హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / క్రొవ్వులో కరిగే విటమినులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

క్రొవ్వులో కరిగే విటమినులు

క్రొవ్వులో కరిగే విటమినులు

పరిచయం

విటమినులు ప్రధాన పోషకాలైన పిండి పధార్థాలు, మాంసకృత్తులు మరియు క్రొవ్వు లాగా శరీరానికి శక్తిని అందించలేవు. కాని శరీరంలో జరిగే పోషకాల జీవ రసాయనిక క్రియలు, హార్మోనుల నియంత్రణలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి.
శరీర ఆరోగ్య పరిరక్షణకు విటమినులు అతి సూక్ష్మ పరిమాణంలో అవసరమవుతాయి. అందువలన వీటిని సూక్ష్మ పోషకాలు అని కూడా వ్యవహరిస్తారు. ప్రతి రోజు తీసుకునే బోజనంలో విటమినులు అధికంగా గల ఆహార పధార్థాలు చేర్చడం ఆరోగ్యానికి అత్యంత అవసరం.
విటమినుల స్వభావాన్ని బట్టి వాటిని రెండు వర్గాలుగా వ్యవహరిస్తారు.

క్రొవ్వులో కరిగేవి


పైన పేర్కొన్న విటమిన్ లు క్రొవ్వులో కరిగే గుణాన్ని కలిగి ఉంటాయి. క్రొవ్వును మాధ్యమంగా మాత్రమే వాడుకొని జీర్ణమై, శోషించబడి, శరీరంలో నిల్వ ఉంటాయి. అందుకే ఈ విటమినులను క్రొవ్వులో కరిగే విటమినులు అని వర్గీకరించారు.
ఈ వర్గానికి చెందిన విటమినులు శరీర అవసరానికి మించి తీసుకుంటే, అవసరాలకు వాడుకోగా మిగిలిన పరిమాణం శరీరంలో నిల్వ ఉండి, అత్యవసర సమయంలో శరీరానికి ఉపయోగపడతాయి.

నీటిలో కరిగేవి

  1. థయమిన్
  2. రైబోఫ్లెవిన్
  3. నియాసిన్
  4. పిరిడాక్సిన్
  5. ఫోలిక్ యాసిడ్
  6. విటమిన్ బి12
  7. ఆస్కార్బిక్ యాసిడ్ లేదా విటమిన్ ‘ సి'
ఇవి నీటిలో కరిగే గుణాన్ని కలిగి ఉంటాయి. నీటి మాధ్యమంగా వాడుకొని శరీరంలోనికి గ్రహింపబడి జీవ రసాయనిక క్రియలలో ఉపయోగపడతాయి. కాబట్టి పై విటమినులను " నీటిలో కరిగే విటమినులు " అని వర్గీకరించారు. వీటిని అధిక మొత్తంలో ఆహారం నుండి పొందినట్లయితే, శరీరం అవసరానికి తగినంత వినియోగించుకుని మిగిలినది మూత్రం ద్వారా విసర్జిచబడుతుంది.

విటమిన్ 'ఎ '


విటమిన్ 'ఎ ' అత్యంత ప్రాముఖ్యత కలిగిన పోషకము. రసాయనికంగా ఇది అసంతృప్త సేంద్రీయ వర్గానికి చెందిన నిర్మాణం కలిగిఉంటుంది. విటమిన్ 'ఎ ' క్రొవ్వు మాధ్యమంగా శరీరంలోనికి గ్రహింపబడి వివిధ జీవరసాయనిక క్రియలలో పాల్గొంటుంది. విటమిన్ 'ఎ ' రెటినొల్, రెటినాల్, రెటినోయిక్ యాసిడ్, బీటా కెరోటిన్ అనే వివిధ రూపాలలో ఉంటుంది.

చరిత్ర

1816 సంవత్సరంలో ఫ్రాంకోయిస్ మెగెండీ కుక్కలలో కంటి నల్ల గుడ్డులో పుండు(అల్సర్) ఉండడం, అధికంగా మరణాలు చోటు చేసుకోవడం ఒక పోషక లోపంగా భావించారు. 1912 సంవత్సరంలో ఎలుకల పెరుగుదలకు పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు క్రొవ్వు కాకుండా తెలియని అంశమేదో కారణమవుతుందని ప్రయోగాత్మకంగా తెలియజేసారు. ఈ ప్రయోగానికై ఫ్రెడ్రిక్ గార్లాండ్ హాప్కిన్స్ 1929 సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారు.
తర్వాతి కాలంలో 1917 లో ఎల్మెర్ మెక్ కల్లం, థామస్ బర్ ఓస్బార్న్, హార్రీ స్టీన్ బాక్(1919) చేసిన అనేక పరిశోధనల ఆధారంగా విటమిన్ 'ఎ ' దాని రసాయనిక నిర్మాణం(పాల్ కర్రర్) కనుగొన్నారు. 1947వ సంవత్సరంలో డచ్ శాస్త్రజ్ఞులు (డేవిడ్ అడ్రియాన్ డార్ప్ & జోసఫ్ ఫెర్డినాండ్ ఎరెన్స్) విటమిన్ 'ఎ ' ని కృత్రిమంగా రూపొందించారు.

విటమిన్ 'ఎ ' వల్ల కలిగే బహుళ ప్రయోజనాలు


1. కంటి చూపు: రెటినాల్ రూపంలో ఉన్న విటమిన్ 'ఎ ' కంటిలో రొడాప్సిన్ అనే ధాతువు తయారవడానికి ఉపకరిస్తుంది. ఈ రొడాప్సిన్ ఆధారంగానే తక్కువ వెలుతురులో, రాత్రివేళల్లో కంటి చూపు తగిన స్థాయిలో ఉండటానికి దోహదపడుతుంది. విటమిన్ ఎ లోపం ఉన్నపుడు రొడాప్సిన్ నిర్మాణం జరగక రేచీకటి అనే అనారోగ్య పరిస్థితి కలుగుతుంది.
2. జన్యు తర్జుమా: రెటినోయిక్ ఆమ్ల రూపంలోని విటమిన్ ఎ జన్యు తర్జుమా డి ఎన్ ఎ కు సహకరిస్తుంది.
3. చర్మ వ్యవస్థ: రెటినోయిక్ ఆమ్లం జన్యు తర్జుమా లో తోడ్పడి చర్మ సహజత్వాన్ని కాపాడుతుంది. చర్మంలోని ఎఫిథీయలియల్ కణాల పెరుగుదలకు, ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
4. పెరుగుదల: శరీర పెరుగుదల, ఎముకల పెరుగుదల మరియు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఈ కారణంగా విటమిన్ ఎ ని పెరుగుదల విటమిన్ అని కూడా వ్యవహరిస్తారు.
5. వ్యాధి నిరోధక వ్యవస్థ పటిస్టీకరణకు విటమిన్ ఎ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. మీసిల్స్ అను వ్యాధి చిన్న పిల్లలలో రాకుండా విటమిన్ ఎ నిరోధకంగా పని చేస్తుంది.

విటమిన్ ఎ కలిగిన ఆహార పదార్థాలు


జంతు సంబంధ ఆహారంలో రెటినైల్ పామిటేట్ రూపంలో ఉండి అది శరీరంలోని చిన్న ప్రేగులలో రెటినోల్ గా పరివర్తన చెందుతుంది.
కాడ్ లివర్ నూనె, ఇంకా కోడి, పంది, టర్కీ, గొడ్డు మొదలగు వాటి కాలేయంలో ఎక్కువగా ఉంటుంది.
చేపలు, పాలు, గుడ్డు, జున్ను, వెన్న - వంటి ఆహార పదార్థాలు అధిక మోతాదులో విటమిన్ ఎ కలిగి ఉంటాయి.
వృక్ష సంబంధ ఆహారంలో బీట-కెరోటిన్ రూపంలో ఉండి ఇది శరీరంలో విటమిన్ ఎ గా రూపాంతరం చెందుతుంది. (ఈ కెరోటిన్ - ఆల్ఫా - కెరోటిన్, బీటా-కెరోటిన్, గామా-కెరోటిన్, క్జాంతోఫిల్, బీటా క్రిప్టో-క్జాంతోనిన్ మొదలగు రూపాలలో ఉంటుంది.
ఆకుకూరలు - పాల కూర, బచ్చలికూర, మునగాకు, బ్రోకోయిల్, లెట్యూస్
కూరగాయలు - క్యారెట్, గుమ్మడి, చిలకడ/గెనుసు గడ్డలు, టొమాటో
పండ్లు - బొప్పాయి, మామిడి, యాప్రికాట్, కర్బూజ, తర్బూజ

శరీరానికి కావలసిన మోతాదు

విటమిన్ ఎ ను ఇంటర్ నేషనల్ యూనిట్ లలో కొలుస్తారు.
ఒక ఇంటర్ నేషనల్ యూనిట్ = 0.3 మైక్రో గ్రాముల రెటినోల్
1 ఇంటర్ నేషనల్ యూనిట్ = 0.6 మైక్రో గ్రాముల బీటా కెరోటిన్

వ్యక్తిగత రోజుకు కావలసిన మోతాదులు

వర్గం

రోజుకు కావలసిన మోతాదు

(మై. గ్రా./ రోజుకు)

మోతాదు అధిక మొత్తము

(మై. గ్రా./ రోజుకు)

చంటి పిల్లలు

0 - 6 నెలలు

7 - 12 నెలలు

 

400

500

 

600

600

పిల్లలు

1 - 3 సంవత్సరాలు

4 - 8 సంవత్సరాలు

 

300

400

600

900

పురుషులు

9 - 13 సంవత్సరాలు

14 - 18 సంవత్సరాలు

19 - >70 సంవత్సరాలు

 

600

900

900

 

1700

2800

3000

స్త్రీలు

9 - 13 సంవత్సరాలు

14 - 18 సంవత్సరాలు

19 - >70 సంవత్సరాలు

 

600

700

700

 

1700

2800

3000

గర్భిణీలు

< 19 సంవత్సరాలు

19 - >50 సంవత్సరాలు

 

750

770

 

2800

3000

పాలిచ్చే తల్లులు

< 19 సంవత్సరాలు

19 - >50 సంవత్సరాలు

 

1200

1300

 

2800

3000

 

  1. రోజుకు అవసరమైన మోతాదుకంటే అధికంగా విటమిన్ 'ఎ ' ఆహారం ద్వారా తీసుకుంటే అది కాలేయంలో నిలువ ఉంటుంది.

  2. రెటినోల్ అసిటేట్ లేదా పామిటేట్ ఎస్టర్ రూపంలో విటమిన్ 'ఎ ' కృత్రిమంగా తయారుచేస్తున్నారు. ఇవి మందుల షాపులలో విటమిన్ 'ఎ ' గొట్టాల రూపంలో దొరుకుతాయి.

  3. మితం లేకుండా ప్రతిరోజూ అధిక మొత్తంలో విటమిన్ 'ఎ ' ని, ముఖ్యంగా కృత్రిమంగా లభ్యమయ్యే విటమిన్ 'ఎ ' తీసుకోవడం వల్ల విటమిన్ 'ఎ ' విష ప్రభావాన్ని చూపగలదు. ఈ విధంగా అధిక మోతాదులో కొన్ని నెలలు లేదా సంవత్సరాలు తీసుకుంటే "విటమిన్ 'ఎ ' హానికర పరిణామాలు" కలుగుతాయి. అయితే ఈ హానికర పరిణామాలు అరుదుగా గమనించవచ్చు.

అధిక మోతాదు, చాలా కాలం విటమిన్ 'ఎ ' తీసుకోవడం వల్ల మానవులలో కనిపించే కొన్ని విపరీత లక్షణాలు

  • కంటి చూపు మసకబారడం

  • ఎముకలలో నొప్పి, వాపు

  • తలనొప్పి

  • మత్తుగా ఉండటం

  • ఆకలి తగ్గడం

  • వాంతి వచ్చినట్లు ఉండటం

  • ​వెంట్రుకలు రాలడం

విటమిన్ 'ఎ ' లోపం వల్ల వచ్చే సమస్యలు


ప్రతి రోజూ ఆహారంలో విటమిన్ 'ఎ ' తక్కువ తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలే మనం ఎక్కువగా గమనించవచ్చు. శరీర నిల్వలు పూర్తిగా తగ్గిపోయాక విటమిన్ 'ఎ ' లోపాలు మెల్లమెల్లగా బయటపడతాయి. విటమిన్ 'ఎ ' లోపం ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లల పై అధిక అనారోగ్య ప్రభావాన్ని చూపుతున్నది. సుమారు 2.5 లక్షలనుండి, 5 లక్షల మంది 5 సంవత్సరాలలోపు పిల్లలు విటమిన్ 'ఎ ' లోపం వల్ల అంధత్వానికి గురవుతున్నారు.
రేచీకటి: విటమిన్ 'ఎ ' లోపం తొలి దశలో కన్ను తక్కువ వెలుతురును చూడగలుగుతుంది. రాత్రులలో కంటి చూపు మసక బారుతుంది. దీన్నే రేచీకటి అంటారు. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ కంటి చూపు పొందవచ్చు.
కంటిలో బూడిదరంగు (బిటాట్) మచ్చలు: లోపం ఎక్కువ అవుతున్న కొద్దీ కంటిలో హానికరమైన మార్పులు కనిపిస్తాయి. కంటిలో తేమదనం తగ్గిపోతుంది. కంటిలో బూడిదరంగు మచ్చలు ఏర్పడడం, కనుపాపలో పుండు రావడం, చివరకు కంటిపాప పాడై నీరుగా కారడం గ్రుడ్డి తనం రావడం జరుగుతుంది.
శరీర ఇతర భాగాలలో చోటు చేసుకునే మార్పులు

 

  • వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం

  • వెంట్రుకల రంగులో మార్పు, రాలడం

  • చెవి, మూత్ర నాళంలో ఇన్ ఫెక్షన్

విటమిన్ 'ఎ ' లోపాన్ని నివారించడం

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు, ముఖ్యంగా UNICEF, మైక్రో ఇనిసియేటివ్ లోప నివారణకు వివిధ కార్యాచరణ పథకాలను అమలు చేస్తున్నాయి.

  • తల్లిపాలు పిల్లలకు పుట్టినప్పటి నుండి ఒక సంవత్సరం వయస్సు వచ్చేంత వరకు తప్పనిసరిగా ఇవ్వడాన్ని ప్రోత్సాహించడం. తల్లి పాలలో విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది.

  • ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లు పెంపొందించి విటమిన్ 'ఎ ' ఉన్న ఆహార పదార్థాలను తప్పనిసరిగా ప్రతిరోజు భోజనంలో చేర్చునట్లు ప్రజల్లో అవగాహన పెంచడం.

  • ప్రభుత్వ ఆరోగ్య సంస్థల ఆధ్వర్యంలో 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి ఆరు నెలలకొకసారి ఒక డోసు చొప్పున మొత్తం 5 డోసుల విటమిన్ 'ఎ ' ప్రొఫైలాక్టిక్ అందించడం.

విటమిన్ 'డి '

 

  • విటమిన్ 'డి ' క్రొవ్వులో కరిగి ఉండి క్రొవ్వు మాధ్యమంగా పనిచేసే విటమిన్ ల వర్గానికి చెందినది.

  • మనం తిన్న ఆహారంలోని కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు భాస్వరం మొదలగు ఖనిజ లవణాలు చిన్న ప్రేగుల ద్వారా రక్తంలోనికి శోషణ జరగడానికి విటమిన్ 'డి ' ప్రధాన పాత్ర పోషిస్తుంది.

  • విటమిన్ 'డి ' శరీరంలో విటమిన్ డి3 (కోలి కాల్సిఫెరాల్) మరియు డి2(ఎర్గొ కాల్సిఫెరాల్) అను రెండు ప్రధాన రూపాలలో ఉంటుంది.

చరిత్ర

1922 - 1971,72 సంవత్స రాల వరకు వివిధ శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనల ఫలితంగా విటమిన్ 'డి ' గురించిన పరిజ్ఞానము వెలుగులోనికి వచ్చినది. ఎల్మర్ మెకోల్లం అనే శాస్త్రవేత్త జబ్బుతో ఉన్న కుక్కలకు విటమిన్ ‘ఎ' పూర్తిగా నశింప చేసిన క్యాడ్ లివర్ నూనెను ఇవ్వడంతో వాటి వ్యాధి నయమవడం గమనించాడు. విటమిన్ 'ఎ ' కాకుండా వేరొక పోషకమేదో కుక్కల వ్యాధి నయం చేసిందని ఆ పోషకానికి విటమిన్ 'డి అని పేరు పెట్టారు. 1923 సంవత్సరం లో హారీ స్టీన్ బోక్ నీలలోహిత కిరణాల ద్వారా ఇరాడియేషన్ జరిగి ఆహార పదార్థాలలో ఆర్గానిక్ పదార్థాలలో విటమిన్ 'డి ఎక్కువవడం గమనించారు. 1971 - 72 లో మికాయిల్ ఎఫ్ హోలిక్ మరియు ఇతర శాస్త్రజ్ఞులు విటమిన్ 'డి శరీరంలోని కాల్షియం మరియు ఫాస్పరస్ లపై నియంత్రణ కలిగి అది ఏ విధంగా ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుందనే విషయాన్ని విశదీకరించారు.

విటమిన్ 'డి ' ప్రయోజనాలు

  • ఆహారంలోని కాల్షియం అనే ఖనిజ లవణం చిన్న ప్రేగుల ద్వారా రక్తంలోనికి శోషణ చెందడానికి సహాయపడుతుంది.

  • రక్తప్రసరణలోని కాల్షియం మరియు ఫాస్పరస్ లవణాల స్థాయిని నియంత్రించి ఎముకల ఆరోగ్యానికి మరియు పునర్నిర్మాణానికి తోడ్పడుతుంది.

  • శిశు దశ నుండి ముసలితనం వరకు శరీర అస్థిపంజరం యొక్క ఎముకలన్నింటిలో కాల్షియం సమతుల్యాన్ని నియంత్రించి ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది.

విటమిన్ 'డి 'లభించే ఆహార పదార్థాలు

 

మన శరీరంలో చర్మం క్రింద '7-డి హైడ్రో కొలెస్టరాల్ ' అను పదార్థం ఉంటుంది. దీనిని ప్రొ విటమిన్ 'డి ' అని కూడా అంటారు. చర్మం క్రింద ఉన్న ఈ పదార్థం సూర్య రశ్మి సోకినపుడు విటమిన్ 'డి ' గా రూపాంతరం చెందుతుంది. ఈ ఒక్క విటమిన్ ను మాత్రమే ఏ ఖర్చు లేకుండా కేవలం సూర్యరశ్మి సహాయంతో శరీరం పొందగలదు. ప్రతిరోజు సుమారు 10-15 నిమిషాలు, వారానికి మూడు సార్లు సూర్యరశ్మి శరీరానికి నేరుగా తాకే విధంగా ఉంటే శరీరం తగినంత విటమిన్ 'డి' తయారు చేసుకోగలుగుతుంది. అయితే ఇది ఆయా వ్యక్తుల యొక్క చర్మ తత్వం, రోజులోని ఏ సమయం, సంవత్సరంలో ఏ కాలం అనే అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది.

  • చేపల రకాలైన సాల్ మన్, ట్యూనా, హెర్రింగ్, సార్ డైన్, క్యాడ్ మరియు మెకోరెల్ మొదలగు వానిలో విటమిన్ 'డి ' అధికంగా ఉంటుంది.

  • పాలు, జున్ను, పెరుగు, గ్రుడ్డు పచ్చసొన మరియు జంతు మాంస కాలేయంలో విటమిన్ 'డి ' ఉంటుంది.

  • కొన్నిరకాల పుట్ట గొడుగులలో విటమిన్ 'డి ' ఉన్నది.

  • బజారులో విటమిన్ 'డి ' తో ఫోర్టిపై చేసిన బ్రెడ్, ధాన్యాలు, పాలు, పాల సంబంధిత ఆహార పదార్థాలు దొరుకుతున్నవి.

విటమిన్ 'డి ' కావలసిన మోతాదు


చిన్న పిల్లలకు - 5 మై. గ్రా లేదా 200 ఇ. యూనిట్లు.
పెద్దవాళ్ళకు - 5 మై. గ్రా లేదా 200 ఇ. యూనిట్లు.
50 - 70 సం. ల వయస్సు - 10 మై. గ్రా లేదా 400 ఇ. యూనిట్లు.
> 70 సం. వయస్సు - 15 మై. గ్రా లేదా 600 ఇ. యూనిట్లు.

 

విటమిన్ 'డి ' లోపంతో వచ్చే సమస్యలు

  • ఆహారంలో తగినంత విటమిన్ 'డి ' లేకపోవడంతో పాటు శరీరానికి సూర్యరశ్మి లోపం కూడా ఉంటే విటమిన్ 'డి ' లోపం వల్ల కలిగే సమస్యలు కలుగుతాయి.

  • ఎదిగే పిల్లలలో ఎముకల నిర్మాణం కుంటుపడి రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. రికెట్స్ సాధారణంగా పిల్లలకే వస్తుంది. ఎముకలు గుల్లగా మారి వంగిపోతాయి. దొడ్డికాళ్ళు, గాడిదకాళ్ళు, ఉబ్బురొమ్ము మొదలైనవి రికెట్స్ వ్యాధి లక్షణాలు. రొమ్ము భాగంలోని ఎముకలు రెండువైపుల చివరలు లావెక్కి పూసల దండ వలె కనిపిస్తుంది. పిల్లలు బలహీనమై నడవలేకపోతారు. దంతాలు కూడా పటిస్టంగా ఉండవు.

  • యుక్తవయస్సులో ఉన్న ఆడ పిల్లలకు విటమిన్ 'డి ' లోపిస్తే నడుము క్రింది భాగంలో కాళ్ళకు ఆధారంగా ఉండే తుంటి ఎముకలు మెత్తబడి, వంగిపోయి వారికి భవిష్యత్తులో ప్రసవం కష్టమవుతుంది.ఎప్పుడూ చీకటి గదులలో పరదాలలో ఉండే స్త్రీలలో ఈ సమస్య కనిపిస్తుంది.

  • గర్భిణీ స్త్రీలలో, బాలింతలలో విటమిన్ 'డి ' లోపిస్తే వచ్చే సమస్యను 'ఆస్టియో మలేషియా' అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారు నడవడానికి, మెట్లెక్కడానికి కష్టపడతారు. కీళ్ళ నొప్పులు వస్తాయి. ఎముకలు పెళుసుగా అయి వంగిపోతాయి.

  • సూర్యరశ్మి ద్వారా ఖర్చు లేకుండా లభించే ఈ విటమిన్ ను తల్లి, ఆమె ద్వారా శిశువులు ఇరువురు లాభం పొందితే వారి ఆరోగ్యం పరిరక్షింపబడుతుంది.

విటమిన్ 'ఇ'


విటమిన్ 'ఇ' క్రొవ్వు పదార్థాలలో కరిగే విటమిన్లలో ఒకటి. శరీరంలో జరిగే జీవరసాయనిక క్రియలలో విటమిన్ 'ఇ 'ఒక ప్రత్యేక పాత్ర వహిస్తుంది.

చరిత్ర

1922 సంవత్సరం లో హెర్ బెర్ట్ మెకలిన్ ఇవాన్, కాథరైన్ స్కాట్ బిషప్ విటమిన్ 'ఇ' ను మొట్టమొదట గుర్తించారు. 1960సంవత్సరం లో కల్లా విటమిన్ 'ఇ' ఉపయోగాలు, కృత్రిమ తయారీ మొదలగు వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి.
విటమిన్ 'ఇ ' రకాలు/రూపాలు: ఇది ముఖ్యంగా టోకోఫెరాల్ మరియు టోకో ట్రై ఈనాల్ రూపాలలో ఉంటుంది. టోకోఫెరాల్, ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా అను అణు రూపాలలో సహజంగా ఉంటుంది. వీటిలో ఆల్ఫా రూపంలోని విటమిన్ 'ఇ ' లేదా ఆల్ఫాటోకోఫెరాల్ పోషణ, ఆరోగ్య విషయంలో చురుకైన పాత్ర నిర్వహిస్తుంది.

ఉపయోగాలు

విటమిన్ 'ఇ ' వలన ఎన్నో ఉపయోగాలున్నాయి.
యాంటీ ఆక్సిడెంట్ గా విటమిన్ 'ఇ ' కీలక పాత్ర వహిస్తుంది. శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి కణాల రక్షణకు సహాయపడుతుంది.
జీవరసాయనిక క్రియలలో ఎంజైముల విధులు సక్రమంగా జరగడానికి విటమిన్ 'ఇ ' తోడ్పాటునందిస్తుంది.
జన్యు ప్రమాణ వ్యక్తీకరణ క్రియలలో పాల్గొంటుంది.
నాడీ వ్యవస్థ సంబంధ విధులలో విటమిన్ 'ఇ ' సహాయపడుతుంది.
రక్తంలో ప్లేటిలెట్స్ ఎక్కువ కాకుండా నివారించి రక్త ప్రసరణ సహజ స్థితిలో ఉండడానికి తోడ్పడుతుంది.
శరీరంలోని క్రొవ్వు పదార్థాల ఆక్సీకరణను నివారించి వాటి సహజత్వాన్ని కాపాడుతుంది.
శరీరంలో అండాశయం విధి నిర్వహణకు అనగా అండోత్పత్తికి సంబంధించిన క్రియలలో సహాయపడుతుంది.

లభించే ఆహార పదార్థాలు


వృక్ష సంబంధ ఆహార పదార్ధాలు: గోధుమ మొలకలు, ప్రొద్దు తిరుగుడు గింజల నూనె, బాదం నూనె మరియు శాఫ్లవర్ నూనెలలో విటమిన్ 'ఇ' ఎక్కువగా ఉంటుంది.
నూనె గింజలలో, ముడి ధాన్యాలలో మధ్యస్థ పరిమాణంలో, ఆకుకూరలలో తక్కువ పరిమాణంలోను విటమిన్ 'ఇ' లభిస్తుంది.
జంతు సంబంధ ఆహార పదార్థాలైన వెన్న, గుడ్డు పచ్చసోనలలో ఇ విటమిన్ ఉంటుంది.

తీసుకోవలసిన మోతాదు


విటమిన్ 'ఇ' ను కూడ ఇంటర్నెషనల్ యూనిట్లలతో కొలుస్తారు. ఒక 'ఇ.యూ' = 0.67 మైక్రో గ్రాముల విటమిన్ ఇ. మనకు రోజుకు కావలసిన విటమిన్ ఇ మోతాదులు.
చిన్నపిల్లలకు/ రోజుకు
0-6 నెలలు - 4 మై.గ్రా.
7-12 నెలలు - 5 మై.గ్రా.
1-3 సంవత్సరాలు - 6 మై.గ్రా.
4-8 సంవత్సరాలు -7 మై.గ్రా.
9-13 సంవత్సరాలు - 11 మై.గ్రా.
యుక్తవయస్సు / రోజుకు - 15 మై.గ్రా.

విటమిన్ 'ఇ' లోపం

విటమిన్ ఇ లోపం సాధారణంగా సంభవించదు. కొన్ని విపరీత పరిస్థితులలో - చాలా తక్కువ బరువుతో పుట్టడం, క్రొవ్వు శోషణకు సంబంధించి తీవ్రమైన సమస్యలుండే విటమిన్ ఇ లోపం సంభవించవచ్చు. విటమిన్ ఇ లోపం వున్నపుడు నాడీ వ్యవస్థ పనితీరులో లోపం, రక్తహీనత, కంటిచూపులోపం, వ్యాధినిరోధకశక్తి లోపం మొదలగు పరిస్థితులకు దారితీయవచ్చు.

విటమిన్ 'కె'


విటమిన్ కె క్రొవ్వులో కరిగే విటమినుల వర్గానికి చెందినది. ఇది రక్తం గడ్దకట్టడం లో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది శరీరంలో కాల్షియం పనితీరుపై కూడ నియంత్రణ కలిగి ఉంటుంది.

చరిత్ర

విటమిన్ కె ను 1929 సంవత్సరంలో డేనిష్ పరిశోధకుడైన హెన్రిక్ డాం గుర్తించారు. కొలెస్టీరాల్ పూర్తిగా తొలగించిన ఆహారాన్ని కోళ్ళకు కొన్ని వారాల పాటు ఇవ్వడంతో అవి రక్తస్రావానికి గురయినట్లు గమనించారు. విటమిన్ కె రక్తం గడ్డ కట్టడానికి అవసరమని పరిశోధన ద్వారా నిర్ధారించినందుకు హెన్రిక్ డాం 1943 సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారు.

ఉపయోగాలు

విటమిన్ కె ను రక్తం గడ్డ కట్టించే విటమిన్ గా వ్యవహరిస్తారు. శరీరంలో ఇది లోపిస్తే దెబ్బ తగిలినపుడు అధిక రక్త స్రావం ఏర్పడుతుంది. కొన్ని పరీశోధనలలో ఇది వయోజనులలో ఎముకల ఆరోగ్యానికి సహాయపడగలదని గమనించారు.

లభించే ఆహార పదార్థాలు

విటమిన్ కె పాలకూర, క్యాబేజి, క్యాలిఫ్లవర్ మొదలగు ఆకుకూరలలోను, అవకాడ, కివి, ద్రాక్ష పండ్లలోను అధికంగా ఉంది. జంతుసంబంధ ఆహార పదార్థాలైన చేపలు, కాలేయం, మాంసం, గుడ్డు, వెన్న, జున్ను మొదలగు వాటిలో ఉంటుంది.
ఆహారనాళపు పొరలో గల బ్యాక్టీరియా కూడా శరీరానికి కావలసిన విటమిన్ కె ను తయారు చేస్తుంది.

కావలసిన మోతాదులు/ రోజు


చంటి పిల్లలు:         0-6 నెలలు - 2 మై.గ్రా.

 

7-12 నెలలు- 2.5 మై.గ్రా.

పెద్ద పిల్లలు:          1-3 సం. - 30 మై.గ్రా

4-8 సం.- 55 మై.గ్రా

9-13 సం. - 60 మై.గ్రా

యుక్తవయస్కులు: 4-18 సం.- 75 మై.గ్రా

19 సంవత్సరాలు ఆపైన - 90 మై.గ్రా/రోజు

లోపం

కె విటమిన్ లోపం చాలా అరుదుగా కనిపిస్తుంది. కాలేయ వ్యాధులు, సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదా ఇంప్లీమేటరీ బొవెల్ జబ్బులు ఉన్న వారిలో విటమిన్ కె తక్కువగా ఉంటుంది. లొప తీవ్రత ఎక్కువైతే రక్త హీనత, చిగుర్ల రక్త స్రావం, ముక్కు నుండి రక్త స్రావం, ఆడ వారిలో నెలవారి ఋతుక్రమంలో రక్తస్రావం అధికం కావడం సంభవించవచ్చు.

ఆధారం:

శ్రీమతి. ఎన్.నిర్మలమ్మ, పోషకాహార నిపుణులు
కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2012/010.

2.98591549296
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు