హోమ్ / ఆరోగ్యం / వ్యాధులు / వెన్నునొప్పి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వెన్నునొప్పి

నడుం నొప్పికి కీలకమైన వెన్నుముక నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (back pain) అంటారు.

నడుమునొప్పి.. నిర్లక్ష్యం పనికిరాదు!

నడుం నొప్పికి కీలకమైన వెన్నుముక నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (back pain) అంటారు. 90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాలలో రాళ్లదాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యలవల్ల వచ్చే నడుమునొప్పి సర్వసాధారణం. ఎక్కువమందిలో కనిపించేదీ… అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నడుం నొప్పి మాత్రం డిస్కు సమస్యలవల్ల వచ్చే నడుము నొప్పే.

నొప్పికి కీలకమైన డిస్క్

శరీరానికి ఒక ఆకృతి రావడానికి ఉపయోగపడే వెన్నుపాములో 33 వెన్నుపూసలు ఉంటాయి. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు మొత్తం ఏడు వెన్నుపూసలు, ఆ తరువాత రొమ్ముభాగంలో ఉండే పనె్నండు వెన్నుపూసలు డి1 నుంచి డి12. ఇక నడుము భాగంలో ఉండే వెన్నుపూసలు అయిదు. అవి ఎల్1 నుంచి ఎల్5. ఆ తరువాత కాలి ఎముకలకు ముందు ఉండే వెన్నుపూసలను ఎస్1 నుంచి ఎస్5గా పిలుస్తారు. ప్రతి రెండు వెన్నుపూసల మధ్య మెత్తని గినె్న లాంటి నిర్మాణం ఉంటుంది. దీనే్న డిస్క్ అంటాం. దీనిపైభాగం గట్టిగా ఉన్నా లోపల జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. డిస్కులు వెన్నుపామును షాక్స్ నుంచి రక్షిస్తాయి. డిస్కులు జారడంవల్లగానీ, అవి అరిగిపోవడంవల్లగానీ నొప్పి మొదలవుతుంది. వెన్నుపూసల నుంచి బయలుదేరే నాడులన్నీ కలిసి పిరుదుల భాగంలో ఒక్క నాడిగా ఏర్పడి కాలి కింది భాగంలోకి వెళతాయి. ఈ నరానే్న సయాటిక్ నరం అంటారు. డిస్కులో సమస్యలున్నప్పుడు ఏర్పడే ఏ నడుం నొప్పి అయినా ఈ సయాటిక్ నరం గుండా కాలిలోకి పాకుతూ వెళుతుంది. అందుకే డిస్కుల వల్లకలిగే ఈ నడుం నొప్పిని సయాటికా నొప్పి అని కూడా అంటారు.

డిస్క్ జారితే

రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారడానే్న డిస్క్ ప్రొలాప్స్ లేదా స్లిప్‌డ్ డిస్క్ అని గానీ అంటారు. డిస్కు జారడమంటే గినె్నలాంటి నిర్మాణం మొత్తం పక్కకు జారిపోతుందని అనుకుంటారు. కానీ డిస్కు పైభాగంలో పగులులా ఏర్పడి లోపలున్న జెల్లీ పదార్థం బయటకు వస్తుంది. ఇది డిస్కు వెనుక ఉన్న సైప్‌నల్ నరంపై ఒరిగిపోతుంది. దానివల్ల నరం ఒత్తిడికి గురయి నొప్పివస్తుంది. ఏ వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కు జారిందన్నదాన్ని బట్టి దానివల్ల కనిపించే నొప్పి లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. లక్షణాలను బట్టి ఏ డిస్కు జారి వుంటుందో కూడా చెప్పవచ్చు. ఉదాహరణకి ఎల్4, ఎల్5 వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారినప్పుడు తొడ భాగంలో పక్కవైపు నుంచి కాలు కిందివరకూ నొప్పి ఉంటుంది. నడుం నొప్పికన్నా కాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారిగా పక్కకు తిరగడం, బరువు ఎత్తడం, వంగడంవల్ల నొప్పి మొదలవుతుంది. ఒక్కసారిగా కూర్చున్నచోట నుంచి లేచినా డిస్కు స్లిప్ అవుతుంది. జర్క్ ఉన్న ఏ కదలిక వల్లనైనా డిస్కు జారవచ్చు. ఎల్5, ఎస్1 మధ్య ఉన్న డిస్కు జారితే తొడ వెనుక భాగం అంటే వెనుక వైపు తొడ నుంచి కాలి పాదంవరకూ నొప్పి ఉంటుంది.

డిస్క్ అరుగుదల

డిస్కు అరిగిపోవడం ప్రారంభమైన తొలి దశలో నడుం నొప్పి అంత తీవ్రంగా ఉండదు. తరువాత ఎక్కువ అవుతుంది. ఎక్కువసేపు కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువ అవుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు తక్కువ అవుతుంది. డిస్కు అరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రం అవుతుంది. డిస్కు అరిగిపోవడంతో రెండు వెన్నుపూసలు గీరుకుంటాయి. నరం ఒత్తిడికి గురవుతుంది. డిస్కు సమస్యలను ఎంఆర్‌ఐ స్కాన్ ద్వారా మాత్రమే క్లినికల్‌గా నిర్థారించవచ్చు.
స్పాండైలో లిస్థెసిస్: వయసు రీత్యా కలిగే మార్పులలో వెన్నుపూసలు పక్కకు జరిగిపోవడం (స్పాండైలో లిస్థెసిస్) కూడా ఒకటి. చిన్న వయసులోనే వెన్నుపూసలు జరిగిపోయాయంటే మాత్రం ప్రమాదాలే కారణం. యాక్సిడెంట్‌వల్ల వెన్నుపూసల వెనుక ఉండే లింకులో ఫ్రాక్చర్‌వల్ల వెన్నుపూసలు పక్కకు జరుగుతాయి. ఇలాంటప్పుడే నడుం నొప్పి స్థిరంగా ఉంటుంది. ఇదీ సయాటికా నొప్పే. నిటారుగా ఉన్నవాళ్లు పక్కకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. కింద కూర్చుని పైకి లేచేటప్పుడు కూడా నొప్పి పెరుగుతుంది. రెండు కాళ్లలోనూ నొప్పి ఉంటుంది. ఆడవాళ్లలో ఈ రకమైన నడుంనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది.

కీలు అరిగినా

రెండు వెన్నుపూసలను కలిపి ఉంచే కీళ్లను ఫాసెట్ జాయింట్స్ అంటారు. మోకాలి కీళ్లలాగా ఇవి కూడా అరిగిపోవచ్చు. అలా అరిగిపోయినప్పుడు నడుం నొప్పి మొదలవుతుంది. పిరుదులు, తొడ వెనుక భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి ఉదయం లేవగానే ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎముకలు కదలకుండా ఉండడానికి వాటి చుట్టుప్రక్కల ఉన్న కండరాలు తోడ్పడతాయి. సాధారణంగా రాత్రి పూట కండరాలన్నీ రిలాక్స్‌గా ఉంటాయి. కాబట్టి ఉదయం సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.
సైఫస్ ఇన్‌ఫెక్షన్:
వెన్నుపాము ఇన్‌ఫెక్షన్లలో అతి సాధారణంగా కనిపించేది క్షయ. ఎముక టిబివల్ల కూడా కనిపించే ముఖ్య లక్షణం నడుం నొప్పే. ఎముక టిబి ఉన్నవాళ్లలో రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పితోపాటు జ్వరం ఉంటుంది. బరువు తగ్గిపోతారు. ఆకలి ఉండదు. చెమట ఎక్కువగా పడుతుంది. టిబివల్ల నరాలు దెబ్బతిని కాళ్లు చచ్చుబడిపోయే అవకాశం కూడా ఉంది.

సైపన్ ట్యూమర్స్ :

వెన్నుపాము కింది ఎముకలో క్యాన్సర్ కణుతులు ఏర్పడినప్పుడు కూడా నడుం నొప్పి ఉంటుంది. ఆకలి తగ్గుతుంది. బరువు తగ్గుతారు. కానీ జ్వరం మాత్రం ఉండదు.

సాజిటల్ ఇంబ్యాపూన్స్:

అయిదు పదులు దాటిన తరువాత కొంతమంది మెల్లమెల్లగా ముందుకు వంగిపోతారు. వెన్నుపాము నిర్మాణంలో తేడా రావడంవల్ల పిరుదులు, తొడ భాగాల్లో నొప్పిగా ఉంటుంది. పడుకుని ఉన్నప్పుడు నొప్పి ఉండదు. వెన్నుపామును సాధారణ స్థితికి తేవడానికి కండరాలన్నీ ప్రయత్నించడంవల్లనొప్పి మొదలవుతుంది.
90 శాతంమంది జీవితంలో ఏదో ఒక సమయంలో నడుం నొప్పితో బాధపడతారు. వీరిలో 80 శాతం మందికి ఆరువారాల్లోగా నొప్పి తగ్గిపోతుంది. మిగిలిన 20 శాతంమంది మాత్రం తీవ్రమైన నడుం నొప్పితో నిత్యం బాధపడుతుంటారని అంచనా. వీరిలో 10 శాతం మందికి మాత్రం ఆపరేషన్ అవసరం అవుతుందని అమెరికా అధ్యయనాలు తెలుపుతున్నాయి. అమెరికాలాంటి దేశంలోనే గణాంకాలు ఇలా ఉంటే ఇక మన ఇండియా లాంటి దేశంలో ఈ సమస్య మరింత ఎక్కువనే చెప్పాలి.

ఇతర కారణాలు

కొన్ని సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు. అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్థారించవచ్చు.
-కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కూడా నడుం నొప్పి ఉంటుంది. అయితే ఇది అలా వచ్చి ఇలా పోతుంది. వచ్చినప్పుడల్లా పది నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నొప్పితోపాటు మూత్రంలో మంట ఉంటుంది. నొప్పి ఒక చోట ఉంటుంది. కాళ్లలోకి పాకదు. ఒక్కోసారి కిడ్నీలో నీళ్లు నిండిపోయినప్పుడు కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. దీంతోపాటు మూత్రం తక్కువ లేదా ఎక్కువసార్లురావడం, ఇతరత్రా మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఉంటాయి.

-వెనె్నముక కాకుండా కేవలం కండరాలకు సంబంధించిన నొప్పే అయితే గనుక ఆ కండరాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది. ఆ కండరం ఒత్తిడికి గురయ్యేలా బరువు ఎత్తినా పక్కకు తిరిగినా నొప్పి ఉంటుంది.

-పాంక్రియాటైటిస్ లాంటి జీర్ణవ్యవస్థ సంబంధమైన సమస్యలున్నప్పుడు బొడ్డు నుంచి వెనక్కి నొప్పి వ్యాపిస్తుంది.

-గర్భాశయం, ఓవరీలలో సమస్యలున్నప్పుడు పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ (పిఐడి) సమస్యవల్ల పిరుదుల భాగంలో నొప్పి, బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ నొప్పితో పాటు రుతు సంబంధ సమస్యలుంటాయి.

ప్రమాద సంకేతాలు

రకరకాల కారణాలవల్ల వచ్చే నడుము నొప్పి వెన్నుపాము సంబంధించినది, ప్రమాదకరమైనది అని చెప్పడానికి కొన్ని సంకేతాలున్నాయి. నొప్పి అందించే ఇలాంటి సంకేతాలను ఎంత మాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా పరిష్కరించవచ్చు. ఆపరేషన్ అవసరాన్ని కూడా తగ్గించవచ్చు.

-నొప్పితోపాటు జ్వరం -ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం -కాళ్లలో బలహీనత కనిపిస్తే అలక్ష్యం చేయవద్దు -మూత్రం, మలవిసర్జనలపై అదుపు తప్పడం -నడుమునొప్పితోపాటు తిమ్మిర్లు, కాళ్లుమొద్దుబారడం, మంటలు

-సయాటికా నొప్పి అంటే నడుమునుంచి కాలిలోకి నొప్పిపాకడం వెన్నుపాము సంబంధిత నడుము నొప్పి ప్రధాన లక్షణం.

డాక్టర్ జి.పి.వి. సుబ్బయ్య

ఫోన్ : 9885012656

నల్లేరు గొప్ప ఔషధం!

‘నల్లేరుమీద బండి’లా జీవితం సాగిపోతోంది అని, మెత్తగా సాపీగా జీవితం వుండటాన్ని ఉపమించే సామెత వాడుకలో వుంది. వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు.
హిందీలో ‘హడ్ జోడ్’గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన ‘భవప్రకాశ’ గ్రంథంలో వివరించారు.
‘సిసస్ క్వాడ్రాంగులా’ లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌‘సి’, కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు.
కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే ‘డ్యూరాబొలిన్’కంటె ఉత్తమ గుణం ఈ ‘నల్లేరు’లో వున్నాయని
పరిశోధకులు ధృవీకరించారు. అస్థ్ధితువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే ‘మ్యూకోపాలిసాక్రైడ్స్’ దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది.
నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటాఠు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది.

విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర ‘గణుపు’ వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో ‘హడ్‌జోడ్’గా పిలుస్తారు.
దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే ‘మహౌషధి’ అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు.
CORTISOL వాడకంవలన ఏర్పడే ఉపద్రవాలలో ఒకటయిన ఎముకల సాంద్రత తగ్గటం, దీనిని నివారించే గుణం దీనిలో వుంది. ఎముకలలో దృఢత్వం కలిగించడమే కాకుండా ప్రక్కన వుండే కండరాలకు శక్తిని చేకూర్చుతుంది. ఇదికాక దీనిలో నొప్పి నివారణ గుణం వుండటం విశేష లక్షణం. మనం తరచుగా వాడే ఆస్పిరిన్ బ్రూఫెన్ మందులకు సరిసమానంగా నొప్పి
నివారణ గుణం నల్లేరులో వున్నదని పరిశోధనల ద్వారా తేలింది.
ప్రకృతి ప్రసాదించి విశేషగుణాలు కలిగిన నల్లేరును సమాదరించకపోవడం విచారకరం. 100 గ్రాముల ఫైటోకెమికల్స్‌ను, 267 ఎం.జిల కెరోటిన్, 398 మిల్లీ గ్రాముల విటమిన్ సి, ఇది
కాకుండా ఎముక సత్వరం అతుక్కోడానికి ఉపకరించే గుణం కూడా వుంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇటువంటి ఔషధ గుణాల మొక్క అవసరం గమనించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రోత్సాహంతో, దక్షిణ భారతంలో, శ్రీలంకలో అధికంగా లభించే ‘సిసస్ క్వాడ్రాంగులా’ను అనేక సంస్థలు పరిశోధనలు చేపట్టి ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించారు.

జంతు పరిశోధనలో దీనిని ఇచ్చిన తరువాత 21 రోజులలో విరిగిన ఎముక యొక్క రెండు చివరలు అతుక్కుని వుండటం ఎక్స్‌రేల ద్వారా గమనించారు. కార్టిలేజ్‌లో, ఆస్టియోబ్లాస్ట్ కణాలలో
మార్పును కూడా గమనించారు. యూసిబోన్ (ఫర్మాన్జా ఇండియా), బొకామో (గుఫిక్), యూనియన్, 4 డఉ-డ (AIRAN PHARMA), నల్లేరు (AGRIGOLD) ASTHI SANDH పేర్లతో మొదలయిన కంపెనీలు వివిధ బ్రాండ్లతో మార్కెట్లో నల్లేరును ప్రవేశపెట్టారు.
శాస్ర్తియ పరిశోధక అంశాలు పుష్కలంగా వుండటంతో అనతికాలంలోనే ప్రసిద్ధమైనాయి. సమతౌల్యంలేని ఆస్టియో క్లాస్టులు (ఎముకల శైథిల్యానికి కారణమయిన కణాలు) ఆస్టియో బ్లాస్టులు (ఎముకల తయారీకి కారణమయిన కణాలు) ఆస్టియో పోరోసిస్ అనే వ్యాధికి కారణమవుతాయి. ఇది ఎక్కువగా మెనోపాజ్ స్ర్తిలలో ఋతుక్రమం ఆగిపోవడం సమయంలో
కాల్షియం తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ లోపం కూడా తోడవడం ఆస్టియో పోరోసిస్ ఉపద్రవం అధికమవుతుంది. ఈ నల్లేరులో వుండే పోషక ఎనబాలిక్ గుణంవలన నల్లేరు వాడకం ఆస్టియో
పోరోసిస్‌ను నివారించవచ్చు.

ఎటువంటి దుష్ఫలితాలు దీనిలో లేవని పరిశోధకులు వెల్లడించారు. ‘లాక్షాదిగుగ్గులు’ ప్రసిద్ధమైన మందు. దీనిలో ముఖ్యమయిన ఓషధి వజ్రవల్లీ (నల్లేరు), నొప్పిని తగ్గించి, వాపును
తగ్గించే చాలా సాధారణ ఔషధం. ఎముకలకు మిత్రుడైన నల్లేరును మీ ఇంటికి ఆహ్వానించండి.

చిన్న పిల్లలలో సెరిబ్రల్ పాల్సీతో మెడ నిలపలేనప్పుడు నల్లేరు, వివిధ మూలికల మిశ్రమం మెడకు లేపనంగా వాడితే మంచి ఉపయోగం. అదేవిధంగా వెన్ను వంకరకు ఈ లేపనంతో వెన్ను
దృఢంగా ఉంటుంది.

- డాక్టర్ డి. శ్రీరామమూర్తి B.A.M.S

drmurthy9@ya hoo.com

Phone: 040- 23741020, 9885297983

వెన్నెముక అరిగినపుడు…

నడుము భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల ఏర్పడటంవల్ల నడుము నొప్పి వస్తుంది. దీనిని ఒక యంత్రంలోపల సంభవించే అరుగుదలతో పోల్చవచ్చు. డిస్కులు శిథిలమవటం మొదలై వర్టిబ్రే మధ్య ఉండాల్సిన జాగా తగ్గుతున్నప్పుడు ఫ్యాసెట్ జాయింట్లు అరిగిపోయి ఈ తరహా నొప్పి మొదలవుతుంది. సాధారణంగా వెన్నును తిప్పుతూ లేదా వంచుతూ ఏదైనా పని చేసినప్పుడు ఈ రకం నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా నడుములో కేంద్రీకృతమైనప్పటికీ పిరుదులు, తొడలు, తుంటి భాగాల్లో కూడా నొప్పిగా అనిపించవచ్చు. ఈ తరహా నొప్పి మోకాళ్ళకు మీంచి కిందకు ప్రసరించదు. అలాగే దీనిలో నరంమీద ఒత్తిడి పడదు. కనుక, పాదాల్లో తిమ్మిరిగాని, కాళ్ళు బలహీనపడటం గాని జరగదు.

నరాలకు సంబంధించిన న్యూరోజెనిక్ నొప్పి నరం ఇరుక్కుపోవటంవల్ల వస్తుంది. వెన్నునుంచి బయటకు వచ్చే నరాల్లో వాపు ఏర్పడినా, ఒరుసుకుపోయినా, లేదా నలిగినా ఈ తరహా నొప్పి వస్తుంది. ఒక్కోసారి నరాలమీద ఏ రకమైన ఒత్తిడీ లేకపోయినప్పటికీ డిస్కులో పగుళ్ళు ఏర్పడినప్పుడు విడుదలైన రసాయనాలు నరాలను రేగేలా చేసి నొప్పికి కారణమవుతుంటాయి. జాయింట్లు అరిగిపోవడంవల్ల ఏర్పడే మెకానికల్ నొప్పి కంటే నరాలు నలిగినప్పుడు ఉత్పన్నమయ్యే న్యూరోజెనిక్ నొప్పి ప్రమాదకరమైనది. ఈ రకం నొప్పిలో నడుమునొప్పి అంతగా ఉండదు. అయితే నరం ప్రయాణించినంత మేరా లక్షణాలు కనిపిస్తాయి. నరంమీద పడే ఒత్తిడికి కండరాలు ప్రభావితమవటం దీనికి కారణం. దీనివల్ల కండరాలు బలహీన పడటమే కాకుండా ప్రతిచర్యలు ఆలస్యమవుతాయి. నరం ప్రయాణించే మార్గంలో సూదులు గుచ్చినట్లు నొప్పి, మంట, తిమ్మిరి, స్పర్శహాని వంటివి కనిపిస్తాయి. కాళ్ళు బలహీనపడి పక్షవాతం కూడా సంభవించవచ్చు.

వెన్నునొప్పి సంభవించే తీరు

వెన్నెముకలు అరిగిపోయి శిథిలమవటంవల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడి నడుమునొప్పి వస్తుంది. అవి: -

(1) డిస్క్ అంచులో పగుళ్ళు ఏర్పడంవల్ల

(2) డిస్క్ శుష్కించిపోవడం (ఇంటర్నల్ డిస్క్ డిస్ప్రప్షన్) వల్ల

(3) డిస్క్ మధ్య భాగం వెలుపలకు చొచ్చుకు రావడంవల్ల

(4) ఫ్యాసెట్ జాయింట్లు వ్యాధి గ్రస్థమై అరిగిపోవడంవల్ల

(5) వెన్నెముకలు ముందుకు జారటంవల్ల

(6) వెన్నెముక లోపలి నాళం మూసుకుపోవడంవల్ల.

ఇంకా… ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవటంవల్ల, వాహనాలు సరిగ్గా నడపకపోవడంవల్ల, అలవికాని బరువులను లేపడంవల్ల, ముందుకు వంగొని పని చేయడంవల్ల. సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యాయామాలు (జనరల్ ఎక్సర్ సైజులు)

గృహ చికిత్సలు:

(1) శొంటి కషాయానికి (అరకప్పు) ఆముదాన్ని (రెండు చెంచాలు) కలిపి రెండుపూటలా వారం లేదా పది రోజులపాటు తీసుకోవాలి.

(2) వావిలి ఆకు కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా పుచ్చుకోవాలి.

(3) పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకు అరకప్పు చొప్పున మూడుపూటలా తీసుకోవాలి.

ఆయుర్వేద చికిత్స

నడుమునొప్పిని ఆయుర్వేదంలో కటిశూల అంటారు. ఇదొక వాత ప్రధాన వ్యాధి. దీనికి స్నేహనం, స్వేదనం, అగ్నిదీపనం, వస్తకర్మ, వేదనాశ్యామక, వాతనాశిక అనేవి ఔషధాలు.

- డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్

muralimanoharch@hotmail.com

వెన్నెముక సమస్యలు.. చికిత్స

సాధారణంగా ఉండే వెన్నెముక వెన్నుపాము 33 వెన్నుపూసలు, ఎముకగూడ ఖండరాలతో నిర్మించబడి ఉంటుంది.ఇవి ఒక దాని మరొకటి నిలువుగా పేర్చబడినట్లుంటాయి. వాటికి ఆధారంగా కండరాలు, అస్థిపంజరాలు ఉంటాయి. ప్రతి వెన్నుపూస మధ్య బిళ్లలు మెత్తగా ఉంటూ పనిచేస్తాయి. వెన్నుపూస పనేమిటంటే మొండెంకు స్థిరత్వాన్ని కదిలే గుణాన్ని కల్గించడమేకాకుండా వెన్నుపాములో ఉండే సున్నితమైన నరాలను కాపాడడం.ఇటువంటి వెన్నెముకలో పలు సమస్యలు ఎదురవుతాయి.

వెన్నుముక నాలుగు భాగాలుగా విభజించబడింది. మెడభాగం, ఛాతిభాగం, వీపులో కొద్దిభాగం, వెన్నుమూకలో క్రిందభాగం. వెనుకనుంచి నేరుగా వీపును చూసినపుడు వెన్నెముక నిలువగా భుజాలకు సమానంగానూ, తుంటెలు చదునుగానూ కనిపిస్తుంది. మోచేతులు, శరీరం మధ్యదూరం సమానంగా అగుపిస్తుంది. వెన్నె ముకకు లోపలి నుంచి చూస్తే భుజాలు, క్రింది భాగాలు సహజస్థిరమైన ఒంపులు కనిపిస్తాయి. వీపునుంచి చూడవచ్చును. భుజపత్రభాగాలు ప్రతి ప్రక్కవైపు అదే స్థాయిలో ముందుకు పొడుచుకుని ఉంటాయి. వెన్నెముక ప్రతి వైపున సౌష్టవయుతంగా కనిపిస్తాయి.

స్క్రీనింగ్‌విధానం

కూర్చున్నా లేదా నిలుచున్న స్థితిలో ఎగ్జామినర్‌ స్క్రీనింగ్‌ నిర్విహస్తారు.విద్యార్థి ఎక్కడ నిలుచుండాలో తెలిపేందుకు ఫ్లోర్‌పైన ఎగ్జామినర్‌ గుర్తును ఉంచుతారు. ఎగ్జామినర్‌ విద్యార్థి మధ్య 5 నుండి 8 అడుగుల దూరం సిఫార్సు చేస్తారు. విద్యార్థులు చొక్కాలను తొలగించితే తద్వారా స్క్రీనర్‌కు వారి శరీర పైభాగం చక్కగా కనిపిస్తుంది.

ఆడపిల్లలు బాతింగ్‌ సూట్‌ టాప్‌, స్పోర్ట్స్‌ బ్రా లేదా సరైనట్టి ఇతర క్లాతింగ్‌ ఐటమ్‌ను ధరించాలి. షార్ట్‌ ధరించే విద్యార్థులు కూడా వీపు, తుంటిభాగాలు, కాళ్లు చక్కగా అగుపించేట్లు ధరించాలి. ఈ మాన్యువల్‌లో వివరించిన చిత్రాలలో అండర్‌ వేర్‌ ధరించిన విద్యార్థిని చూడవచ్చును.లోదుస్తులు ధరించిన విద్యార్థులు స్క్రీన్‌ చేయబడరు.

స్క్రీనింగ్‌ కోసం కావాలసిన విధంగా విద్యార్థి దుస్తులు ధరించకపోతే సరైన క్లాతింగ్‌ ఏర్పాటు చేయకపోతే. అతను లేదా ఆమె స్క్రీనింగ్‌ రీ షెడ్యూల్‌ చేసుకోవాలి. విద్యార్థి వీటితో ప్రారంభించబడతాడు.పాదాలు, మోకాళ్లు రెండూ పక్కపక్కన పెట్టి అతను లేదా ఆమె తమ చేతులను కూడా వదులుగా వేళ్లాడదీసి ఎగ్జామినర్‌ ఎదురుగా నిలబడాలి.

దిగువ వాటిని అనుసరించాలి.పరీక్షకు కావలసిన పొజిషన్స్‌లో విద్యార్థి నిలుచుని ఉండం విద్యార్థికి చాలా ముఖ్యం. తల తిప్పినట్లైతే, కనుగొనే అంశాలలో మార్పు వస్తుంది. విద్యార్థి వెనుక భాగం పూర్తిగా కనిపించేందుకు పొడవాటి జుట్టును ముందుకు వాల్చుకోవాలి.

తర్వాత స్థితి ఆదర్మ్స్‌ ఫార్వర్డ్‌ – బెండింగ్‌ టెస్ట్‌

పాదాలు, మోకాళ్ళు దగ్గర ఉంచి విద్యార్థి నిటారుగా నిలుచుని ఉండాలి రెండు చేతులు అరచేతులను కలుపుతూ నడుము అడ్డంగా వచ్చేంత వరకు వంగాలి.

వికృతంగా వెన్నెముక వక్రత

వెన్నెముక పరీక్ష రెండు ప్రధాన వెన్నెముక వైకల్యాలు కనుగొనేలా రూపొందించబడినది. రెండు రకాల వెన్నెముక వైకల్యాలు పార్శ్వగూని, గూనితనం.

పార్శ్వగూని

పార్శ్వగూని అంటూ వెన్నెముక 10 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ అసాధారణ రీతిలో పక్కకి వక్రత కలిగి ఉండటం. ఇది వెన్నుపూస ను ఒక పక్క నుంచి మరో పక్కకి కదిలేలా చేస్తుంది. ఎస్‌ ఆకారపు వంపు వెనుకనుంచి కనిపిస్తుంది. కొన్ని సంర్భాలో తక్కువ సమయంలోనే ముదిరిపోతుంది. దాని ఫలితంగా కనిపించకపోవడం, తరచు వెన్నుపోటు రావడం వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయి. బాగా ముదిరిన సంద ర్భాలలో గుండె, ఊపిరి తిత్తుల పనికి అవరోధం కలుగుతుంది. పార్వ్శ గూని నిర్మాణాత్మక మైనవి, నిర్వాహకమైనవిగా విభజించబడతాయి.

వంపుల పార్శ్వగూని

వంపులున్న కారణంగా స్థిరకంగా అతుక్కుపోయిన వెన్నుపూసలోని నిర్మాణాలలో మార్పులు వస్తాయి. నిర్మాణాత్మక వంపులు వాటి కలిపి వున్న వెన్నెముకకు సంబంధించిన మెలి ద్వారా నిర్వాహక వంపులనుంచి వేరు చేయవచ్చును. విద్యార్థులు ముందుకు వంగినప్పుడు మెలిపడిన ఫలితాలు పక్కటెముక గదుల్లో ఒకవైపు మూపురంలో కనిపిస్తాయి. భంగిమలో తేడావుంటే ఈ వంపులను తిన్నగా నిలబడటానికి అధ్యయనం ద్వారా తెలుసుకోలేం.

నిర్వాహక పార్శ్వగూని

ఈ రకపు పార్శ్వగూని వెన్నెముక ఆకారంలోగానీ లేదా నిర్మాణంలోగానీ శాశ్వత మార్పులు ఉండవు. నిర్వాహక పార్శ్వగూని సాధారణంగా తుంటిలో మరో వైకల్యతకు రెండవది వృద్ధిచేయవచ్చును. లేదా తీవ్రత కొద్దిగా ఉండవచ్చును. నిర్వాహక పార్శ్వగూనిలో దాదాపు సాధారణ కారణం విద్యార్థులు సమానంగా నిలబడకుండా చేసే కాళ్ల పొడ వులో తేడా వుండటమే. సమానంగా లేని కాలు పొడవును కొయ్య పలక మీద ఒక కాలుతో నిలబడగలిగి ఉండటం ద్వారా గుర్తించవచ్చును. తుంటిలతో అప్పుడు అదే స్థాయిలో వెన్నెముక తిన్నగా కనిపిస్తుంది.

పార్శ్వ గూని సంఘటన

నిర్మాణాత్మక పార్శ్వగూని విషయాలన్నిటిలో ఎనభై అయిదు శాతానికి కారణాలు తెలియవు. వాటిని కారణం తెలియని పార్శ్వగూనిలుగా పేర్కొంటారు. కారణాలు తెలియని గూని పెద్దలలో రెండు నుంచి మూడు శాతం సంభవిస్తాయి. ఇది సాధారణంగా 10 నుంచి 16 సంవత్సరాలు వయసుగల వారికి వస్తుంది. బాలికలకు కౌమారదశ బాలుర కంటే ముందుకు వస్తుంది కనుగ లింగ బేధాన్ని బట్టి కలుగుతుంది. శీఘ్రగతిన వృద్ధి చెందే వెన్నెముక అభివృద్ధి బాలికలకు 10 నుంచి 14 సంవత్సరాల వరకు, బాలురకు 12 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది.

బాలికల్లో..

బాలికల్లో వంపు పెరగడం సర్వసాధారణం. పెద్ద వంపులు తరచు సంభవిస్తాయి. విద్యార్థులలో పార్శ్వగూని సంఘటనకు దోహదపడేది వారి కుటుంబంలో పార్శ్వగూని చరిత్ర ఉండటం. కారణాలు లేని పార్శ్వగూనికి తారతమ్యతను పరీక్షించి చూస్తే, తెలిసిన కారణాలు ఉన్న పలుతక్కువ పార్శ్వగూని రకాలు వున్నాయి. ఈ వంపులు పుట్టుకతోనే రావచ్చు లేదా కండరాల అస్వస్థత వల్ల రావచ్చును.ఇవి పాఠశాల పరీక్షల వల్ల తేలేదికాదు. ఎందుకంటే అవి జీవితంలో ముందుగానే వచ్చి ఉంటాయి. కారణాలు లేని పార్శ్వగూని విషయంలో, తొలిదశలో వంపును గుర్తిస్తే తీవ్రం కాకుండా చేయవచ్చును.

ఉదాహరణకు పుష్పవతికాని బాలికకు బహిష్టు అయ్యే కౌమారయువతికన్నా లేదా యుక్తవయసు వచ్చినట్టు చిహ్నాలు అంటే చంకల్లో కేశాలు వృద్ధిచెందిన కౌమారబాలునికన్నా వంపులు వృద్ధి చెందే ప్రమాదం ఎక్కువ. కారణాలు తెలియని పార్శ్వగూని రూపాన్ని ఏర్పరిచే సంవత్సరాలలో తరచుగా బాధగా వుంటుంది కనుక యువకులలో గుర్తించలేము. భుజం వేరొక దానికంటే పెద్దగా ఉంటుంది. ఒక షోల్డర్‌ బ్లేడ్‌ ఇంకొక దానికంటే ఎక్కువగా మరింత ఉన్నతంగా ఉంటుంది. ఒక తుంటి వేరొక దానికంటే పెద్దగా వుంటుంది.

గూని

గూనితనం లేదా ఎతె్తైన వీపును పక్కనుండి చూసినప్పుడు వక్ర సంబంధమైన వెన్నెముక చాలా పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ అవయవలోపాన్ని అది సరికాకపోతే వ్యాయామాలు, తగిన భంగిమ ద్వారా సరిచేయు వచ్చును. స్కూర్‌మాన్‌ నిపాసిస్‌గా పిలువబడే స్ట్రక్చరల్‌ టైప్‌ కర్వ్‌తో కొంత మంది యువతలో దీనిని అమర్చవచ్చును. ఇందులో వెన్నుపూస బలవంతంగా అమర్చడానికి వీలవుతుంది.

ఈ రకమైన అవయవలోపానికి గల కారణం తెలియదు. స్కూరోమన్‌ కెపాసిస్‌తో లేత వయసుగల వారి కోసం కట్టుకట్టడం లేదా సర్జరీ సిఫార్సు చేయవచ్చును. పక్కగూనికి సంబంధించి టీనేజర్స్‌ స్థిరమైన గూని చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ స్కూల్‌ సై్పనల్‌ స్క్రీనింగ్‌లో తరచుగా దీనిని గుర్తించవచ్చు.

- డాక్టర్‌ జి.పి.వి.సుబ్బయ్య,
గ్లోబల్‌ హాస్పిటల్‌

పరిమాణక్రమంలో వెన్ను నిర్మాణం

పరిణామక్రమంలో సకశేరుకాలైన వివిధ జంతువులు నాలుగు కాళ్లు కలిగి, వాటి వెన్నెముకలు, వెన్నుపూస భూమికి సమాంతరంగా ఉండేవి. మానవ పరిణామక్రమంలో మనిషి రెండు కాళ్లతో నడవడం మొదలుపెట్టాడు. మిగతా జంతువుల కన్నా తన చేతుల ద్వారా రాయడం, తద్వారా జ్ఞాన సముపార్జన పొంది ఎంతో అభివృద్ధి చెందాడు. క్రమంగా వెన్నెముకలు, వెన్నుపూస భూమికి లంబకోణ ముఖంలో మార్పు చెందింది.

తన దైనందిన కార్యక్రమంలో అన్ని పనులు ముందుకు వంగి చేసుకోవడానికి అలవాటు పడ్డాడు. పరిణామ క్రమంలో వెన్నుపూస ముందు భాగాన అంటే ఉదరభాగం మెడ ముందు భాగం, ఎదభాగంలోని కండలు బాగా అభివృద్ధి చెందాయి. వెనుక పక్కన అంటే వీపు, పైవీపులో కండలు బలహీనపడి నడుం బ్యాలెన్స్‌లో మార్పులు ఏర్పడ్డాయి. దీంతో వివిధ రకాల వెన్నుపూసలు, వెన్నెముకకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. వీటిని స్పాండైలోసిస్‌ అంటారు.

మనిషి వెన్నెముక మొత్తం 33 ఎముకల సమూహారం. ఈ ఎముకల మధ్య ఘర్షణ తగ్గడానికి ఏర్పడిన మృదువైన కణజాలమే డిస్క్‌. సాధారణంగా నడుం (లంబార్‌), మెడ (సర్వైకల్‌) ఎముకల్లో అరుగుదల మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ఇతర కీళ్లలోని ఆర్త్రైటీస్‌ కారణాలన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. వీటితోపాటు పడుకునే విధానంలోను, పనిచేయడంలో ఎక్కువగా వంగడం ద్వారా కూడా ఈ కీళ్లలో ఎక్కువగా మార్పులు వస్తుంటాయి. ఆర్రైటీస్‌లోని ఆయా కీళ్ల వద్ద నొప్పులు, ఇతర రోగ లక్షణాలు కనిపిస్తాయి. కానీ స్పాండైలోసిస్‌లో అరుగుదల మార్పులు ఏర్పడినప్పుడు డిస్క్‌లు వెనకకు జరిగి, మెదడు నుండి వెన్నుపూసల ద్వారా చేతులు, కాళ్ల దేహంలోని వివిధ ఇతర భాగాలకు వచ్చే స్పైనల్‌ నరాలు ఒత్తిడికి లోనై, వెన్నుముక, పూసల్లోనేకాక నరాల పొడవునా నొప్పి ఏర్పడుతుంది. దీన్నే న్యూరాల్జియా అంటాం. ఈ ప్రత్యేక లక్షణాన్ననుసరించి స్పాండైలోసిస్‌ వైద్యం వైవిద్యభరితంగా ఉంటుంది.

డాక్టర్ ‌ జె . భాను కిరణ్ ‌

ఆర్థొపెడిక్ ‌ సర్జన్ ‌ డాక్టర్ ‌ వెంకట రామప్ప హాస్పిటల్ ‌

సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ

బెంగళూరురోడ్డు , అనంతపురం .

ఫోన్ ‌ : 08854272881

ఆధారము: వైద్యం.ఇన్ఫో

3.02542372881
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు