పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ర్యాన్సమ్‌వేర్

ర్యాన్సమ్‌వేర్ అనేది వైరస్‌లలో ఒక రకానికి చెందినది. ఇది కంప్యూటర్‌లోకి ప్రవేశించాక యూజర్‌కు చెందిన ఫైల్స్ అన్నింటినీ లాక్ చేస్తుంది

ర్యాన్సమ్‌వేర్ అంటే

ర్యాన్సమ్‌వేర్ అనేది వైరస్‌లలో ఒక రకానికి చెందినది. ఇది కంప్యూటర్‌లోకి ప్రవేశించాక యూజర్‌కు చెందిన ఫైల్స్ అన్నింటినీ లాక్ చేస్తుంది. ఈ క్రమంలో యూజర్ ఒక వేళ ఆ ఫైల్స్‌ను ఓపెన్ చేయాలని చూస్తే అప్పుడు అవి ఓపెన్ కావు. పైగా ఫైల్స్ లాక్ అయ్యాయని, కొంత డబ్బు కడితేనే ఆ ఫైల్స్ మళ్లీ అన్‌లాక్ అయి ఓపెన్ అవుతాయని, వీలైనంత త్వరగా డబ్బు కట్టకపోతే ఫైల్స్ అనీ ఎరేజ్ అవుతాయని ఓ మెసేజ్ కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్ ఆ మెసేజ్‌లో కనిపించిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. అది నేరుగా హ్యాకర్ల ఖాతాలోకి చేరుతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తింగా అటాక్ అయిన వాన్న క్రై కూడా ర్యాన్సమ్‌వేర్ విభాగానికే చెందుతుంది. ఇప్పటికే ఈ వైరస్ సోకిన చాలా కంప్యూటర్లకు చెందిన యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్టు తెలిసింది.

'వాన్న క్రై (Wanna Cry)'

ప్రపంచ దేశాలను ఇప్పుడీ ర్యాన్సమ్‌వేర్ ఊపేస్తున్నది. సుమారు 100కి పైగా దేశాల్లో ఉన్న అనేక రంగాలకు చెందిన సంస్థల కంప్యూటర్లు ఈ ర్యాన్సమ్‌వేర్ బారిన పడ్డాయి. దీంతో భారీ నష్టం వాటిల్లింది. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద సైబర్ అటాక్‌గా దీన్ని భావిస్తున్నారు.

ఇలా వ్యాప్తి చెందుతుంది..!

  1. ర్యాన్సమ్‌వేర్ ఏదైనప్పటికీ అది ఎక్కువగా ఈ-మెయిల్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ-మెయిల్స్‌కు వచ్చే లింక్‌లలో అటాచ్‌మెంట్లు ఉంటాయి. అవి .doc, .zip, .rar, .xls, .rtf వంటి ఫైల్ ఎక్స్‌టెన్షన్లతో ఉంటాయి. ఈ క్రమంలో ఆ ఫైల్స్‌ను యూజర్లు క్లిక్ చేస్తే వెంటనే వాటి ద్వారా ఈ ర్యాన్సమ్‌వేర్ కంప్యూటర్‌లోకి ప్రవేశిస్తుంది.
  2. ఆన్‌లైన్‌లో కొందరు అశ్లీల వెబ్ సైట్లను పదే పదే చూస్తూ ఉంటారు. వాటిల్లో చాలా మటుకు సైట్లలో వైరస్‌లు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సైట్లను చూడడం వల్ల కూడా వాటిలో ఉండే వైరస్ పీసీల్లోకి వ్యాప్తి చెందుతుంది.
  3. పైరేటెడ్ సినిమాలు, వీడియోలు, పాటలు, ఫొటోలు, సాఫ్ట్‌వేర్లు, ఇతర ఫైల్స్‌ను ఉచితంగా ఇస్తామని చెప్పే సైట్ల ద్వారా కూడా ఇలాంటి వైరస్‌లు వ్యాపిస్తాయి. ఆయా ఫైల్స్‌లలో ర్యాన్సమ్‌వేర్ తరహా వైరస్‌లు కలిసిపోయి ఉంటాయి. ఈ క్రమంలో ఆ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పీసీలో ఓపెన్ చేస్తే అప్పుడు వాటి ద్వారా ర్యాన్సమ్‌వేర్ పీసీలోకి చేరుతుంది.
  4. ఒరిజినల్ సైట్లు కాకుండా డూప్లికేట్, ఫిషింగ్ సైట్లను తెలియకుండా ఓపెన్ చేస్తే వాటి ద్వారా కూడా ర్యాన్సమ్‌వేర్ కంప్యూటర్లలోకి ప్రవేశిస్తుంది.
  5. పాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు వైరస్‌ల నుంచి బెడద ఎక్కువగా ఉంటుంది. వాటి సెక్యూరిటీలో ఉండే లోపాల వల్ల కూడా ఈ తరహా ర్యాన్సమ్‌వేర్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.
  6. కేవలం కంప్యూటర్లకే కాదు, ఆండ్రాయిడ్, ఐఫోన్లకు కూడా ఈ ర్యాన్సమ్‌వేర్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఆయా డివైస్‌లలో పైన చెప్పిన విధంగా అటాచ్‌మెంట్లను ఓపెన్ చేసినా, ఆయా సైట్లను దర్శించినా, లేదంటే రూటింగ్ చేసిన డివైస్‌లను వాడినా వైరస్‌ల బారిన పడేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ర్యాన్సమ్‌వేర్ నుంచి తప్పించుకోవాలంటే ఇలా చేయాలి..!

  1. గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఈ-మెయిల్స్ అస్సలు ఓపెన్ చేయవద్దు. వాటిలో పైన చెప్పినటువంటి అటాచ్‌మెంట్లు ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక అలాంటి మెయిల్స్ వస్తే వెంటనే వాటిని డిలీట్ చేయాలి తప్ప ఓపెన్ చేయకూడదు.
  2. యూజర్లకు వచ్చే ఈ-మెయిల్స్‌లో .wncry, wannaDecryptor, Wanna Decryptor 1.0, Wana Decrypt0r, Wana Decryptor, WANNACRY, WanaCrypt0r, WANACRY!, WNcry@2ol తరహా సబ్జెక్ట్ లేదా అటాచ్‌మెంట్లు ఉంటే అస్సలు ఓపెన్ చేయరాదు. వాటిని డిలీట్ చేసేయాలి.
  3. మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సర్వర్ మెసేజ్ బ్లాక్ (SMB) అనే ప్రొటోకాల్‌లో ఉన్న లోపం ద్వారా కూడా ర్యాన్సమ్‌వేర్ వ్యాపిస్తున్నట్టు తెలిసింది. కనుక ఆ ప్రొటోకాల్‌ను డిసేబుల్ చేయాలి. అందుకు విండోస్ పీసీ యూజర్లు Control Panel --> Programs --> Windows Features అనే ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ లిస్ట్‌లో ఉండే SMB 1.0/CIFS File Sharing Support అనే ఆప్షన్‌కు ఉండే చెక్ మార్క్ తీసేయాలి. దీంతో ర్యాన్సమ్‌వేర్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు.
  4. అశ్లీల వెబ్‌సైట్‌లు, పైరేటెడ్ సాఫ్ట్‌వేర్‌లు, సినిమాలు, పాటలు, వీడియోలు, ఫొటోలు ఉండే వెబ్‌సైట్లను ఓపెన్ చేయరాదు.
  5. మాక్ లేదా విండోస్ పీసీ ఏది వాడినప్పటికీ యూజర్లు ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడాలి. పైరేటెడ్ వెర్షన్ వాడకూడదు. అలా వాడితే సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఆయా కంపెనీలు విడుదల చేసే సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు వీలుండదు.
  6. విండోస్ పీసీ యూజర్లు తాజాగా విడుదలైన MS17-010 అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
  7. యూజర్లు ముఖ్యమైన డేటానంతా సీడీలు, డీవీడీలు లేదా ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌లలోకి ఎప్పటికప్పుడు కాపీ చేసుకోవాలి. ఇలా చేస్తే ఒక వేళ ర్యాన్సమ్‌వేర్ అటాక్ అయినా నష్టం ఉండదు. పీసీని వెంటనే ఫార్మాట్ చేసుకుని ఎప్పటిలా వాడుకోవచ్చు. అయితే అలా జరిగినప్పుడు సురక్షితంగా ఉండేలా మంచి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
  8. కాస్పర్ స్కై, ఏవీజీ, అవాస్ట్, నార్టన్ వంటి సంస్థలు యాంటీ వైరస్, ఇంటర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లను అందిస్తున్నాయి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటే ఇలాంటి ర్యాన్సమ్‌వేర్‌ల బెడద తప్పుతుంది.
  9. విండోస్ పీసీల్లో ఆఫీస్ 365 ఎడిషన్ వాడే వారు అందులో Advanced Threat Protection అనే ఫీచర్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేస్తే ఎలాంటి అటాచ్‌మెంట్ల నుంచి అయినా పీసీకి రక్షణ లభిస్తుంది. అలాంటి ర్యాన్సమ్‌వేర్‌లు అటాచ్‌మెంట్ల రూపంలో వస్తే ఈ ఫీచర్ వెంటనే వాటిని బ్లాక్ చేస్తుంది. తద్వారా కంప్యూటర్ సురక్షితంగా ఉంటుంది.
  10. కంప్యూటర్‌లో ఎప్పటికప్పుడు పేరుకుపోయే జంక్ ఫైల్స్, హిస్టరీ, కుకీస్‌ను క్లీన్ చేసుకోవాలి. అందుకు CCleaner వంటి సాఫ్ట్‌వేర్లు ఉపయోగపడతాయి. దీని వల్ల వైరస్‌లు ఆ జంక్ ఫైల్స్‌లో స్టోర్ కావు.

ఆండ్రాయిడ్‌కు విస్తరించనున్న ర్యాన్‌సమ్‌వేర్!

వేలకువేలు పోసి కొనుక్కునే మొబైల్‌ఫోన్ అకస్మాత్తుగా ఫ్రీజై పోయింది. విలువైన డేటా, ఫొటోలన్నీ అందులోనే ఉండిపోయాయి. ఇంతలో ఫలానా బ్యాంక్ అకౌంట్‌కు రూ.వెయ్యి డిపాజిట్ చేస్తే ఫోన్ బాగైపోతుందని మెసేజ్! ఏం చేస్తారు? పనిజరిగితే చాలనుకుని వెయ్యి వదిలించుకుని ఫోన్‌ను అన్‌ఫ్రీజ్ చేయించుకుంటారు. ఈ ఏడాది మొబైల్ ప్రపంచానికి దాపురించనున్న అతిపెద్ద సెక్యూరిటీ కష్టమిదేనంటోంది క్విక్‌హీల్ అనే సంస్థ. నిన్న మొన్నటివరకూ విండోస్ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే పరిమితమైన ఈ ర్యాన్‌సమ్‌వేర్ బెడద ఈ ఏడాది ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫార్మ్‌కు కూడా విస్తరిస్తుందని క్విక్‌హీల్ విడుదల చేసిన వార్షిక నివేదిక హెచ్చరించింది. దీంతోపాటు మొబైల్, ట్యాబ్లెట్లపై అక్రమంగా ప్రకటనలు గుప్పించే యాడ్‌వేర్‌లు కూడా ఈ ఏడాది విజృంభించే అవకాశముంది. నివేదికలోని ముఖ్యాంశాలు...

  1. 2014లో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫార్మ్‌పై దాదాపు 30 లక్షల ఆండ్రాయిడ్ మాల్‌వేర్ శాంపిల్స్ కనిపించాయి.
  2. 2011 - 2014 మధ్యకాలంలో ఆండ్రాయిడ్ మాల్‌వేర్ దాదాపు 304 రెట్లు పెరిగింది.
  3. ఒక్క 2014లోనే ఈ పెరుగుదల నాలుగు రెట్లు ఉండటం గమనార్హం.
  4. గత ఏడాది మొత్తం 536 కొత్త మాల్‌వేర్ ఫ్యామిలీస్, 616 వేరియంట్స్‌ను క్విక్‌హీల్ గుర్తించింది.
  5. గూగుల్ ప్లే స్టోర్‌లో నకిలీ పెయిడ్ అప్లికేషన్లు కనిపించడం ఎక్కువగా ఉంది.
  6. క్యాష్‌లెస్ పేమెంట్ వ్యవస్థలు, బ్యాంకు లావాదేవీలు, అప్లికేషన్లపై మాల్‌వేర్ సృష్టికర్తల దాడి పెరిగే అవకాశం.
  7. ఇప్పటివరకూ డెస్క్‌టాప్, సర్వర్లపై దృష్టిపెట్టిన హ్యాకర్లు ఇకపై వైఫై నెట్‌వర్క్‌ల్లోకి విధ్వంసక సాఫ్ట్‌వేర్‌లు జొప్పించి, మొబైల్ ట్రాఫిక్ ప్యాకెట్ల రవాణాను చిన్నాభిన్నం చేసే అవకాశముంది.
  8. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి కొత్త, వినూత్న మార్గాల్లో ర్యాన్‌సమ్ వేర్‌ను చేర్చేందుకు ప్రయత్నాలు
  9. ర్యాన్‌సమ్ వేర్ మెసేజీలు స్థానికభాషల్లోనూ ప్రత్యక్షమయ్యే అవకాశం.
  10. డీఫాల్ట్ వెబ్ బ్రౌజర్లను, సెర్చింజిన్లను మార్చేసి పీసీని నత్తనడకన నడిపించే మాల్‌వేర్ 2014లో విండోస్ వినియోగదారులను బాగా చికాకుపెట్టింది.

మరింత సమాచారం కొరకు cert-in లో చూడండి

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
సంబంధిత అంశాలు
మరిన్ని ...
పైకి వెళ్ళుటకు