పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సృజనాత్మకత సామర్థ్యం

సృజనాత్మకత సామర్థ్యం లో విద్యార్థి

పరిచయం

భావాలను అందంగా, ఆకర్షణీయంగా ఆవిష్కరించడమే సృజనాత్మకత. ‘అభివ్యక్తి ప్రధానంగా సాగుతుంది. ఆభావాలను వ్యక్తీకరించడం అందరిలో ఉన్నా సమాన స్థాయిలో ఉండదు.

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి ఉంటుందా?

సృజనాత్మకత అంటే ఏమిటో తెలియకపోయినప్పటికీ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి నిగూఢంగా ఉంటుంది. కొందరు కథలు చెప్పగలరు. కథను సంక్షిప్తీకరించగలరు. పాత్రల పేర్లు మార్చి చెప్పగలరు. కొందరు పేరడీలు పాడగలరు. ఏకపాత్రాభినయం చేయగలరు. ఇలా కొన్నింటిలో వారికి ప్రవేశముంటుంది.

సృజనాత్మకతవల్ల ప్రయోజనమేమిటి?

ఇది మెదడుకు పదును పెట్టే ప్రక్రియ. ఇందులో బాగా రాణించిన వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉండటం మనం చూస్తున్నదే. సృజనాత్మకత హృదయ స్పందనకు సంబంధించిన అంశం. ఈ రంగంలో కృషిచేస్తున్నవారు సున్నిత హృదయులుగా మలచబడతారు. మానవీయ విలువలతో వ్యవహరిస్తారు. సమాజానికి సరికొత్త ఆలోచనలకు, ప్రేరణను అందిస్తారు. సృజనాత్మకత, జీవనోపాధిగా మారిన సందర్భాలెన్ని ఉన్నాయి.

పరీక్ష దృష్టితో చూసినా ఈ అంశాన్ని సమర్థంగా రాసే వారికి మిగతా వారి కంటే మార్కులు పెరుగుతాయి. విద్యార్థి నైపుణ్యానికి ఇది గీటురాయిగా నిలుస్తుంది.

సృజనాత్మకతలో విద్యార్థి ఎలా రాణించగలడు?

ఎందులోనైనా రాణించాలంటే నాలుగు విషయాలు ప్రధానమైనవి. అవి “అవసరం, అవకాశం, ప్రోత్సాహం, అభ్యాసం” ఏదైనా నేర్చుకోవాలంటే ముందుగా దాని అవసరం ఉండాలి. కేవలం అవసరముందే సరిపోదు దానిని నేర్చుకొనే అవకాశం ఉండాలి. అవకాశం ఉన్నా తగిన ప్రోత్సాహం లేకుంటే నీరుగారిపోతాడు. ఈ మూడూ సమకూరినప్పుడు సరిపడినంత అభ్యాసం చేస్తే రాణించగలడు.

ఒకనాడు సృజనాత్మక అంశాలను ఏ కొద్దిమంది విద్యార్థులో చేయగలిగితే వారిని గుర్తించి, ప్రత్యేకంగా ప్రోత్సహించేవారు. కాని ఈనాడు సృజనాత్మకత పాఠ్యపుస్తకాలలో అంతర్భాగమైంది. అనేక ప్రక్రియలను పరిచయం చేయడం జరిగింది. ఫలితంగా ఈ విభాగంలో రచనలు చేస్తున్న విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇదొక శుభపరిణామం. దీనిని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరముంది.

6 నుండి 10 తరగతుల వరకు పరిచయం చేసిన సృజనాత్మక ప్రక్రియలు

1) గేయం 2) కథ 3) సంభాషణ 4) వ్యాసం 5) లేఖ_6) కవిత 7) ఏకపాత్ర 8) ఆత్మకథ 9) పోస్టర్ 10) నినాదాలు 11) సూక్తులు 12) వర్ణన 13) ప్రశ్నావళి 14) ప్రకటన 15) ఆహ్వానపత్రం 16) అభినందనపత్రం 17) అభినందన వ్యాసం 18) ప్రసంగ వ్యాసం 19) స్వగతం 20) సంపాదకీయవ్యాసం 21) పుస్తక పరిచయం (పీఠిక) 22) కరపత్రం 23) యాత్రాచరిత్ర..

ఆశించే అభ్యసన ఫలితాలు

 • పిల్లలు ఒక ప్రక్రియలో ఉన్న పాఠ్యాంశాన్ని మరో ప్రక్రియలోకి మార్చగలిగే నైపుణ్యాన్ని పెంపొందించగలగడం.
 • చిన్న చిన్న కవితలు, గేయాలు రాయగలగడం.
 • సూక్తులు, నినాదాలు సొంతంగా రాయగలగడం.
 • సంభాషణలు కూర్చగలగడం. • కరపత్రాలు, అభినందన పత్రాలు రాయగలగడం.
 • పోస్టరు, ఆహ్వానపత్రాలు తయారుచేయగలగడం.
 • ఇంటర్వ్యూ కోసం సొంతంగా ప్రశ్నలు తయారుచేసుకోగలగడం.
 • ఏకపాత్రాభినయం కోసం తగిన మాటలు రాయగలగడం.

వీటన్నిటితోపాటు పలు సృజనాత్మక ప్రక్రియల్ని నిత్యజీవితంలో వినియోగించుకోగలిగేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దడం ఈ సామర్థ్యం ద్వారా ఆశిస్తున్న ఫలితం.

సామర్థ్య సాధనలో ఎదురవుతున్న సమస్యలు 

తరగతి స్థాయిననుసరించి సృజనాత్మక అంశాలు చేర్చగలిగినా విద్యార్థులు సాధించడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 • కవితలు, గేయాలు వంటి ప్రక్రియలు సొంతంగా రాయగలమనే నమ్మకం లేకపోవడం.
 • సొంతంగా ప్రయత్నించకపోవడం.
 • గైడ్లలో సమాధానాలు దొరకడంవల్ల విద్యార్థులు సొంతంగా ఆలోచించే శ్రమ తీసుకోకపోవడం.
 • రాత సమస్యలు, లేఖన దోషాలవల్ల కూడా రాయడానికి ఇష్టపడకపోవడం.
 • వివిధ సృజనాత్మక ప్రక్రియల మీద పూర్తి అవగాహన కలిగియుండకపోవడం.
 • సృజనాత్మక ప్రక్రియను ఎట్లా సాధించాలో తరగతి గదిలో సరిగా గ్రహించకపోవడం.
 • ఇతర విద్యార్థుల నుండి వచ్చే విభిన్న రూపాలను స్వాగతించి ప్రోత్సహించకపోవడం.

సామర్థ్యాల సాధనకై అనుసరించే వ్యూహాలు

సృజనాత్మక సామర్థ్యంలోని పలు ప్రక్రియలను సాధించేందుకు సాధారణంగా నిర్వహించే వ్యూహాలు క్రింది విధంగా ఉండాలి. అయితే వేర్వేరు ప్రక్రియలకు అవగాహన కల్పించడం, మాదిరి ప్రదర్శించడం వేర్వేరుగా ఉంటాయని గ్రహించాలి.

 • ప్రక్రియను నల్లబల్లపై రాయడం.
 • ప్రక్రియపై అవగాహన కల్పించడం.
 • మాదిరి ప్రదర్శించడం
 • జట్లుగా చర్చింపజేయడం.
 • వ్యక్తిగతంగా రాయించడం.
 • ప్రదర్శింపజేయడం.
 • దోషసవరణ చేయడం.

ఉదాహరణ

కవిత (పిల్లలు రాసింది)

అంశం - వర్షం :

ఆకాశంలో మబ్బులో కమ్ముకున్నాయి

ఉరుములు ఉరుముతున్నాయి

మెరుపులు మెరుస్తున్నాయి

పిడుగులు రాలుతున్నాయి

వర్షం వస్తుందా అనిపిస్తుంది

వర్షం వచ్చేసింది!

వాగులైంది...

వంకలైంది...

పొంగింది...

పారింది...

గంగలో కలిసింది...

గేయం

అంశం - వర్షం :

పల్లవి :           కురుస్తుంది కురుస్తుంది

వాన భలే కురుస్తుంది

మెరుస్తుంది మెరుస్తుంది

మెరుపు భలే మెరుస్తుంది... || కురుస్తుంది ||

చెట్టు మీద కురుస్తుంది

గుట్ట మీద కురుస్తుంది

పిట్ట మీద కురుస్తుంది

గట్టు మీద కురుస్తుంది.... || కురుస్తుంది ||

ఈ గేయాన్ని ఇంకా పొడిగించి రాసేలా పిల్లలకు తగిన సూచనలు, ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

ఏకపాత్రాభినయం : కాకి

కాకి (పిల్లలు రాసింది)

పిల్లలూ...! నేను కాకినైనా మీ అందరి క్షేమాన్ని కోరుకునేదాన్ని. మీరంతా ఆకారానికి విలువిస్తారుగాని రూపురేఖలకన్నా గుణం గొప్పదని నా భావన. అయినా నేను మీకు మరీ అంత అందవికారంగా కనిపిస్తానా?

నల్లగా ఉంటే అందంగా ఉండదా? అసలు మనుషుల్లో కూడా నల్లగా ఉన్నవారు అందంగా లేరా? అంతెందుకు... మీరు పూజించే విష్ణుమూర్తి నల్లనివాడే కదా!

అయినా మంచి చేసేవాళ్ళను గుర్తించకపోవడం మీ మనుషులకు అలవాటేకదా! అసలు నేను ఎంత మేలు చేస్తానో మీరు గమనిస్తేకదా! నా అరుపులో కరుకుదనం ఉందని చీదరించుకుంటారేమోగానీ, మీరు కూడా అప్పుడప్పుడు ఎంత కరుగ్గా మాట్లాడతారో, ఎందర్ని నొప్పిస్తారో పరిశీలించుకున్నారా? ఇకనుండైనా రూపానికి కాకుండా వ్యక్తిత్వానికి విలువిచ్చే గుణాల్ని మీ మనుషులంతా అలవరుచుకోవాలని మీ స్నేహితురాలిగా నా కోరిక...

యాత్రా చరిత్ర (పిల్లలు రాసింది)

మేమంతా నేడు బాబా గుట్టకు ఉదయం 11 గం||లకు బయలుదేరితిమి. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యాను వచ్చింది. అది ఎక్కి మేము బాబా గుట్టకు వెళ్లాము. మేము బాబాకు కావాల్సిన పూలు, పండ్లు, ఊదుబత్తీలు కొన్నాం. దాని ఖరీదు రూ. 20/- అయింది. మేము మెట్ల దగ్గరికి వెళ్లాం. దాదాపు 450 మెట్లు ఉన్నాయి. మేము ఎక్కడం మొదలు పెట్టాం.

ఇక్కడ బాబా గుడికి ముస్లింలు ఎక్కువగా వస్తారు. వాళ్ల కష్ట సుఖాలు బాబా దగ్గర చెప్పుకుంటారు మెట్లు ఎక్కుతుంటే పైకి ఎక్కలేని పిల్లల్ని వాళ్ల తల్లిదండ్రులు ఎత్తుకుంటారు. ఈ బాబా గుట్ట దగ్గర భక్తుల్ని నెమలి ఈకల కట్టతోటి కొడుతుంటారు.

అలా చేస్తే మన కష్టాలు పారిపోతాయని అక్కడ ఒకాయన చెప్పారు. మేము దర్శనం చేసుకొని తిరిగి వస్తుంటే గుడి మెట్లకింద కాళ్లు చేతులు లేనివారు, గుడ్డివారు కనిపించారు. వాళ్లను చూస్తే బాధ అనిపించింది. అందరికీ ఒక్కొక్క రూపాయి దానం చేశాము. వాళ్లు మమ్మల్ని దీవించారు. బొంగులు, పుట్నాలు కొనుక్కొని సాయంత్రానికి ఇంటికొచ్చాం.

ఇవన్నీ మాదిరి కొరకు ఇవ్వబడినవి. ఇట్లే మిగతా సృజనాత్మక ప్రక్రియలన్నింటికీ వాటి లక్షణాలను స్పష్టంగా తెలియపరిచి రాయడానికి ప్రోత్సహించాలి.

ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్

3.13793103448
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు