హోమ్ / వార్తలు / కొత్త పోస్టాఫీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాల తొలి బ్యాచ్ ప్రారంభం
పంచుకోండి

కొత్త పోస్టాఫీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాల తొలి బ్యాచ్ ప్రారంభం

కొత్త పోస్టాఫీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాల తొలి బ్యాచ్ ప్రారంభం

దేశంలోని పౌరులకు పాస్ పోర్ట్ సంబంధిత సేవలను అందజేసేందుకు వేరు వేరు రాష్ట్రాలలో ప్రధాన తపాలా కార్యాలయాలను (హెచ్ పి ఒ)లను పోస్టాఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాలుగా (పిఒపిఎస్ కె) వినియోగించుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా విభాగం గత నెల 24న ప్రకటించాయి. పాస్ పోర్టు సేవల పరిధిని మరింత విస్తరించాలని, ఇంకా ఎక్కువ ప్రాంతాలకు వీటిని అందజేయాలనేది ఇందులోని పరమార్థం. విదేశీ వ్యవహారాల శాఖకు, తపాలా విభాగానికి మధ్య భాగస్వామ్యంతో కర్ణాటకలోని మైసూర్ హెడ్ పోస్టాఫీసులో ఒక ప్రయోగాత్మక పథకం, అలాగే గుజరాత్ లోని దాహోద్ లో మరొక ప్రయోగాత్మక పథకాన్ని ఆ రోజే ప్రారంభించడం జరిగింది. ఇవి అప్పటి నుంచి విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ పిఒపిఎస్ కె లు ఒక్కొక్కటి ప్రతి రోజు 100 అపాయింట్ మెంట్ లను ఇస్తూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇక ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించాలని సంకల్పించింది. విస్తరణలోని ఒకటవ బ్యాచ్ లో భాగంగా 17 రాష్ట్రాలలోను, 5 కేంద్ర పాలిత ప్రాంతాలలోను కలుపుకొని  56 పోస్టాఫీస్ పాస్ పోర్ట్ సేవాల కేంద్రాలను తెరుస్తున్నారు. ఈ కేంద్రాలలో తెలంగాణాలోని మహబూబ్ నగర్, వరంగల్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, కడప ప్రాంతాలు ఉన్నాయి. ఈ కేంద్రాలలో పాస్ పోర్టుకు సంబంధించిన సేవలను త్వరలోనే ప్రారంభించే దిశగా విదేశీ వ్యవహారాల శాఖ, తపాలా విభాగం కృషి చేస్తున్నాయి. ఒకసారి ఈ కేంద్రాలు పూర్తిగా పని చేయడం మొదలుపెట్టాయంటే గనుక దరఖాస్తుదారులు వారి పాస్ పోర్టులను పొందడం కోసం పాస్ పోర్టు పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. పాస్ పోర్టు జారీ చేయడానికన్నా ముందు అవసరమైన లాంఛనాలను పూర్తి చేయడం కోసం పోస్టాఫీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాలలో అపాయింట్ మెంట్ ను తీసుకోవాలి. పాస్ పోర్టు విధానాన్ని గత ఏడాది డిసెంబర్ 23న సరళతరం చేసిన తరువాత పాస్ పోర్టుల కోసం దాఖలవుతున్న అభ్యర్థనలు సుమారు 30 శాతం వరకు పెరిగాయి. పాస్ పోర్టు సేవా ప్రాజెక్టును ఆరంభించినప్పటి నుంచి రికార్డు సంఖ్యలో ఈ నెల 7వ తేదీన 53,400 దరఖాస్తులను ప్రాసెస్ చేయడమైంది. వీటిలో 49,259 సరికొత్త దరఖాస్తులు. పాస్ పోర్టుల కోసం అంతకంతకూ పెరుగుతున్న డిమాండును తీర్చడానికి వారాంతపు దినాలలో పాస్ పోర్టు కార్యాలయాలు ప్రత్యేకంగా పాస్ పోర్టు  మేళాలను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మైసూరు పోస్టాఫీస్ పాస్ పోర్టు సేవా కేంద్రంలో అపాయింట్ మెంట్ లు 10 రోజుల వ్యవధిలో లభ్యమవుతూ ఉండగా, దాహోద్ లో ఈ సౌకర్యం మరుసటి రోజే లభ్యమవుతోంది. కొత్తగా తెరుస్తున్న అదనపు పోస్టాఫీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాలు సత్వరమే పాస్ పోర్టులను పొందడంలో మన దేశ పౌరులకు మరింతగా ఉపయోగపడనున్నాయి.

ఆధారం : పత్రికా సమాచార కార్యాలయము

పైకి వెళ్ళుటకు