অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గృహ వైద్యం

ఉసిరితో ఎన్నో ఉపయోగాలు

ఉసిరికాయ పెచ్చుల పొడి, పిల్లిపీచర గడ్డల పొడి (శతావరి), పంచదార, తేనె ఈ నాలుగింటినీ సమాన భాగాలు కలిపి పాలు లేదా నెయ్యితో తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. దీనిని చతుస్సమ కల్పం అంటారు.

* ఉసిరి పండ్ల రసాన్ని నీళ్లతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే వాయువు బంధించబడి, పైవైపుకదలటం వల్ల వచ్చిన కడుపు నొప్పి తగ్గుతుంది.
* ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే ఆమ్లపిత్తం వల్ల వచ్చే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. లేదా ఉసిరిపండ్ల రసానికి ద్రాక్ష పండ్ల గుజ్జును, పంచదారను కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.
* ఉసిరి పండ్ల పొడికి లోహ భస్మం, అతి మధురం పొడిని కలిపి తేనె అనుపానంగా తీసుకుంటే ఆహారం జీర్ణమయ్యే సమయంలో వచ్చే పరిణామశూల తగ్గుతుంది.
* ఉసిరిపొడికి వేపాకు పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటూ ఉంటే దీర్ఘకాలం నుంచి బాధించే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* ఉసిరిపండ్ల పెచ్చులు, చండ్ర చెక్కలను నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి, బావంచాలు గింజల పొడిని కలిపి తీసుకుంటే తెల్లమచ్చలు త్వరితగతిన తగ్గుతాయి.
* ఉసిరిపెచ్చులు, పసుపు దుంపలను నీళ్లకు వేసి మరిగించి కషాయం తయారుచేసి తేనె కలిపి తీసుకుంటే వాతరక్తం తగ్గుతుంది.
* ఉసిరిపండ్ల రసానికి నెయ్యి కలిపి తీసుకుంటే చర్మం మీద తయారైన చీము పొక్కులు తగ్గుతాయి. మలబద్ధకం ఉంటే తెల్లతెగడ వేరు బెరడు పొడిని కలిపి తీసుకోవాలి.
* ఉసిరిపండ్ల పెచ్చుల పొడిని చన్నీళ్లతో కలిపి బాహ్యంగా ప్రయోగించటంతోపాటు అభ్యంతరంగా కూడా తీసుకుంటే చర్మం పైన వేగంగా వ్యాపించే శోధ తగ్గుతుంది.
* ఉసిరిపండ్ల పెచ్చులను, ఇప్పపువ్వులను (మధూకం) నీళ్లకు కలిపి మరిగించి, తేనె కలిపి బాగా పుక్కిట పడితే నోటిలోనూ, గొంతులోనూ తయారైన పూత, నోటి పుండ్లు తగ్గుతాయి.
* లేత ఉసిరి పండ్లను ఎంచుకొని తెచ్చి, గోమూత్రంలో వారంపాటు ఊరబెట్టి, మేకపాలతో కలిపి మెత్తని పేస్టు మాదిరిగా నూరి, ముఖ చర్మం మీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే మంగు మచ్చలు తగ్గుతాయి.
* ఉసిరిపండ్లు, మండూర భస్మం, మందార పువ్వులను మెత్తని ముద్దగా నూరి, తలస్నానానికి ముందు జుట్టుకు ప్రయోగిస్తే జుట్టు తెల్లబడటం ఆగిపోతుంది.
* ఉసిరి పెచ్చులు, పసుపుకొమ్ములను ముద్దగా నూరి తీసుకుంటే ప్రమేహంలో అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. మధుమేహం లేనివారు తేనె కలిపి తీసుకోవచ్చు.
* ఉసిరిపెచ్చులు, కరకపిందెలు, తానికాయ, తుంగముస్తలు, మానుపసుపు, దేవదారు చేవలను సమాన మాత్రలో తీసుకొని, 10 గ్రాముల మిశ్రమాన్ని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి, 10-20 మిల్లీలీటర్ల మోతాదులో ఉదయ సాయంకాలాలు తీసుకుంటే ప్రమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
* ఉసిరి రసాన్ని 160 మిల్లీలీటర్ల మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి.
* ఉసిరి రసానికి ఏలక్కాయ పొడిని కలిపి తీసుకుంటే మూత్ర పరిమాణం పెరుగుతుంది.
* ఉసిరి రసంలో బెల్లం కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో నొప్పి తగ్గటంతోపాటు రక్తస్రావం, మంటలు, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

-డా.చిరుమామిళ్ల మురళీమనోహర్

నిమ్మరసంతో నిండైన ఆరోగ్యం

వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ, అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం, చికెన్‌ మటన్‌ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్‌ కోసం నిమ్మకాయ వాడడం జరుగుతుంటుంది.

నిమ్మకాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మరసంలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ వుంటుంది. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇక విటమిన్లూ వంటివాటి విషయానికొస్తే, విటమిన్‌ సి, విటమిన్‌ బి, కాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేడ్స్‌ నిమ్మకాయలో పుష్కలంగా ఉంచేందుకు దోహదపడుతాయి. నిమ్మరసంతో మేని నిగారింపుతోపాటు, సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేలా వివిధ రకాలైన ఉపయోగాలున్నాయి.

అజీర్ణంతో బాధపడేవారెవరైనసరే, కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు. గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటివాటికి నిమ్మరసం దివ్యౌషధం, నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాస్సేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే, శరీరంలో నిగారింపు వస్తుంది.

వయసు మీద వడుతుండడం వల్లే వచ్చే చర్మ ముడతపడి పోవడాన్ని నిమ్మకాయ రసం కొంత వరకు నిరోధిస్తుంది. బ్లాక్‌ హెడ్స్‌ వంటివాటిని నివారిస్తుంది నిమ్మరసం.ఎవరైనాసరే, పన్ను నొప్పితో బాధ పడుతుంటే, కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టిన చోట పెడితే వారికి ఉపశమనం లభిస్తుంది. పళ్ల నుంచి రక్తం కారుతున్న, నోటినుంచి దుర్వా సన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది.

అంతేకాదు గొంతులో తరచూ తలెత్తే ఇబ్బందుల నుంచి నిమ్మరసంతో విముక్తి పొందవచ్చు. నిమ్మరసం, నీరు కలిపి పుక్కిళీస్తుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటివి ఇబ్బంది పెట్టవు.

నిమ్మరసంతో చేసే నింబూ పానీలో ఎక్కువగా వుండే పొటాషియం రక్తపోటు అంటే, బీపిని అదుపులో ఉంచుతుంది. నీరసం, మగతగా వుండడం, ఒత్తిడికి పనిచేస్తుంది నింబు పానీ. శ్వాశ కోశ ఇబ్బందులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. ఆ విషయాన్నీ డాక్టర్లూ అంగీకరిస్తారు.

చర్మపు ముడతలకు నివారణ

వయసుతో చర్మపు ముడతలు వస్తాయి. కొంత మందిలో చిన్న వయస్సులో ముడతలు రావడం కనిపిస్తుంది. అటువంటి ముడతల సమస్య తలెత్తకుండా వుండేందుకు ఈ చిట్కాలు పాటించండి.

ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోని తడుచుకున్న తర్వాత నాలుగు చుక్కల నిమ్మరసం ముఖానికి రాసి అరగంట ఆగి ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. 15 నుండి 20 రోజులు ఇలా చేయాలి.

ఆలివ్‌ ఆయిల్‌ ని ముఖచర్మం మీద నెమ్మదిగా మర్ధన చేయాలి.

చల్లటి నీళ్ళతో ముఖం కుడƒక్కున్నప్పుడు వెంటనే టవల్‌తో తడుచుకోకుండా అలాగే ఆరనిస్తే చర్మం కొంత మేర తేమను పీల్చుకుంటుంది. చర్మానికి తాజాదనాన్ని ఇస్తుంది.

క్యారట్‌ రసం తాగడం మంచిది.

పండిన బొప్పాయి గుజ్జును మెడ, ముఖం మీద రుద్దుకుంటే చర్మానికి మంచి రంగునిస్తుంది.

కళ్ళమీద,నుదుటిమీద దోసకాయ ముక్కలను రోజూ పెట్టుకోవాలి పదిహేను రోజులు అలాచేస్తే ముడతల సమస్య తగ్గుతుం

పులిపిర్లు ఇబ్బంది పెడుతుంటే…

పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వందమందిలోనూ కనీసం 10-15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరికాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. పులిపిరులకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్). ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి.

పులిపిరులను చికిత్స చేయడానికి మామూలుగా లేఖనం (స్క్రేపింగ్), దహనం (బర్నింగ్), ఛేదనం (కటింగ్), ఫ్రీజింగ్ మొదలైన చికిత్సా పద్ధతులను వాడుతుంటారు. ఐతే ఈ పద్ధతులు పులిపిరుల పునరావృతాన్ని నిరోధించలేవు. పైగా ఈ చికిత్సా పద్ధతులవలన ఏర్పడిన మచ్చలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకే వీటి చికిత్స కంటే శాశ్వతనివారణ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పులిపిరులకు సంబంధించి ఆయుర్వేద గృహ చికిత్సలను, నివారణ పద్ధతులనూ సంక్షిప్తంగా తెలుసుకుందాం.

పులిపిరులను ఆయుర్వేదంలో ‘చర్మకీల’ అంటారు. వీటికి సంబంధించిన వివరణలు ఆయుర్వేద సంహితా గ్రంథాల్లో క్షుద్రవ్యాధులు వివరించే అధ్యాయాల్లో లభిస్తాయి. క్షుద్రవ్యాధులు అంటే అల్పమైన లక్షణాలు, పురోగతి, తీవ్రతలు కలిగిన వ్యాధులని అర్ధం. పులిపిరులు చాలావరకూ ‘స్వయం అంతాలు’గా ఉంటాయి. అంటే చాలామటుకు ఏ చికిత్సా తీసుకోకపోయినప్పటికీ వాటంతట అవే సమసిపోతాయన్నమాట. అయితే కొంతమందిలో మాత్రం వాటంతట అవి తగ్గవు. పైగా పులిపిరులు నిరంతరమూ సాంక్రామిక లక్షణాలు కలిగిన వైరస్‌లను విడుదల చేస్తుండటం వలన వీటి సంఖ్య, పరిమాణాలు పెరిగే అవకాశముంది. ఇలాంటి సందర్భాలలో చికిత్స తీసుకోవాలి. పులిపిర్లను కలిగించే వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించిన తరువాత లక్షణాలను కలిగించటానికి 1-8 నెలలు పట్టవచ్చు.
పులిపిర్లను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. కామన్ వార్ట్స్ (చేతివేళ్ళ చుట్టూ వస్తాయి), ప్లాంటార్ వార్ట్స్ (పాదాల మీద వస్తాయి), ఫ్లాట్ వార్ట్స్ (ముఖంమీద, మెడమీద వస్తాయి), జననాంగాలమీద వచ్చేవి జనైటల్ వార్ట్స్. అవి వేరే కోవకు చెందుతాయి.

సూచనలు

చర్మం తేమగా ఉంటే పులిపిర్లను కలిగించే వైరస్‌లు పెరగటానికి, జీవించి ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చర్మాన్ని, ముఖ్యంగా పాదాలను, చేతులను, మెడను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. చెమటతో తడిసిన సాక్సులను, దస్తీలను ప్రతిరోజూ మార్చి వాడాలి. వాడబోయే ముందు వీటిని తడి ఆరిపోయేలా ఎండలో బాగా ఆరబెట్టాలి.
పులిపిరులను కలిగించే వైరస్‌లు గాయమైన చర్మం నుంచి శరీరంలోకి తేలికగా ప్రవేశిస్తాయి కనుక గాయాలూ, దెబ్బలూ కాకుండా చూసుకోవాలి. కరచాలనం వంటి అలవాట్లు మానుకోవాలి. పులిపిరులు ఏర్పడిన చర్మాన్ని పదేపదే స్పర్శించకూడదు.

పులిపిరి వచ్చిన చోట వాటర్ ఫ్రూఫ్ స్టిక్కింగ్ టేప్‌ని రెండు మూడు పొరలుగా అతికించాలి. ఆరున్నర రోజులు అలాగే ఉంచి టేప్ తొలగించాలి. 12 గంటలపాటు గాలిని తగలనిచ్చి మళ్లీ ఆరున్నర రోజులపాటు టేప్‌ని అతికించాలి. దీంతో వార్ట్స్ శుష్కించిపోయి ఊడి వచ్చేస్తాయి. టేప్ కారణంగా గాలిచొరబడని వాతావరణం ఏర్పడటంవల్ల వైరస్ నశిస్తుంది.

గృహ చికిత్సలు

వెల్లుల్లి రేకలను పులిపిరులపైన రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణంవల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి.

ఉల్లిపాయను సగానికి కోసం మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజులపాటు పులిపిరులపైన ప్రయోగిస్తుంటే గుణం కనిపిస్తుంది.

పులిపిరులకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతోగానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన ప్రయోగించాలి.

కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుప్రక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి.
రావిపట్టను కాల్చి మసిచేసి సమంగా కొత్త సున్నం, వెన్న కలిపి పైకి పూయాలి. లేదా కొత్త సున్నాన్ని తమలపాకు రసంతో సహా కలిపి నూరి పులిపిరులపైన పూయాలి.

పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్-ఎ, విటమిన్-సిలను పైపూతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది. చేపనూనె, క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్ ఎకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉసిరికాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని నలగ్గొట్టి గుజ్జుగా చేసి ఒకటి రెండు నెలలపాటు ప్రతిరోజూ పులిపిర్లమీద పూతగా లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

పులిపిరులు మొండిగా తయారై ఇబ్బంది కలిగిస్తుంటే వైద్య సలహా మేరకు కాశీసాది తైలాన్ని పైపూతకు, వాతారి గుగ్గులు అనే మందులను లోపలకూ నిర్ణీత కాలంపాటు వాడాలి.

డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్
murali manoharch@hotmail.com
రక్ష ఆయుర్వేదిక్ సెంటర్,
స్టేట్‌హోం ఎదుట సారథీ స్టూడియోరోడ్,
అమీర్‌పేట, హైదరాబాద్-73

ఆధారము: వైద్యం.ఇన్ఫో

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate