పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పదజాల సామర్థ్యం

అభ్యాసన ప్రక్రియయందు విద్యార్థుల పదజాల సామర్థ్యం

పరిచయం

ఆలోచనకు అభివ్యక్తికి సాధనం భాష, ఆ భాషకు పరిపుష్టిని కలిగించేది ఆ భాషలోని పదజాలం. ప్రతిభాషకు తనదైన ప్రత్యేక పదజాలము ఉంటుంది. సందర్భోచితమైన సమర్థవంతమైన పదప్రయోగ నైపుణ్యము వక్త లేదా రచయిత యొక్క ఆలోచనా పరిణతికి, వ్యవహారకుశలతకు, వ్యక్తీకరణ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

పదజాల సామర్థ్యమంటే?

ఒక పదము యొక్క అర్థము తెలుసుకున్నంత మాత్రాన అది పదజాల సామర్థ్యం అనిపించుకుంటుందా! ఉదాహరణకు “దేవుడు ఒక్కడే. మనుషులంతా ఒక్కటే”, ఈ రెండు వాక్యాల్లోనూ ప్రయోగించిన 'ఒక్కటి' శబ్దము ఒకటే. రెండింటికీ అర్థపరంగా చూస్తే 'ఒకటి' అని అర్థం వస్తుంది. కాని వాటిలోని భావన వేరు. 'ఒక్క శబ్దంలోని లోతైన భావనను అర్ధం చేసుకోగలగాలి. అర్థం చేసుకోవడమేకాదు, అవసరమైనచోట సందర్భోచితంగా దానిని ప్రయోగించగలగాలి. వివరించగలగాలి. విస్తరించగలగాలి. విభిన్న సందర్భాల్లో ఉపయోగించగలగాలి. ఇవన్నీ చేయగలిగితే పదజాల సామర్థ్యం సాధింపబడినట్టు.

పిల్లలు ఇవన్నీ చేయలేకపోతున్నారా! అంటే... కొంతవరకు మాత్రమే చేయగలుగుతున్నారు. ఎందుకంటే భాషలో రకరకాల పదజాలం మనకు కనిపిస్తుంది. .

దృశ్య సంబంధమైనవి, చేష్టలకు సంబంధించినవి, అమూర్తమైనవి.

 • చూపు ద్వారా గుర్తించే వస్తువులకు సంబంధించిన పదజాలం.

ఉదా|| బల్ల, పుస్తకం, చెట్టు, కట్టె మొ||నవి.

 • చేష్టల ద్వారా గుర్తించే పదజాలం.

ఉదా|| తింటున్నారు, పడుకున్నారు, నడిచాడు మొ||నవి.

 • అమూర్తమైన / పదజాలం

ఉదా|| మంచివాడు, సమానులు, క్రూరమైనవి.

ఇందులో మొదటి రెండు విభాగాలకు చెందిన పదజాలాన్ని విద్యార్థులు నిత్య జీవితంలో వివిధ సంఘటనల్లో, సందర్భాల్లో, అప్రయత్నంగా తెలుసుకుంటున్నారు. అవసరమైన సందర్భాల్లో ప్రయోగించగలుగుతున్నారు కూడా. కాని అమూర్తమైన పదజాలాన్ని వినియోగించడంలోనే వెనుకబాటుతనం ఉంటున్నది. ఈ విషయంలో సామర్థ్యాన్ని పెంపొందించడంలోనే ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైంది.

ముఖ్యంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులు పదజాలంలో కింది అభ్యసన ఫలితాలను సాధించగలగాలి.

ఆశించే అభ్యసన ఫలితాలు

 • నూతన పదాలకు అర్థాలను తెలుసుకొని, ఆ నూతన పదాలను సొంతవాక్యాల్లో ఉపయోగించగలగాలి.
 • ధ్వన్యనుకరణ పదాలను గుర్తించి ప్రయోగించగలగాలి.
 • వ్యతిరేక పదాలను గుర్తించి ప్రయోగించగలగాలి.
 • చదివిన / విన్న అంశంలోని కీలక పదాల భావనను అర్ధం చేసుకొని సందర్భోచితంగా వినియోగించగలగాలి.
 • ప్రకృతి వికృతులను గుర్తించగలగాలి. వాక్యాల్లో ప్రయోగించగలగాలి.
 • జాతీయాలను గుర్తించగలగాలి. వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించగలగాలి.
 • సామెతలను గుర్తించగలగాలి. వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించగలగాలి.
 • వ్యవసాయం, నృత్యం, సంగీతం, హస్తకళ... మొదలైన వృత్తిసంబంధమైన పదజాలాన్ని అర్థం చేసుకోగలగాలి. అవసరమైన సందర్భాల్లో వాటిని ప్రయోగించగలగాలి.
 • పర్యాయపదాలను (సమానార్ధక పదాలను) గుర్తించగలగాలి. వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించగలగాలి.
 • నానార్థాలను గుర్తించగలగాలి. వాటిని సొంతవాక్యాల్లో ప్రయోగించగలగాలి.
 • గళ్ళనుడికట్టు, భావనాచిత్రం మొదలైన భాషాశ్రీడలను ఉత్సాహంతో నిర్వహించగలగాలి.
 • అవసరమైనచోట్ల పదాల ఉత్పత్తికి (వ్యుత్పత్యర్థం) మూలం గుర్తించగలగాలి (ఉదా: జలజం)
 • పై అన్ని సందర్భాల్లో అవసరమైన చోట్ల తోటి విద్యార్థుల, లేదా ఇతర పఠనసామగ్రి లేదా నిఘంటువు లేదా ఉపాధ్యాయుల సహకారం తీసుకోగలగాలి.

సామర్థ్య సాధనలో ఎదురవుతున్న సమస్యలు

 • నూతన / కఠిన పదాలకు అర్థాలను చెప్పలేకపోవడం.
 • అర్థాలు తెలిసినా సొంతవాక్యాల్లో ప్రయోగించలేకపోవడం.
 • కీలక పదాల యొక్క భావనను గుర్తించలేకపోవడం.
 • జాతీయాలను / సామెతలను సొంతవాక్యాల్లో ప్రయోగించలేకపోవడం.
 • జాతీయాల, సామెతల ప్రయోగానికి తగిన సందర్భాన్ని గుర్తించలేకపోవడం.
 • వ్యవసాయం, నృత్యం, సంగీతం, హస్తకళ..... మొదలైన వృత్తిసంబంధమైన పదజాలాన్ని అవసరమైన సందర్భాల్లో ప్రయోగించలేకపోవడం.
 • నానార్థాలను, పర్యాయపదాలను గుర్తించలేకపోవడం. వివిధ సందర్భాట్ల ప్రయోగించలేకపోవడం.
 • పదాలకు ఉత్పత్తిని గుర్తించలేకపోవడం.
 • గళ్ళనుడికట్టు, భావనాచిత్రం మొదలైన భాషాక్రీడలను నిర్వహించలేకపోవడం.

సమస్యలకు కారణాలు

 • కఠిన లేదా నూతన పదాలకు అర్థాలను తెలుసుకునే విషయంలో విద్యార్థులు నిరాసక్తత ప్రదర్శించడం.
 • తగినన్ని నిఘంటువులు అందుబాటులో లేకపోవడం.
 • పాఠ్యపుస్తకేతర కృత్యాలు అనగా వార్తాపత్రికలు చదవడానికి, టీవీల్లో వార్తలు చూడటానికి ఆసక్తి చూపకపోవడం.
 • జాతీయమంటే ఏమిటో విద్యార్థులకు అర్థం కాకపోవడం.
 • జాతీయానికి, సామెతకు తేడా తెలియకపోవడం.
 • వ్యవసాయం, నృత్యం, సంగీతం, హస్తకళ, ..... మొదలైన వృత్తిసంబంధమైన పదజాలాన్ని తరచుగా వినకపోవడం.
 • ఉపాధ్యాయుల నుండి అవసరమైన సమాచారాన్ని తెలుసుకునే విషయంలో బిడియం, భయం ఉండడం.
 • కీలక పదాల భావనలను అర్థం చేసుకోలేకపోవడం, వాటిని వదిలివేయడం.
 • ఉపన్యాస, వ్యాసరచన పోటీలు తరచుగా నిర్వహించకపోవడం, వాటిలో అందరూ పాల్గొనకపోవడం.
 • గళ్ళనుడికట్టు, భావనాచిత్రం మొదలైన భాషాక్రీడలు ఎక్కువగా అందుబాటులో లేకపోవడం, ఉన్నా వాటిని పూరించడంలో ఉత్సాహం చూపకపోవడం.
 • కేవలం పరీక్షల (Exam) దృష్టితో మాత్రమే చూడడం.
 • ముఖ్యంగా విస్తారంగా శ్రవణ, పఠన అవసరాలను కల్పించకపోవడం. అందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడం.

సామర్థ్య సాధనకై వ్యూహాలు

 • పదజాలాభివృద్ధి కలిగే ప్రయోజనాన్ని విద్యార్థులకు వివరించాలి. గొప్ప వక్తలు ఎలా తయారవుతారో వివరించాలి.
 • రచయితలకు / కవులకు పదజాలంవల్ల కలిగే ప్రయోజనమేమిటో కూలంకషంగా వివరించాలి.
 • దృశ్యమాధ్యమాల్లో పదజాలాభివృద్ధి కలిగే కార్యక్రమాలను చూసేట్టుగా ప్రోత్సహించాలి.
 • ప్రతి పాఠాన్ని పిల్లలతో చదివించాలి.
 • పాఠంలోని కఠిన పదాలను వాళ్ళే గుర్తించాలి.
 • వాటికి అర్థాలను పిల్లలే స్వయంగా సేకరించాలి. అందుకోసం పదకోశం తప్పకుండా చూసేట్లు చూడాలి.
 • నిఘంటువులను విరివిగా వాడేట్లు చూడాలి. అందుకోసం తగినన్ని నిఘంటువులను అందుబాటులో ఉంచాలి.
 • అర్థాలు తెలుసుకున్న నూతన పదాలతో సొంతవాక్యాలు తయారుచేసేట్లు ప్రోత్సహించాలి.
 • పర్యాయపదాలు, నానార్థాల విషయంలో కూడా ఎక్కువ అభ్యాసం చేసేట్లు చూడాలి.
 • జాతీయాల గురించి తరచుగా విద్యార్థులకు వివరించాలి. వాటిని వాడుతూ మాట్లాడేటట్లుగా ప్రోత్సహించాలి.
 • సామెతల గురించి విద్యార్థులతో తరచుగా చర్చించాలి.
 • సమాజంలోని వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా విని వాళ్ళ మాటల్లో వచ్చిన జాతీయాలను సామెతలను గుర్తించమనాలి.
 • వక్తృత్వ పోటీలు పెట్టాలి.
 • వివిధ వృత్తులకు సంబంధించిన పదజాలాన్ని సేకరించేట్లు ప్రాజెక్టులు ఇవ్వాలి.
 • ఒకే అంశంపై వివిధ పత్రికల్లో రాయబడిన అంశాన్ని చదివించి వాటిలోని తేడాలను, పదజాలంలోని విశేషాలను గుర్తించమనాలి.
 • పుస్తకపఠనాన్ని తప్పనిసరి అలవాటుగా మార్చాలి. అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచాలి.
 • చిన్న చిన్న కవితలు, కథలు రాసేట్టుగా ప్రోత్సహించాలి. అట్లా రాసే సందర్భాల్లో జాతీయాలను, సామెతలను, ధ్వన్యనుకరణ పదాలను వాడుమని చెప్పాలి.
 • తరచుగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తూ ఉండాలి.
 • గళ్ళనుడికట్టు వంటివాటిని పూరించడంలో మెళకువలు తెలియజెప్పి దానివల్ల కలిగే జ్ఞానాన్ని విశదపరచాలి.
 • ఉపాధ్యాయులతో బిడియం లేకుండా మాట్లాడేటట్లు చూడాలి.
 • 'పదజాలాభివృద్ధి' అనేది పరీక్ష కోసం అని కాకుండా నిత్యజీవితంలో దాని యొక్క అవసరాన్ని పిల్లలకు తెలియజెప్పాలి.
ఆధారము: సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్
2.92
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు