ఇంట్లో కరెంటు పోయినపుడు (పవర్ సప్లై ఆగినపుడు) క్రొవ్వొత్తులు వెలిగిస్తాము కదా. కాసేపటికి కరెంటు వచ్చినపుడు (పవర్) ఎవరు ముందు క్రొవ్వొత్తిని ఊది ఆర్పేస్తామో అని పోటీపడి మీరు పరిగెత్తే వుంటారు. మీరు ఆర్పిన వెంటనే మీ తమ్ముడో, చెల్లెలో ‘హ్యాపీ బర్త్ డే' అని చెప్పే వుంటారు. అవునా? ఈ ఆట అందరూ ఆడే వుంటారు. ఎందుకో చెప్పండి. మనకు ‘పవర్ కట్స్” ఎక్కువ కదా. అదీ సంగతి.
క్రొవ్వొత్తులు సాధారణంగా పారదర్శకంగా తెల్లగాను, రంగు రంగులుగాను దొరుకుతాయి. కానీ బొమ్మలు ముద్రించిన క్రొవ్వొత్తులు ఎప్పుడైనా కొన్నారా? లేదా? పోనీ చూసారా? లేదా? కొనడం.. చూడడం... ఎందుకూ? మనమే బొమ్మలు ముద్రించిన క్రొవ్వొత్తులు తయారుచేస్తే పోలా? ఎలాగంటారా? చాలా సులభం. రండి చేసి చూద్దాం.
కావలసిన వస్తువులు: కొన్ని లావుపాటి క్రొవ్వొత్తులు, బొమ్మలు ముద్రింపబడిన పేపరు, అగ్గిపెట్టె.
విధానం: మామూలు క్రొవ్వొత్తిని బొమ్మలు కలిగిన క్రొవ్వొత్తిగా మార్చడం చాలా సులభం. ముందుగా ఏ బొమ్మను క్రొవ్వొత్తిపై ముద్రించాలో ఆ బొమ్మ గల పేపరును కత్తిరించుకోవాలి. ఈ బొమ్మ వెడల్పు క్రొవ్వొత్తి చుట్టుకొలత కంటే తక్కువగా వుండాలి. ఈ బొమ్మలు న్యూస్ పేపరు పై బాగా చిక్కగా ముద్రింపబడిన తాజా బొమ్మలైతే మంచిది. బొమ్మలో గీతలు బాగా నల్లగా చిక్కగా వుంటే బొమ్మ బాగా వస్తుంది. పేపరు పలుచగా వుంటే మంచిది. కత్తిరించిన ఈ పేపరును బొమ్మగల భాగము క్రొవ్వొత్తిని తాకుతూ కొవ్వొత్తి చుట్టూ గట్టిగా బిగుతుగా చుట్టాలి. (జాగ్రత్త సుమా కాగితం చినిగి పోకూడదు)
తరువాత అగ్గిపుల్ల వెలిగించి పటంలో చూపిన విధంగా పేపరును మెల్లగా (మరీ అంత మెల్లగా కాకుండా) వేడిచేస్తూ క్రొవ్వొత్తిని త్రిప్పుతూ బొమ్మకు - మొత్తం వేడి తగిలేలా చేయాలి. పేపరు కాలకూడదు సుమా. వేడి మాత్రం కావాలి.
అగ్గిపుల్ల ఆర్పివేసి పేపరును తీసి వేయండి. అంతే పేపరు పై గల బొమ్మ కొవ్వొత్తిపై ముద్రపడి పోయింది. నలుపు, తెలుపు బొమ్మలు బాగా ముద్రపడతాయి. రంగు బొమ్మలు బాగా చిక్కగా వుంటే ముద్రపడతాయి.
చూసారా ఎంత సులభము. ఇంకేం మీకు నచ్చిన బొమ్మలు బాపుగారి బుడుగో, సీగాన్ పెసూనాంబ, బొమ్మో, టాం అండ్ జెర్రి బొమ్మో, మిక్కీమౌస్ బొమ్మో రకరకాల బొమ్మలు మీ కొవ్వొత్తిపై ముద్ర వేసుకోండి.
జాగ్రత్త సుమా. అగ్గి పెట్టె వెలిగిస్తున్నాం కాబట్టి పెద్దవారి సమక్షంలో, వారి పర్యవేక్షణలో ఈ పని చేయండి. సరేనా?
ఆధారం: యుగంధర్ బాబు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/9/2020