హోమ్ / ఆరోగ్యం / ఆయుష్ / మహత్తరం.. రక్తదానం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మహత్తరం.. రక్తదానం

రక్తదానం అనేది దరిదాపుగా ప్రాణదానం లాంటిది. రోగ నివారణకోసం... ఒకరిరక్తం మరొకరికి ఇచ్చేపద్ధతిని రక్తదానం అంటారు.

మహత్తరం..రక్తదానం

రక్తదానం అనేది దరిదాపుగా ప్రాణదానం లాంటిది. రోగ నివారణకోసం... ఒకరిరక్తం మరొకరికి ఇచ్చేపద్ధతిని రక్తదానం అంటారు. అమ్మకం అనకుండా దానం అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్నఅవయవాలని(ఉ. కంటిపొర, చర్మం, గుండె, మూత్రపిండం, రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడదలుచుకున్నప్పుడు వాటిని దాతస్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపారదృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాలా మంది రక్తాన్ని దానంచేస్తారు. చేసినదానం సవ్యంగా వెచ్చించబడుతోందా, దుర్వినియోగంపాలవుతోందా అనే అనుమానం ఉండటం సహజం. దుర్వినియోగం అంటే మనం దానం చేసిన రక్తాన్ని కుళ్ళబెట్టి పారెయ్యడమయినా కావచ్చు లేదా నల్లబజారులో అమ్మకానికి పెట్టినాపెట్టొచ్చు.

ప్రపంచ రక్తదాన దినోత్సవం...

మన ప్రాణాలకు రక్తం అవసరం ఎంతఅవసరమో అందరికీ తెలిసిందే. ఇలాంటి రక్తం కొందరిలో తక్కువగా ఉంటుంది. కొందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాంటి సంపూర్ణ ఆరోగ్యవంతుల రక్తం అనారోగ్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. అందుకే రక్తదానం చేయండి-ప్రాణాలను నిలబెట్టండి అనే నినాదాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రాచుర్యంలోకి తెచ్చింది. రక్తందానం చేసే ప్రాణదాతలకు గుర్తింపుగా ఏటా జూన్‌ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్యపరచడంతోపాటు రక్తదానం చేసే విషయంలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. రక్తదాతల సంస్థ అంతర్జాతీయ సమాఖ్య 1995లో ప్రతిఏటా అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000వ సంవత్సరంలో రక్తం జీవితాన్ని కాపాడుతుంది. మంచిరక్తం నాతోనే ప్రారంభిస్తాను అనే నినాదాలతో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించింది. అనంతరం 2005 జూన్‌ 14న ప్రతి ఏటా ఈకార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. రక్తంలో ఎ, బి, ఒ అనే గ్రూపులు ఉన్నాయని కనుగొని నోబెల్‌ బహుమతి పొందిన కార్ల్‌ల్యాండ్‌ స్టెయినర్‌ జన్మదినం సందర్భంగా ప్రతిఏటా జూన్‌ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించి అప్పటినుంచి ఈకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అత్యవసరపరిస్థితి...

ప్రతి 2సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుంది. మీ రక్తం ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మందికి సహాయపడుతుంది. ప్రమాదానికి గురైనవారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్తచ్రికిత్స రక్తం కావలసిన రోగులకు, మీ రక్తాన్ని పరీక్ష చేసిన తరువాత నేరుగా ఉపయోగిస్తారు. గాయాలకు గురైన రోగులకి, రక్తహీనతతో బాధపడే రోగులకి, ఇతర శస్తచ్రికిత్స ఎర్రరక్తకణాలు మాత్రమే కావలసి వస్తాయి. ఈ ఎర్రరక్తకణాలు మీ రక్తం నుండి వేరు చేయబడతాయి. ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడయినాసరే ఒక లీటర్‌ రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ రక్త చందురం ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పనిలేదు. ఎవరి రక్తంలో అయినాసరే లీటర్‌ ఒక్కంటికి 60 గ్రాములకంటే తక్కువ రక్త చందురం ఉంటే అది రక్తం ఎక్కించవలసినపరిస్థితి. అంతేకాని ఆపరేషన్‌ చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పనిలేదు.

ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషన్‌ చేసి ప్రాణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషన్‌లో కూడా కొంత రక్తస్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, పన్నెండు యూనిట్లు (ఒకయూనిట్‌=ఆర్ధలీటర్‌) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం రక్తమే ఉరమరగా 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాతరక్తం అంతాపోయి కొత్త రక్తం ఎక్కించిన పరిస్థితిరావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాలవల్ల దానం స్వీకరించిన వాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులు ఎదురైనప్పుడు రోగి సొంతరక్తాన్నే ఎంత వీలయితే అంత గొట్టాల ద్వారా పట్టి, కూడగట్టి, శుద్ధిచేసి, తిరిగివాడతారు.

రక్తం ఎందుకు దానం చేయాలి?
అన్ని జీవులు, రక్తం అనే ద్రవం మీద ఆధారపడి జీవిస్తాయి. రక్తం 60% ద్రవభాగం, 40% ఘనభాగంతో చేయబడింది. 90%నీరు, 10%పోషకాలు, హార్మోన్లు మొదలగు వాటితో తయారుచేయబడే, ద్రవభాగమైన ఈ ప్లాస్మా, ఆహారం, మందులు మొదలగువాటితో సులభంగా తిరిగి నింపబడుతుంది. కాని, ఆర్‌.బి.సి.(ఎర్రరక్తకణాలు), డబ్ల్యు.బి.సి.(తెల్లరక్తకణాలు), ప్లేట్‌లెట్స్‌ కలిగి ఉండే ఘనభాగం పోతే, యధాతథంగా రావడానికి సమయం తీసుకుంటుంది. మీరు ఇక్కడే అవసరపడతారు. దానిని తిరిగి యధాతథంగా రోగుల యొక్క శరీరం నింపడానికి తీసుకునేసమయం, అతని/ఆమె ప్రాణాన్ని తీయవచ్చు. కొన్ని సమయాలలో, శరీరం తిరిగి నింపడానికి వీలైన స్థితిని ఏ మాత్రం కలిగి ఉండకపోవచ్చు. రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని దాన్ని ఉత్పత్తి చేయలేమని మీకు తెలుసు. అంటే, రక్తం అవసరమయ్యే జీవితాలని మీరు మాత్రమే రక్షించవచ్చు. ప్రతి సంవత్సరం భారతదేశంలో, 250 సి.సి. రక్తం గల 40 మిలియన్‌ యూనిట్లు కావాలసి ఉంటే,. అందులో 500,000 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది.

ఎవరు రక్తదానం చేయవచ్చు...?

  • ఆరోగ్యంగా ఉన్న18 నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు రక్తదానం చేయ్యొచ్చు.
  • జీవితకాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తదానం చెయ్యొచ్చు.
  • మత్తు మందులకు అలవాటు పడినవారు, హెపటైటీస్‌ బి, సి, హెచ్‌ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్న వారు రక్తదానానికి అనర్హులు.
  • ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరుమాసాలు, పురుషులైతే మూడుమాసాలు తర్వాతనే రక్తాన్ని రెండవసారి ఇవ్వడానికి వీలుంటుంది.
  • రక్తం ఇచ్చేవారు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. ఎటువంటి రుగ్మతలు ఉన్నా రక్తాన్ని స్వీకరించరు.
  • సగటు 45 కేజీల బరువున్న వారు రక్తదానం చేయవచ్చు.
  • 12.5 గ్రాముల హీమోగ్లోబిన్‌ ఉన్నవారు.

ఎవరి నుండి రక్తదానం తిరస్కరిస్తారు?

  • హెచ్‌.ఐ.వి. సోకిన వారి నుండి.
  • హెపటైటిస్‌-బి లేదా సి వైరస్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు.
  • సిఫిలిస్‌ వంటి సుఖవ్యాధులు ఉన్నప్పుడు.
  • రక్తపోటు అధికంగా ఉండి నియంత్రణలో లేనప్పుడు.
  • మధుమేహం నియంత్రణలో లేనప్పుడు.
  • ఫిట్స్‌వ్యాధి, గుండెజబ్బు/కాన్సర్‌ వ్యాధి ఉన్నప్పుడు.
  • గడచిన 6 నెలల్లో రక్తం ఎక్కించుకున్న వారినుండి.
  • గడచిన 2 వారాల్లో యాంటిరేబిస్‌ వాక్సిన్‌ తీసుకున్నప్పుడు.
  • గత 3 సం.లలో హెపటైటిస్‌ వైరస్‌తో కామెర్లు వచ్చి ఉన్నప్పుడు.
  • గర్భిణీగా ఉన్నప్పుడు లేదా బిడ్డకు పాలిచ్చే తల్లులు.
  • గత 48 గం.లలో ఏదైనా మందులు వాడినప్పుడు.
  • గత 3 సం.లలో మలేరియా వ్యాధి వచ్చి వుంటే (ప్రత్యేకించి ఎర్ర రక్తకణాల దానం).
  • హైరిస్క్‌కలిగినలైంగికజీవనశైలికల్గినవారు.

ఒక్కరి రక్తదానం - ముగ్గురికి ప్రాణ దానం...
మీరిచ్చే ఒక్క పూర్తి యూనిట్‌ రక్తం (300-450) మిల్లీలీటర్‌ రక్తాన్ని మూడు బాగాలుగా ఉపయోగించి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. ఉదాహరణకు మీ రక్తంలోని ఎర్రరక్తకణాలను ఒక రక్తహీనతతోనున్న వ్యక్తికి లేదా ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి, ప్లాస్మా అనే ద్రవాన్ని హీమోఫిలియా అనే బ్లీడింగ్‌ డిజార్డర్‌ వ్యాధితోనున్న వ్యక్తికి, ప్లేట్‌లెట్స్‌ను డెంగ్యు వంటి ప్రాణాంతక జ్వరంతోనున్న వ్యక్తికి లేదా థ్రోంబోసైటీమియా వంటి వ్యాధితో నున్న వ్యక్తికి ఇవ్వడం ద్వారా మీరు చేసే ఒక్క యూనిట్‌ రక్తదానం ముగ్గురి ప్రాణాలను కాపాడినట్లవుతుంది.

రక్తదానం... అపోహలు - వాస్తవాలు...

అపోహ: రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు.
వాస్తవం: రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత సంభవించదు. అరగంట విశ్రాంతి తీసుకుని, ఒక రోజు ద్రవ పదార్ధాలు విరివిగా తీసుకుంటే ఎప్పటిలా ఆరోగ్యంగా ఇంకా ఉత్సాహంగా ఉంటారు.
అపోహ: కష్టమైన, శ్రమతో కూడిన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరు.
వాస్తవం: రక్తదానం తర్వాత యధావిధిగా అన్నిరకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు.
అపోహ: రక్తదానం సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది.
వాస్తవం: రక్తదానం సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్నపాటి నొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన బాధ ఉండదు.
అపోహ: రక్తదానం వల్ల ఎయిడ్స్‌ సంక్రమించవచ్చు.
వాస్తవం: రక్తదానం పూర్తి శాస్ర్తీయమైన, సురక్షితమైన  పద్దతులలో  ఏ రకమైన వ్యాధి క్రిములు సోకే అవకాశంలేని విధంగా  జరుగుతుంది.
అపోహ: రక్తదానం వల్ల రక్తం తగ్గి రక్తహీనత వస్తుంది.
వాస్తవం: రక్తదానానికి ముందు అన్ని పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతుల నుండి మాత్రమే తీసుకుంటారు. కనుక రక్తదానం తర్వాత ఎటువంటి రక్తహీనత ఏర్పడదు. ఒక యూనిట్‌ రక్తంలోని ఎర్ర రక్తకణాలు 3 రోజుల్లో, తెల్లకణాలు 3 వారాల్లో తిరిగి ఏర్పడతాయి.
అపోహ: రక్తదానం సన్నగా ఉండే వారు చేయకూడదు. లావుగా, బరువుగా ఉండే వారే చేయాలి.
వాస్తవం: లావుగా ఉండేవారిలో రక్తం ఎక్కువ ఏమీ ఉండదు పైగా స్థూల కాయం వల్ల అనారోగ్యంతో ఉండే అవకాశం ఉంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తగినంత బరువుండి ఆరోగ్యంగా ఉంటే నిక్షేపంగా రక్తదానం చేయవచ్చు.
అపోహ: రక్తదానం తరువాత మద్యం సేవించలేరు.
వాస్తవం: తరువాత రోజు నుండి మీరు సేవించవచ్చు.
అపోహ: ఎయిడ్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగవచ్చు.
వాస్తవం: లేదు ! ఒకసారి ఉపయోగించి పారవేసే సిరంజ్‌ లను ఉపయోగించేలా మరియు క్రిముల బారి నుండి దూరంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

కృత్రిమరక్తం...

ఈ రోజుల్లో రక్తదానం చేస్తామని ముందుకొచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. జనాభాలో నూరింట అయిదుగురు మాత్రమే రక్తదానం చేస్తామని ముందుకి వస్తున్నారు. ఇలా సరఫరా ఒకపక్క తగ్గిపోతూ ఉంటే మరొక పక్కనుండి వృద్ధుల జనాభా పెరుగుతోంది. రక్తదానం పుచ్చుకునే వారిలో ఎక్కవభాగం వయసు మళ్ళిన వారే. కనుక రక్తానికి ఎద్దడి రోజులు వస్తున్నాయి. దీనికి, నిల్వచెయ్య టంలోఇబ్బందులు వల్ల కృత్రిమంగా రక్తం తయారు చెయ్యాలనే కోరిక పెరిగింది. కృత్రిమంగా తయారుచేసిన రక్తం ఈ దిగువచూపిన లక్షణాలు కలిగి ఉండాలి.

  • అది అవిషి అయిఉండాలి.
  • అందులో రోగకారక పదార్ధాలు ఉండకూడదు.
  • రవాణా చెయ్యటానికి  అనుకూలంగా ఉండాలి.
  • గ్రహీత శరీరంలోకి ఎక్కించినప్పుడు రక్త ప్రతిస్పందన రాకూడదు.
  • ఏ జాతి రక్తంతో అయినా కలసిపోగలగాలి.
  • అవసరంతీరే వరకూ ( శరీరం తన సొంతరక్తాన్ని తయారుచేసుకునే వరకు) పాడవకుండా పనిచెయ్యాలి.
  • అవసరంతీరిన తరువాత శరీరం నుండి విసర్జించబడాలి.
  • అలమారులో చాలాకాలం నిల్వఉంచినా పాడవకూడదు.(దీనినే అలమారు ఆయుర్దాయం అంటారు.)
    ఈ కోరికలన్నింటినీ తీర్చటానికీ ఇంతవరకు అనుకూలమైన పదార్ధమే దొరకలేదు.

రక్తదానం ప్రయోజనాలు...

వల్ల

హెల్త్‌చెకప్‌...
రక్తందానం చేయడానికి ముందు, దాత యొక్క చరిత్ర తెలుసుకుంటారు. అంతేకాదు, ఆ వ్యక్తి రక్తందానం చేయడానికి అర్హుడా కాడా అన్నివిషయ నిర్ధారణ కోసం డాక్టర్లు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి మీరు రక్తదానం చేయడానికి ముందు డాక్టర్‌ సలహా ప్రకారం చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. దాంతో మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు.

క్యాన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది...
శరీరంలో ఐరన్‌ నిల్వల స్థాయి తగ్గడంవల్ల (తక్కువగా) ఉండటంవల్ల క్యాన్సర్‌ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తదానం చేయడంవల్ల క్యాన్సర్‌తో బాధపడుతున్న అవకాశాలు ప్రత్యేకంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది...
మీరు రక్తదానం చేసినప్పుడు, రక్త పరిమాణం సమతుల్యం చెంది, రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది.

కొలెస్టరాల్‌ తగ్గిస్తుంది...
శరీరంలోని రక్తకణాల్లో కొలెస్టరాల్‌ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్టరాల్‌ ఉంటుంది. కాబట్టి కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.

రక్తం నష్టం అధిగమించడానికి సహాయం చేస్తుంది...
మీరు రక్తదానం చేసినప్పుడు, తిరిగి మీ శరీరంలో ఏర్పడిన రక్త నష్టాన్ని భర్తీ చేయడం కోసం 4-8 రోజుల సమయం పడుతుంది. ఆ సమయంలో ఎర్రరక్తకణాల్లో ఉన్న రక్తం శరీరం మొత్తం పునరుద్దరణ సరిచేస్తుంది. మరి కొన్ని ప్రయోజనాలేంటంటే పురుషులు ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయొచ్చు. మహిళలు ప్రతి నాలుగు నెలలకొకసారి డొనేట్‌ చేయవచ్చు. అయితే మీరు రక్తదానం చేసేటప్పుడు మీ డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.

రక్తదానం - చిట్కాలు...

  • రక్తాన్ని దానం చేసే కనీసం 3 గంటల ముందు మంచి భోజనాన్నితీసుకోండి.
  • దానం చేసిన తరువాత మీకిచ్చిన ఉపాహారములను తీసుకోండి, మీరు వాటిని తీసుకోవడం ముఖ్యం. తరువాత మంచి భోజనాన్ని తీసుకోవడం మంచిది
  • దానం చేసే రోజు ముందు పొగత్రాగడం మానండి.
  • దానం చేసే 48 గంటల ముందు మీరు ఆల్కహాలు సేవించి ఉంటే, మీరు దానం చేయడానికి అర్హులు కారు.

రక్తం - వాస్తవాలు...

  • రక్తం అనేది శరీర హృదయం, ధమనులు, సిరలు మరియు కేశనాళికల ద్వారా ప్రసరించి మీ ప్రాణాలను నిలబెట్టే ద్రవం.
  • రక్తం శరీర పోషణకి, విద్యుద్వాహక లవణాలు, హార్మోన్లని, విటమిన్లని, ప్రతి రక్షకణాలు, వేడిని, ఆమ్లజనిని తీసుకువెళతాయి.
  • శరీరం నుండి వ్యర్థపదార్థాలని, కార్బన్‌ డై ఆక్సైడ్ ను రక్తం తీసుకువెళుతుంది.
  • రక్తం, వ్యాధులను ఎదుర్కొని, గాయాలకు ఉపశమనం కలిగించడానికి దోహదపడి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • మీ శరీర బరువులో, రక్తం సుమారు 7% వరకు ఉంటుంది.
  • అప్పుడే పుట్టిన శిశువు శరీరంలో సుమారు ఒక కప్పు రక్తం ఉంటుంది.
  • వ్యాధులను ఎదుర్కొనడంలో, తెల్ల రక్తకణాలు శరీరం యొక్క ప్రాథమిక సురక్ష.
  • ఒక రకమైన తెల్ల రక్తకణాలైన గ్రాన్యులోకైట్స్‌, సూక్ష్మక్రిములను వెదికి నాశనం చేయడానికి రక్త కణాల గోడల చుట్టూ తిరుగుతాయి.
  • శరీర అవయవాలి, కణజాలానికి, ఎర్రరక్తకణాలు ఆమ్లజనిని తీసుకువెళతాయి.
  • రెండు నుండి మూడు రక్త బిందువులలో, సుమారు ఒక బిలియన్‌ ఎర్ర రక్తకణాలు ఉంటాయి.
  • ప్రసరణ వ్యవస్థలో, ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవించి ఉంటాయి.
  • రక్త పట్టికలు రక్తం గడ్డకట్టడానికి దోహదపడతాయి. లుకేమియా, ఇతర కేన్సర్‌ ఉన్నవారికి, జీవించడానికి అవకాశం కలిగిస్తాయి.

రక్తదానం - కొన్నినిజాలు...

  • ఏటా మన దేశంలో 4 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే, అందుబాటులో ఉన్నది కేవలం 40 లక్షల యూనిట్లు మాత్రమే.
  • మానవ రక్తానికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. రక్తదానం చేయడమంటే ఓ ప్రాణాన్ని కాపాడడమే.
  • ప్రతీ రెండు సెకన్లకు దేశంలో ఎక్కడోచోట ఒకరికి రక్తం అవసరమవుతుంది.
  • ప్రతి రోజూ కనీసం 38,000 మంది రక్తదాతల అవసరంఉంది.
  • అత్యధికంగా కోరుకునే రక్తం "ఒ" గ్రూప్‌
  • దేశంలో ఏటా కొత్తగా 10 లక్షల మంది క్యాన్సర్‌ బాధితులుగా తేలుతున్నారు. కీమోథెరపీ చికిత్స సందర్భంగా తరచూ వారికి రక్తం అవసరం ఉంటుంది.
  • రక్తదానం ఎంతో సురక్షిత ప్రక్రియ. ప్రతీ సారి కూడా స్టెరైల్‌నీడిల్‌ ను ఉపయోగిస్తారు. ఒకసారి ఉపయోగించినదాన్ని మళ్ళీ ఉపయోగించరు.
  • రిజిస్ట్రేషన్‌, మెడికల్‌హిస్టరీ, డొనేషన్‌, రిఫ్రెష్‌మెంట్‌ అనే నాలుగు తేలికపాటి దశల్లో రక్తదానం పూర్తవుతుంది.
  • రక్తదానం చేసే వారికి ముందుగా టెంపరేచర్‌, బీపీ, పల్స్‌, హిమోగ్లోబిన్‌ తదితర పరీక్షలు చేస్తారు. ఇవన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తేలిగ్గా పూర్తయ్యేవే.
  • రక్తదాన ప్రక్రియ పావుగంటలో పూర్తవుతుంది.
  • మన శరీరంలో 10 యూనిట్ల రక్తం ఉంటే, సుమారుగా 1 యూనిట్‌ రక్తాన్ని దానం చేయవచ్చు. దాని వల్ల దాత శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
  • ఆరోగ్యవంతుడైన దాత ప్రతీ 56 రోజులకు ఒకసారి ఎర్ర రక్తకణాలను డొనేట్‌ చేయవచ్చు.
  • ఆరోగ్యవంతుడైన దాత కనీసం 7 రోజుల విరామంతో సంవత్సరానికి 24 సార్లు ప్లేట్‌లెట్స్‌ దానం చేయవచ్చు.
  • రక్తదానం ద్వారా సేకరించిన రక్తానికి హెచ్‌ఐవీ, హెపటైటిస్‌, ఇతర అంటువ్యాధుల సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాతే దాన్నిఅవసరమైన వారికి ఎక్కిస్తారు.
  • రక్తం నుంచి ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మా, క్రయోప్రిసిపిటేట్‌ అనే భాగాలను విడదీసి ఎవరికి ఏది అవసరమో వారికి అది అందిస్తారు. ఒక్కసారి రక్తదానంతో ముగ్గురి ప్రాణాలను కూడా కాపాడవచ్చు.
  • డొనేట్‌ చేసిన ప్లేట్‌లెట్స్‌ను సేకరించిన ఐదు రోజుల్లోగా ఉపయోగించాల్సి ఉంటుంది.

ఆధారము: సూర్య న్యూస్

3.06060606061
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు