অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మధుమేహం

పరిచయం

మధుమేహం లేదా చక్కర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు . మధుమేహం అంటే మనిషి రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా అనియంత్రిత స్థాయిలో వుండటం . ఇది వ్యాధి కాదు. శరీరం లో ఇన్సులిన్ తగ్గడం వల్ల ఏర్పడే ఒకానొక అసమానత. సాధారణంగా రక్తంలో గ్లూకోస్ 100 మి.గ్రా /డె.లీ వుండాలి. దానికంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లు భావించాలి . ఆహారం శరీరంలో జీర్ణంకాబడి గ్లూకోస్ గా మారుతుంది . ఈ గ్లూకోస్ కణజాలంలోకి గ్రహింపలేకపోవడం వలన రక్తంలో చక్కర స్థాయి ఎక్కువగా ఉంటుంది. గ్లూకోస్ కణాలలోకి గ్రహించాబడాలంటే ఇన్సులిన్ అనే హార్మోను క్లోమగ్రంధి నుంచి స్రవిoచబడాలి . ఇన్సులిన్ తక్కువగా స్రవించబడినా, సరిపడా స్రవించబడినప్పటికి సక్రమంగా పనిచేయలేకపోవడంవలన రక్తంలోని గ్లూకోస్ కణాలలోకి గ్రహించబడదు . అందువలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు శరీరంలోని జీవకణాలకు దీర్ఘకాలం శక్తి అందక వివిధ అవయవాలు అనారోగ్యనికి గురవుతాయి. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్య స్థితిపట్ల అప్రమత్తులుగా ఉండి తగు జాగ్రత్తలు పాటిస్తే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

మన శరీరంలో అనేక వ్యవస్థలున్నాyi . . ఇవన్నీ వాటి పనుల్ని అవి నిర్వహించుకుంటూ ఉన్నా, అన్నీ ఒకదాని మీద ఆధారపడి ఉన్నాyi. ఒక వ్యవస్థ పనిలో ఆటంకం ఏర్పడితే ఆ ప్రభావం మిగతా వ్యవస్థల మీద కూడా ఉంటుంది. మధుమేహంలో ఈ ప్రభావం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. శరీరంలో జరిగే జీవచర్యలో భాగంగా తయారయ్యే రక్తంలో ప్రవేశించిన గ్లూకోజ్‌ను శరీరం సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడం వలన కలిగే స్థితిని మధుమేహం అంటారు.

ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ ఉన్న వాళ్ళల్లో 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లోని వాళ్లే! 35 మిలియన్లకి పైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహం బారినపడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చని ఒక అంచనా. 30 శాతం మంది ప్రి-డయాబెటిక్‌ స్టేజ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో 40కి పైబడ్డ ప్రతీ ఇద్దరిలో ఒకరికి మధుమేహం పీడిస్తుండి. డయాబెటిస్‌ అనే వ్యాధి కాదు, కాని అనేక వ్యాధులకు మూలం. ఇలా విస్తృతంగా పెరిగిపోతున్న డయాబెటిస్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలి. ఫెడరిక్‌ బ్యాంటింగ్‌, చార్లస్‌ వెస్ట్‌తో కలిసి 1922లో ఇన్సులిన్‌ని కనుక్కున్నారు.

పాంక్రియాజ్‌ గ్రంథి లోపం వల్ల ఇన్సులిన్‌ హార్మోన్‌ లోపించడంతో ఈ డయాబెటిస్‌ వస్తుంది. రక్తంలో షుగర్‌ పెరిగిపోతుంది. డయాబెటిస్‌ని అదుపులో ఉంచుకోకపోతే ఎన్నో అనర్థాలు కలుగు తాయి. నరాలు దెబ్బతింటాయి. త్వరగా మరియు తీవ్రంగా వచ్చే కాంప్లికేషన్స్‌ హైపోగ్లైసీమియా, కీటో అసిడోసిస్‌ లేదా నాన్‌కీటోటిక్‌ హైపర్‌ ఆస్మొలార్‌ కోమా... వ్యాధిని సరిగా నియంత్రించుకోకపోతే రావచ్చు . తీవ్రమైన దీర్ఘకాలిక కాంప్లికేషన్స్‌గా హృద్రోగాలు, మూత్రపిండాల బలహీనత, డయాబెటిక్‌ రెటి నోపతి, డయాబెటిక్‌ న్యూరోపతి, గాయాలు త్వరగా మానకపోవడం ముఖ్యమైనవి. అభివృద్ధి చెందిన దేశాల్లో యుక్త వయసులోనే అంధత్వానికి, మూత్రపిండాలు దెబ్బతిని డయాలిసిస్‌ అవసరమయ్యే డయాబెటిక్‌ నెఫ్రోపతికి ప్రధాన కారణం డయాబెటిక్‌.

రక్తనాళాలు దెబ్బతింటే వాస్కులోపతి. ముఖ్యంగా నరాల మీద ‘మైలీన్‌’ అనే సన్నని పొర ఉంటుంది. ఇది దెబ్బతింటే లోపల సంకేతాల్ని అందచేసే ‘యాక్సాన్‌’ దెబ్బతింటుంది. దాంతో మెదడు నుంచి శరీరభాగాల్లోకి, శరీరం నుంచి మెదడులోకి సంకేతాలు సరిగ్గా అందవు. ఈ సమస్య పాదాలు, అరిచేతుల్లో ప్రారంభమవుతుంటుంది. ఎందుకంటే పొడవాటి నరాలు శరీరం కోసల్లో ఉండే నరాలు ముందుగా దెబ్బతింటాయి. కాబట్టి దాంతో అరికాళ్ళు, అరిచేతులు తిమ్మిర్లు, మొద్దు బారటం లాంటివి జరుగుతాయి.

మెదడులోని కణాలు సక్రమంగా పనిచేయడానికి బ్లడ్‌ షుగర్‌ చాలా అవసరం. అందుచేత తక్కువ బ్లడ్‌ షుగర్‌ ‘మైకం, గందరగోళం, నీరసం, వణుకు’ మొదలైన సెంట్రల్‌ నెర్వస్‌ సిస్టమ్‌కి సంబంధించిన అనారోగ్య లక్షణాలను కలిగిస్తుంది. ఈ లక్షణాలు కలిగే బ్లడ్‌ షుగర్‌ ప్రమాణం డెసీలీటర్‌కి 65 మి.లీ.కు పడిపోతే కలుగుతాయి. బ్లడ్‌ షుగర్‌ ప్రమాణం మరీ పడిపోయి 40. మి.లీ. కిందికి చేరితే కోమాలోకి దారి తీస్తుంది. మధుమేహం ఒక వ్యాధి కాదు, షుగర్‌ జీవచర్య సరిగ్గా జరగకపోవడం వల్ల కలిగే శారీరక స్థితి.

దీనిని సకాలంలో గుర్తించడం చాలా అవసరం. లేకపోతే ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాబట్టి నెలకు ఒక్కసా రైనా పొద్దున్నే ఆహారం తినకముందు, ఆహారం తిన్న గంటన్నర తర్వాత రక్తపరీక్ష చేయించు కోవాలి. దాని ద్వారా రక్తంలోని షుగర్‌ శాతాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అలాగే లిపిడ్‌ ప్రొఫైల్‌ అనే రక్త పరీక్ష చేయించుకోవడం కూడా అవసరం. సంవత్సరానికి ఒకసారి కళ్ళు, గుండె, మూత్రపిండాలు వంటి అవయవాల పనితీరు తెలిపే పరీక్షలు చేయించుకోవాలి.

మధుమేహ పరీక్షలు చేయించుకునే ముందు శరీరానికి అధిక శ్రమ కలిగించకూడదు. పరీక్షల కోసం ఎక్కువ దూరం నడవకుండా, పరీక్షా కేంద్రం ఇంటి పక్కనే ఉండేటట్లు చూసుకోవాలి. లేదా వెళ్ళ డానికి ఏదైనా వాహనాన్ని ఆశ్రయించాలి. రాత్రిపూట ఎక్కువసేపు మేల్కోని ఉన్నా, ప్రయాణం చేసి వచ్చినా, ఎక్కువ శ్రమ పడినా ఉదయాన్నే రక్తపరీక్షలు చేయించుకోకూడదు. చేయించుకుంటే రక్తంలో ఎక్కువ గ్లూకోజ్‌ కనబడుతుంది.

డయాబెటిస్‌పై సరైన నియంత్రణ, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన బరువును నిలుపుకోవడం, దీనిలో అతి ముఖ్యమైన అంశం ఆహార నియమం. రోగి గాని రోగి యొక్క కుటుంబంలోని వారుగాని అలవాటుగా తినే ఆహారాన్ని కొన్ని నియమాలతో తీసుకోవాలి. సమయం ప్రకారమే ఆహారాన్ని తీసుకోవాలి.

  • పప్పు దినుసుల నుండి లభించే ప్రొటీన్లు, మాంసాహారం నుండి లభించే ప్రొటీన్లు కంటే మేలైనవి. ధాన్యాలు, పప్పులు కలిపి తీసుకున్న ఆహారం ప్రొటీన్ల శాతాన్ని పెంచుతుంది. పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయినప్పటికీ కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పీచు అధికంగా ఉండే ఆహార పదార్ధాలు మధుమేహాన్ని నివారించటం లోనూ, రక్తంలో కొవ్వు పదార్థాలను తగ్గించ డంలోనూ ఉపయోగపడతాయి. ఆకు కూరలు, కూర గాయల్లో పీచు అధికంగా ఉంటుంది. మెంతుల్లో పీచు పదార్థాం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని, చికిత్సను సహాయకారిగా తీసుకోవచ్చు. మీ పాదాలకి సౌకర్యంగా ఉండే అనువైన పాదరక్షలను వాడాలి.
  • ధూమపానం అలవాటు పూర్తిగా మానేయాలి. ఎక్కువ కొలస్ట్రాల్‌ ఉండే నూనెలు గాని, మాంసా హారాలు గాని, నూనే అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం పూర్తిగా తగ్గించాలి.రోజు తగినం తగా వ్యాయామం చేస్తూ ఉండాలి. తక్కువగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా నడుస్తూ ఉండాలి. మీ రక్తపోటు, శరీర బరువు, నడుము చుట్టుకోలత - ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోగలం.
  • సాధారణంగా పరగడుపున రక్త , మూత్ర పరీక్షలు చేసి గ్లూకోస్ స్థాయి తెలుసుకుంటారు. సాధారణంగా రొజులో వివిధ సమయాల్లో రక్తంలో గ్లూకోస్ స్థాయి 80-139 మి.గ్రా /డె.లీ. ఉండాలి. అంతకంటే ఎక్కువగా వుంటే మధుమేహులుగా గుర్తిస్తారు.

    సమయం

    సాధారణ స్థాయి

    మధుమేహం వున్నపుడు

    పరగడుపున

    80-100 మి.గ్రా /డె.లీ

    126 మి.గ్రా /డె.లీ కన్నా ఎక్కువ

    రోజులో ఎప్పుడైనా

    80-139 మి.గ్రా /డె.లీ

    200 మి.గ్రా /డె.లీ కన్నా ఎక్కువ

    భోజనం చేసిన రెండు గంటల తరవాత

    80-139 మి.గ్రా /డె.లీ

    200 మి.గ్రా /డె.లీ కన్నా ఎక్కువ

    మధుమేహంలో రకాలు

    టైపు-1

    క్లోమ గ్రంధిలో బీటా కణాలు నశించడం వలన ఇన్సులిన్ స్రవించక ఈ రకం మధుమేహం వస్తుంది. సాధారణంగా జన్యు కారణాల వలన, అంటువ్యాధుల వలన టైపు -1 మధుమేహం వస్తుంది. ఆకలివిపరీతంగావేయటం, ఉన్నట్లుండిబరువుతగ్గిపోవటం, బలహీనత, చిరాకు, వాంతులు, వికారం వంటి లక్షణాలు ఈ రకం మధుమేహం లో కన్పిస్తాయి.

    టైపు - 2

    శరీరం సరైన రీతిలో ఇన్సులిన్ను వినియోగించు కోలేనపుడు టైపు -2 మధుమేహం వస్తుంది .ఈ రకం మధుమేహం వయస్సుపైబడటంవలన, ఊబకాయం, పోషకాహార లోపం, శారీరక శ్రమలేని జీవన విధానం వలన వస్తుంది. ఈ మధుమేహులలో చూపుతగ్గిపోవడం, కాళ్ళ పాదాలవేళ్ళలో తిమ్మిర్లుగా, మొద్దుబారినట్లు అనిపించడం, కాళ్ళమీద గాయం అయినపుడు త్వరగా మానకపోవడం, చర్మంమీద దురదగా అనిపించటం వంటి లక్షణాలు వుంటాయి.

    గర్భిణీల్లోవచ్చే డయాబెటిస్

    హార్మోన్లలో సంభవించే తేడాల వల్ల గర్భధారణ సమయంలో కొంతమందిలో ఈరకం మధుమేహం వస్తుంది. ప్రసవానంతరం తగ్గిపోతుంది. అయితే ఇలా గర్భధారణ సమయంలోమధుమేహం వచ్చిన వారిలో సగానికి సగం మందిలో తరువాత వయసులో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది . కనుక వారు ఆహార, వ్యాయామాల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తుండాలి.

    ఇతర కారణాల వల్ల వచ్చే ద్వితీయ మధుమేహం

    స్టెరాయిడ్లు, కొన్ని రకాల మందులను వినియోగించటం, రసాయనాల వలన క్లోమగ్రంధి దెబ్బతిని మధుమేహం వచ్చే అవకాశం ఉంది . ఇది సాధారణంగా పెద్దల్లో కనిపించేదైనప్పటికీ ఇటీవలకాలంలోయువకుల్లోసైతంకనిపిస్తోంది.

    మధుమేహ లక్షణాలు

     

    తరచుగా మూత్ర విసర్జనచేయాల్సిరావటం శరీరంలో చక్కెర మోతాదు పెరిగిపోయినప్పుడు శరీరం కిడ్నీలద్వారా దానిని బైటకు పంపేప్రయత్నం చేస్తుంది. దానివల్ల తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది.
    చర్మంపొడారిపోయిదురదలుపెట్టడం ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సిరావటంతో శరీరం ఎండిపోయి, చర్మంపొడారిపోతుంది. స్నిగ్ధత కోల్పోవటం వల్ల దురదలు ఉత్పన్నమవుతాయి. అలాగే రక్తంలో చక్కెరనిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి తగ్గటంతో పాటు బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు పెరిగి అంటువ్యాధులకు ఆస్కారం ఏర్పడుతుంది.
    గాయాలు త్వరగా మానకపోవటం రక్తం ద్వారా శరీరంలో భాగాలకు నిర్దేశిత ప్రాంతాలకు పోషకాలు, ప్రాణవాయువు అందుతుంటాయి. కానీ మధుమేహంలో రక్తనాళాలు పూడుకుపోయేందుకు అవకాశం ఉంది. గాయమైన చోటుకు రక్తసరఫరా సరిగ్గా జరుగనందున గాయం మానడానికి చాలాకాలం పడుతుంది.
    చూపు మసకబారటం మధుమేహం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు కంటి కటకంలోని చక్కెర శాతంలోను, నీటి శాతంలోనూ మార్పులు సంభవించి చూపు దెబ్బతినటం జరుగుతుంది.
    ఎక్కువగా ఆకలి వేస్తుండటం మధుమేహం మూలంగా శరీరంలో ఇన్సులిన్ మోతాదు తగ్గినప్పుడు రక్తంలోని చక్కెర రూపంలో ఉన్నపోషకపదార్థాలను కణజాలాలు గ్రహించలేవు. దీనితో ఈ కణజాలాలు పోషకాల కోసం మెదడును చైతన్య పరిచి ఆకలి పెరిగేలా చేస్తాయి.
    బరువుకోల్పోవటం ఆహారం సరిగ్గా తీసుకుంటున్నప్పటికీ బరువు కోల్పోవటానికి కారణం, పోషక పదార్థాలను గ్రహించలేకపోవటమే. పోషకతత్వాలు పరిపూర్ణంగా అందక పోవటంతో శరీరం శక్తి కోసం కొవ్వునిల్వలను వినియోగించుకుంటుంది. దీనితో, శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గి బరువు తగ్గుతారు.
    తిమ్మర్లు కాళ్ళు చేతల్లో తిమ్మిర్లు పట్టినట్లు, సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలం నుంచీ ఉన్నప్పుడు నరాలు దెబ్బతిని ఈ సమస్య వుత్పన్నమవుతుంది.
    హైపోగ్లైసిమియా ఒక్కొక్కసారి మధుమేహులలో చక్కరశాతం సాధారణ స్థాయి కంటే కూడా పడిపోతుంది. దీనిని హైపోగ్లైసిమియా అంటారు

    శరీరంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడానికి కారణాలు

    శరీరంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడానికి కారణాలు

    • ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఉపవాసాలు చేయడం.
    • అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరానికి మించి వ్యాయామం, శారీరక శ్రమ చేయడం.
    • నొప్పి నివారణ మందులు విచక్షణారహితంగా తీసుకోవడం.
    • అధికంగా మత్తుపానీయాలు తీసుకోవడం.

    రక్తంలో చక్కెర శాతం తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు

    ఈ లక్షణాలు ప్రతీ మనిషికి మారుతుంటాయి. ఒకే మనిషిలో విభిన్న లక్షణాలు కనిపిస్తుంటాయి.

    • అతి ఆకలి, అతిచెమట, మూర్ఛపోవడం, బలహీనత, ఎక్కువగా గుండెకొట్టుకోవడం.
    • పెదవులకు తిమ్మిరి పట్టడం.
    • చూపు మసకబారడం.
    • తలనొప్పి, చేసేపని పై శ్రద్ధలేకపోవడం.
    • తికమకపడడం, అలసిపోవడం, బద్దకం మొదలైనవి.

    జాగ్రత్తలు

    ఈ స్థితి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    1. నాలుగు పూటలా మితంగా ఆహారం తీసుకోవాలి. (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రిభోజనం)
    2. కచ్చితమైన ఆహార సమయాలు పాటిస్తూ, సరైన సమయంలో మందులు వాడడం
    3. హైపోగ్లైసిమియా పరిస్థితి కన్పించగానే రక్తంలోని చక్కెర నిల్వల స్థితి పెంచాలి. 3, 4 చెంచా చక్కెర లేదా గ్లూకోస్ తీసుకోవాలి.
    4. ఎప్పుడూ కొంతచక్కెర లేదా గ్లూకోస్ దగ్గర ఉంచుకోవాలి.
    5. అపస్మారక స్థితి వస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

    ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్

    ఆధారం:

    1. డాక్టర్ ఎన్.నిర్మలమ్మ, పోషకాహార నిపుణులు.
    2. కుమారి ఎన్.సునీత, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/090.

    చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2024



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate