పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పరిసరాల పారిశుధ్యం

మన చుట్టూ ఉన్న పరిసరాలను మన అలవాట్లతో, ప్రవర్తనతో మలినం చేస్తున్నాము. తినే అన్నాన్ని, త్రాగే నీటిని, పీల్చేగాలిని చేతులారా మనమే కలుషితం చేసి, మన ఆరోగ్యాన్ని హానికరం చేసుకొంటున్నాము.

మన చుట్టూ ఉన్న పరిసరాలను మన అలవాట్లతో, ప్రవర్తనతో మలినం చేస్తున్నాము. తినే అన్నాన్ని, త్రాగే నీటిని, పీల్చేగాలిని చేతులారా మనమే కలుషితం చేసి, మన ఆరోగ్యాన్ని హానికరం చేసుకొంటున్నాము. ఇది అందరికి తెలియకపోవడం ఒక కారణమైతే, నిర్లక్ష్యం, అశ్రద్ద, తేలికభావం, జరుగుతున్న పద్ధతుల్లో మార్పుని అంగీకరించలేకపోవడం మరికొన్ని కారణాలు. మనిషి మనస్ఫూర్తిగా అనుకుంటే అన్నీ సాధ్యమే అన్న సూక్తిని ఋజువు చేయటానికి మన గ్రామాల్లోనే ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. కొన్ని ఉపకరణాలను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగాను, తక్కువ ఖర్చుతోను అందిస్తున్నాయి. ఈ సదుపాయాలన్నీ మన ఉపయోగించుకుంటే మానవ నిర్మిత వ్యాధులు మన జోలికి రాకుండా చేయవచ్చు.

పరిశుభ్రమైన త్రాగు నీరు

నీటి కాలుష్యం వల్ల మనకు కలరా, నీళ్ళ విరేచనాలు, పచ్చకామెర్లు, పోలియో, అమీబియాసిస్ , చీము – రక్త విరేచనాలు, టైఫాయిడ్, నులి పురుగుల వ్యాధులు రావచ్చు.

కలరా, నీళ్ళ విరేచనాలు ప్రాణాలు తీసే రోగాలు.  పచ్చ కామెర్లు దీర్ఘకాలం బాధిస్తుంది.  ముదిరితే ప్రాణాలు తీయవచ్చు. పోలియో జీవితాంతం అంగ వైకల్యం కలిగిస్తుంది. నులి పురుగుల వ్యాధులు అమీబియాసిస్ దీర్ఘ కాలం మనిషిని బాధపెడతాయి.

ఇలా మనకు వచ్చే చాలా సాధారణ వ్యాధులు అపరిశుభ్రమైన నీరు తాగుట వల్లనే.  ఎండాకాలం మరియు వానాకాలంలో మనం తాగే నీరు కలుషితమౌతుంది. ఎండా కాలంలో నీటి వనరులలో నీరు ఇంకి, నీరు పాడవుతుంది, వానాకాలంలో తాగునీటి వనరులలో దుమ్ము, చెత్తా, చెదారం, కొన్ని రసాయనాలు కలిసి నీటిని కలుషితం చేస్తాయి.

తాగు నీటితో వచ్చే వ్యాధులకు నివారణ కంటే, నిరోధమే మంచిది.  కొన్ని సామాన్య జాగ్రత్తల ద్వారా మనం తాగేనీటిని మనమే రక్షించుకోవచ్చు.

  • తాగునీటి వనరులను కలుషితం చేయకండి. మల , మూత్ర విసర్జనకు వాడకండి. తాగునీటి వనరులలో పశువులను కడగకండి.
  • మీకు దగ్గరలో గొట్టపు బావి ఉంటే, గొట్టపు బావి నీరే తాగండి.  గొట్టపు బావి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.
  • ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో మీ గ్రామంలో తాగు నీటిని పరీక్ష చేయండి.  సమస్యలుంటే సరిదిద్దుకొనే ప్రయత్నం చేయండి.
  • ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో తాగునీటి వనరులలో క్లోరినేషన్ జరిగేలా చూడండి.
  • ఆరోగ్య కార్యకర్తల దగ్గర క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా లభిస్తాయి. క్లోరిన్ టాబ్లెట్లు పొడి చేసి తాగునీటిలో కలిపి నీటిని రక్షించుకోవచ్చు.  ఒక క్లోరిన్ టాబ్లెటు 20 లీటర్ల నీటిని క్లోరినేషన్ చేస్తుంది.
  • వీలయినంత వరకు గుంటలలోని నీరు, చెరువులలోని నీరు తాగకండి.

గొట్టపుబావి

గ్రామాలలోని ప్రజలు నదులలో, చెరువులలో, కొలనులో, కాల్వలలో స్నానం చేస్తుంటారు, బట్టలు ఉతుకుతారు, పశువులను కడుగుతారు, కొన్నిసార్లు అదే నీటిని త్రాగటానికి కూడా ఉపయోగిస్తారు.

  • గొట్టపుబావి లేదా వీధి కుళాయిల ద్వారా సరఫరా చేయబడే నీటినే వాడాలి.
  • ఇంటికి దగ్గరగా గొట్టపుబావి నీరు లేదా వీధి కుళాయిల నీరు లేకపోతే ఇతర చోట్ల నుండి తెచ్చుకున్న నీటిని కాచి చల్లార్చి త్రాగాలి.
  • నీటిని మరగకాచిన తరువాత ఒక పరిశుభ్రమైన పాత్రలో ఆ నీటిని నిల్వ ఉంచి, దానిపైన మూత పెట్టాలి.
  • ఈ నీటిని త్రాగటానికి వీలుగా ఒక గరిటెను ఉపయోగించి ఆ పాత్రలోని నీటిని తీసుకోవాలి.
  • నీటిని శుభ్రపరచటానికి నీటిలోని హానికర క్రిములను చంపివేయటానికి నీళ్ళలో క్లోరిన్ కలపాలి. క్లోరిన్ మాత్రలు ఆరోగ్య కార్యకర్త దగ్గర దొరకుతాయి.

మరుగుదొడ్లు

మన గ్రామంలోను, పట్టణాలలో ఖాళీ ప్రదేశాలలో మల విసర్జన చేయటం వలన పరిసరాలు అపరిశుభ్రమై కలుషితం అవుతాయి. 5 సంవత్సరాల లోపు వయస్సులోని పిల్లలు అంటువ్యాధులు సోకి అధిక మరణాలు జరగడానికి ఇది ముఖ్యకారణము. శాస్త్రీయ మరుగుదొడ్లను వాడితే మలము ద్వారా వ్యాపించే వ్యాధులను అతి సులభంగా నివారించవచ్చు.

చెత్త మరియు మురికి నీటిని తొలగించే విధానాలు

కంపోస్టు పిట్టు

గ్రామాలలో చెత్త, చెదారము వేయటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండవు. ఎవరింటి ముందు వారే, ఖాళీ స్థలాలలోనే వేయటము జరుగుతుంది. దీని వలన గ్రామంలో పలుచోట్ల చెత్త చెదారంతో నిండి ఉంటుంది. ఈ చెత్త ఎండకు ఎండి, పొడిగా తయారయ్యి, గాలిలో కలిసిపోయి ఊరంతా విస్తరిస్తుంది. వర్షాకాలములో నీటిలో కలసి గ్రామములో ప్రవహిస్తుంది. ఇందులోని సూక్ష్మక్రిములు, గాలి ద్వారా, నీటి ద్వారా, మనము తినే ఆహారము ద్వారా అంటు వ్యాధులను ప్రబలిస్తాయి. చెత్త, చెదారమును గోతిలో వేసి ప్రతివారము లేదా పదిరోజులకొకసారి గోతిలో వేసిన చెత్త, కసువును ఒక రేకుతో లేదా కర్రతో చదును చేసి దాని మీద మూడు చేతి వేళ్ళ మందం మట్టిని కప్పాలి. దీని వల్ల ఈగల ఉత్పత్తి జరగదు. ఈగలు పెరగవు. గొయ్యి చెత్త, కసువుతో పూర్తిగా నిండిపోయిన తరువాత దానిపైన మట్టితో పూర్తిగా కప్పివేసి, చదును చేసి, కదపకుండా ఉంచాలి. రెండు మూడు నెలల కాలంలో ఈ గోతిలోని చెత్త, చెదారాలు నాణ్యమైన ఎరువుగా అవుతాయి.

మురికి కాలువలు

వాడుక నీరు ప్రవహించటానికి సరైన సదుపాయాలు లేక, ఇంటి ముందర నిల్వ ఉంటే, ఈగలు, దోమలు పెరిగి అంటువ్యాధులను కలిగించటమే కాక, అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. ఈ నీరు గ్రామానికి దూరంగా వెళ్ళిపోయే విధంగా కాలువలు తీసుకొని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

ఇంకుడు గొయ్యి

ఛాతీ ఎత్తు లోతు, వెడల్పున ఒక గొయ్యి తీసి దానిలో అనేక పరిమాణాలలో ఉన్న రాళ్ళు, ఇటుక ముక్కలతో సగానికి పైగా నింపితే, వాడుక నీరు అందులో నుండి నెమ్మదిగా భూమిలోనికి ఇంకుతాయి. వీటి ద్వారా దోమలు వృద్ధి చెందకుండా అరికట్టవచ్చును.

పెరటి తోటలు

అవకాశం ఉన్నచోట్ల వీలున్న ప్రదేశాల్లో ఈ వాడుక నీటిని దగ్గరలో గల పెరటితోటలోనికి మళ్ళించవచ్చు. వీటిని ఉపయోగించి మంచి కూరగాయలు, ఆకు కూరలు పండించవచ్చు. కాని సబ్బు నీరు మొక్కలవైపు మళ్ళించకూడదు.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

త్రాగునీటి సరఫరా పారిశుద్ధ నిర్వహణ

త్రాగునీటి లభ్యత, మంచినీటి బావుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెరువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేతి పంపుల నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్లోరినేషన్ చేయు విధానం, బ్లీచింగ్ పౌడర్ కలుపవలసిన మోతాదు, బ్లీచింగ్ పౌడర్ కలుపు విధానం, రక్షిత మంచినీరు, నీటి నాణ్యత పరిక్షలు మొదలగునవి వివరాలు ఈ క్రింది పి.డి.ఎఫ్. లో అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం పి.డి.ఎఫ్. ను చూడండి.

పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అపార్డ్ స్థానిక పాలన

త్రాగు నీరు పారిశుద్ధ్యం

త్రాగు నీరు పారిశుద్ధ్యం కొరకు అపార్డ్ వారు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని చక్కటి కరదీపికను రూపొందించారు. దీనిలో సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమం – మార్గదర్శకాలు, ప్రతీ ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణ పథకం, నిర్మల గ్రామం, నిర్మల గ్రామ పురస్కారము కొరకు దరఖాస్తు ఫారము, శుభ్రం బహుమతులు, గ్రామీణ నీటి నాణ్యత, పరిశీలన మరియు పరిరక్షణ కార్యక్రమం, నీరు, భూమి మరియు చెట్లు – చట్టం 2004, రక్షిత నీరు, పారిశుద్ధ్య లోపానికి కారణాలు మరియు పరిష్కారాలు, పారిశుద్ధ్య సమస్య పరిష్కారాలు, తాగునీటిలో ఉండవలసిన రసాయనాల మోతాదు మొదలగు అంశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అపార్డ్

వాతావరణ మార్పులతో వచ్చే సమస్యలు

క్రమంగా వేసవి వస్తోంది. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నా రాత్రుళ్లు మాత్రం ఇంకా చలి పూర్తిగా తగ్గలేదు. ఇలాంటి సంధి దశలో కొన్ని రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. పగటివేళల్లో వేడి వల్ల దగ్గు వస్తుంది. అలాగే రాత్రివేళల్లో చలివల్ల తేమ పెరుగుతుంది. ఈ రెండు అంశాలూ అలర్జీ, ఆస్తమా లాంటి జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే పైన పేర్కొన్న దుమ్ము, రాత్రివేళల్లోని నెమ్ము ఈ రెండూ అలర్జీ, ఆస్తమాలకు ట్రిగరింగ్ ఫాక్టర్లే. దాంతో అలర్జీ, ఆస్తమా వంటి వ్యాధులతో బాధపడేవారికి ఈ వాతావరణం ప్రతికూలంగా పరిణమిస్తుంది. దుమ్ము, నెమ్ములకు ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏ చిన్నపని చేసినా ఆయాసపడటం, అలసిపోవడం, ముక్కులు బిగుతుగా మారడం, శ్వాసతీసుకుంటున్నప్పుడు పిల్లి కూతలు వినిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పదేపదే పునరావృతం కావడం వల్ల రోగిలో వ్యాధినిరోధకత తగ్గుతుంది. ఫలితంగా ఇతర ఇన్ఫెక్షన్లూ తేలికగా సోకే అవకాశం ఉంది. అంతేకాదు... ఊపిరితిత్తులు సైతం వాటి సాగే గుణాన్ని, పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒక్కోసారి బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి ఒకింత ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు.

అలర్జీలు, ఆస్తమా అనేవి సాధారణంగా కొందరిలో పుట్టుకతోనే వస్తాయి. మరికొందరికి పెరిగాక వాతావరణంలోని దుమ్మూధూళి సరిపడక రావచ్చు. ఈ తరహా రుగ్మతలను హోమియో వైద్యచికిత్సా విధానం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. లక్షణాలను బట్టి వాటికి

వాడాల్సిన మందులివి...

యాంట్ టార్ట్ : జలుబు, దగ్గు, కొన్నిసార్లు దగ్గుతో కఫం ఉండటం, ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడం వంటి లక్షణాలకు.
ఆర్స్ ఆల్బ్ : దుమ్ములోకి వెళ్లినప్పుడు తుమ్ములు రావడం, ముక్కులు మూసుకుపోవడం, తుమ్ములతో పాటు ముక్కుల నుంచి నీళ్లు కారడం వంటి లక్షణాలకు, అలాగే వెన్నుపై పడుకుంటే ఉబ్బసం ఎక్కువైనప్పుడు.

హెపార్‌సల్ఫ్ : చాలా చలిగా అనిపిస్తుంటే. చలిని ఏమాత్రం తట్టుకోలేక పోతుంటే. చల్లని-పొడి వాతావరణంలో ఆస్తమా వస్తుంటే. కూర్చుని తలవాల్చి పడుకున్నప్పుడు మాత్రమే ఉపశమనం లభిస్తుంటే.

సోరియమ్ : ఎండాకాలంలోనూ దుప్పటి కప్పుకుని కూర్చోవాలనిిపిస్తుంటే. ప్రతి చలికాలంలోనూ ఆయాసం వస్తుంటే.   
నేట్రమ్ సల్ఫ్ : నేలమాళిగలు, సెలార్స్‌లో ఉండేవాళ్లకు జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపించినప్పుడు. కఫం పచ్చరంగులో ఉన్నప్పుడు. దగ్గు ఎక్కువగా ఉండి, ఛాతీని పట్టుకుని దగ్గుతున్నప్పుడు.
ఫాస్ : మెత్తటి స్వభావం, ఊరికే సాయం చేసే గుణం ఉన్నప్పుడు. క్షయ వ్యాధి ఉన్నా కూడా.
రోడో : వర్షం ముందుగా లక్షణాలు కనిపిస్తూ రోగిలో మార్పులు వస్తుంటే, మెరుపులంటే భయం భయంగా ఉంటుంటే.
కాలీ సల్ఫ్: ముక్కుదిబ్బడ, సైనసైటిస్ తోపాటు, ఆయాసం ఎక్కువగా ఉంటే.
మెర్క్‌సాల్ : ఒంట్లో చురుగ్గా లేనప్పుడు, అపనమ్మకంగా ఉన్నప్పుడు, పట్టుదల కోల్పోతే, కుడివైపు తిరిగి నిద్రపోలేనప్పుడు, కఫం పచ్చగా పడుతుంటే... ఈ మందులు వాడవచ్చు.

ఆధారము: సాక్షి

3.10126582278
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు