హోమ్ / ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం / జొన్న వంటకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జొన్న వంటకాలు

జొన్న వంటకాలు

అల్పాహారం

జొన్న దోసె

కావలసిన పదార్థాలు


జొన్నపిండి - 100 గ్రా.
మినపపప్పు - 50 గ్రా.
ఉప్పు -తగినంత
నూనె - తగినంత
విధానం: మినపపప్పు నాలుగైదు గంటలు నానిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో గంట జారుగా జొన్నపిండి కలుపుకొని, పెనం కాలిన తర్వార దోసె వెయ్యాలి. తగినంత నూనె వేస్తూ దోసె ఒకవైపు దోరగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి కాల్చాలి. ఈ దోసెలు పప్పు చట్నీతో తింటే కమ్మగా ఉంటాయి.

జొన్న ఉప్మా


కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ - 100 గ్రా.
ఆవాలు - 1/2 చెంచా
మినపపప్పు - 1/2 చెంచా
పచ్చిమిర్చి - 4
అల్లం - చిన్నముక్కలు
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
నీరు - 2 గ్లాసులు
కరివేపాకు - 2 రెమ్మలు
విధానం: జొన్న రవ్వ ఉడకబెట్టడానికి ఎక్కువ నీరు, సమయం అవసరం. కాబట్టి రవ్వను నీరు పోసి ముందుగానే ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్కలుగా తరగాలి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు మినపపప్పు తరిగిన ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత రవ్వ, ఉప్పు వేసి కలిపి పొయ్యి మీద నుండి దించాలి. నిమ్మరసం కలిపి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

జొన్నకిచిడి


కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ - 100 గ్రా.
పెసరపప్పు - 50 గ్రా.
మిరియాలు - 1/2 టీస్పూన్
ఉల్లిపాయ - చిన్నది
నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
నీరు - 1/2 లీటర్
విధానం: జొన్న రవ్వ ఉడకడానికి ఎక్కువ నీరు, సమయం అవసరం కాబట్టి ముందుగానే తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి. పెసరపప్పును తగినంత నీరు పోసి ముందుగానే నానబెట్టాలి. బాగా కాగిన నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మిరియాలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పెసరపప్పు వేసి కొంచెం నీరు పొసి ఉడకనివ్వాలి. పప్పు ఉడికిన తర్వాత ఉడికించిన జొన్నరవ్వ, ఉప్పు వేసి కలిపి దించాలి.

జొన్న తీపి తాళికలు


కావలసిన పదార్థాలు
జొన్న పిండి - 200 గ్రా.
గోధుమ పిండి - 50 గ్రా.
పాలు - 1/2 లీటరు
బెల్లం - 200 గ్రా.
యాలకులు – 4
విధానం: జొన్నపిండిని, గోధుమ పిండిని గోరు వెచ్చటి నీటితో కలిపి ముద్దగా చేసి, ఆ ముద్దను పది నిమిషాల పాటు ఆవిరి మీద వుడికించాలి. తరిగిన బెల్లములో కొద్దిగా నీళ్ళు కలిపి కరిగేంత వరకు పొయ్యి మీద ఉంచి దించాలి. పిండిని మురుకుల గొట్టంలో పెట్టి తాళికల కాగుతున్నపాలలో ఆకారంలో వత్తాలి. వీటిని పాలలో ఉడికిన తర్వాత దించి చల్లార్చాలి తర్వాత బెల్లం పాకంతో కలపాలి. యాలకుల పొడితో పాటు జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసుకోవచ్చును.

అంబలి


కావలసిన పదార్థాలు
జొన్నపిండి - 25 గ్రా.
నీరు - 2 గ్లాసులు
ఉప్పు – తగినంత
విధానం: జొన్న పిండిని కొద్దిగా గోరు వెచ్చని నీటిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. బియ్యం గంజిలో కొంత నీరు కలిపి మరగనివ్వాలి. తర్వాత జొన్న పిండి, ఉప్పు వేసి చిక్కబడేవరకు ఉడకనివ్వాలి. చల్లబడినాక త్రాగితే బాగుంటుంది. అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు.

 

జొన్న రొట్టెలు


కావలసిన పదార్థాలు
జొన్న పిండి - 100 గ్రా.
ఉప్పు - తగినంత
నీరు - తగినంత
విధానం: జొన్న పిండిని జల్లించి, ఉప్పు వేసి గోరు వెచ్చని నీటితో కలిపి ముద్దగా చేసుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక్కొక్క ఉండను కొంచెం నీరు చల్లుతూ వేళ్ళతో నొక్కుతూ బాగా కలపాలి. పీటమీద పొడి పిండి చల్లుకొని ఈ ఉండలను చుట్టూ తిప్పుతూ అరచేతితో గుండ్రంగా నొక్కాలి. పిండిని జల్లించి ఉండను బాగా నొక్కితే అంచు పగలకుండా ఉంటుంది. పెనం కాలిన తర్వాత రొట్టెను పెనం మీద వేయాలి. రొట్టె కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా నీరు చల్లి బట్టతో నొక్కి రెండవ వైపుకు తిప్పుతూ కాల్చాలి. రొట్టె వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

జొన్న ఇడ్లి



కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ - 100 గ్రా.
మినపపప్పు - 50 గ్రా.
ఉప్పు - తగినంత
విధానం: మినపపప్పు, నాలుగైదు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి నానబెట్టుకున్న జొన్న రవ్వ కలపాలి. మామూలు ఇడ్లి పిండి కన్న పలుచగా కలిపి ఇడ్లీ చేయాలి.

 

భోజనము

జొన్న బిర్యాని




జొన్న రవ్వ -250గ్రా
పచ్చి బఠానీలు-50గ్రా
బంగాళ దుంపలు -4
​క్యారెట్లు-4
ఉల్లిపాయలు-2
కొత్తిమీర-2కట్టలు
పుదీన -2కట్టలు
నూనె -4 టేబుల్ స్పూన్స్
అల్లం-చిన్నముక్క
వెల్లుల్లి - చిన్నది
లవంగాలు- 3
యాలకులు-3 
దాల్చిన చెక్క-3చిన్న ముక్కలు
ఉప్పు - చాలినంత
నీరు-3/4 లీటరు లేక 3 గ్లాసులు.
విధానం: బంగాళ దుంపలు, క్యారట్లు కడిగి ముక్కలుగా తరుక్కోవాలి. కడాయిలో నూనె వేసి బాగా కాగిన తరువాత మసాల దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి బఠానీలు, కూరగాయ ముక్కలు వేసి వేగనిచ్చి నీరు పోయాలి. నీళ్ళు మరిగేటప్పుడు రవ్వ వేసి కలుపుతూ సన్నటి సెగపై ఉడికించాలి. దించేముందు కొత్తిమీర, పుదీనాను వేసి కలపాలి.

 

జొన్న సంగటి


కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ - 100 గ్రా.
జొన్నపిండి - 100 గ్రా.
నీరు - 2 లీటర్లు
ఉప్పు - తగినంత
విధానం: నీరు మరిగిన తర్వాత జొన్న రవ్వ కలపాలి. రవ్వ సగము ఉడికిన తర్వాత ఉప్పు, జొన్నపిండి వేసి కలిపి ఉడకనివ్వాలి. గట్టి పడకముందే ఉండలుగా చేయాలి.

 

జొన్న వడియాలు


కావలసిన పదార్థాలు
జొన్నపిండి - 500 గ్రా.
కారం : 4 స్పూన్లు
జీలకర్ర - 20 గ్రా.
ఉప్పు - తగినంత
నీరు - 21/2 లీటర్లు

 

విధానం: నీళ్ళు బాగా మరిగిన తర్వాత జొన్నపిండి,ఉప్పు, కారం, జీలకర్ర వేసి పిండి గరిట జారుగా ఉండే వరకు వుడకబెట్టాలి. ఈ పిండిని గరిటతో తీసుకొని ఒక బట్ట మీద వడియాలులాగ బెట్టి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత డబ్బాలో పెట్టి వుంచి అవసరమైనప్పుడు నూనెలో వేయించుకోవచ్చును .

స్నాక్స్

స్పాంజ్ కేక్


కావలసిన పదార్థాలు
జొన్న పిండి - 115 గ్రా.
డాల్డా/వెన్న - 80 గ్రా.
చెక్కర పొడి - 115 గ్రా.
బేకింగ్ పౌడర్ - 1/2 టీ స్పూన్
వెనిలా ఎసెన్స్ - కొన్ని చుక్కలు
కోడి గ్రుడ్లు - 2
విధానం: ముందుగా జొన్నపిండిలో బేకింగ్ పౌడర్ వేసి జల్లడ పట్టాలి. వెన్న/డాల్డాలో పంచదార పొడిని కలుపుకుంటూ నురుగు వచ్చే దాక గిలకొట్టుకోవాలి. ఆదే విధంగా కోడిగుడ్డును కూడా గిలకొట్టుకోవాలి. గిలక్కొట్టిన డాల్డా/వెన్నలోకి గుడ్డును మరియు వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి జొన్నపిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ అర్థ చక్రందిశలోకలుపుకోవాలి, పూర్తి చక్రంలా కలుపుకుంటే కేకు గట్టిగా వస్తుంది. పిండి మిశ్రమం కొద్దిగా పల్చగా ఉండాలి. దీన్ని కేకు తయారి చేసే పాత్రలో వేసుకోవాలి. పిండి గట్టిగా ఉన్నట్లనిపిస్తే పాలను లేదా నీటిని కలుపుకొని కావలసిన విధంగా మార్చుకోవాలి. ఇప్పుడు పాత్రని ఒవెన్ లో పెట్టి 350 డిగ్రీ వద్ద 25 నిమిషాల వరకు ఉంచాలి.

 

జొన్నపిండితో పండ్ల కేకు


కావలసిన పదార్థాలు
జొన్న పిండి - 130 గ్రా.
డాల్డా/వెన్న/నెయ్యి - 85 గ్రా.
మసాలాల పొడి ( ఇలాచి, దాల్చిన చక్క, లవంగం) -1/2 టీ స్పూన్స్
గ్రుడ్లు - 2
చెర్రి పండ్లు - 30 గ్రా.
కాండిడ్ పీల్ - 30 గ్రా.
పాలు - 30 మి.లీ
ఉప్పు - చిటికెడు
జీడిపప్పు - 45 గ్రా.
కారమెల్ - 45 గ్రా. (చక్కరని నీళ్ళు వేయకుండా బంగారు వర్ణం వచ్చే దాకా కరిగించుకోవాలి)
విధానం: జీడిపప్పుని, కాండెడ్ పీల్ ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మసాలాల పొడిని జొన్నపిండిలో వేసి జల్లెడ పట్టుకోవాలి. పిండిలోకి చెర్రిపండ్లను ముక్కలుగా చేసి వేసుకోవాలి. జీడిపప్పును, కాండెడ్ పీల్ ముక్కలని కూడా పిండిలోకి వెయ్యాలి. వెన్న/డాల్డాని మెత్తని నురగపొంగులా అయ్యేంత వరకు గిలకొట్టాలి. గ్రుడ్లను గిలకొట్టి డాల్డా మిశ్రమంలో వేసుకోవాలి. దాంట్లోకి కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ అర్థ చక్రందిశలో కలుపుకోవాలి. పిండి మిశ్రమంలోకి కారెమిల్, పాలు వేసి పల్చని సాంద్రతకు తెచ్చుకోవాలి. దీన్ని కేకు తయారు చేసే పాత్రలో వేసి 325 డిగ్రీ వద్ద 45 నిమిషాల నుండి 1 గంట వరకు ఒవెన్లో ఉంచాలి.

 

జొన్న మఫిన్లు


కావలసిన పదార్థాలు
జొన్న పిండి - 185 గ్రా.
వెన్న/నూనె/నెయ్యి - 116 గ్రా.
పంచధార - 150 గ్రా.
బేకింగ్ పౌడర్ - 3 గ్రా.
వెనిలా ఎసెన్స్ - 3 గ్రా.
గుడ్లు – 3-4
సుల్తానాస్ - 83 గ్రా.
విధానం: గుడ్లు గిల్లక్కొట్టి దాంట్లో వెనిలా ఎసెన్స్ ని వేయాలి. వెన్న/నూనె/నెయ్యి, పంచదార కలిపి గిలక్కొట్టుకుని క్రీం లా చేయాలి. దీంట్లో గుడ్ల మిశ్రమాన్ని వేసుకోవాలి. జొన్నపిండిలో బేకింగ్ పౌడర్ వేసి 2 సార్లు జల్లడ పట్టుకోవాలి. సూల్తానాలను కూడా పిండిలోకి వేసుకోవాలి. జొన్నపిండిని కొద్ది కొద్దిగా  పైన తయారు చేసుకున్న మిశ్రంలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అర్థ చక్రందిశలో కలుపుకోకోవాలి. పల్చని మిశ్రమంలా చేయాలి. మఫిన్లు తయారు చేసే పాత్రకి కొద్దిగా డాల్డా/నెయ్యి/నూనె పూతలా రుద్దుకోవాలి. ఈ పాత్రలోకి పిండిని వేసి 375 డిగ్రీల వద్ద ఒవెన్ లో పెట్టాలి, 15-20 నిమిషాల వరకు ఉంచాలి. 

జొన్న మెడిలిన్స్


కావలసిన పదార్థాలు
జొన్న పిండి - 115 గ్రా.
వెన్న/నూనె/నెయ్యి - 100 గ్రా.
చెక్కర పొడి - 115 గ్రా.
బేకింగ్ పొడి - 1/4 టీ స్పూన్
చెర్రీలు - 20 గ్రా.
గుడ్డు - 2
తురిమిన ఎండు కొబ్బరిపొడి - 55 గ్రా.
జాం - 30గ్రా.
విధానం: జొన్నపిండిలో బేకింగ్ పొడిని వేసి జల్లెడ పట్టుకోవాలి. వెన్న/నూనె/నెయ్యి లో చెక్కరని వేసి పల్చని నురుగ వచ్చే విధంగా క్రీంలా గిలక్కోట్టుకోవాలి. గుడ్డుని కూడా గిల్లక్కోట్టుకుని పై మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి జొన్నపిండిని వేసి అర్థ చక్రందిశలో కలుపుకోవాలి. మెడిలిన్స్ చేసే పాత్రలో నూనె/నెయ్యి ని పూతలా వేసుకుని, దానిలో 3/4 వంతు వరకు పిండిని వేసుకోవాలి. ఒవెన్ లో 20 నిమిషాల పాటు ఉంచాలి. బయటకు తీసి మెడిలిన్స్ పైన కింద భాగాలను కోసి సమాంతరంగా చేసుకోవాలి. మెడిలిన్స్ చుట్టూ జాం పూసి, కొబ్బరితురుము వేసి తిప్పుకోవాలి. పైభాగాన చెర్రిలను వేసి డెకొరేట్ చేసుకోవాలి.

జొన్న చెక్కలు


కావలసిన పదార్థాలు
జొన్నపిండి -200 గ్రా.
మినపప్పు - 20గ్రా.
శెనగపప్పు - 20 గ్రా.
పెసరపప్పు - 40 గ్రా.
ఫ్యాట్ - 4 టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడినంత
కారం పొడి - రుచికి సరిపడినంత
నూనె - వేయించడానికి సరిపడినంత
నీళ్ళు – కలుపుకోవడానికి
విధానం: మినపప్పు,  పెసరపప్పులను వేయించుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడిలోకి జొన్నపిండిని కలుపుకోవాలి. వెన్న/నూనె/నెయ్యి ని వేడి చేసుకొని పిండిలోకి వేసి రుద్దుకోవాలి. ఉప్పు, కారం వేసి వేడి నీటితో పిండి కలుపుకోవాలి. కొద్దిగా చల్లనీళ్ళని వేసి చెక్కలకి కావాల్సిన పిండి సాంద్రతలోకి తెచ్చుకోవాలి. కావాలంటే కరివేపాకు, కొత్తిమీర, అల్లం ని తరిగి పిండిలో కలుపుకోవచ్చు. 1/2 గంటపాటు పక్కన పెట్టుకొని, కొంచెం కొంచెం నానబెట్టిన శెనగపప్పు,  పిండిని చెయ్యిలోకి తీసుకొని ఉండకట్టుకొని పలుచగా గుండ్రంగా ఒత్తుకోవాలి. వేడిచేసిన నూనెలో బంగారు వర్ణం వచ్చే దాకా వేయించుకోవాలి. నూనె నుండి తీసి కొద్దిసేపు పేపర్ పై పెట్టాలి. పేపర్ అధికంగా ఉన్న నూనెను పిల్చుకుంటుంది. తర్వాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

జొన్న నమక్ పారా


కావలసిన పదార్థాలు
జొన్నపిండి - 250 గ్రా
జీలకర్ర -1/2 టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడినంత
నూనె - వేయించడానికి కావాల్సినంత
నీళ్ళు- సరిపడినన్ని
విధానం: జొన్నపిండిలో ఉప్పు, జీలకర్ర వేయాలి. నీళ్ళుపోసి ముద్దగా చేసుకోవాలి. కోలతో చపాతిలా చేసుకొని మనకు కావాలసిన ఆకారంలో కత్తితో పూరిని ముక్కలుగా కోసుకోవాలి. నూనెలో వేయించుకోని పేపర్ మీద కొద్దిసేపు గాలికి ఉంచాలి.

జొన్న పకోడి


కావలసిన పదార్థాలు
జొన్న పిండి -100 గ్రా
పాలకూర - 2 కట్టలు
ఉల్లిగడ్డలు -2
పచ్చిమిర్చి - 5
ఉప్పు - రుచికి సరిపడినంత
కరివేపాకు - కొద్దిగా
నూనె - వెంపుడుకు సరిపడినంత
విధానం: పాలకూర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలను సన్నగా కోసుకోవాలి. పిండిని జల్లెడపట్టి అందులో ఉప్పూ, కరివేపాకు, పాలకూర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి.ఒక చెంచా వేడి నూనెను వేసి పిండిని కలుపుకోవాలి. నూనె బాగా కాగాక పిండిని పకొడి లా వేసి వేయించుకోవాలి.

 

తీపి బిస్కెట్లు


కావలసిన పదార్థాలు
జొన్నపిండి - 250 గ్రా.
మైదా పిండి - 50 గ్రా.
చక్కర పొడి -150 గ్రా
డాల్డా - 150 గ్రా.
బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్
అమ్మోనియా - కొన్ని చుక్కలు
విధానం: బిస్కెట్ ట్రే కి గ్రీస్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఓవెన్ 180 డీగ్రీల వద్ద 15 నిమిషాల ముందు ఆన్ చేసి ఉంచుకోవాలి. జొన్న పిండిని కూడా వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జొన్నపిండిని, మైదా పిండిని, బేకింగ్ పౌడర్ ను జల్లెడ పట్టుకోవాలి. ఈ జల్లెడ పట్టుకున్న పిండికి వెన్న, చక్కెర, అమ్మోనియా కొన్ని చుక్కలు కలిపి బాగా గిలకొట్టిన మిశ్రమాన్ని రొట్టె పిండిలా చేసుకోవాలి. ఒక బిస్కెట్ కట్టర్ తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా గ్రీస్ చేసుకొని పెట్టుకున్న ట్రేలో అమర్చుకొని 180 డీగ్రీల వద్ద 15 - 20 నిమిషాలు బేకింగ్ చేసుకోవాలి.

 

జొన్న మురుకులు


కావలసిన పదార్థాలు
జొన్న పిండి:  250 గ్రా.
పెసర పిండి: 50 గ్రా
జీలకర్ర : కొంచం
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
విధానం: పెసరపప్పును వేయించి పిండి చేయాలి. దీనిని జొన్నపిండిలో వేసి, ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు తగినన్ని వేసి నీళ్ళతో ముద్ద గా చేసుకోవాలి. వీటితొ పాటు ఒక స్పూను వేడి చేసిన నునె గాని, నెయ్యి గాని కలిపితే మురుకులు కరకరలాడుతూంటాయి. కడాయిలో నూనె కాగిన తరువాత, మురుకుల గొట్టములో పిండిని వుంచి మురుకులు వత్తి వేయించాలి. మురుకులు రెండువైపులా దోరగా వేగిన తరువాత తీసివేయాలి.

 

జొన్న బూరెలు


కావలసిన పదార్థాలు
జొన్నపిండి-200గ్రా
బెల్లం-200గ్రా
పచ్చికొబ్బరి-కొంచెం
యాలకులు-2
విధానం: జొన్న పిండిని జల్లడ పట్టుకోవాలి, పచ్చికొబ్బరి తురుముకోవాలి. బెల్లంలో కొద్దిగా నీరు పోసి పోయ్యి మీద పెట్టి తీగపాకం వచ్చే వరకు కలపాలి దీనికి జొన్నపిండి, యాలకులపొడి తురిమిన కొబ్బరి వేసి ముద్దగా అయ్యే వరకు కలపాలి. దీనిని చిన్న ఉండలుగా చేసి పలుచగా చేతిలో నొక్కి కాగిన నూనెలో వేయించాలి.

 

జొన్న పాయసం


కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ -150గ్రా
పెసర పప్పు-50గ్రా
తరిగిన బెల్లం/ చక్కెర -150గ్రా
నెయ్యి/డాల్డా-3టేబుల్ స్పూన్లు
పాలు-1/2 లీటరు
నీరు-చాలినంత
విధానం: నేతిలో జొన్న రవ్వను దోరగా వేయించాలి. పెసర పప్పును మెత్తగా వుడికించిన తర్వాత, తరిగిన బెల్లం వేయాలి. బెల్లం కరిగిన తర్వాత రవ్వను వేసి మెత్తగా ఉడికించాలి. వడ్డించే ముందు తగినన్ని పాలు కలిపితే పాయసం గరిట జారుగా ఉంటుంది. ఇష్టం వున్న వారు జీడిపప్పు కుడా వేసుకొవచ్చు.

 

జొన్న పేలాలు


కావలసిన పదార్థాలు
జొన్నలు - 200 గ్రా.
ఉప్పు - తగినంత
విధానం: పొయ్యి మీద కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి బాగా కాగిన తర్వాత జొన్నలు వేయాలి. ఒకసారి గరిటెతో కలియబెట్టి మూతపెట్టి ఉంచితే జొన్నలు పేలాలు అవుతాయి. ఉప్పు చల్లి తింటే రుచిగా ఉంటాయి. జొన్నలను తడిపి ఎండబెట్టి వేయించి చేసిన పేలాలు ఇంకా బాగా ఉంటాయి.

జొన్న లడ్డు


కావలసిన పదార్థాలు
జొన్న పిండి - 200 గ్రా.
బెల్లం - 150 గ్రా.
నెయ్యి - 50 గ్రా.
యాలకులపొడి - 1 స్పూన్
విధానం: జొన్న పిండిని దోరగా వేయించాలి. బెల్లం పాకం పట్టాలి. బెల్లం తీగపాకం వచ్చాక జొన్న పిండిని, యాలకుల పొడిని చేర్చి కలపాలి. కరిగించిన వేడి నెయ్యి కలుపుతూ లడ్డూ కట్టాలి. వేరుశనగపప్పు గాని, నువ్వులు గాని కలుపుకోవచ్చు.

మెల్టింగ్ మూమెంట్స్


కావలసిన పదార్థాలు
జొన్నపిండి - 150 గ్రా.
వెన్న - 115 గ్రా.
చక్కెర - 85 గ్రా,
గుడ్డు - 1/2
బేకింగ్ పౌడర్ - 1/4 టీస్పూన్
కార్న్ ప్లేక్స్ - 55 గ్రా.
వెనిల్లా - 3 లేక 4 చుక్కలు
విధానం: జొన్నపిండి, బేకింగ్ పౌడరు కలిపి రెండుసార్లు జల్లించాలి. పొడి చేసిన చక్కెరలో వెన్న కలిపి నురుగు వచ్చే వరకు రుద్దాలి. దీనికి గిలకొట్టిన గుడ్డు, వెనిల ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమానికి జొన్నపిండి కలిపి ముద్దలా చేయాలి. దీని నుండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని కార్న్ ప్లాక్స్ అద్ది "ఓవెన్" లో 350 డీగ్రీ ఉష్ణోగ్రతలో 8 నిమిషాలు పాటు బేక్ చేయాలి.

 

జొన్న, పెసలు మిక్స్


కావలసిన పదార్థాలు
జొన్నలు - 100 గ్రా.
పెసలు - 50 గ్రా.
నువ్వులు - 25 గ్రా.
విధానం: జొన్నలు, పెసలు శుభ్రపరుచుకోవాలి. వీటిని నువ్వులతో కలిపి మెత్తగా నూరుకొని ఒక మిశ్రమంలా చేసుకొని గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని సంవత్సరం పైబడిన పిల్లలకు గుజ్జులాగా చేసి తినిపించవచ్చు, పెద్దవాళ్ళు కూడా ముఖ్యంగా మధుమేహులు జావలాగా చేసుకొని త్రాగవచ్చు. దోశ లేదా ఇడ్లీపిండిలో కూడా కలపవచ్చు.

 

జొన్న రాబ్రి


కావలసిన పదార్థాలు
జొన్నలు - 200 గ్రా.
మజ్జిగ - 1000 గ్రా.
తోటకూర - 200 గ్రా.
ఉప్పు - తగినంత
నూనె - 30 మీ.లీ
విధానం: జొన్నలు కడిగి మజ్జిగలో ఉడకబెట్టాలి. తోటకూరను కడిగి తరగాలి. ఉడుకుతున్న జొన్నలకు తరగిన తోటకూరను కలపాలి. తర్వాత ఉడుకుతున్న జొన్నలకు ఉప్పు, నూనెను చేర్చి పొయ్యి మీద నుండి దింపాలి.

 

చుడువా


కావలసిన పదార్థాలు
పొట్టు తీసిన జొన్నలు - 100 గ్రా.
ఉప్పు, కారం - తగినంత
నూనె - 1/2 చెంచా
కరివేపాకు - రెండు రెమ్మలు
విధానం: పొట్టు తీసిన జొన్నలను ఒక రాత్రి నానబెట్టి బట్టమీద ఆరబెట్టాలి. కడాయిలో నూనె వేసి బాగా కాగిన తర్వాత తడి ఆరిన జొన్నలు వేసి వేయించాలి. వేయించిన జొన్నలకు, ఉప్పు, కారం, కరివేపాకు వేసి కలిపితే చాలా రుచిగా ఉంటుంది. జొన్నలతో పాటు వేయించిన శనగపప్పుగాని, వేరుశనగపప్పుగాని కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది.

పునుగులు


కావలసిన పదార్థాలు
పొట్టు తీసిన జొన్నలు - 250 గ్రా.
పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 6
ఉప్పు - తగినంత
కొత్తిమీర - అరకట్ట
కరివేపాకు - 3 రెమ్మలు
నూనె – వేయించడానికి
విధానం: పొట్టు తీసిన జొన్నలను ఒక పూట నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక రాత్రి పులియబెట్టాలి. మరుసటి రోజున శనగపప్పును నానబెట్టి మెత్తగా నూరుకోవాలి. దీనిని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు కొత్తిమీరలను పులిసిన జొన్నపిండితో కలపాలి. ఈ పిండిని పునుగుల మాదిరిగా చేసి కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో శనగపప్పు బదులు మినప పప్పును కూడా వాడుకోవచ్చు.

 

ఆధారం:

కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/010.

3.02298850575
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు