పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

భాషా సామర్థ్యము

భోధనలో భాషాంశాలు మరియు వ్యాకరణాంశాల ప్రాధాన్యత

పరిచయం

భావ వినిమయ సాధనాలలో భాష ప్రధానమైనది. విద్యార్థి తన జ్ఞానార్జన కాలంలో తనకు తెలిసిన భాషలో రాయడం, చదువడం, మాట్లాడటానికి ఆసక్తి కనబరుస్తాడు. వివిధ సందర్భాలలో వ్యాకరణ పరిధిలో మాట్లాడుతున్నా, రాస్తున్నా తాను అది వ్యాకరణ సూత్రాలకు లోబడి ఉందని గ్రహించలేడు. పాఠ్యాంశాలలోని భాష, దైనందిన జీవితంలోని భాషల మధ్య విద్యార్థికి వ్యాకరణం యొక్క సంబంధం అవగాహన కల్పించాలి. తాను మాట్లాడుతున్న, చదువుతున్న, రాస్తున్న విషయాలు ఏ వ్యాకరణ సూత్రాలకు లోబడి ఉంటున్నాయో విద్యార్థి అర్థం చేసుకున్నప్పుడు వ్యాకరణ బోధన పరమ లక్ష్యం నెరవేరినట్లే. భాష, వ్యాకరణం వేరు కాదనే విషయం విద్యార్థి అర్థం చేసుకోవాలి. రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించిన విధంగా భాషాభ్యసనం కొనసాగుట కొరకు ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరించినప్పుడు తరగతి గదిలో వ్యాకరణ బోధన సుసంపన్నం అవుతుంది. విద్యార్థి భాషపై అధికారం పెంచుకొని ప్రయోగాత్మకంగా వినియోగించుకుంటూ విద్యాభ్యాసం కొనసాగించినప్పుడు సఫలీకృతుడవుతాడు. పూర్వకాలపు గ్రాంథికం మొదలుకొని నేటి వ్యావహారికం వరకు భాషలో జరుగుతున్న మార్పులు తెలుసుకొని, అర్థం చేసుకోవడానికి, విద్యార్థి అభిరుచి మేరకు విస్తృత అధ్యయనం కొనసాగించడానికి వ్యాకరణం ఎంతగానో ఉపయోగపడుతుంది.

నేడు విద్యార్థులు వ్యాకరణం పట్ల నిరాసక్తతను కనబరచడం భాషా సామర్థ్యాల అవగాహనకు ఆటంకంగా మారుతున్నది. ఉపాధ్యాయుడు భాషాంశాలు, వ్యాకరణాంశాలపట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా నూతన పద్దతులలో భాషాబోధన కొనసాగించినప్పుడు, వ్యాకరణం సులభ సాధ్యమైన అంశంగా ఫలవంతమవుతుంది.

అభ్యసనలో ఆశించే ఫలితాలు 

 • వ్యాకరణాంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి.
 • వర్ణమాల, విభాగాలు, భాషాభాగాలు, విభక్తులు, సంధిపదాలు, సమాసపదాలు కలుపడం, విడదీయడం మొదలైన వాటిని చేయగలగాలి.
 • విద్యార్థులు రాసేటప్పుడు పదాలను, వాక్యాలను, జాతీయాలను, సామెతలను, విరామచిహ్నాలను, కాలాలు, క్రియలు, విశేషణం మొదలైన వ్యాకరణాంశాలను ఉపయోగించగలగాలి.
 • భాషాభాగాలు, విభక్తులు, సంధులు, సమాసాలు, క్రియాభేదాలు, వాక్యభేదాలు స్పష్టంగా గుర్తించగలగాలి.
 • విద్యార్థి నిత్యజీవితంలో వ్యాకరణాన్ని / భాషాంశాలను ప్రయోగించగలగాలి.
 • సంధి సూత్రాలను సొంతమాటల్లో రాయగలగాలి.
 • సందర్భోచితంగా వాక్య ప్రయోగం చేయగలగాలి.
 • అలంకారాలు, ఛందస్సు లక్షణాలను సమన్వయం చేస్తూ, అర్థవంతంగా సొంతమాటల్లో వివరించగలగాలి.

భాషాంశాలు (వ్యాకరణాంశాలు) అధ్యయనంలో ఎదురవుతున్న సమస్యలు 

 • విద్యార్థికి వ్యాకరణం పట్ల తెలియని భయం ఏర్పడటం.
 • ప్రస్తుతం అంతగా అవసరం లేదనే దురభిప్రాయం ఉండటం.
 • సంధి సూత్రాలను బట్టీ విధానంలో నేర్చుకోవడం.
 • సంధి, సమాస పదాలకు మధ్య తేడాలను గుర్తించలేకపోవడం.
 • పారిభాషిక పదాలు అర్థం చేసుకోలేకపోవడం.
 • తెలుగు, సంస్కృత పదాల వ్యత్యాసం గుర్తించలేకపోవడం.
 • వాక్యభేదాల అభ్యాసం తరగతి గదిలో జరగకపోవడం.
 • ద్విగు, బహువ్రీహి సమాసాల మధ్య తేడాలు గుర్తించడంలో లోపం.
 • గణ విభజనలో 'ర' కారం (రేఫ C) వచ్చినప్పుడు గురు, లఘువుల గుర్తింపులో తడబాటు.

భాషాంశాలు / వ్యాకరణాంశాలు అధ్యయనంలోని సమస్యలు అధిగమించడానికి వ్యూహాలు

 • వ్యాకరణం బోధించేటప్పుడు తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలవైపు విద్యార్థులను ఉద్యుక్తుల్ని చేయాలి.
 • వ్యాకరణం అధ్యయనం చేయడం అనేది నిరంతరం ప్రక్రియగా కొనసాగాలి.
 • పాఠ్యబోధనలో వ్యాకరణం అంతర్భాగమనే భావనతో బోధన కొనసాగాలి.
 • శబ్ద ఉత్పత్తిని పరిచయం చెయ్యాలి.
 • ఉపాధ్యాయుడు వ్యాకరణం బోధించడానికి ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
 • నిత్య జీవితంలో ఉండే ఉదాహరణలను విద్యార్థికి చెప్పడం ద్వారా, విద్యార్థి ఆ ఉదాహరణలను ఉపయోగించడం ద్వారా బోధన సులభంగా ఉండేలా చూసుకోవాలి.
 • వీలయినన్ని ఎక్కువ ఉదాహరణలు ఉపయోగించేలా చూడాలి.
 • ఏ తరగతిలో బోధించాల్సిన భాషాంశాలు / వ్యాకరణాంశాలు ఆ తరగతిలోనే పూర్తయ్యేలా చూసుకోవాలి.
 • పద్యభాగాలను బోధించేటప్పుడు కవులు అనుసరించిన విధానం, ప్రత్యేకశైలి తెలియజేస్తూ కవులపై గౌరవం పెంచేలా ఉపాధ్యాయుడు కృషిచేయాలి.
 • వ్యాకరణాంశ బోధనలో సంధి / సమాస సూత్రాలు ఉపయోగిస్తున్నప్పుడు పారిభాషిక పదాలకు ముందుగా అర్థం తెలియజెప్పాలి.
 • పద్య / గద్య భాగాలను బోధిస్తున్నప్పుడు వెంటనే సంధి, సమాస పదములు వచ్చినప్పుడు విసంధి చేసి అప్పటికప్పుడు/ నివృత్తి చేయాలి.
 • ఏవి తెలుగు పదాలు, ఏవి సంస్కృత పదాలు అనే ప్రాథమిక అవగాహనను కలిగి ఉండాలి. మహా ప్రాణాక్షరాలు, | ఊష్మాలు ('స' మినహా) ఋత్వంలో కూడినవి, సంయుక్తాక్షరాలు, అనునాసికాలతో కూడిన పదాలను సంస్కృత పదాలుగా వ్యవహరిస్తున్నాం. అవి మినహా తెలుగు పదాలు.
 • సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలపై సాధనకు విద్యార్థి దైనందిన జీవితంలోని ఉదాహరణలను విద్యార్థి చెప్పేటట్లుగా ప్రోత్సహించాలి. ఇది తరగతి కృత్యంగా నిర్వహించాలి. నల్లబల్లను తప్పక వినియోగించాలి.
 • ద్విగు, బహువ్రీహి సమాసాల మధ్య మౌలిక భేదాలను విద్యార్థికి అవగాహన కలిగించాలి.
 • గురు, లఘువుల గుర్తింపులో విద్యార్థులు ముందుగా తమ పేర్లను, ఊరి పేర్లు, వస్తువుల పేర్లు మొదలగువాటి గణ విభజన చేయునట్లుగా ప్రోత్సహించాలి.
 • శబ్ద, అర్థ అలంకారములను విద్యార్థుల దైనందిన జీవితంలోని ఉదాహరణలతో అనగా సినిమా పాటలు, గేయాలు, కవితలు, పద్యాలు, ప్రసిద్ధ వాక్యాలు చెబుతూ ఆసక్తి కలిగించాలి.

మాదిరులు - ఉదాహరణలు

 1. సంధి నిర్ణయంలో భాగంగా తెలుగు, సంస్కృత పదాల నిర్ణయంలో, విసర్గ (2) ఉండే పదాలు, మహాప్రాణాలు అయిన ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, అనునాసికాలైన - ఆ, ఇ, ణ; ఊష్మాలైన - శ, ష, హ తప్పనిసరిగా సంస్కృత భాషా పదాలలోనే వస్తాయి అని తెలుపవచ్చు. అలాగే ఎ, ఒ, 7, " - ఉండే పదాలు తెలుగు పదాలలోనే వస్తాయి అని తెలుపవచ్చు.
 2. సంధి పదాలు విడదీయడంలో - విడదీసిన రెండు పదాలు అర్థవంతమైనవి అని చెప్పాలి. పదాలు రెండూ ఇకే భాషకు చెందినవైనప్పుడు ఆ భాషకు సంబంధించిన సంధి కార్యం చెప్పవచ్చు.
 3. ఉదా! అ) దేవాలయం - దేవ + ఆలయం (సంస్కృత సంధి)

  ఆ) చింతాకు      -  చింత + ఆకు (తెలుగు సంధి)

 4. ద్విగు - బహువ్రీహి సమాసాలు
 5. ద్విగు సమాసం మొదట పరిచయం అవడం మూలాన... తరువాత పరిచయం అయ్యే బహువ్రీహి సమాసంలో పూర్వ పదం సంఖ్యా వాచకం' అయినప్పుడు 'ద్విగు'గా పొరబడే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు ఈ సమాస పదం గమనించండి.

  చతుర్ముఖుడు 1 నాలుగు ముఖములు కలవాడు (ఎవరు? - బ్రహ్మ) నాలుగు అనేది సంఖ్య అయినా - "నాలుగు ముఖములు” అని లేదు. కలవాడు” ఎవడు”? - అని ఉన్నది. దీనికి జవాబు "బ్రహ్మ" తప్ప వేరు లేదు కాబట్టి దీనిని “బహువ్రీహి”గా నిర్ధారించాలి.

  నాలుగు చేతులు, ఏడు కొండలు, మూడు చెరువులు - ఇటువంటి పదాలలోనివి 'సంఖ్యలు' మాత్రమే. వీటికి ప్రశ్నలు వేసుకున్నప్పుడు “ఎన్ని” అని మాత్రమే వేయగలం, కాబట్టి "ద్విగు” సమాస పదాలుగా నిర్ధారించాలి.

 6. గురు లఘువుల విభజనలో 'రేపు' (C) కు ముందు అక్షరం ఊనికతో పలుకుతున్నప్పుడు 'గురువు' అవుతుంది. ఉదా : చక్రము;

  "రేఫ 'ర' కారానికి ఊనికతో పలుకబడ/ని అక్షరాలు లఘువులుగా గుర్తించాలి.

  U I I U
  ఉదా : భానుప్రకాశ్

  ‘భానుప్రకాశ్ గా కాకుండా భానుప్రకాశ్ గా అంటాము. కాబట్టి 'ప్ర' అనే సంయుక్తాక్షరానికి ముందున్న 'ను' గురువుగా మారదు.

ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్

3.125
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు