత్తో జేబురుమాలు చివరలను గ్లాసు అడుగున భాగంలో పట్టుకుని రెండో చేతిని గ్లాసు మూతిపైన ఉంచాడు. ఇప్పుడు గ్లాసును తలక్రిందులు చేసి క్రింది చేతిని గ్లాసు నుంచి నెమ్మదిగా తీసివేశాడు. ఆశ్చర్యం! గ్లాసులోని నీరు కింద పడకుండా గ్లాసులోనే ఉండిపోయింది. చూశారా నా జేబురుమాలుకు గురుత్వాకర్షణను వ్యతిరేకించే లక్షణం ఉంది. దీనివల్లే గ్లాసులోని నీరు కూడా గురుత్వాకర్షణను ఎదిరిస్తోంది. అందుకే నీరు కిందికి పడలేదు. ఇలా అంటూనే, చేతిని గ్లాసు మూతి మీద ఉంచి మళ్లీ మూతి భాగంపైకి వచ్చేలా కదిపాడు. ఇప్పుడు జేబురుమాలు తీసివేసి గ్లాసులోని నీటిని మళ్లీ బేకరులో పోసేశాడు. హాలంతా చప్పట్లతో మారుమోగింది.

ఈ మేజిక్ ను మనం కూడా చేయగలం. చాలా సులభం కూడా!

ఇందుకు కావల్సినవి: గుండ్రని అంచు గల పొడవాటి గాజుగ్లాసు, జేబురుమాలు, బీకరులో నీరు, ఒక ఖాళీ నీటి తొట్టె.

గాజు గ్లాసు మూతి మీద జేబురుమాలును ఉంచి, వేలితో మధ్యన నొక్కాలి. రుమాలు గ్లాసులోకి కొంత దిగి మధ్యన గొయ్యిలాగా ఏర్పడుతుంది. ఈ గొయ్యిలోకి బీకరులోని నీటినిపోస్తూ గ్లాసును మూడు వంతులు నింపాలి. రుమాలును నెమ్మదిగా గ్లాసు ప్రక్కల నుంచి కిందికి లాగుతూ, గ్లాసు మూతి మీద బిగుతుగా పరుచుకునేలా చేయాలి. గ్లాసు అడుగున రుమాలు చివరలను ఎడమ చేత్తో పట్టుకుని, కుడిచేతిని గ్లాసుమూతి మీద ఉంచాలి. ఎడమ చేత్తో గ్లాసును కదిల్చి, తలకిందులు చేయాలి. ఇప్పుడు గ్లాసు మూతి భాగం కిందివైపునకు వచ్చింది. ఎడమచేత్తో గ్లాసును పట్టుకుంటూ, రుమాలు క్రిందనుంచి కుడి చేతిని నెమ్మదిగా తీసివేయాలి. కాని నీరు కింద పడకుండా జేబురుమాలు ఆపుతున్నట్లుగా గ్లాసులోనే ఉండిపోతుంది. మెజిషియన్ చేసిన మేజిక్ ఇదే

ఇలా ఎందుకు జరుగుతుంది?

గ్లాసులోని నీటిని రుమాలు గుండా పోసినప్పుడు, రుమాలులోని రంధ్రాల గుండా కిందికి పోయింది. అదే విధంగా గ్లాసును తలకిందులు చేసినప్పుడు కూడా అవే రంధ్రాల గుండా నీరు కిందికి పడిపోవాలి కదా. కాని పడడంలేదు. నిజానికి, రుమాలును గ్లాసుమూతి మీద బిగుతుగా వరిచినప్పుడు ఈ రంధ్రాలన్నీ మాయమైపోయాయి. ఇలా చేసినప్పుడు నీటి అణువులు ఒకదానితో ఒకటి కలిసి తలతన్యతను కలిగిస్తాయి. రుమాలులోని ప్రతి రంధ్రంలోనూ పల్చని నీటి పొర ఏర్పడుతుంది. కాని జాగ్రత్త సుమా! గ్లాసును మరీ గట్టిగా కదిల్చితే, ఈ పల్చని పొరలు తెగిపోయి నీరు ఒక్కసారిగా కింద పడుతుంది.

ఆధారం: డా.ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate