অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వశీకరణం వాంతులు

వశీకరణం వాంతులు

(నిశిరాతిరి నిశ్శబ్దాన్ని చీలుస్తూ... చిరుగజ్జల సవ్వడి. వడివడిగా నడుస్తున్న తాంత్రిక స్వామి! వెనుకే ఆదుర్దాగా ఆడుగులేస్తున్న మంజులమ్మ! ఊసురోమంటు, వారి వెనుకే స్మశానం వైపు అడుగులేస్తున్న నాయుడు...!)

మంజులమ్మ: సామీ! మరులు మందు, మొత్తం కక్కేసాడా?

తాంత్రికుడు: (గంభీరంగా) ఆ! ఆ!

మంజులమ్మ: ఇక మా నాయుడు, ఆ చంద్రాలు వంక చూడడుగా!

తాంత్రికుడు: చూడడు! చూడడు!

మంజులమ్మ: కడుపులో, ఇంకేమైన మిగిలిందేమో, సామి?

తాంత్రికుడు: నా మీదే అనుమానమా?

మంజులమ్మ: లేదు! లేదు సామి! అది మళ్ళీ ఏ అరటి పండులోనో మందు పెడతాదేమోనని!

తాంత్రికుడు: స్మశానకొల్ల చేసి, నీ పెనిమిటికి రక్ష కట్టాలి...!

(నాయుడికి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదు. చంద్రాలు తన మేనత్త కూతురు. చిన్నప్పటి నుండి, తనకిచ్చే పెళ్ళి చేయాలనుకొన్నారు. కానీ కాల ప్రభావం, పరాయి సంబంధం, మంజులమ్మను పెళ్ళాడాడు. నాయుడు దక్కలేదని చంద్రాలు, చాల ఏండ్లు పెళ్ళి చేసుకోలేదు. ఆపై పెళ్ళి జరిగింది. కానీ ఆమె భర్త జూదరి, తాగుబోతు! అర్థాంతరంగా అప్పులగంప చంద్రాలు నెత్తిన పెట్టి, పుటుక్కున పోయాడు. ఇదంతా తన వల్లే జరిగిందని భావించి ఆర్థికంగా స్థితిపరుడైన నాయుడు, చంద్రాలు అప్పులు తీర్చి, అర ఎకర పొలం ఆమె పేరున రాశాడు. మంజులమ్మ మనస్సులో అదో ముల్లయింది, తాంత్రికుడి "మరులు మందు” (వశీకరణ మందు) మాటలతో అదికాస్తా బలపడింది!)

నాయుడు: మంజూ! ఇక ఆపవే! వీడు పెట్టిన విరుగుడు కషాయానికి ఆరు వాంతులయ్యాయి!

మంజులమ్మ: ఆరో వాంతిలోనేగా ఆ చంద్రాలు పెట్టిన మందు ఆరటిపండు ముక్కతోపాటు పడింది.

నాయుడు: (మనస్సులో) దీని మూర్ఖత్వం తగలేయా! ఆరునెలల క్రితం నమిలి మింగిన పండు! ఇప్పుడు వాంతిచేస్తే ముక్కలుగాను, అందులో వరుల మందు నల్లగుళికలగాను పడిందంటే ఎలా నమ్మిందో?

మంజులమ్మ: స్వామి! ఆ చంద్రాలు బ్రతకరాదు సామి!

తాంత్రికుడు: అదెంత! ఓ ఐదులక్షలు నీవి కావనుకుంటే, చేతబడి చేసేస్తాను!

(ఇక ఓర్చుకోవడం నాయుడి చేత కాలేదు. బక్కపల్చగా ఉన్న తాంత్రికుడి నడ్డిపై ఓ తన్ను తన్నాడు! కండలు తిరిగిన నాయుడి ముందు, తాంత్రికుడి బలం చాలలేదు. పెడరెక్కలు విరిచికట్టి లాక్కొచ్చి తన పశువుల కొట్టంలోని రాతి కూసానికి కట్టేశాడు.)

నాయుడు: (ఫోను చేస్తూ) రఘురాం తాతగారూ! మీరు చెప్పింది నిజమండి. ఈ తాంత్రికుడి ఆగడాలు ఆగటం లేదు. నా భార్యకు మనస్సుకుదుటపడుతుందని ఓర్చుకుంటే, చేతబడి, చిల్లంగి, బాణామతి అంటూ కొత్త నాటకానికి తెరతీస్తున్నాడు.

తాత: వాడిని నే చెప్పినట్లు కట్టిపడై, పోలీసులతో పాటు నేను వచ్చేశాను!

నాయుడు: వీటిని విడిచేదే లేదండి! నా బతుకుతో ఆడుకున్నాడు! (ఆవేశంగా)

ఇన్స్పెక్టర్: (వస్తూ) నాయుడూ! వీడి బుట్టలో నీవెలా పడ్డావోయ్!

నాయుడు: నేను కాదండి! మా ఆడవాళ్ళే!

మంజులమ్మ: అప్పనంగా ఆస్థి, మరో ఆడదానికి రాస్తుంటే చూస్తూ ఉరుకోవాలా?

నాయుడు: నీ కళ్ళకు మాయ కమ్మిందే!

తాత: (అడ్డు పడుతూ) ఆగవయ్య నాయుడు! ఈ తాంత్రికుడు మనూరి వాడుకాదే!

నాయుడు: (మంజలను చూపుతూ) వాళ్ళ బాబాయికి ఫోను చేసి మరీ పిలిపించింది.

మంజులమ్మ: మా బాబాయి ఇంట్లో వాస్తు పూజ చేసి, ఈ సామి ఫోటో ఫ్రేం పెడితే అందులో నుండి విభూది రాలింది తెల్సా!

తాత: (పకపక నవ్వుతూ) అల్యూమినియం ఫ్రేమ్తో వుండే మీ ఆయన ఫోటో తీసుకొని రావమ్మా! దానికి మెర్యురిక్ క్లోరైడ్ పూసి, ఓ గంటపాటు పెడితే రసాయన చర్య వల్ల అల్యూమిని క్లోరైడ్ విభూదిలా రాలుతుంది.

కానిస్టేబుల్: మెడికల్ షాపులో దొరికే లాక్టోబాసిల్లస్ పొడిని చెమ్మచేసి అద్దం మీద రాస్తే, తడి ఆరిపోగానే విభూతిలా రాలుతుంది.

మంజులమ్మ: వశీకరణ అయ్యింది కాబట్టే సామి మంత్రించిన, టెంకాయను మా ఆయన కొడితే మసి, వెంట్రుకలు, గోర్లు పడ్డాయి.

తాత: టెంకాయకు ముఛ్చె భాగంలో మెత్తగా వుండే మూడు నల్లని చుక్కలుంటాయి. వాటి దగ్గర చిన్న చిల్లు చేసి పూలు, పసుపు, కుంకుమా వేసి ఫెవికాల్తో అతికేశామనుకో...!

పక్కింటి కుర్రాడు: అదో మ్యాజిక్ అక్కా.

మంజులమ్మ: మరులు మందు కక్కించాక, నాయుడితో టెంకాయ కొట్టిస్తే, మీరు చెప్పినవే వస్తాయని చెప్పాడే!

తాత: వాడి సంచి వెదకండి! అలాంటి ఏర్పాట్లతోనే వచ్చాడేమో!

కుర్రాడు: (సంచిలోంచి టెంకాయ తీసికొడుతూ!) మంజులక్కా! ఇదిగో, నీ తాంత్రిక సామి. భాగోతం బయటపడుతూవుంది! (టెంకాయ పగిలింది! పూలు, ఆక్షింతలు ఎరుపు, పసుపు రంగులలో భళ్ళున రాలాయి.)

నాయుడు: మరి వీడు నా చేతిలోను, నాభార్య చేతిలోను పచ్చి కాకరకాయల రసం పోసి పది నిమిషాలు పట్టుకోమన్నాడు...!

తాత: నీ చేతిలోని కాకర రసం మాత్రం గడ్డకట్టింది! అంతేగా!

నాయుడు: అవును! అదెలా జరిగింది.

తాత: చిటికెడు కరక్కాయపొడిని, నీ కంట పడకుండ నీచేతి కాకరరసంలో కలిపితే అదే గడ్డకడుతుంది!

మంజులమ్మ: మరి మా ఆయన గత రెండు నెలలుగా నీరసంగా, నిర్లిప్తంగా రోగం వచ్చినట్టున్నాడే? నాయుడు: మంజూ! రాత్రిపగలు తేడా లేకుండా అక్రమ సంబంధం అంటకట్టి వేధిస్తుంటే నేనెలా సంతోషంగా వుంటాను చెప్పు!

తాత: భార్యా, భర్తల మధ్య పొరపొచ్చాలు రావడం సహజం, వాటిని తమలో తాము సరుకుపోవాలి కాని, తాంత్రికులు, మాంత్రికులు అంటూ పోరాదు.

నాయుడు: మంజూ! నా వైపువారికి సాయం చేస్తే అడ్డు పడతావని నీతో చర్చించకుండా చంద్రాలుకు సాయం చేయడం తప్పే! ఒప్పుకుంటున్నాను.

మంజులమ్మ: (బాధపడుతూ) మీతో మాట మాత్రం చెప్పకుండా తాంత్రికుడి వద్దకు పోయుండరాదు...!

ఇన్స్పెక్టర్: (తాంత్రికుడికి నాలుగు తగిలిస్తూ!) ఏరా! వాంతులు కావడానికి ఏ విషం పెట్టావో చెప్పు.

తాంత్రికుడు: విషం కాదు దొర! నల్లచిల్లంగి గింజలు పిడికెడు తీసుకొని, గ్లాసు పచ్చిమేకపాలలో గంట సేపు నాన పెట్టి తాపితే నాలుగైదు వాంతులవుతాయి.

ఇన్స్పెక్టర్: అవి ఎక్కడ చిక్కాయి రా?

తాంత్రికుడు: పట్నంలోని నాటు మందుల షాపులో అమ్ముతారయ్యా!

తాత: మరి అరటిపండు, గుళికలు?

తాంత్రికుడు: నా చేతిలో వుంటే గుర్తుపడతారని, దీక్షా వస్త్రంగా నాయుడి భుజంపై వేసిన కండవా మడుతలో అంటించి పెట్టాను...!

తాత: వాంతుల హడావిడిలో అందరూ వుంటే, నీవు మడత విప్పావా?

తాంత్రికుడు: ఆ! దొర! చూడటానికి అది నోట్లో నుంచి పడ్డట్లుగానే అని పిస్తుంది.

మంజులమ్మ: ఓరి! నీ కనికట్టు పడిపోను! నా కాసులపేరు నగను కుదవపెట్టి డబ్బిచ్చాను కదరా!

ఇన్స్పెక్టర్: నీ డబ్బెక్కడికి పోదమ్మా! పైసాపైసా వీడితో నేను కక్కిస్తాను!

(అనుమానాలు - అపార్థాలు వున్నచోట - అనురాగం, అనోన్యం సాధ్యం కాదు. అలానే మన బుద్ధి, పెడబుద్ధికి మారనంత వరకు ఏ మోసగాడు మనల్ని ఏమి చేయలేడని గ్రహిద్దాం!)

ఆధారం: జి. చంద్రశేఖర్

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/19/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate