పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహణ

పాఠశాలలో నిర్మాణాత్మక మూల్యాంకనం అమలు

ఉపోద్ఘాతం

పాఠశాలల్లో 6 నుండి 10 తరగతులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు జరుగుతున్నది. విద్యార్థుల ప్రగతిని మూస పద్దతితో కూడిన పరీక్షల ద్వారా మూల్యాంకనం చేయడం అశాస్త్రీయమని గుర్తించడంవల్ల సి.సి. ఇని నిర్వహించడం జరుగుతున్నది. విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు? అభ్యసన ఫలితాలు ఎలా ఉంటున్నాయి? అనేవి గుర్తించడానికి నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం నిర్వహిస్తున్నాం.

నిర్మాణాత్మక మూల్యాంకనం

నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని 20 మార్కులకు నిర్వహిస్తారు. ఈ 20 మార్కులను కింది విధంగా కేటాయిస్తారు.

  1. పుస్తక పఠనం, సమీక్షారచన      :         5 మార్కులు
  2. విద్యార్థులు రాసిన అంశాలు      :         5 మార్కులు
  3. ప్రాజెక్టుపని                          :         5 మార్కులు
  4. లఘు పరీక్ష                        :         5 మార్కులు

పై 4 అంశాల గురించి వివరంగా పరిశీలిద్దాం.

పుస్తక పఠనం - సమీక్ష

పుస్తక పఠనం అంటే విద్యార్థి తాను అభ్యసించే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా పాఠశాల గ్రంథాలయ పుస్తకాలు, బాల సాహిత్యం, ఇతర పుస్తకాలు చదువడం. విద్యార్థుల స్థాయికి అనుగుణమైన పుస్తకాలు పిల్లలు చదువాలి. కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కావడంవల్ల విద్యార్థులు అదనపు జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. పాఠ్యపుస్తక అభ్యసనం ద్వారా పొందిన భాషా జ్ఞానంతో బయటి పుస్తకాల్ని స్వయంగా అభ్యసించి అందులోని విషయాల్ని గ్రహించే స్థాయికి విద్యార్థి ఎదగాల్సిన అవసరం ఉంది. పుస్తక సమీక్ష : పాఠ్యపుస్తకాల పఠనం ద్వారా విద్యార్థులందరిలోనూ దాదాపు ఒకే రకమైన వ్యక్తీకరణకు అవకాశం ఉంది. విద్యార్థులు ఇతర పుస్తకాలు చదివి, సమీక్ష రాయడం ద్వారా వారి స్వంత వ్యక్తీకరణ బయటపడుతుంది. ఆయా విద్యార్థులకు వేర్వేరు పుస్తకాలు అందించడంవల్ల, వాటిని చదివే విద్యార్థులు సమీక్షలు కూడ వేరు వేరుగా చేస్తారు. పుస్తక సమీక్షకు ప్రత్యేకంగా ఒక నోటుపుస్తకం ఏర్పాటుచేయించి, ఆయా సమీక్షల్ని అందరి చేత తరగతి గదిలో చదివించాలి. దీనికి అదనంగా కేటాయించబడే 8 పీరియళ్ళు వినియోగించుకోవాలి. వాటి సమీక్షా స్థాయిని బట్టి 5 మార్కుల వరకు FA లో నమోదు చేసుకోవాలి. పుస్తక సమీక్షకు కనీసం వారం రోజుల సమయాన్ని కేటాయించాలి.

పుస్తక సమీక్షలో 1. ప్రాథమిక వివరాలు II. చదివిన అంశం III. అభిప్రాయం అనేవి ప్రధానాంశాలు. ప్రాథమిక వివరాల'పుస్తకం పేరు, రచయిత పేరు, ప్రక్రియ, ముద్రణాసంస్థ, పుటల సంఖ్య, వెల అనే అంశాలు రాయాలి. ఈ వివరాలను 6, 7 తరగతులలో బుల్లెట్ పాయింట్ల రూపంలో రాసినా, 8, 9, 10 తరగతుల్లో పేరా రూపంలో రాయాలి. చదివిన అంశం'లో పుస్తకంలో ఉన్న విషయాన్ని విశ్లేషించాలి. స్వంత మాటల్లో రాయాలి. పుస్తకంలోని పద్యాలు / కవితలు/ సామెతలు / సూక్తులు మొదలైనవి విశ్లేషణలో ఉదహరించాలి.

మూడవ అంశమైన 'అభిప్రాయాలను రాయడం' పుస్తక సమీక్షలో అతి ముఖ్యమైనది. పుస్తకం చదువడం ద్వారా తాను పొందిన అనుభూతినీ, అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. సమీక్ష రచన అనగానే స్థాయికి మించినదిగా భావించాల్సిన అవసరం లేదు. పుస్తకం పెద్దదైనప్పుడు ప్రధానాంశాల్ని చదివి అందులోని మంచీ చెడుల్ని పరిచయం చేసేలా రాసినా సరిపోతుంది.

రాత పనులు

విద్యార్థులు సొంతమాటల్లో రాయడం, సృజనాత్మకంగా రాయడం, భాషాంశాలకు సంబంధించిన అంశాలు రాయడం అనేవి రాతపనులు. పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశం తర్వాత ఇవి చేయండి' శీర్షిక కింద ఇచ్చిన సామర్ధ్యాల సాధనకు సంబంధించినవి రాత అంశాలు. ప్రత్యేకంగా ఒక నోటు పుస్తకం రాత అంశాల కొరకు ఉండాలి. విద్యార్థుల నోటు పుస్తకాలను పరిశీలించడం ద్వారా ఈ రాత అంశాల స్థాయిని గుర్తించవచ్చు. పాఠ్య పుస్తకంలోని అభ్యాసాలను విద్యార్థి నోటు పుస్తకంలో రాస్తాడు. ఇందులో స్వీయరచన, సృజనాత్మకతకు చెందిన ప్రశ్నలకు స్వయంగా జవాబులు రాస్తాడు. అలా రాసిన అంశాల్లోని రచనా శైలి, స్వీయభావనలు, భాష, వాక్య నిర్మాణ రూపము తదితరాలన్నీ ప్రాధాన్యతవహిస్తాయి. విద్యార్థి స్వంత వ్యక్తీకరణకు రాత అంశాలలో ప్రాధాన్యత ఇవ్వాలి.

నిర్వహణ : బోధనా సోపానాల్లో అభ్యాసాల నిర్వహణకు తగిన కాలాంశాలు కేటాయించడం జరిగింది. వాటిని సరిగా వినియోగించుకొని విద్యార్థులు రాత అంశాలు పూర్తి చేసే విధంగా చూడాలి. తరగతి గదిలో రాయాల్సిన అభ్యాసాలు ఆయా పీరియడ్లలోనే పూర్తి చేసే విధంగా చూడాలి. ఇంట్లో రాయల్సిన అంశాలను ఇంటిపనిగా ఇవ్వాలి.

మార్కుల కేటాయింపు : విద్యార్థి స్వయంగా రాసిన అంశాలకు 5 మార్కులు కేటాయించాలి. విద్యార్థి గైడ్లు, వర్క్ బుక్లు చూసి రాస్తే వాటిని పరిగణనలోకి తీసుకోకూడదు. అవసరమైతే స్వంతంగా మళ్ళీ రాసేలా చూడాలి. సౌలభ్యం కోసం ఒక్కొక్క పాఠానికి 10 మార్కుల చొప్పున కేటాయించుకోవాలి. FA నిర్వహించే సమయానికి ఎన్ని పాఠాలు పూర్తయితే వాటి సగటు లెక్కించాలి. నమోదు చేసేటప్పుడు 5 మార్కులకు లెక్కించాలి. వ్యక్తీకరణ, భావాన్ని క్రమ పద్ధతిలో రాయడం, దోషాల్లేకుండా రాయడం, సొంతంగా రాయడం మొదలైన అంశాలను మార్కులు కేటాయించడానికి పరిగణనలోనికి తీసుకోవాలి. విద్యార్థులు ఒకరికొకరు చూసి రాయకుండా జాగ్రత్తవహించాలి. ప్రతి పాఠానికి మార్కులు కేటాయించాలి. నోటు పుస్తకాలు పరిశీలించకుండా మార్కులు ఇవ్వరాదు.

ప్రాజెక్టు పని

వివిధ వనరుల ద్వారా సమాచారన్ని సేకరించి నివేదిక రాసి, ప్రదర్శించడాన్ని భాషా ప్రాజెక్టు పనులుగా పరిగణిస్తారు. దీనివల్ల అభ్యసించిన సామర్థ్యాలను వినియోగించగలుగుతారు. ప్రాజెక్టుపని విభిన్న సామర్థ్యాలు, కృత్యాల సమాహారం. విద్యార్థిలోని సమగ్ర అంతర్గత శక్తుల్ని వెలికితీయడం, వాటిని పెంపొందించడం, వినియోగింపజేయడమే ఈ ప్రాజెక్టు పనుల ఉద్దేశ్యం.

పాఠ్య పుస్తకంలో ప్రతి పాఠం చివర భాషా కార్యకలాపాలు / ప్రాజెక్టుపని పేరుతో అన్ని పాఠాలలో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. FA నాటికి ఎన్ని పాఠాలు పూర్తయినా, వాటిలో ఏదైనా ఒక ప్రాజెక్టు పనిని విద్యార్థులను చేయమనాలి. నివేదిక రాయమనాలి. ప్రాజెక్టును ఎలా చేయాలో విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలి. పాఠ్యాంశ బోధన తర్వాత ప్రాజెక్టుపనిని అప్పగించి, అభ్యాసాల నిర్వహణ అనంతరం విద్యార్థుల చేత వారి వారి ప్రాజెక్టులను ప్రదర్శింపజేయాలి.

మార్కుల కేటాయింపు : FA లో ప్రాజెక్టు పనులకు 5 మార్కులు కేటాయించడం జరిగింది. అయితే దీన్ని 10 మార్కులకు నిర్వహించుకొని సగటున 5 మార్కులు నమోదు చేసుకోవచ్చు. సమాచార సేకరణ నైపుణ్యానికి 2 మార్కులు, నమోదు చేసే విధానానికి 5 మార్కులు, ప్రదర్శనా వివరణకు 3 మార్కుల చొప్పున ఇవ్వవచ్చు.

నివేదిక

(అ) ప్రాథమిక సమాచారం

1) ప్రాజెక్టు పని పేరు :

2) సమాచారాన్ని సేకరించిన విధానం :

(ఆ) విషయ వివరణ ( సేకరించిన సమాచారాన్ని పేరా లేదా పట్టిక రూపంలో సంక్షిప్తంగా రాయాలి.)

(ఇ) నేర్చుకున్న విషయాలు-ముగింపు

ప్రాజెక్టు పని గ్రూపుల వారీగా చేసినా, నివేదిక వ్యక్తిగతంగా రాయాలి. మార్కులను వ్యక్తిగతంగా కేటాయించాలి.

లఘు పరీక్ష :

తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియలకు అనుగుణంగా సామర్థ్యాలను అంచనా వేయడానికి తగిన ప్రశ్నలను కూర్చి విద్యార్థులచే సమాధానాలు రాయించాలి. ఒక FA నాటికి 1 నుండి 3 లఘు పరీక్షలు నిర్వహించుకున్నా వాటిలో ఉత్తమంగా మార్కులు పొందిన పఘు పరీక్షను నమోదు కొరకు తీసుకోవాలి. ఒక లఘు పరీక్షను 20 మార్కుల చొప్పున నిర్వహించాలి. తర్వాత సగటును 5 మార్కులకు తీసుకోవాలి.

I, II FA ల సరాసరి SA-1 కు,

I, II, III, IV ల సరాసరి SA-II కు స్వీకరించాలి.

పిల్లలు జవాబులను నోటు పుస్తకాలలో రాయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠ్య పుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలను యథాతథంగా ఇవ్వరాదు. లఘుపరీక్షను 10 మార్కుల చొప్పున రెండు సార్లు నిర్వహించకూడదు. ఒకేసారి 20 మార్కులకు నిర్వహించాలి. ఏవైనా 2, 3 సామర్థ్యాల ఆధారంగా నిర్వహించాలి. అయితే తప్పనిసరిగా స్వీయరచన, సృజనాత్మకత ప్రశ్నలను ఇవ్వాలి.

ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్

3.04545454545
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు