హోమ్ / వార్తలు / ఏపీపీఎస్సీ - ఆబ్జెక్టివ్‌ పరీక్షలన్నింటిలో మూడు తప్పులకు ఒక మార్కు కట్‌!
పంచుకోండి

ఏపీపీఎస్సీ - ఆబ్జెక్టివ్‌ పరీక్షలన్నింటిలో మూడు తప్పులకు ఒక మార్కు కట్‌!

ఏపీపీఎస్సీలో ఆబ్జెక్టివ్‌ పరీక్షలన్నింటికీ ‘నెగిటివ్‌’ మార్కులు, మరియు అక్టోబరులో గ్రూప్‌-2, 3 నోటిఫికేషన్ల సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) పరీక్షల్లో ఇకపై ‘నెగెటివ్‌’ మార్కుల విధానం అమలు కానుంది. ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహించే పరీక్షలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ప్రతి మూడు తప్పు జవాబులకు ఒక మార్కు చొప్పున కట్‌ అవుతుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మూల్యాంకన విధానంలో కమిషన్‌ తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ అవుతుంది. డిస్ర్కిప్టివ్‌ టైప్‌ (వ్యాసరూపం)లో నిర్వహించే పరీక్షలకు పాత పద్ధతిలోనే మూల్యాంకనం జరుగుతుంది. ఉదాహరణకు.. గ్రూప్‌-1 మెయిన్స్‌తో పాటు ఆ తరహాలో జరిగే పరీక్షలు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కార్యాలయంలో చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ నేతృత్వంలో మంగళవారం జరిగిన ‘కమిషన్‌’ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి వై.వి.ఎ్‌స.టి.సాయి, సభ్యులు జీ.ఎ్‌స.సీతారామరాజు, జి.రంగ జనార్దన్‌, కె.విజయకుమార్‌, జి.సుజాత, కె.పద్మరాజు పాల్గొన్నారు. అనంతరం ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ.. కొత్త సభ్యుల నియామకం అనంతరం తొలిసారిగా జరిగిన కమిషన్‌ భేటీలో పాత కేసులతో పాటు 1999 నాటి గ్రూప్‌-2, 2011 నాటి గ్రూప్‌-1 సర్వీసెస్‌ నియామకాలపై సమీక్షించామన్నారు. మొత్తం 4009 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తాజాగా 748 ఏఈఈ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చామని చెప్పారు.

నెలాఖరులోగా 256 పోస్టులతో 9 నోటిఫికేషన్లు

ఈ నెలాఖరులోగా 256 పోస్టులతో మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఉదయభాస్కర్‌ వెల్లడించారు. ఇందులో అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌ (199 పోస్టులు), అసిస్టెంట్‌ హైడ్రాలజిస్ట్‌ (9 పోస్టులు), అసిస్టెంట్‌ హైడ్రో జియాలజిస్ట్‌ (12 పోస్టులు), టెక్నికల్‌ అసిస్టెంట్‌ - హైడ్రాలజీ (5 పోస్టులు), టెక్నికల్‌ అసిస్టెంట్‌ -హైడ్రో జియాలజీ (13 పోస్టులు), వెల్ఫేర్‌ ఆర్గనైజర్‌ (6 పోస్టులు), జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (7 పోస్టులు), లాబ్‌ అసిస్టెంట్‌ (3 పోస్టులు), డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (2 పోస్టులు) ఉన్నాయని తెలిపారు. అక్టోబరు నెలాఖరులోగా 750 పోస్టులతో గ్రూప్‌-2, 1000 పోస్టులతో గ్రూప్‌-3 (పంచాయితీ కార్యదర్శులు) నోటిఫికేషన్ల విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డిసెంబరు నెలాఖరులోగా గ్రూప్‌-1 సర్వీసె్‌సతో సహా పెండింగ్‌లో ఉన్న అన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు.
‘వయోపరిమితి’ ఏడాది పెంపుపై లేఖ
ఈ నెలాఖరులోగా వివిధ కారణాల వల్ల నోటిపికేషన్లు ఇవ్వలేకపోయినందున నిరుద్యోగుల మనోగతాన్ని దృష్టిలో ఉంచుకుని.. సెప్టెంబర్‌ 30 వరకు అర్హులైన వారికి వచ్చే ఏడాదిలోగా ఇచ్చే నోటిఫికేషన్లకు కూడా వయోపరిమితిని సడలింపు వర్తింపచేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసిందని ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. ఫలితంగా సెప్టెంబర్‌ 30 వరకు 40 ఏళ్లు నిండని వారందరికీ ఊరట లభిస్తుందన్నారు. ఏ నోటిఫికేషన్‌కైనా 25 వేల మంది కంటే ఎక్కువమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే తప్పనిసరిగా స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించిందని చెప్పారు. యూపీఎస్సీ తరహాలో గ్రూప్‌-1 మెయిన్స్‌లోనూ వడపోత చేపట్టేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖరాశామని ఉదయభాస్కర్‌ తెలిపారు. రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని, కానీ ఇకపై యూపీఎస్సీ మాదిరిగా రిజర్వుడ్‌ కేటగిరీ వారీగా ఒక్కో పోస్టుకు 12 లేదా 13 మంది మెయిన్స్‌ రాసేలా అర్హత కల్పించాలని కోరామన్నారు. ఈ విధానం వల్ల నాన్‌ సీరియస్‌ అభ్యర్థుల వడపోత జరుగుతుందని తెలిపారు. ఏపీపీఎస్సీలో స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నుంచి మెయిన్స్‌కు ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.

బయోమెట్రిక్‌, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ

ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని ప్రధాన పరీక్షలకు కూడా ఇకపై పరీక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్‌ హాజరు తీసుకోవడంతో పాటు సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తామని చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ చెప్పారు. స్ర్కీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్‌కు ఒకే సిలబ్‌సలో ప్రశ్నలు ఉంటాయని వెల్లడించారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు